పోస్ట్ మాన్ (ఏకపాత్రాభినయం/సోలో)

గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి ( సోమసుధ )  


( ముప్ఫై ఏళ్ళ క్రితం పత్రికావ్యాపారం ముమ్మరంగా సాగే రోజుల్లో కొత్తవారి రచనలు ముద్రించినా వారికి కాంప్లిమెంటరీ కాపీలు గాని, సదరు రచనలకు పారితోషికాలు గాని పంపేవారు కాదు. ఇది తెలియని రచయితలు పోస్ట్ మాన్ వాటిని కొట్టేశాడేమోనని వీరి వెంటపడేవారు. ఆ దెబ్బతో ఆ అర్భకులు యీ రచయితల బారిని తప్పించుకోవటానికి వీరిని దూరంగా చూడగానే ప్రక్కవీధుల్లోకి తప్పుకొనేవారు. వాటిని చూసి నాలో కలిగిన చిలిపి కల్పన. ఇది సరదాకోసమే తప్ప ఎవరినీ కించపరచాలని వ్రాయలేదు)
  ***
 ( రంగస్థలంపై అదొక పత్రికాఫీసు గది. ఎడమవైపు-వీధివైపు నుంచి అతను ప్రవేశిస్తాడు. ఎదురుగా కనిపించే బల్ల వెనుక కుర్చీ వైపు తిరిగి ) దండాలండీ! నానూ. . .అప్పారావుని. " సెంద్రసీమ " ఎడిట్రుగోరు తమరేనా? ( వేగంగా ముందుకెళ్ళి చేతులు పట్టుకొన్నట్లు నటించి )
ఇయి సేతులు కాదు కాళ్ళనుకోండి బాబయ్యా. . .నాయి కాదు.. .మియ్యే! కాళ్ళెందుకొట్టుకున్నాంటారా? . . .నా కాపరం నిలబెడతారని. . .ఓ! ఐం సారీ!. . నా సిగదరగ. . .నాయివరాలు మీకు తెల్వు కదూ!. . .నాను అప్పారావుని. . . వైజాగునేదండీ?. . సిమ్మాచలం పక్కన. ..దాన్నే యిశాపట్నం అని కూడా అంటార్లెండి. . . ఆ పట్నంలో జగదాంబ సెంటరుందండీ! . . .దానికీపెడ డాబాతోటుందండీ. . .అదేనండీ డాబాగార్డీను. . .ఆడ సేవణి అని. . ఓ రచైతున్నాడు. . . .ఆడి సిగదరగ. . .ఆడు కతలూ గట్రా రాత్తుంటాడు. . . ఎప్పుడూ తిరిగొచ్చేత్తుండేవి.. . .ఈ మద్దెల. . .నా రోజు బాగోక. . .ఆడి కత ' అమ్మాయికో అర్దణా 'ని . . .యీ ఊరి బాసలో ' అమ్మాయికో ఆఠణా ' గా మీ పుత్తకంలో ముద్దరేశారంట. ...పాతరచైతలకు పంచెలచాపులో పైసలెట్టి. . .ఏదో రాసిమ్మని ఎంటడతారు గాని. . . మీ సిగదరగ. . .మీ పత్రికలోళ్ళు కొత్తోళ్ళకు కాపీలంపరు గద! ఈ సంగతి ఆ సేవణి గాడికేం తెల్సు?  ఆడూరెళ్తూ ఊసుపోక మీ బుక్కు కొని సదూతూ. . ." యిది నా కతలాగుందే " ని సూసుకొన్నాట్ట. ఊర్నుంచి దిగడ్డాక. . .యింటికి పోక . . .తిన్నగా మా పోట్టాఫీసు కెల్లిపోచ్చి తన కతడ్డ కాపీ యేదని ఓటే గోల. . .
