ఇలా ఎందరున్నారు ?- 14 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 14

Share This

ఇలా ఎందరున్నారు ?- 14   

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. ఇక చదవండి... )
అనంత్ మాట్లాడేది ఒక అమ్మాయితో అని అర్ధమైంది సంకేతకి....
... ఇందుకేనేమో గతకొన్ని రోజులుగా తనెప్పుడు కాల్ చేసినా అతని సెల్ ఫోన్ లాంగ్ టైం ఎంగేజ్ వచ్చేది. ఎన్నిసార్లు చేసినా అంతే!  బిజీ! బిజీ! బిజీ! అంటే! అనంత్ తనను ప్రేమించినట్లే ప్రత్యూషను ప్రేమిస్తున్నాడా? తనతో తిరిగినట్లే ఆమెతో తిరుగుతున్నాడా? తనకి ఇచ్చినట్లే గిఫ్ట్ లు కూడా ఇస్తున్నాడా?
ఎందుకో ఇలాంటి పనులు ప్రపంచంలో ఎవరు చేసినా, ఎవరి సెల్ ఫోన్ ఎంతసేపు ఎంగేజ్ వచ్చినా ఎవరికీ లేని బాధ తన ఒక్కదానికే ఉందా?
నిజానికి తను అతనితో బాగానే అనుభవించింది. సంతోషపడింది. ఒకానొక సందర్భంలో మొహం మొత్తింది కూడా! తనకి తెలియనిది, అందనిది, అతని దగ్గర ఇంకేం లేదన్న స్థాయికి కూడా చేరి సంతృప్తిపడింది... అలాంటప్పుడు ప్రత్యూషతో అతను మాట్లాడితే బాధపడకుండా వుండాలి కదా! ప్రత్యూషను కూడా తనలాగే అతని దగ్గర అనుభవించనీ అని తేలిగ్గా తీసుకోవాలి కదా!అలా ఎందుకు చెయ్యలేకపోతోంది?
గుండెలో చెయ్యిపెట్టి తిప్పినట్లు ఈ బాధేంటి?
ప్రశాంతంగా వున్న మనసును రాయితో చితకబాదినట్లు ఈ నొప్పేంటి?
ఆ బాధను తట్టుకోవటం ఆమె వల్ల కావటం లేదు. ఈ బాధ ముందు ప్రపంచంలో ఏ బాధ అయినా గడ్డిపోచే... తలవంచుకుని అనంత్ ప్రత్యూషతో ఏ మాట్లాడుతున్నాడో వింటోంది. తనతో కన్నా ప్రత్యూషతో ఎక్కువ మాట్లాడుతున్నాడేమో ! డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడేమో! తన మాటలకన్నా ఆమె మాటల్లో ఎక్కువ ఆనందం దొరుకుతుందేమో! తన దగ్గర తీరని దాహం ఆమె దగ్గర తీరుతుందేమో! ఏదైనా ఒకదాన్ని మించి ఒకటి ఆకర్షిన్తుంది అంటే దానికి అదనపు అర్హతలు వుండాలి. అవి తనలో లేకనే అమెవైపుకి మొగ్గాడు. అసలు ఎక్కడుంది సమస్య? అది తనకు ఎలా తెలియాలి? తనలో కలిగే ఈ ఆరాటం, ఈ ఉద్విగ్నత, ఉద్వేగం అతనికెలా తెలియాలి? అతనికి తనతో అవసరమే లేనట్లు, తనెవరో తెలియనట్లు, అపరిచితుడులా నిలబడివున్నాడు. తనలోని భావోద్వాగాలను గమనించే స్థితిలో లేడు.
తనుకూడా అతనిలా ఎందుకు వుండలేకపోతుంది? ఇదేం బాధరా దేవుడా బాధి బాధి చంపుతోంది అన్నట్లు ఆమె మనసు అనంతంగా మెలితిరుగుతుంటే! సెల్ ఫోన్ ఆఫ్ చేసి దాన్ని అలాగే పట్టుకొని ‘చెప్పు!’ అన్నాడు సంకేత వైపు చూసి... సంకేత వెంటనే...
“ఈ పార్టీలో మన ఫ్రెండ్స్ తా వున్నారు. నన్ను మాత్రమే ఎందుకు పిలవలేదు. నీకు ఉద్యోగం రావటం నాకు ఆనందం కాదా? నేను దాన్ని పంచుకోవద్దా! నన్నెందుకిలా దూరం చేస్తున్నారు?” అంది. ఆమె గొంతు బాధతో జీరబోయింది.
