'చెలిమి' పద్యములు

రచన: నండూరి సుందరీ నాగమణి


అంశం: స్నేహం

ఆటవెలదిలో

1.బంధుజనము కన్న బాంధవ్యమే మిన్న

స్వార్థమెరుగనిదది సాంత్వనమ్మె,

మధురమైన స్నేహమన్న మది మురియు;

చెలిమి తోడ నేను చేయి కలుప!

2.నెయ్యమన్న నాకునెంతయో మక్కువ

పాలు వెన్న భంగి పరమ బ్రీతి!

ప్రాణ మొసగు నొక్క పాత మిత్రుడు చాలు;

జీవితమ్ము లోన యీవి దీర!

3.దాన కర్ణుడనిన ధాత్రిలో మేటియే

ధర్మ మందు ధనము ధార వోయ;

ధరను నేస్తుడనిన తరణి సుతుడె గాద;

రాజసమున నొందె రాజ రాజు! 

4.కలియుగమున జూడ చెలిమియే కరువాయె

అవసరమ్ము కొరకు యనుగు చేయ;

సత్యమైనదేది సఖ్యమిలను నేడు,

చెలిమి మించి యిలను కలిమి కలదె!

  1. బాల్య నెయ్య మనిన బహుమంచి బంధము

పెద్దయైన కూడ పేర్మి యౌను

పసిడి పాతబడిన వసివాడి పోవునా?

జ్ఞప్తి తావి జన్మ దీప్తి నొందె!

  1. నింగి లోని శశికి నీటిలో నికలువ

సప్త హయుని మదికి సరసిజమును

నేస్తులగును చూడ నెమ్మి మీరగనిట 

దవ్వు లేదు కూర్మి ధరణి చూడ!

  1. ఇచ్చు గుణము చూడ మెచ్చుకొనును మది

త్యాగమిందు కలదు, భాగ మిచ్చి  

పంచుకొనుట తప్ప పట్టిలాగుట లేదు

సