మగం’తరంగం’ - అచ్చంగా తెలుగు

మగం’తరంగం’

Share This

మగం’తరంగం’ 

(కేవలం నవ్వుకోవడానికి మాత్రమే - ఎవరినీ ఉద్ద్యేశించింది కాదు.)

పూర్ణిమ సుధ 


"కాలేజ్ లో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు - ఒక్క నాకు తప్ప... నాలో లోపమేంటీ ? నేనూ ఓ మోస్తరుగా బానే ఉంటాను కదా ?" అని ఛత్రపతిలో వేణుమాధవ్ లాగా బాధపడుతున్న మన కథానాయకుడు వరుణ్ కి దేవుడు కరుణించి, కరుణని పంపాడు. ఇక్కడ కరుణ అనేది అమ్మాయి పేరు.
నాకెప్పుడూ ఒక సందేహం... పుట్టగానే పెట్టే పేరుని నిలపాలని అనుకోకపోగా, మరీ ఇంత విరుధ్ధంగా తయారవుతారు... "హౌ ?" అని. ఇక కథలోకొస్తే, వారం రోజులుగా అస్సలు తన వైపు చూడని కరుణ, నిన్న రాత్రి 11 గంటలకి, "రేపు కలుద్దామా ?" అని పంపిన సంక్షిప్త సందేశం... అదే మేఘ సందేశంలా ఫీలయిపోయి, సెంటులో స్నానం చేసి, దువ్విన తలనే పది రకాలుగా లొంగదీసి, స్పైక్స్ పెట్టి, అమ్మకి ఇంటి పనిలో ఓ చెయ్యేసి ఒక వెయ్యి, నాన్నకి బిల్లులు కట్టడంలో తిమ్మిని బొమ్మిని చేసి ఒక వెయ్యి పట్టుకుని, క్రితం పుట్టినరోజుకి నాన్న గిఫ్ట్ గా ఇచ్చిన చెయిన్ ని వేసుకుని, మాంఛి పండగ పండగ డ్రెస్ ఏసి, దొరబాబుకి అమ్మ పెనిమిటిలా తయారయి గుమ్మం బయటకి రాగానే, "బావా, నీకెందుకు టెన్షన్ ? మన వీరిగాడి బైక్... ఫుల్లు ట్యాంకు... సాయంత్రం దాకా ఇటు వైపుకి రాకు... డు ఫెస్ట్... ఆల్ ద బెస్ట్" అని భుజం తట్టేసరికి, ధూం సీరీస్ లో తదుపరి హీరోలా బయలుదేరి, కాలేజ్ దగ్గర ఎదురు చూసాడు.
నాలుగంటే నాలుగు నిమిషాల తరువాత, వరుణ్ కంటికి పట్టు పరికిణీ కట్టుకున్న పంచపాత్రలా వస్తుందనుకున్న కరుణ, పిజ్జా మీది టాపింగ్ లా, ఒక ఉల్లిపొర టీ షర్ట్, ముప్పావ్ జీన్స్ లో మెరిసేసరికి, మురిసి, తడబడి, పడబోయి, నిలదొక్కుకుని, హాయ్... బాయ్... గుడ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్... నిన్ను, నిన్న నువ్వు, నాకు ఇవాళ... అంటూ కొరియన్ సినిమాకి ఒరియా డబ్బింగ్ లా అర్థం కాని వాగుడు వాగుతూ బైక్ ని చూపించాడు కూర్చొమ్మని.
"థాంక్స్... ముందెటు?" అంది, ఎక్కుతూ...
"నువ్వు చెప్పు - నేను జస్ట్ ఫాలో అవుతా" అంటూండగా... ముందు షాపింగ్ అంది, మృదు మధురంగా...
అదో పెద్ద మాల్. అడుగిడుతూనే, చాలా ని’క్కచ్చి’గా చెప్పింది, "నేనే కొనుక్కుంటాను, నువ్వు జస్ట్ నాకు ఏది బావుంది, ఏది బాలేదు అని సలహా ఇస్తే చాలు," అని... "అబ్బో ! అందరూ జోకులేస్తారు గానీ అమ్మాయిలు అంత బ్యాడేమీ కాదు" అని, మురిసి, ష్యూర్ అంటూ లేడీస్ సెక్షన్ లోకి వెళ్ళారు.