అనంత్ ఆ మాటలకి ఏమాత్రం స్పందించకుండా మళ్ళీ తన సెల్ ఫోన్ వైపు చూడసాగాడు. అతని నిర్లక్ష్యం ఆమెను ఊచకోత కోస్తోంది.
“ఆంటీకి నేను నచ్చలేదా?” అంది.
“ఆంటీ ఎవరు?” అడిగాడు”
మీ మమ్మీ!” అంది.
“మా మమ్మీ నిన్ను చూసిందా?” ఆశ్చర్యపోయాడు.
“చూసింది. పల్లవితో వచ్చి... నేను నచ్చితే మనకి పెళ్ళి చెయ్యాలన్నదే ఆమె ఉద్దేశ్యమట. మీతో ఏం చెప్పింది? నచ్చలేదని చెప్పిందా? నన్ను కట్ చేసుకోమని చెప్పిందా?” అంది.
“బోర్! అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మా మమ్మీ ఎలా ఉంటుందో చెప్పు! నువ్వు చూశావో లేదో చెబుతాను... ఈ మధ్యన నువ్వు అబద్దాలు కూడా నేర్చుకుంటున్నట్టున్నావు” అన్నాడు.
అంత బాధలో కూడా సంకేత శరదృతిని గుర్తు చేసుకుంటూ...
“ఆంటీ జడ చాలా పొడవుగా వుంటుంది. నా దగ్గరకి వచ్చినపుడు నెటెడ్ కాటన్ చీరలో వుంది. ఇప్పుడు నమ్ముతున్నారా ఆంటీ నా దగ్గరకి వచ్చిందని...”
“వచ్చిందేమో! నాకు తెలియదు. నాతో ఏం మాట్లాడలేదు. అయినా ఎందుకీ నాన్సెన్స్? నువ్వు నాతో ఏం మాట్లాడినా ఈగల్ని, దోమల్ని బాణాలతో కొడుతున్నట్లు జోక్ గా, బోర్ గా వుంది. వెళ్ళు. ఇంటికెళ్లి ప్రశాంతంగా చదువుకో! సబ్జెక్టులున్నాయిగా! ఐదా ? ఆరా?”
ఇప్పుడా విషయం ఎందుకు? అయినా చెప్పింది “ఐదు..” అని.
“చూడు! ఇలా సబ్జక్టులు పోయినవాళ్ళు కొందరు ఇంటి దగ్గర చెప్పకుండానే చాలా కష్టపడి ఎగ్జామ్ ఫీజు కట్టుకొని రాస్తుంటారు. నువ్వంత కష్టపడొద్దు. ఇంట్లో చెప్పెయ్యి. ఒక ఫ్రెండ్ గా నా అడ్వయిజ్ ఇది. నచ్చితే ఫాలో అవ్వు! లేదా నీ ఇష్టం!” అన్నాడు. చాలా కఠినంగా అన్పించాయి ఆ మాటలు.
“నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. అనంత్! ఎందుకిలా మాట్లాడుతున్నావ్? ఫస్ట్ సెమ్ లో రెండు సబ్జక్టులు పోయాయని చెప్పినప్పుడు ‘ఏం కాదు. మళ్ళీ రాసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు నేను కడతానులే! ఇంట్లో చెప్పకు” అన్నావు. ఆ తర్వాత సెకండ్ సెమ్ లో మూడు సబ్జక్టులు పోయాయని చెప్పినా అలాగే అన్నావు. డిటేయిండ్ అయ్యానని చెప్పినప్పుడు “ముందు చెప్పొద్దా! దానిక్కూడ ఏదో చేసేవాడిని... నేను కూడా నా అటెండెన్స్ నా ఫ్రెండ్స్ తో చెప్పించేవాడిని. అలా వీలుకానపుడు సీక్రెట్ గా మనీ ఇచ్చి మేనేజ్ చేసుకునేవాడిని... మార్కులు కూడా ఒక ప్రొఫెసర్ కి రహస్యంగా మనీ ఇచ్చి వేయించుకున్నాను. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. బయట చెప్పలేదు. నా చిన్నప్పుడు మా డాడీ నా మార్కుల విషయంలో ఎలా చేశాడో పెద్దయ్యాక నేనూ అదే చేస్తున్నాను... అలా ఎందుకంటే చదువులో నేను నీ అంత బ్రిలియంట్ కాను...” అని నువ్వు అనలేదా?
