వాత్సల్యపు ఆశయాలు - అచ్చంగా తెలుగు

వాత్సల్యపు ఆశయాలు

Share This
 వాత్సల్యపు ఆశయాలు

ఆండ్ర లలిత 


అది అమెరికా లో బోస్టన్ మహానగరములో లక్ష్మి శ్రీనాథ్లు ఏర్పరచుకున్న అందమైన కుటీరము.. లక్ష్మి, గదిలో టి.వీ ‌చూస్తూ షాలు అల్లుతోంది.  కాని మనసు మనసులో లేదు. ప్రతీ కారుశబ్దం విన్నప్పుడల్లా సరసిజ కారేమో అనిపించింది. మోబైల్కూడా తనపక్కనే పెట్టుకుంది. పొరపాటుని సరసిజ కాల్ అయినా,మెసేజ్ అయినా ఎక్కడ మిస్ అవుతుందేమోనని. చేతులు షాల్ అల్లుతున్నాయి.కాని షాలులో    ఉన్న పువ్వులు తడబడుతున్నాయి. కళ్లు టీ.వి  చూస్తున్నాయి..కాని టీవిలో  ఏమౌతొందో ఏమీ అర్ధం కావటం లేదు. గందరగోళముగా ఉంది. ఇవన్నీ ఒక తంతైతే, మనసు మటుకు మరోతంతు. ఎక్కడికో వేగంగా పరుగెడుతోంది. ఇక మనసుని అదుపులో పెట్టలేక షాల్  బల్లమీద పెడుతూ, శ్రీనాథ్ భుజము తట్టి” ఏవండీ గాబరాగా ఉంది. ఆ టీ వి కట్టేసి, నాతో మాట్లాడరూ”అని అంది లక్ష్మి.
“సరే అలాగే మాట్లాడుకుందాము. అయినా అంత ఆందోళన ఎందుకు ఏమిటో చెప్పు”అని ప్రేమతో  పలికారు శ్రీనాథ్ లాప్ టాప్ మూస్తూ.
“పొద్దున్నే సరసిజతో ముద్దుగా లాలిస్తూ చెప్పాను ‘తిన్నగా కళాశాల మరియు సంగీతము తరగతి తరువాత ఇంటికి వచ్చేయమని. పరీక్షలు దగ్గరపడుతున్నాయని. పుట్టినరోజు పార్టీకి వెళ్తానని అంది. వెళ్లొద్దని చిలకకి చెప్పినట్టు చెప్పాను.అక్కడికి వెళ్తే రాత్రి అయిపోతుంది. ఆ చోటు కూడ మంచిది కాదని. తన స్నేహితులతో  రానని చెప్పమన్నాను. నేను చూసుకుంటానంది.  ఇంత ఆలస్యము అయిందంటే బహుశ వెళ్లే ఉంటుంది. వినదు. మన పద్దతులు, సంస్కారముకి దూరమౌతుందేమో అని భయముగా ఉందండి. చుట్టూఉన్న స్నేహితుల ప్రభావము ఉండదా! ఇక్కడ వేషభాషలు. సంస్కారము తప్పు , మనవి ఒప్పు అనటము లేదు.మన సంస్కారాన్ని కాపాడుకుంట, ఇతరుల సంస్కారాన్ని గౌరవిస్తూ సమయానుకూలంగా అవసరమైనప్పుడు మన ప్రవర్తనలలో మార్పు తెచ్చుకోవటములో తప్పులేదు.“Be like a Romanwhen you are in Rome” లో లాగ. కాని అదిచేసే ప్రయత్నములో మనని కించపరచుట సమంజసమా. ఇలా చాలాచోట్ల పార్టీలలో చూడటములేదాండి. ఏమంటారు?”అంది లక్ష్మి.
“నిజమే అనుకో,కాని మనము అలా ఉంటే కదా. మనము అలా లేము. మన సరసిజ అలా ఉండదు లక్ష్మీ”అన్నారు శ్రీనాథ్.
“ఎన్నో విషయాలు వింటూ ఉంటాము.అదికాక పిల్లలుమనసు గాలిపటము లాంటిది. గాలి ఎటుంటే అటు ఎగురుతుంది. కాని దాని దారము నియంత్రణ ,మటుకు మనచేతులో ఉండాలి, ఉందంటారా!! సరిగా ఎగరకపోతే మళ్లి సరిగా ఎగిరేలాచూసేందుకు” అంది లక్ష్మి.
“మన దగ్గర దారము ఉందికదా లక్ష్మీ! ఎంతవదలాలో అంతే వదులుతున్నాము. కంగారుపడకమ్మా! మానసిక మరియు శారీరమార్పులు జరిగే వయస్సు. చెప్తేవినరు, అర్థముకాదు. కొంచము మొండితనముతో ఉంటారు . అందుకే స్నేహితులలాగా వ్యవరిస్తున్నాము కదమ్మా అన్నారు”శ్రీనాథ్.
“ఇవే కాదు మనము ఆ వయస్సులోనుంచి ప్రయాణంచలేదా! అదుపులు తప్పే మనసు. అలాటివన్నీ ఆలోచిస్తే, నాకు గాబరా వస్తోంది అని తన నుదుటి మీద ఉన్న చమట తుడుచుకుంటూ” అంది లక్ష్మి.
“వద్దన్న పని ఎందుకు చేస్తోందో అడుగుదాము. ఒకవేళ తోటి స్నేహితుల వత్తిడి అయితే..ఎలా ఎదురుకోవాలో చెప్పదాము.ఏదో వత్తిడి వచ్చి ఉంటుంది.వత్తిడినిఎలా ఎదురుకోవాలో చక్కగాప్రేమతో చెబుదాము. నమ్మకము ఉంచుకో లక్ష్మీ. ఏమంటావు?”అన్నారు శ్రీనాథ్.
“కాని గుడ్డిగా నమ్మకూడదుకదండి..”అందిలక్ష్మి.
“అమ్మయ్యఇకఆపావా!!!ఇక నా గుండె పరుగెడుతోంది లక్ష్మీ. ఆగు ఇద్దరికీ మంచినీళ్లు తెస్తాను. మంచినీళ్లు తాగి సంభాషణ తిరిగి ప్రారంభిద్దాము “అని శ్రీనాథ్ మంచినీళ్లు తాగి లక్ష్మికి మంచినీళ్లు అందించి ఇలా అన్నారు“మనము మన సరసిజతో స్నేహితులులాగ వ్యవహరిస్తున్నాము. తన బదులు మనము ఆలోచించి చెప్పే బదులు, తనతోపాటు ఆలోచిస్తున్నాము.. కాబట్టి ఖంగారు పడనవసరము లేదు లక్ష్మీ. మనము విదేశాలలో ఉన్నాము కాబట్టే మనసరసిజకి స్వదేశము గురించి వివరంగా చెప్పాము, చెప్తున్నాము కదా.మనవాళ్ల మరియు మన దేశము యడల ప్రేమ వచ్చేలా చూస్తున్నాము కదమ్మా. మనసు కలత చెందనీయకమ్మా!”అన్నారు శ్రీనాథ్.
“సరేలేండి” అంది లక్ష్మి.
“ఏమిటో పిల్ల ఒక ఫోన్ అన్నా చేయవచ్చుగా... చెయ్యదు. ప్రొద్దున్న అందుకే వద్దన్నాను. మీరు  నా మాట లెక్క పెట్టరు.” అంది లక్ష్మి
“నన్ను కంగారు పెట్టకు లక్ష్మీ. ఏమీ  చేస్తాము...మనము ఇంత కోపముగా ఉన్నా మన బంగారు తల్లి రాగానే మన అమ్మాయి కబుర్లతో అరచేతిలో వైకుంఠాన్ని చూసేస్తాము. అంతే ఇంకేముంది నోరు వెళ్ళబెట్టుకుని ఆలకిస్తూ,  మంచు కొండలా కరిగి పోతాము అంతే” అని గట్టిగా  నవ్వారు  శ్రీనాథ్.
“మీరే పాడి చేసారు ..బాగా ముద్దు చేసి” అంది లక్ష్మిబుంగ మూతితో.
“నేనా అబ్బే కాదు నువ్వే” అన్నారు శ్రీనాథ్. ఇక నా పనిచేసుకోనా.. చాలా ఉంది లక్ష్మీ”అన్నారు శ్రీనాథ్.
లేప్టాప్లొ పని ప్రారంభించారు కాని చాలా నెమ్మదిగా అవుతోంది. ఎంత సరసిజ గురించి ఆలోచించకుండా ఉందామన్నా కుదిరేలా లేదు.లక్ష్మి ఆందోళన మనసులో చిరాకు రేపింది. మేక పోతు గాంభీరముతోనున్నా,మనసులో మటుకు ఎటూ చెప్పుకోలేని ఆందోళన.
ఈ ఇరువురి ఆందోళన, ఘర్షణ చూడ లేక అత్తగారు విశాలాక్షిగారికి గాబరావచ్చి ఒకసారి కాల్చెయ్యి బాబ్జీ, “అని అంది .
ఫోన్ చేసారు శ్రీనాథ్ .
“ఒక్క క్షణము ... ఉష్ ..... మ్రోగుతోంది” అన్నారు శ్రీనాథ్.
 “హలో అమ్మా సరసిజా వినబడుతోందా!” అన్నారు శ్రీనాథ్
“ఏమిటి నువ్వు ఇక్కడికి చేసావు..వస్తా కదా!”అంది సరసిజ.
“అలా కాదురా, ఆగరా మరి ఆలస్యమౌతోందని చేసాను”
అన్నారు శ్రీనాథ్
“నా  స్నేహితులు చూస్తున్నారు నాన్న” అంది సరసిజ.
“ఎనిమిది గంటలు కావొచ్చింది, ఇంకా ఎంత సేపమ్మా. తొందరగా రా తల్లీ” అన్నారు శ్రీనాథ్.
"నాన్నా... నేను ఏమన్నాచిన్న పిల్లనా! నా వెంటపడతారు. వస్తా కదా"  అంది సరసిజ.
“అబ్బేఅలా కాదు నిన్ను చూడనిదే నాకు తోచదు. అందరూ కలిసి ఉన్నప్పుడు సమయము తెలియదు. సమయము  చూసుకో చీకటి  పడుతోంది”అన్నారు శ్రీనాథ్ .
“నాన్నా కొంచెము ఆలస్యము అవుతోంది అంతే కదా... ఏదో చెప్తూ ఉండకు. నేను చూసుకుంటాను కంగారు పడకు నాన్నా. ఇప్పుడు ప్రస్తుతము ఐస్క్రీం షాప్లో ఉన్నాము. ఇప్పుడే వచ్చాము. ఒకగంటలో ఇంట్లో ఉంటాను. నువ్వు కాల్చేస్తే బావుండదు నాన్నా. వచ్చేస్తాలే తొందరగా. సరేనా. బై అంది సరసిజ.  ఇంకా అంత ఆలస్యము ఏమైంది?”అంది సరసిజ .
అమ్మా సరసిజా అలాకాదురా తల్లీ అని ఇంకా ఏదో మాట శ్రీనాథ చెప్పే లోపలే..
“నాన్నా ఏదో చెప్తూ ఉండకు నా స్నేహితులు చూస్తున్నారు. ఫోన్ పెట్టేయి ప్లీజ్.... నువ్వు  పెట్.... తే...  కదా నేను గబగబగా తిని రాగలను? ఇంటికి  వచ్చాక తాపీగా మాట్లాడు కుందాము. సరేనా. I can manage my own things. కంగారుపడకునాన్నా! పరీక్షలకి నాకు అన్నీ వచ్చేసు. అయినా చాలా సమయము ఉంది. ఇప్పుడు నాకు గుర్తుచేసి వత్తిడిపెట్టకు.” అని ఫోను పెట్టేసింది సరసిజ.