సేల్స్ అబ్బాయి, లేటెస్ట్ మోడల్స్ అంటూ ముప్పైమూడో పన్ను కూడా బైటేసి, పడేస్తున్న వాటిలో, వాడి దుంప తెంచి మరీ, ఆ కలర్ కి ఈ కలర్ ప్యాచ్ వర్క్, కుందన్స్, హెవీ వర్క్, ట్యునిక్స్ అంటూ, అర రోజుకి టోటల్ గా సోషల్, సైన్స్, మ్యాథ్స్ లాంటి అన్ని సబ్జెక్ట్ లని రివైజ్ చేయించి, "ఇంత ఖరీదా ?" వద్దులే అని వచ్చేయబోతుంటే, తన ఫ్రెండ్ ఇచ్చిన కార్డ్ గీకి మరీ కొనిపెట్టి, ఠావుల్ దప్పె, మూర్ఛ వచ్చె, ఏదైనా తిందామని రెస్టారెంట్ కి లాక్కెళ్ళాడు.
"నువ్వేం చెప్తే అదే" అని అంటూనే, నేతితో కాల్చాలి, ఆవాలు తక్కువెయ్యాలి, ఉల్లిపాయలు ఎక్కువెయ్యాలి, మరీ మందంగా వద్దు... అంటూ లక్ష రకాలుగా బేరర్ ని బేర్ మనిపించి, ఆఖరికి బ్రేవ్ మని బయటికి వచ్చింది.
తను ముందు వెళ్తూ, వెనకాల వస్తున్న వరుణ్ ని చూసుకోకుండా తలుపు వదిలేసరికి రెస్టారెంట్ తలుపు సందులో వేళ్ళు ఇరికి, కెవ్వుమని, జివ్వుమని, లవ్వు అంత వీజీ కాదని... ఏడవలేక నవ్వుతూ... బయలుదేరారు. ఇంతకీ నీ ఫేస్బుక్ ఐడి ఏంటి అనడిగి, రిక్వెస్ట్ పంపింది. ఆ రోజుకి తెచ్చిన రెండు వేలు, నలిగిన నాలుగు వేళ్ళు తలుచుకుని కుమిలిపోతూ... "అయితే అయింది, ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందని" ప్రశాంతంగా బెడ్డెక్కాడు...
"గుడ్ నైట్" అన్న మెసేజ్ మొబైల్ లో బ్లింక్ అయింది. తనూ జవాబిచ్చాడు. అంతే, "ఏం చేస్తున్నావ్ ?" అంటూ బాణంలా ఇంకోటి...
"ఇంత రాత్రి ఇంకేం చేస్తారు ? పడుకుందామని... "అని పెట్టాడు.
"ఏదైనా మాట్లాడొచ్చు కదా ?" అంది...
"సరే" అని ఓ పది నిమిషాలు మాట్లాడి పెట్టేసాడు. పొద్దున్నే బార్డర్ లో సైనికుడిలా గుడ్ మార్నింగ్ మెసేజ్ తో రిపోర్టింగ్ చెయ్యాలని తెలియని వరుణ్, కరుణ వర్షించిన ఒక చిన్న సైజ్ సునామీలో మునిగి, తృటిలో తప్పి, బయటపడ్డాడు. నాలుగో రోజు, ఇంతకీ నీ ఫేస్బుక్ పాస్ వర్డ్ ఏంటి ? అని అడిగింది. మళ్ళడిగావో ? అన్నాడు. బిక్కమొహమేసిన కుక్కపిల్లలా గారంగా, గోముగా, చిరుకోపంగా పధ్నాలుగు రకాలుగా చూసిన చూపుకి కరిగి, వరదయిన వరుణ్, "నా పాస్ వర్డ్ అదే బంగారూ... మళ్ళడిగావో ?" అన్నాడు.
ఓ అయితే ఓకే... అని టైంలైన్ లో ఉన్నవన్నీ స్కాన్ చేసి, "ఈ ఫోటో ఎవరిది ?" అంది, మా పిన్నిగారమ్మాయి జానకిది అన్నాడు.
"ఎంత బావుందో ? మరిది ?" అనింకో ఫోటో చూపించింది. తన ఫ్రెండ్ అని అమాయకంగా చూసాడు.