“నేను బ్రిలియంట్ ని అయినా, మీరుకాకపోయినా ఇప్పుడు చూడండి ఇద్దరం. ఒకటే అయ్యాం! ఒకటి కాదు. చదువు విషయంలో ఇప్పుడు మీరు నాకన్నా బెటర్ పొజిషన్ లో వున్నారు. లోలోపల డబ్బులతో మీరేం చేస్తున్నారన్నది బయట ఎవరికీ కన్పించదు. అనంత్ బాగా చదివాడు. సంకేత డుమ్మా కొట్టింది అంటారు....” అంది రాని నవ్వును ముఖం మీదకి తెచ్చుకుంటూ.
అనంత్ నవ్వి “కావచ్చు. దానికి నేనేం చెయ్యలేను...” అన్నాడు భుజాలను తమాషాగా కదిలించి...
అనంత్ నవ్వు, ఆ భుజాల కదలిక సంకేతకి ఎక్కడెక్కడో గుచ్చుకొని బాగా హింసించాయి...
“కావాలంటే మా డాడీకి మంచి పేరుంది. పలుకుబడి వుంది. ఆయన పేరు చెబితే చాలు ఏ పనయినా సులభంగా అవుతుంది. నీ చదువయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు నాకు కాల్ చెయ్యి... డాడీతో చెప్పి పనయ్యేలా చేస్తాను” అన్నాడు.
కన్నీళ్ళోస్తున్నాయి కానీ మాట రాలేదు సంకేతకి...
“మరి నేను వెళ్ళనా! లోపల స్నేహితులు నాకోసం వెయిట్ చేస్తుంటారు. ఇది నేను బయటకొచ్చి మాట్లాడే సమయంకాదని నీకు తెలుసు...”
ఆమె అదేం పట్టించుకోకుండా “అనంత్! మీరిప్పుడు ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఎవరు?” అంది.
“నా ఫియాన్సీ!” అన్నాడు.
..దిక్కులు గర్జించినట్లు, మేఘాలు మీదపడ్డట్లు, ఊపిరి బిగబట్టింది సంకేత.
అతను లోపలికి వెళ్లబోయాడు.
వెంటనే కదలి అతని చెయ్యిపట్టి ఆపుతూ “మరి నేనేమై పోవాలి?” అంది. ఆమె గుండె గొంతులోకి వచ్చినట్లు ఆ మాటనిండా ఆర్థ్రత వుంది.
అనంత్ ఏమాత్రం చలించకుండా “నీకేమైందిప్పుడు? పోయిన ఆ సబ్జక్టుల పనేదో చూడు. ఒక సంవత్సరం ఆలస్యంగానైనా బి.టెక్. పూర్తి చెయ్యి... మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి కదా!”
“అవన్నీ నేను చూసుకుంటాను. నన్ను వదిలేసి ఆ అమ్మాయిని చేసుకోవటం ఏమిటి?”
“చేసుకుంటే తప్పేంటి? చూడు సంకేతా! నేను చెడ్డవాడినో, మోసగాడినోకాను... నీ ప్రమేయం లేకుండా, నీ పర్మిషన్ లేకుండా నిన్ను నేను ఏమి చెయ్యలేదు... నేను నీతో ఎన్ని మాటలు మాట్లాడానో అంతకు రెట్టింపు మాటలు నువ్వు నాతో మాట్లాడావు. నేను నీతో ఎంత సంతోషపడ్డానో అంతకు రెట్టింపు సంతోషాన్ని నువ్వూపడ్డావు.. ఇదే విషయాన్ని నువ్వు నీనోటితోనే ఎన్నోసార్లు చెప్పి ఒప్పుకున్నావు.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది నీకు తెలుసు... ఆ ఇష్టం కూడా ఎందుకో నీకు చెప్పాను. మళ్ళీ చెబుతాను విను... నువ్వు చదువుతావని, మంచి మార్కులు తెచ్చుకుంటున్నావని...నేను కాదు నీ లాంటి అమ్మాయిలతో పరిచయం అంటే ఏ అబ్బాయికైనా గర్వంగానే ఉంటుంది. స్వార్ధం లేకుండా మనిషి ఏ పనీ చెయ్యడు కదా?” అన్నాడు.