ఒక్కక్షణానికి సరసిజ ఆత్మధైర్యానికి నవ్వాలా లేక బాధపడాలా అర్థము కాలేదు. కాని తనని తను తమాయించుకుని, బానేవుంది లక్ష్మీ. కంగారుపడకు. వస్తోంది”అన్నారు శ్రీనాథ్.
ఇక టీవి చూసేందుకు మనస్కరించక, లక్ష్మి పైకివచ్చి, సావిట్లో అటూఇటూ పచారులు చేస్తోంది. కళ్ళు మట్టుకు సింహద్వారము కేసే. ఇదేనేమో కళ్ళు కాయలుకాసేలా ఎదురుచూడటమంటే అనుకుంది. ఇంతలో అత్తగారొచ్చి భుజము తట్టింది. ఉలిక్కిపడి వెనక్కి చూసింది .
“ఎక్కడా సరసిజ రాక కానరావటం లేదు” అంది లక్ష్మి దిగులుగా.
“అంత ఆందోళన ఎందుకమ్మా, వస్తుంది లే”అన్నారు అత్తగారు విశాలాక్ష్మగారు.
“అలా కాదండీ”అంది లక్ష్మి.
***
సావిట్లోకి  వస్తూ శ్రీనాథ్ ఇలా అన్నారు  “లక్ష్మీ ఎక్కడ  ఉన్నావు?సరసిజ ఫోన్ చేసింది. బయలుదేరానని!ఇంకోక అరగంటలో ఇంట్లో ఉంటానంది. ....... ఏమిటి ఇక్కడనుంచున్నారు, గుమ్మానికి అటూఇటూ. ఎవరికైనా స్వాగతము పలుకుతున్నారా. "
"అబ్బా, మీకు అన్నీ వేళాకోళాలే. అర్థంచేసుకోరు" అందిలక్ష్మి.
“రండి, ఎంచక్కగా సావిట్లో కూర్చొని మాట్లాడు కుందాము” అన్నారు శ్రీనాథ్
“ఎమో ఏమీ అర్థముకావటము లేదు అంతా  మిథ్య. రామచంద్రప్రభో”అంది లక్ష్మి.
“లక్ష్మీ, అంత దిగులుగా ఉండకమ్మా” అన్నారు అత్తగారు ప్రేమతో.
ఒక చిరునవ్వుతో లక్ష్మి “అది కాదండీ” అనబోయింది .
“ఏది కాదు, అంతా బావుంటుంది. మన బంగారము ఎప్పుడూ మంచిదే. మనము మన సంస్కృతి  ఆచారాలను  విడనాడుకోనప్పుడు  మన    పిల్లలు  ఎందుకు   అలా  చేస్తారు? పిల్లలు  ఒకొక్కసారి  వాళ్ళ  సమూహము  ఏమి  చేస్తే అదే వాళ్ళు చేస్తారు. వాళ్ల  మనసుకి హత్తుకునే  విధములో తప్పు చేస్తే ఇది తప్పు అని ఖండిస్తూ, సరి  చేసినప్పుడు  ఆనందము  వ్యక్తపరుస్తే ఎంత బావుంటుందో కదా! మరి అలా చేస్తునప్పుడు  భయమేల తల్లీ!”అన్నారు అత్తగారు విశాలాక్ష్మ్మగారు.
ఇంతలో కారు శబ్దమైంది. “సరసిజ వచ్చిందను కుంటాను” అని అత్తగారు విశాలాక్షమ్మగారు అన్నారు.
అందరుఒక్కసారిగట్టిగాఊపిరితీసుకున్నారు.
“రానీయండి...మన మాట విననప్పుడు మనకి సరసిజ ఎటుపోతే మనకెందుకు అంటూ” వంట గది లోకి వెళుతున్న లక్ష్మి చెయ్యి పట్టుకుని కూర్చోమని సౌజ్ఞ చేసారు శ్రీనాథ్.