" అరె! ఆళ్ళ సిగదరగ . . .ఆళ్ళా కాపీ అంపలేదయ్యా " అన్నా యిండే.. . . .పైపెచ్చు " ఆళ్ళా కాపీ అంపలేని కడుక్కుపోయే టేజీలో . . .ఏదీ?. . కడుక్కుపోయే టేజీలో ఆళ్ళు లేరు. ఆ బుక్కు నువ్వే నొక్కేశావ్!" అని ఓటే గోల. . .ఆ మీన " ఒచ్చిందా. . .ఒచ్చిందా? " అని వారంరోలు నాబుర్ర తినేత్తే . . .బజార్లో మీ బుక్కు కొని ఆడి మొహానడేశా!. . .పైసలోతేనేం? పదిరోలు పేనం ఆయిగా ఉందని మురిసిపోతంటే. . .ఓ రోజు అటాత్తుగా దిగడి పారితోసికమేదన్నాడు.  నాకు చిర్రెత్తింది. "నీ కత అచ్చేసి అమ్ముకున్నదాళ్ళయితే సొమ్ములు నేనీటమేటని" కవుకులేసినా! సొమ్ములాళ్ళంపే ఉంటారు. నువ్వే కుమ్మేశావంటాడు. . . .అదేనండి బాబూ! కతారచైత కాబూలీవాలా అయ్యిండు. . .నా సిగదరగ. . .నాకు తిక్క రేగి బాగా దులిపేత్తే, నాల్రోలు అవుపళ్ళే! పేనం పెశాంతంగా ఉందని గట్టిగా గాలి పీల్చుకొంటుంటే. . .యిల్లెలా పట్టుకొన్నాడో. . .ఓ సందేల. . యింటిముందు టెంటేశాడు. " ఏందయ్యా యిది " అంటే " ఆపీసుకొద్దన్నావని యింటికొచ్చాంటాడు.  అలా ఓ రోజు కాదు, . .పొద్దున్నే ఆపీసుకెడుతుంటే ఎదుర్రావటం . . .సందేల అరుగుపై టెంటేయటం. . . " పెళ్ళయిన కొత్తకదా! పెనివిటి యింటికి రాగానే పేనం పెట్టేద్దారని . . .దాని సిగదరగ. . .నా యింటిది గుమ్మంలోకి రావటం, యీడు దాన్ని చూసి యికిలించటం. ..ఎట్టా ఉంటదో సెప్పండి. . . సరే! ఆడికెలాగూ యిది లేదు.పెనివిటి లేనప్పుడు పరాయోడు అరుగుమీన కూకుంటే . . . ఆళ్ళ సిగదరగ. . . .అమ్మలక్కలేటరనుకొంటారోని నా ఆడది ఆణ్ణి యింటోకి రమ్మంది. . . . .తప్పేటంతారేటి? ఆడపిల్ల కాడ రచైత చేరటమంటే పటాసు పక్కన అగ్గిపుల్ల చేరటమే కదండీ! . . .
ఏటైందంటారేటి? అసలు కత ఆడే మొదలైంది బాబూ! ఇంటో ఆడు తిన్నగా కూకోక దానికి అడ్డమైన కూతలు నేర్పేత్తన్నాడు. . . .ఆడది ఆది సెత్తంట. . సమానక్కులంట. . పెళ్ళేల కొంగున కట్టుకున్నోణ్ణి, జీయితాంతం ఆడా ముడిప్పి పారిపోకుండా సూసుకోవాలంట. . .అంతేనా?. . .నేనాపీసులో ఆడామెతో ఆసికాలాడ్తానని సెప్పాడు. పారితోసికమని పదిరోజులు తిరిగాడు కద! సూసుంటడు. . . .ఆపీసులో ఆడామె నిజమే! ఆసికాలాట్టం నిజమే! ఎందుకా? అది కేసీరండీ బాబూ! తవరే సెప్పండీ! గవుర్మెంటాపీసులో ఆపీసరు మొగం సూడకుండా రోజులు నెట్టుకుపోవచ్చు గాని కేసీర్ని రోజుకో పాలైనా పలకరించకపోతే సెల్లుద్దా? అలా సేత్తే మా క్లయాలాగిపోవూ? . . .అదలా ఉంచితే. ..పూలూ పళ్ళూ . . ఏటిచ్చినా మవునంగా తీసుకొనేది. . . . ఈడి సిగదరగ. . .ఈడేం సెప్పాడో? ఇప్పుడాటి రేటడుగుతోంది. . .మగాడి జీతమడక్కూడదంటారుగా! ఇప్పుడయే అడుగుతోంది బాబూ! . . బేసిక్కెంత, గ్రాసెంత, కట్టింగెంత, పైనొచ్చేదెంత అంటూ . . . నా సిగదరగ. . .నాకే తెలీని యివరాలడూతోంది.  పైసలెట్టి కాంటీన్లో కాపీ తాగేముందు . . .పుట్టబోయే పిల్లలకి కట్టబోయే కాలేజీ పీజు తలచుకోవాలంట. . .అందుకే బాబూ అప్పు సేసొచ్చినా! మీరాడి కత పైసలిచ్చేత్తే, ఆ పైసల్;ఆడి మొగాన కొట్టేత్తా! ఆడు నన్నొగ్గేత్తాడు. లేదంటే నా ఆడది నన్నొగ్గేసేలా సేసేత్తాడు. దయుంచి తవరు నా కొంప నిలబెట్టాలి. లేదంటే నేనా ఉజ్జోగవూ, యిశాపట్నమూ ఒగ్గేసి నా ఆడదాంతో డైరెట్టుగా. .. యింటున్నారా?. .మీ సిగదరగ. .మీ కొంపలో దిగిపోతా! దానికేనా ఒప్పుకోండి ( కొద్దిసేపు విన్నట్లు ఆగి ) అప్పు తీసుకున్నోళ్ళు అయిపీ పెట్టేత్తే తట్టుకొనే గవుర్మెంట్ బాంకు కాదు బాబూ నేను. మామూలు పోస్టుమేన్ని. దయుంచండి. . .ఏటంతారు? రికార్డీలు రాయాలా? నే రాసిపెడతా! నాకాడి పైసలిప్పిచ్చండి.. .ఏటీ? పైసలు సేతికీరా?
