వ్యక్తిత్వం-ఆశాజీవి-నిరాశాజీవి

బి.వి.సత్య నగేష్ 


ఏ ఊరు బస్సు ఎక్కితే ఆ ఊరే వెళ్తాం. బెంగుళూరు బస్సు ఎకి ప్రయాణం చేస్తుంటే మార్గమధ్యంలో అనేక ఊర్లు, ట్రాఫిక్ జామ్ లు, స్పీడు బ్రేకర్లు వున్నప్పటికి చేరవలసిన సమయానికి చేరవలసిన బెంగుళూరుకు చేరుతాం. అలాగే మనిషి ఎటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ వుంటే అటువంటి మనస్తత్వమే ఏర్పడుతుంది. ఆశాజీవిలా సానుకూల దృక్పథంలో వుంటే మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు, ఇబ్బందులు స్పీడు బ్రేకర్లు లాగానే అన్పిస్తాయి. లక్ష్యాలను నిర్ణయించుకుని సానుకూల దృక్పథంతో నిర్దిష్టమైన ఆలోచనా ప్రక్రియలతో వుంటే లక్ష్యాలనే గమ్యస్థానాలను చేరగలం.
          ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త ఆడ్లర్ (ADLER)చెప్పినట్లు మనుషులలో ఆశాజీవి (OPTIMIST), నిరాశాజీవి (PESSIMIST)అనే రెండు రకాలుంటారు. ఆశాజీవి ఆలోచనా విధానం మంచిని కోరుకునే విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఆశాజీవి ఆలోచనా విధానం ఎలా వుంటుందో చూద్దాం.
బెంగుళూరు బస్సు ఎక్కిన ఆశాజీవి ఆలోచించే విషయాలిలా వుంటాయి.
  • బెంగుళూరు ఎన్ని గంటలకు చేరగలను?
  • చేరిన తర్వాత చెయ్యవలసిన పనులేంటి?
నిరాశాజీవి ఆలోచించే విషయాలు ఈ విధంగా వుంటాయి.
  • ఈ బస్సు బెంగుళూరు సమయానికి చేరుతుందా?
  • మధ్యలో ఆగిపోతే ఏం చెయ్యాలి?
  • అదే మార్గంలో వెళ్తుందా?
  • క్షేమంగా చేరతామా?
ఈ విధంగా ఆశాజీవి, నిరాశాజీవి వేరు వేరు రకాలుగా ఆలోచిస్తారు. వీరి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా ఆశాజీవి గురించి చూద్దాం.
ఆశాజీవి మంచి గురించి మాత్రమే ఆలోచిస్తూ జ్ఞానసంపదను పెంచుకుంటూ, కార్యకలాపాల గురించి పనులు చేపట్టి ముందడుగు వేస్తూవుంటాడు. పట్టుదల, కృషిని నమ్ముకుంటాడు. కాలాన్ని వృథా చెయ్యకుండా మంచిని కోరుకుంటూ శక్తిసామర్ధ్యాలను పెంచుకుంటాడు. మంచి జరుగుతుందనే నమ్మకంతో వుంటాడు. లక్ష్యాన్ని చేరే దిశలో ఎదురయ్యే ఆటంకాలను స్పీడ్ బ్రేకర్లు మాత్రమే అనుకుంటాడు. తన నిర్ణయాలపై గట్టి నమ్మకంతో వుంటాడు. లక్ష్యాన్ని చేరిన తరువాత ఎలా ఉంటుందోనని ఊహిస్తాడు, ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం,సాహసం అనే ప్రత్యేకగుణాలుగా వుంటాయి.
నిరాశాజీవి నిరాశక్తతతో వుంటాడు. అనుమానం, కచ్చితంగా చెప్పలేకపోవడం, భయం, ఆందోళన , ఒత్తిడి, కలవరం, అసంతృప్తి, వాయిదాలు వేయడం లాంటి లక్షణాలతో వుంటాడు.
“నా కాళ్ళకు మంచి బూట్లు లేవని బాధపడుతున్నపుడు అస్సలే కాళ్ళు లేనివాడు కష్టపడి పనిచేసుకుంటూ నా కళ్ళు తెరిపించాడు” అన్నట్లు మనకున్న శక్తిసామర్ధ్యాలను ఆశాజీవిలా వాడుకుంటే జీవితంలో అభివృద్ధి కన్పిస్తుంది. మనకు లేనివాటి గురించి ఆలోచించి కృంగిపోకుండా వాటిని సంపాదించే మార్గంలో కృషి చెయ్యడమే ఆశాజీవి లక్షణం.
తండ్రి కోపం ప్రదర్శిస్తే, తన మంచి గురించేననుకుంటాడు ఆశాజీవి. పరిస్థితిని విశ్లేషించుకుంటాడు. పట్టుదల, పౌరుషం పెంచుకుంటాడు. నిరాశాజీవి వేరుగా ఆలోచిస్తాడు. తనను బాధపెట్టడమే తప్ప తన తండ్రికి వేరేపని లేదనుకుంటాడు.
యుక్తవయస్సులో వున్నపుడు కష్టపడి మంచి లక్ష్యాలను చేరుకోవాలి, సరదాల పేరు చెప్పి యుక్తవయస్సును వృథా చెయ్యకూడదనుకుంటాడు ఆశాజీవి.
ఇప్పుడు కాక... ఇంకెపుడు అనుకుంటూ యుక్తవయస్సులో సరదాలతో సమయాన్ని గడుపుతూ లక్ష్యాలను లక్ష్య పెట్టకుండా వుంటాడు నిరాశాజీవి.
ఒక కొండను ఎక్కాలంటే ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ తనను తాను అభినందించుకుంటూ కొండపైకి చేరుతారు ఆశాజీవి. కొండ కింద ప్రాంతంలోనే నిలబడి కొండను చూస్తూ చతికిల పడిపోతాడు నిరాశాజీవి.
ఆశాజీవిగా వుండాలనుకునేవారు ఒక సత్యాన్ని గ్రహించుతారు. అదే....”నేర్చుకునే దశలో ఏదైనా కష్టమే”, అనే విషయాన్ని సానుకూల దృక్పథంతో అలవాటు చేసుకుంటారు.
మనిషి కూడా ఒక యంత్రం లాంటివాడే. ఉదాహరణకు ... స్కూటర్ బయలుదేరిన వెంటనే వేగం పుంజుకోదు. మొదట ఒకటవ గేర్ లో తనబరువును, తనమీద వున్న బరువును కదల్చుతూభారంగా, నెమ్మదిగా కదులుతుంది.ఎక్కువ వేగం వుండదు. తరువాత 2,3 వ గేరులో వేగం పెరిగి సునాయాశంగా పోతుంది. అలాగే భాష నేర్చుకునే రోజుల్లో కష్టంగానే వుంటుంది. భాష మీద పట్టు వచ్చేలా ఎంత సునాయాశంగా ఉంటుందో అందరికీ అనుభవమే. అందుకని ఆశాజీవి లక్షణాలను అలవాటు చేసుకుని అశాజీవిలా జీవితాన్ని సాగిస్తే ఉన్నతమైన ఉత్తమమైన లక్ష్యాలను సాధించి తృప్తిగా జీవించగలం, ఆలస్యమెందుకు? పదండి ముందుకు.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top