 లక్ష్మికి ఉక్రోషమూ, కోపము, ఆవేదన, పిల్ల  తన మాట వినటం లేదని అసహాయత. ఇంకా ఎనెన్నో ముంచుకు వస్తున్నాయి .
“రానీయండి ...ఆటపట్టిస్తోంది మనని, చెప్తాను...అసలు పెద్దవాళ్లు ఒక మాట చెప్పారే, విందాము అని బుథ్థే లేదు” అంది లక్ష్మి
  ****
 “అమ్మా!!!!”  అని కౌగలించు కుంది సరసిజ.
“అమ్మా నన్ను క్షమించు. నేను ఎప్పుడు ఇలా ఆలస్యము చేయను” అంది సరసిజ. “నాతోఇంకా ఆ విషయము మాట్లాడకు, నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు  ఆలస్యముగా రాను”
“అ...సరే చాలులే ప్రేమ ఒలకబోయటాలు. నీ మాటలకి ఎవ్వరు కరిగి పోరు” అని మూతి బిగించింది లక్ష్మి.
“అనట్టు ఇవాళ సంగీతము క్లాస్లో మనసులోని మర్మము తెలుసుకో...మాన రక్షకా మరకతాంగా.. హిందోళము రాగములో నేర్చుకున్నాను. సాధన  కావాలి కదమ్మా  మరి వినిపించనా?” అంది సరసిజ.
“సరే.. సరే” అంది లక్ష్మి.
సరసిజ తన పాటతో ముగ్ధ మనోహరులను చేసింది. మంచు పర్వతములా కరిగి పోయారు.
అమ్మా! నిద్దర వస్తోందమ్మా. ఇంక పడుకుంటాను” అంది సరసిజ ఆవలిస్తూ!
***
అందరూ ఏక స్వరముతో పడుకో తల్లీ అని లాలించి ముద్దాడారు.
“సరసిజ ఒక్క క్షణం. నువ్వు చెప్పిన సమయానికి రావాలి. ప్రొద్దున్న వెళ్లొద్దు చదువుకోవాలి అని చెప్పాను కదా. పెద్దవాళ్లు అనుభవముతో చెప్పినమాట వినాలిరా తల్లి”అని ప్రేమతోగడ్డం కింద చెయ్యిపెట్టి పలికింది లక్ష్మి.
అమ్మ మాటలకి తప్పు చేసినట్టు అనిపించి అమ్మని కౌగలించుకుని ముద్దుపెట్టుకుని“అలాగే నమ్మాఇంకెప్పుడు వద్దూ అంటే చెయ్యనమ్మా”అంది సరసిజ ఆవలిస్తూ.
“లక్ష్మీ!మనసు కుదుటపడింది”అన్నారు శ్రీనాథ్.
“అవునండి, మన సరసిజ బంగారు తల్లేనండి”అంది లక్ష్మి చిరునవ్వుతో.
“ఒకొక్కసారి అనిపిస్తుంది మనదేశము వెళ్లిపోవాలని”అంది లక్ష్మి.