“మరి మీ భార్యగా నేను బాగుంటానని ఎందుకు అన్నారు? నాకు అంతటి ఆశను ఎందుకు కలిగించారు? మెళ్ళో పుస్తెలతో, కాళ్లకు మట్టెలతో మీ పక్కన ఊహించుకొని ఎంత సంతోషపడేదానినో తెలుసా” అంది.
“ఇప్పుడూ అంటున్నాను. నా భార్యగా ప్రత్యూ కన్నా నువ్వే బావుంటావు... కానీ ప్రత్యూ నాతో పాటే క్యాంపస్ సెలెక్షన్స్ లో సెలెక్ట్ అయింది. ఇద్దరం ఒకే కంపెనీ. దీనివల్ల ఇంట్లోనే కాదు కంపెనీలో కూడా ఇద్దరం కలిసి ఉండొచ్చు. ఇది నాకు అరుదైన అవకాశం... ఇద్దరం ఓ.కే.అనుకున్నాం... అప్పటినుండి మాట్లాడుకుంటున్నాం... అన్నాడు. ఆకాశం మీద పడకపోయినా పడ్డట్లే అదిరిపడింది.
అనంత్ చెప్పేది నిజమే! కార్లు మారుస్తాడు. బైక్ లు మారుస్తాడు కాని మొబైల్ మాత్రం మార్చడు... ప్రత్యూష పరిచయం కాకముందు ఆ సెల్ ఫోన్ తన ఒక్క దానికోసమే అన్నట్లు ఉండేది. వెంటనే రింగు అయ్యేది. ఆన్ చెయ్యగానే అతని మాటలు ఒక ప్రవాహంలాగా తన శరీరంలోకి చేరి అణువణువును తృప్తి పరిచేవి... అనంత్ ఎప్పుడెప్పుడు కాల్ చేస్తాడా అని తన ధ్యాసంతా అతనిచ్చిన సెల్ ఫోన్ మీదనే ఉండేది. చెవులు, మనసు, శరీరం ఏకమై ఎదురుచూసేవి...
..మరి ఇప్పుడు ప్రత్యూష కూడా అతని మాటల వల్ల తన లాగే ఫీలవుతోందా? తను అనుభూతిస్తున్నప్పుడు ఏమీ అన్పించలేదు కాని ఇప్పుడు ప్రత్యూష కూడా అతని వల్ల తన లాగే ఆనందిస్తోందీ అంటే అణువణువు రగిలిపోతోంది. తనకి మాత్రమే చెందాలనుకున్న దాన్ని ప్రత్యూష అవలీలగా తన్నుకుపోయి తనని నిర్ధాక్షిణ్యంగా కాలితో తొక్కుతున్నట్లు అన్పిన్తోంది. మనసుతో పాటు శారీరకంగా కూడా ఉడికిపోతుంది...
అనంత్ సెల్ ఫోన్ మీద ఉన్న చూపుల్ని సంకేత మీదకి మళ్ళించి దడిసినట్లుగా ఒక అడుగు వెనక్కి వేశాడు.” ఆ చూపేంటే! కాళిలా! ఇక్కడికిక్కడే నన్ను కాల్చి బూడిద చేస్తావా ఏం? అక్కడెక్కడో ఒక మొగుడి నోట్లో భార్య యాసిడ్ పోసిందట. నువ్వు కూడా అలాగే పోస్తావా ఏం? అంత వయోలెన్స్ అవసరమా చెప్పు? అయినా నీ మీద ఎంత ఖర్చు పెట్టాను. నిన్నెంత సుఖ పెట్టాను. అదొకసారి గుర్తు చేసుకో! ఒకటి, రెండు, మూడు అంటూ వేళ్ళు లెక్కపెట్టుకొనో మనం తిరిగిన ప్రదేశాల్ని, కూలింగ్ అద్దాలున్న కారులో తిరగడాలను గుర్తు చేసుకో! పాపం! అనంత్ నాకోసం డబ్బుని, టైం ని, చదువుని వృధా చేసుకొని నా వెంటే తిరిగాడు కదా! మార్కులు కూడా డబ్బులిచ్చే వేయించుకున్నాడు కదా! అతనీ రోజు తన భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఆలోచించుకుంటే తప్పేంటి? అని నీకు అన్పించటం లేదా?... మనిషన్నాక ఆ మాత్రం సడలింపులు దేనికైనా అవసరం సంకేతా!” అన్నాడు.