పోనీ . . డీడీయో, చెక్కో అదే అగోరిచ్చండి.  ( ఎదుటివాడు వ్రాస్తున్నది చూస్తున్నట్లు నటించి ) అదేటి? పారితోసికమేనా? నా దారికర్చులీరా? పోన్లెండి. ఏదో ఓటి. . .(చెక్కు తీసుకొని కుడివైపు లోనికెళ్ళి తిరిగి ప్రవేశించి ) చెక్కు కేసీరుకిచ్చా! ఆడు బాంకు కెళ్ళాడు. . ఈలోగా. . .(జేబులోంచి కాగితం తీసి మడతలిప్పి యిచ్చినట్లు నటించి) ఏటా? నువ్వే సూడు. అది మా పోస్టలోళ్ళ అలిటిమేటం. . . .దేనికా? ఆళ్ళెవరో రాసింది అచ్చేసి మీరమ్ముకొంటారా? కతడ్డ కాపీలు, పారితోసికాలిమ్మని ఆళ్ళు మా యెంటడతారా? పైసలు, బుక్కులు నొక్కేసేది మీరూ, అయి కొట్టేశారన్న సెడ్డపేరు పోస్ట్ మేన్లకా? ఏటంతావ్? యిశాపట్నం నుంచి యీడకొచ్చిన దారిపైసలు ఆ సేవణి కిచ్చేత్తే గొడవుండేది కాదంటావా? పదిమందికీ పంచటానికి అదేం ప్రైంమినిట్రీ ఫండేట్రా? పోస్ట్ మేన్ జీతం. . .నా జీతం. . .నా సిగదరగ. .నా ఆడది, పిల్లలకూ పెట్టటానిగ్గాని. .ఊరంతా పంచటానిగ్గాదురా! ఇంకా ఏటన్నావ్?. . .ఈ రోజుల్లో పక్కోడి నుంచి తీసుకొని సదివేటోళ్ళే గాని మీ బుక్కులెవడూ కొనట్లేదా? అందుకే పారితోసికాలివ్వట్లేదా? . . . మరి లచ్చన్నర పైగా అమ్ముడోయేది మా బుక్కేని. . మొదటి పేజీలో ముద్దరేత్తారుగా! ఏటి? అది పబ్లిసిటీనా? ఏ సిటీనో నాకు తెల్దు.  ఈ అప్పారావు సేతకానోడనుకొన్నావా? . . .నా సిగదరగ. . .నాకు తిక్క రేగిందంటే పేగులేరేత్తా! ఉజ్జోగం సేత్తున్నాని ఊరుకొన్నా గాని . . . బళ్ళో సదివేరోజుల్లో. . పెతోణ్ణీ బాజా కొట్టేసేవోణ్ణి.. . . .తిడతానండీ! యిశాపట్నం   దారిపైసలీనందుకు శాపాలెడతాను.   నేనెవర్నో తెల్సా? ఉత్తరాంధ్ర ఉత్తరాలోళ్ళ సంగానికి పెసిడెంటుని. ఈడకొచ్చే ముందే మా నాయకుల్ని కలిసినా. .మరోసారి ఏ ఊళ్ళో రైటరైనా మా పోస్టలోళ్ళెంటడితే, మీ కొచ్చే కవర్లు సించిపారేత్తాం. లేదంటే పాకిస్తాను ఐదరాబాదుకి తోసేత్తాం. అసలు మేమంటే ఏటనుకొన్నారు? రచైతలు ఎర్రడబ్బాలో యేసిన సరుకుని మేము మీకాడకి తేకపోతే మీకు ముద్దరేయటానికేటుంటదిరా? రైల్లోంచి దిగిన మీ పార్సెళ్ళని మేము బజారుకి సేర్చకపోతే ఏం సేయగల్రు? పెజలు మేము దొంగోళ్ళనుకొనే యెదవ పన్లు సేకుండా మీరూ బతకండి. ఆ రచైతల్ని బతకనివ్వండి. ఇదే నే సెప్పేది. అవునూ! చాలా సేపైంది. మీ కేసీరింకా రాలేదేటి?. . . .ఏటీ? ఆఫ్ డే సెలవా? మరి డీడి అట్టుకొత్తా. ఈడనే ఉండమన్నాడు.( కంగారుగా ) ఆడిల్లెక్కడా? తెల్దా? సచ్చాన్రా దేవుడా? సందేలకు రైలు టిక్కెట్టు కొన్నానే! జనాల్తో . . . .మీసిగదరగ. . .మీ పత్రికలోళ్ళు బాగా ఆడుకొంటున్నార్రా? మీరు మరి బాగుపడరు. ..నా ఉసురు కొట్టి పోతార్రా! (అంటూ కంగారుగా బయటకు పరుగు తీస్తాడు)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top