“అలాకాదు లక్ష్మీ. మనము ఉన్నత విద్యలు ఉద్యోగాలరిత్యా మనదేశము వదిలి పరదేశము వచ్చాక అక్కడ పరిస్థితులు వేషభాషలు ఆహార వ్యవహారాలు స్వీకరించి మనని మనము అనుకూలంగా మార్చుకోవాల్సి వస్తుంది, స్థిరపడటానికి. అంతమాత్రాన మన మూలము మరచిపోకుండా ఉంటే సరిపోదూ!! అసలు మన స్థితిగతులు ఇక్కడికి వచ్చాక మారాయని మన దేశము మనది కాదంటామా? అలా అని తల్లీతండ్రీ, తోబుట్టువులుని తిరస్కరిస్తామా, తామరపువ్వు లక్ష్మి స్వరూపము. చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉన్నానని పంకజం  గర్వంతో తన జన్మస్థానము మరచిపోతుందా? అలాగే మనము మన మూలము చెందనాడుకోకుండా ఉన్నప్పుడు, మన సరసిజ మన సంస్కృతి సాంప్రదాయాలను ఎందుకు తిరస్కరిస్తుంది. మన సరసిజ నా దేశము, నా వాళ్లు అని సగౌరవముగా చెప్పుకోటానికి ఎప్పుడూ వెనుకాడదు. దేశ సంస్కృతి సాంప్రదాయములకి వ్యతిరేకించే పని తను చెయ్యదు లక్ష్మి .చెడుకి తామరకు మీద నీటిబిందువులా ఉండిపోతుంది. సరసిజకి స్వేచ్చ  ఇస్తూ, సరైనదైతే మెచ్చుకుంటూ , తప్పు ఐతే ఖండిస్తున్నాము కదా లక్ష్మీ. సరసిజ గాలిపటమైతే దారం సరిచేసేందుకు మనచేతులో ఉంది. ఖంగారుపడకు, సరసిజ మన వాత్సల్యపుఆశయాల మేరకే పైకి వస్తుంది”అని శ్రీనాథ్ లక్ష్మి అనుకుంటూ పడకగదిలోకి నడుస్తూ సరసిజగదిలో దీపము చూసి. సరసిజ పొరపాటున పడుకొలేదా? అని అనుకుంటూ వెళ్లిచూచేటప్పటికి ఏదో వ్రాసుకుంటోంది.
“బంగారుతల్లీ ఏమి వ్రాసుకుంటుంన్నావు?” అని ఏకకంఠముతో అడిగారు.
“ఏమీలేదు ఏదో మనకి ఇష్టమైన దేశము గురించి నాకు తెలిసింది వ్రాయమని ఎసైన్మెంట్ ఇచ్చారు. నేను మన భారతదేశము గురించి వ్రాస్తునాను”అంది సరసిజ.
“ఏమని వ్రాస్తున్నావు?”అన్నారు శ్రీనాథ్.
“టూకిగా చదువుతాను వినండి. ఆదేశముమంటే నాకు చాలా ఇష్టము. భారతదేశము ఆత్మీయఅనురాగాల పుట్టినిల్లు.... మరి ఈదేశము నేను పుట్టిన దేశము, నా దేశము, భోగాలకి మెట్టినిల్లు.దేని అందముదానిదే.ఏ మంటారు. కాని ఏ దేశములో ఉన్నా మనమూలము మన పూర్వీకులని మర్చిపోకుండా వాళ్ల గొప్ప సాంస్కృతిక మరియు సాంప్రదాయ వారసత్వం కాపాడుకుంటూ ఉంటాను. “I love my India!!”నేను ప్రతీసంవత్సరము భారత దేశము వెళ్లినప్పుడు ఏదో ఒక పండుగలో పాల్గొనటమో లేక ఒకఊరు చూడటమో చేస్తా. ఈసారి పల్లెసీమల పచ్చదనము.. అట్లతద్దె పండగ చాలా నచ్చింది.
తెల్లవారుజామున అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పొయ్ మూడట్లోయ్ అని అనుకుంటూ అందరిని లేపి ఒకచోట గుమిగూర్చి ఆటలు ఆడుకోవటము చాలా బావుంటాయి”అంది సరసిజ.
ఏకకంఠముతో “ఇకచాలమ్మా వ్రాసుకో, అని కళ్లుచెమర్చి ఆనందముతో సరసిజను ఆశీర్వదించి రోజు ముగించారు లక్ష్మీశ్రీనాథ్లు.
లక్ష్మిశ్రీనాథ్ చెయ్యి పట్టుకుని మెల్లిగా ఇలా అంది “ఏవండీ నాకు అనిపిస్తోంది.. మన సరసిజ పుట్టింటి భాగ్యము. మెట్టింటి సౌభాగ్యము. ఏమంటారు?”
అవును అంటూ ఒక చిరునవ్వుతో శ్రీనాథ్ ఇలా అన్నారు, “అవును నీలాగే!!”.
***

No comments:

Post a Comment

Pages