సంకేతకి ఒళ్లంతా జలదరించినట్లై కన్నీళ్లు తన్నుకొచ్చాయి. తనేం పోగొట్టుకున్నదో స్పష్టంగా అర్ధమైంది. ఆ క్షణంలో ఏం చేయాలో తోచక ఏం చేస్తున్నానో తెలియని దానిలా ఒక అడుగు ముందుకేసి అతని భుజాన్ని నోటితో గట్టిగా పట్టుకొని కసిగా, కండవూడోచ్చేలా కొరికింది... అనంత్ తేరుకునే లోపలే తను కొరికిన చోట చేయి పట్టి గట్టిగా అదిమింది. అతనికి నొప్పి తెలియనియ్యకుండా నిమిరింది. ఆమె చేస్తున్న పనికి అతను నిరుత్తరుడై చూస్తుండగానే ఆమె ఒక్కక్షణం కూడా అక్కడ నిలబడకుండా వెనక్కితిరిగి వెళ్ళిపోయంది.
భుజాల్ని తడుముకుంటూ, స్నేహితులు గుర్తు రాగానే లోపలికి వెళ్ళాడు అనంత్....
*****
          ఇంటికెళ్ళగానే నీలిమ ఒడిలో తలపెట్టుకొని బోరున ఏడ్చింది సంకేత... నీలిమది తన వయసే అయినా తల్లిలా అన్పించింది. ఆ క్షణంలో...
          సంకేత ఎందుకు ఏడుస్తుందో నీలిమకు అర్ధం కాలేదు. చేయి మాత్రం సంకేత తలపై వేసి ఓదార్పుగా నిమిరింది.
          ఓ నిమిషం గడిచాక నీలిమ ఒడిలోంచి లేచి కళ్ళు తుడుచుకుంది సంకేత.... సంకేత కళ్ళు ఎర్రగా మంకెన పువ్వుల్లా ఉన్నాయి.
          “ఏంటి మేడమ్! ఏం జరిగింది? ఇంటి దగ్గర నుండి ఏదైనా వార్తలాంటిది తెలిసిందా?” అడిగింది నీలిమ ఆందోళనగా చూస్తూ. అప్పుడప్పుడు సంకేత తల్లి శశమ్మకి అనారోగ్యంగా వుంటుంది.
“అలాంటిది ఏమి లేదు నీలిమా?”
“మరింకేంటి?” త్వరగా తెలుసుకోవాలన్న ఆత్రుత నీలిమలో స్పష్టంగా కన్పించింది.
నీలిమని చూస్తుంటే తన బాధను నీలిమతో పంచుకోవాలనిపించింది. వెంటనే “అనంత్ నన్ను మోసం చేశాడు నీలిమా!” అంది సంకేతకు ఎంత ఆపుకుందామన్న కన్నీళ్లు ఆగటంలేదు.
నీలిమ ఆశ్చర్యపోతూ “అనంత్ సార్ మోసం చెయ్యటమా! నమ్మలేకపోతున్నాను” అంది తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు.
సంకేత ఏడుస్తోంది. అది ఏడుపులా లేదు. అదో ప్రవాహంలా, ఉప్పెనలా, సునామీలా సంకేతను ముంచెత్తుతోంది.
నీలిమ నెమ్మదిగా సంకేత భుజాలను పట్టుకొని “ఇలాగే ఏడ్చారంటే మైండ్ దెబ్బతిని పిచ్చెక్కుతుంది మేడమ్! కంట్రోల్ చేసుకోండి!” అంది.