ఫేస్ లో ఏ ఫీలింగ్ లేకపోయేసరికి, చెప్పింది నిజమే అని నిర్థారించుకుంది... ఇలా పలు అగ్ని పరీక్షల వలయంలో, సునామీల సుడిగండంలో పడి కొట్టుకుని చావు తప్పి కన్ను లొట్టబోయిన వరుణ్ కి వారం తరువాత, కరుణ నించీ ఓ ఫోన్ వచ్చింది. నీతో ఓ విషయం చెప్పాలని. ఏంటో తెలిసినా, తన పదాల్లో తెలుసుకుందామని ఉసేన్ బోల్ట్ లాగా పరిగెడుతున్న గుండెని డిస్క్ బ్రేకులేసి అదిమి పట్టి చెప్పు - అన్నాడు.
"వద్దులే వరుణ్, మళ్ళీ నువ్వు ఫీలవుతావ్," అని ఒక పావుగంట బ్రతిమాలించుకున్న తరువాత, "నీకేమంటే ఇష్టం ?" అని అడిగింది మెలికలు తిరుగుతూ...
"నువ్వే అన్నాడు," అంతకన్నా ఇంకో రెండు యు టర్న్ లు ఎక్కువ తీసుకుని. నేలమీదేసిన ముగ్గుని సిగ్గని సర్దిచెప్పుకుని, ఛి, చిలిపి, అది కాదు, "తినేవాటిల్లో ఏమిష్టం ?" అంది. కంద బచ్చలి ఆవ పెట్టిన కూర అనగానే, ఆవిరైపోయింది, తన ఉత్సాహం.
మరేం ఫర్లేదు, టెక్నాలజీ ఉండగా ఏదైనా చేసెయ్యొచ్చని డిసైడ్ అయి, ఆ రాత్రి ప్రయత్నం మొదలెట్టింది. ముందుగా, వరుణ్ కి ఫోన్ చేసి, "వర్రూ... నీకు వర్రగా కూర వండిపెడదామంటే, నాకేమో వంట రాదు... అందుకే, నీకేమైనా తెలుసేమో అని ?" అన్నట్టూ... "ముందు స్టౌ కి మంటెట్టాక గిన్నె పెట్టాలా ? గిన్నె పెట్టాక మంటెట్టాలా ?" అని అడిగింది.
"ఏదో ఒకటి చెయ్ రా బాబూ..! ఆకలి దంచేస్తోంది..." అన్నాడు.
"ఏం చెయ్యను ? యూ ట్యూబేమో బఫర్ అవుతోంది. ఇందాకట్నించీ తిరిగిన తిరుగుడు తిరుగుతూనే ఉంది. నీ కడుపులో ఎలుకలు తిరిగినంత వేగంగా..!" అన్నది. మరుసటి రోజు, ఇద్దరూ కలిసి ఎటైనా వెళ్దాం అనుకుంటుండగా, వాళ్ళ చుట్టాల ఫార్మ్ హౌజ్ ఉందని మాటల సందర్భంలో చెప్తూండగా, "అమ్మో, నేను సాయంత్రమయ్యేసరికి ఇంటికి వచ్చెయ్యాలి. అసలే నాకూ ఇవాళ చాలా ముఖ్యమైన రోజు... "అని ఓ గావు కేకేసుకుంది.
"కొంప ముంచి తన పుట్టిన రోజా ? కాదే, క్రితం నెలేగా ? నా పర్సుని కర్సు చేసి, నా కార్డ్ ని స్క్రాచ్ చేసింది ? మరి ఇప్పుడేంటి ? వాళ్ళ అమ్మదో నాన్నదో పుట్టిన్రోజా ? ఈ క్విజ్ కన్నా, ఫెయిల్ అయ్యానని ఒప్పుకోవడం నయమేమో ?" సారీ రా...అన్నాడు.
 "అంటే నువ్వు అది కూడా మర్చిపోయావా ? నిన్నసలూ..! అనవసరంగా బంటిగాడు నిన్ను అడుగుతుంటాడు... నీకసలు వాడు గుర్తేలేడు... ఛి" అని చీదింది.
"బంటీనా ? ఈ పేరెక్కడో విన్నట్టుంది ? ఎవరబ్బా ?" అని ఇంకా మాట పూర్తి కాకముందే, "బంటీ తెలీదా ?" అని చంపేసేలా చూసింది.
వరుణ్ దెబ్బకి బెదిరిపోయి, "ఆ... ఆ... ఎందుకు తెలీదు ? మనం రేసుగుర్రం సినిమాకెళ్ళినప్పుడు మన ఎనక సీట్లో కూర్చుని పాప్ కార్న్ పడేసాడు.. "అంటూ నసిగాడు. "ఛి, వాడు ఎప్పుడూ నిన్నే అడుగుతుంటాడు, నీకేమో వాడు గుర్తేలేదు. హౌ మీన్ ?" అని రాగాలు తీసింది.