ఆమె మాటలు వినగానే నీలిమను వదిలించుకొని నుదురు పగిలిపోయేలా కొట్టుకుంది సంకేత. అలాగే కొట్టుకుంటూ “నాకు పిచ్చెక్కాలి. లేకుంటే ఈ వాస్తవాన్ని నేను తట్టుకోలేను. అనంత్ లేకుండా నేనుండలేను. అతనే లేనప్పుడు నాకేమి అక్కర్లేనట్లు అన్నీ పోగొట్టుకొని అనంతే చాలనుకున్నాను. అతనే లేనప్పుడు నాకేముందని నేను తెలివిలో ఉండాలి. అందుకే నాకు పిచ్చెక్కాలి. నన్ను చూసి ఇంకెవరూ ప్రేమ జోలికి పోకుండా ఉండాలి. మా కాలేజీలోనే కాదు అన్ని కాలేజీలలో నా గురించి చెప్పుకోవాలి. ఈ నరకం ఇంకే అమ్మాయికి ఉండకూడదు. నాకు పిచ్చిక్కితేనే ఇది సాధ్యం...” అంది తలను ఇంకా బలంగా కొట్టుకుంటున్న సంకేతను బలవంతంగా ఆపి ఆమె తలను తన భుజానికి చేర్చుకొని “ఇలా ఎందుకు జరిగింది మేడమ్! నువ్వేమైనా అన్నావా అనంత్ సార్ ని...”
“అలాంటిది ఏమి కాదు నీలిమా! నాకు సబ్జెక్టులు పోయాయట డిటేయిండ్ అయ్యానట. నాకు బి.టెక్ కంప్లీట్ కావాలన్నా, జాబ్ రావాలన్నా చాలా టైం పడుతుందట. నేను డిటెయిండ్ కాకుండా సబ్జక్టులు పోకుండా ఉంటే నా గురించే ఆలోచించేవాడట... ‘ఇప్పుడు నిన్ను చేసుకొని నేనేం చెయ్యాలి? మహా అయితే కాస్త ట్రైనింగ్ ఇస్తే వంటకి మాత్రమే పనికొస్తావు. అందుకే నేను ప్రత్యూషను సెలెక్ట్ చేసుకున్నాను’ అంటున్నాడు. ఇన్నే రోజులు నేనే తనైనట్లువుండి ఇప్పుడేమో ఇలా అంటున్నాడు. అతన్ని నేనెలా మరచిపోవాలి? ఇప్పటికిప్పుడు నా మనసులోంచి అతన్ని ఎలా తీసేయ్యాలి? తీసేసి ఆ శూన్యాన్ని ఎలా భరించాలి? ఒకక్షణం అతన్ని తీసేసి చూస్తే నా మనసు మైదానం ఎంత బావురుమంటుందో అతనికెలా తెలియాలి?” అంది సంకేత.
          నీలిమ బిక్క ముఖం వేసుకొని చూస్తోంది.
          సంకేత తన రెండు అరచేతుల్ని కళ్ళమీద పెట్టుకొని గట్టిగా కన్నీళ్లను తుడుచుకుంది. మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది.
          “అనంత్ కి నేను కాల్ చేసినప్పుడు అతని సెల్ ఫోన్ ఎంగేజ్ వస్తేనే భరించలేకపోయేదాన్ని... అడిగే దాన్ని, బాధ పడేదాన్ని, ఎంతసేపు మాట్లాడతాడో అని టెస్ట్ చెయ్యటం కోసం రిపీట్ కాల్ చేసే దాన్ని .. అతను మాట్లాడుతూనే ఉండేవాడు. గంటలు, గంటలు... అయినా కాంప్రమైజ్ అయ్యాను. కానీ అతను ఫోన్లో మాట్లాడుతున్నది తన వుడ్ బి ప్రత్యూషతో అని, ఇంతకు ముందే తెలిసింది. ఇప్పుడెలా కాంప్రమైజ్ అవ్వాలి? లైఫంతా అతను ఎంగేజ్ అయితే ఎలా తట్టుకోవాలి?” అంటూ మళ్లీ ఏడ్చింది.
          ఈ ఏడుపెంటో! ఈ ప్రేమేంటో! నోటి కాడి ముద్ద జారిపోయినట్లు, ఎవరో మనషి చనిపోయినట్లు, అసలు ఈ బాధేంటో అర్ధం కాలేదు నీలిమకి....
          “ఇదంతా హిందూ మేడమ్ కి తెలుసా?” అడిగింది నీలిమ.
          “తెలిస్తే నన్ను అనంత్ దారి నుండి మళ్లిస్తుందని చెప్పేదాన్ని కాదు. తర్వాత తెలుసోలేదో నాకు తెలియదు. బహుశా తెలుసో ఏమో నేను తన చేయి జారిపోయినట్లు జాలిగా చూసేది కోప్పడేది. నాతో ఎప్పుడు మాట్లాడినా ఏవో జీవిత సత్యాలను చెప్పేది. నేనున్న అప్పటి పరిస్థితులలో అవి నాకు నచ్చేవికావు. తనేం మాట్లాడినా హర్టయినట్లు ఫీలై కోప్పడేదాన్ని అప్పటినుండి అది నను అంటీముట్టనట్లు ఉండేది. అది నాకు మంచి స్నేహితురాలు. అయినా దానిముందు అనంత్ ఫీలే నాకు గొప్పగా అన్పించేది. ఇదంతా నా కర్మ. నేను తప్పు చేశాను నీలిమా! హిందూని వదిలేసి కొంతమంది స్నేహితుల మాటలు విని చదువుకునే టైంలో చదువుకోకుండా చదువుదేముందిలే ఎప్పుడైనా వస్తుంది. అనుకున్నాను. అనంత్ పొతే మళ్లీ వస్తాడా అని అనంత్ తో తిరిగాను... అతను నా మీద ప్రేమతో ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి న్యాయం చెయ్యాలనుకున్నాను. ఈ లోపలే ‘డబ్బు కన్నా విలువైన దాన్ని నేను’ అంటూ కాలం నా చదువుని కాటేసి వెళ్ళిపోయింది... ఇప్పుడు చదువుపోయింది. అనంత్ పోయాడు. నాకేం మిగిలింది? ప్రేమలేని జీవితాన్ని నేను ఎలా మొయ్యాలి?” అంటూ ఏడుస్తూనే ఉంది.
          ఎంతసేపు మాట్లాడినా అనంత్ ప్రేమ గురించి తప్ప ఇంకో మాటమాట్లాడని సంకేతను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నీలిమకి.... అసలు ప్రేమంటే ఒకే వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి జ్ఞాపకాలతో ఏడుస్తూ గడపడమా?
          ఈ మధ్యనే ఈ సంకేతకి చదువు తగ్గి, సోమరితనం పెరిగింది. ప్రేమ పేరుతో నోటికాడి చదువుని కాలదన్నుకునేలా ఉంది. కాకుంటే ఈ ఏడుపేంటి? తామిద్దరేమైనా లైలా, మజ్నులా? లేక దేవదాసు, పార్వతీలా? అయినా ఆ జంటల్ని చూసిన వాళ్ళెవరున్నారు? సినిమాల్లో తప్ప... ఎవరినైనా ప్రేమిస్తే అర్ధంఅవుతుంది ఆ బాధేంటో అని అంటారేమో కాని తనకి వరమ్మ అంటే చాలా ఇష్టం... అలా అని కాంచనమాలని ఇష్టపడటం లేదా? శివరామకృష్ణని, శ్రీహర్షని ఇష్టపడటం లేదా? అందరి పనులను మనసుతో చెయ్యటం లేదా? బాధ్యతతో చూడటం లేదా?
          ఇంతెందుకు తను సూర్యోదయాన్ని ప్రేమిస్తుంది. కిటికీ పక్కనపూలమొక్కని ప్రేమిస్తుంది. జలుబు చేసినపుడు వరమ్మ దగ్గుని ప్రేమిస్తుంది. అలాగే ఉదయాన్నే కాఫీని కప్పులో పోస్తుంటే వినిపించే చప్పుడును ప్రేమిస్తుంది. తనకి లేదా ప్రేమించే తత్త్వం...? అందుకే సంకేతను అర్ధం చేసుకొని...
          సంకేతమ్మ! నాకు మీ అంత చదువు లేకపోయినా నేనోమాట చెబుతాను వింటావా? నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే ఏడుస్తావు... ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే ఓ పదిరోజులు మీ ఊరు వెళ్ళి మీ అమ్మ, నాన్నలతో గడిపిరా! వాళ్ళ సంతోషంలో పడి నువ్వీ బాధను మరచిపోతావు... ఒక దాని మీద మనసు నిలవనపుడు ఇంకో దాని మీదకి మల్లించటం తెలివైన పని.. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అనంత్ సార్ ని ఎంతగా ప్రేమించావో అంతకన్నా ఎక్కువగా నీ చదువును ప్రేమించు... నేనింతగా ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో అంతేకాదు శివాని, పల్లవి, హిందు,శ్రావ్య బి.టెక్. ఫోర్త్ ఇయర్ లోకి వెళ్ళి చదువుతుంటే ఒక్క నువ్వు మాత్రమే థర్డ్ ఇయర్ లో వుంది చదవాల్సి వస్తోంది. లోపం ఎక్కడుందో ఆలోచించు. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి, తగినంత బలంతో, ధైర్యంతో, బాధ్యతతో నడుచుకోవాలి” అంది నీలిమ.