"అంటే నీ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దది కదా ? అందుకని," అన్నట్టు, నాకు మొహం గుర్తుంది, 5'10'' పొడువు - సౌండంటే పడవు, సస్పెన్స్ సినిమా ఆపి, రివీల్ చెయ్యవే బాబూ అని ప్రాధేయపడేసరికి, "చి... పో... సౌండంటే పడదులే కానీ, అంతెక్కడుంటాడు ?" మహా అయితే 2 ఫీట్లు... అని నిట్టూర్చింది.
"రెండు ఫీట్లా ? "అని నిర్ఘాంతపోయాడు.
"అంత ఆశ్చర్యం ఏంటీ ? నువ్వెప్పుడొచ్చినా నాకందే వదలడు, భుజాల మీద కాళ్ళేసి పలకరిస్తాడు... అని కరుణ చాలా తన్మయంగా చెప్తోంది. వరుణ్ నాకుతాడా ?" అని అంటూనే, ఒక్కసారి ఙాన బల్బు డింగుమని వెలిగింది. కరుణ చెప్పుకు పోతోంది, వాడి పళ్ళెంలో నించీ లెగ్ పీస్ కూడా తీసుకున్నావ్ !
"బంటి - నా డార్లింగ్. ఏంటీ ? పెంపుడు కుక్కా ?" అన్నాడు, "ఎంత ధైర్యం ? నా బంటీని కుక్క అనడానికి ?" అని పిక్కందుకుని కరవబోయినంత పని చేసింది, కరుణ... "ద్యావుడా - డాగ్స్ మస్ట్ బీ క్రేజీ - చి చి - గాడ్స్ మస్ట్ బీ క్రేజీ" - అంటూ, ఎందుకు గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంత అలమటించానా ? అని తెగ కుమిలిపోయాడు.
దీనికి తగ్గట్టు, ఇంకో వారంలోపు, రెడీ అవడానికి పట్టిన టైం, డేట్లు గుర్తుపెట్టుకోలేదని చించిన డొక్క ఇలా ఇంకో మూడు నాలుగు సంఘటనల తర్వాత, ముఖేష్ పొగత్రాగొద్దనే యాడ్ ఈ విధంగా వినబడింది -
మేం రోజూ, అమ్మాయిల మాటలు అర్థం కాక జుట్టు పీక్కుంటున్న ఎంతో మంది  అబ్బాయిల్ని చూస్తూ ఉంటాం..!
వీళ్ళందరూ కూడా అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకుందామని ప్రయత్నించి పిచ్చెక్కిన వాళ్ళే. ఇది ముఖేష్ కథ...
నా పేరు ముఖేష్... నేను ఇరవై రెండేళ్ళుగా కష్టమనేదే తెలీకుండా హ్యాపీగా ఉన్నాను...రెండు నెల్ల క్రితం నా జీవితంలోకి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది - తన మనసులో విషయం కనుక్కుందామని ప్రయత్నించాను... నాకిప్పుడు అంతుచిక్కని వ్యాధి - నెత్తి మీది ఉంగరాల జుట్టుతో పాటు చేతికున్న ఉంగరాలు కూడా దబంగ్ దబంగ్... బహుశా నన్నింక ఏ అమ్మాయీ దేకకపోవచ్చు (చూడకపోవచ్చు)
దురదృష్టవశాత్తూ మేం ముఖేష్ ని కాపాడలేకపోయాం...! అతని వయసు 23 ఏళ్ళే - అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం - ప్రాణాంతకం - మానుకోండి నేడే...
***

No comments:

Post a Comment

Pages