          ...నీలిమ మాటలు రుచించనట్లు, అసహానంగా చూసింది సంకేత.
          అయినా నీలిమ సంకేత గురించే ఆలోచిస్తోంది. మనం ఏది చేసినా సంతోషం కోసమే చేస్తాం! ప్రేమించినా, సంపాదించినా... కాకపొతే ఏది సులభంగా ఉంటే దాని వెంటపడాలనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకి ప్రేమించటం చాలా ఈజీ అయిపొయింది. అందుకే...
          “ఒకసారి నువ్వు మీ ఊరెళ్ళినపుడు మీ వాళ్ళతో కలిసి పొలం పనులకి వెళ్తానని నాతో చెప్పావు గుర్తుందా సంకేతమ్మా! నువ్వే కాదు సిటీలకొచ్చి కాలేజీలో చదివే కొందరు అమ్మాయిలు సెలవుల్లో ఇంటికెళ్లినపుడు వాళ్ళ స్థోమతను బట్టి పొలం పనులకి వెళ్తుంటారట....తప్పులేదు. ఈసారి ఊరెళ్ళినపుడు మీ వాళ్ళతో పొలం పనులు చెయ్యి వచ్చిన డబ్బులతో మీ అమ్మకో చీర కొనివ్వు... అప్పుడు ఎంత ఆనందం వస్తుందో చూడు. ఆ ఆనందం ముందు ఈ ప్రేమ తేలికై పోతుంది. నీకు బోలెడంత ఆత్మవిశ్వాసం వస్తుంది... నామాట విని మీ ఊరువెళ్లిరా!” అంది.
          సంకేత అసహనంగా, కోపంగా చూసి “నేను ఆ అనంత్ గాడిని ప్రత్యూషని వదిలి మా ఊరు వెళ్ళాలా? ఇదేనా నువ్విచ్చే సలహా?” అంది గట్టిగా.
          అప్పుడే లోపలికి వస్తున్న శ్రీహర్ష ఆ మాటలు విన్నాడు.
          శ్రీహర్ష వచ్చినట్లు తెలిసి కంగారుగా చూసి “కళ్ళు తుడుచుకో! ఆంటీ ఇంట్లో లేరు. నేను వెళ్ళి శ్రీహర్ష సార్ కి జ్యూస్ తీసి ఇవ్వాలి...” అంటూ ఎవరో తరుముతున్నట్లు లోపలికి వెళ్లింది నీలిమ.
          వెళ్తున్న నీలిమను చూడగానే నీరసం ఆవరించింది సంకేతకి అనంత్ విషయంలో తనది ఏక పక్ష పరితపన అని తనలోని ఆత్మ పరిహాసం చేస్తున్నా మనసు మాత్రం అతని వైపే వెళ్తోంది.
          అతని గురించి నీలిమతో ఇంకా, ఇంకా ఏదో చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఖాళీ సమయం దొరికితే తప్ప నీలిమ తన మాటలు వినదు. ఏంటో పనిపట్ల ఎవరి అంకితభావం వాళ్ళదైపోయింది. పనిని ప్రేమిస్తే ఏమోస్తుందో నీలిమకు బాగా తెలుసు. ఈ రెండు ప్రేమలు ఎవరిని ఎటు తీసుకెలతాయో?
          అనంత్ గుర్తొస్తుంటే గుండె బరువెక్కింది సంకేతకి...
*****
          ....ఎవరి విధికి వాళ్ళే విధాతలంటారు పెద్దలు. రోజులు వేగంగా నడచిపోతున్నాయి.
          సంకేతకి ఇప్పుడు అనంత్ తో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఆమె మనసు మాత్రం దాన్ని ఒప్పుకోలేకపోతుంది.ధ్యానంలో వున్న మనిషిలా ఎటో చూస్తూ గడుపుతోంది. అదే ప్రేమ అయితే ఆ ప్రేమ ఆమెను తిండి తిననియ్యకుండా, నిద్రపోనియ్యకుండా, చదువుకోనియ్యకుండా చేస్తోంది...
(సశేషం...)

No comments:

Post a Comment

Pages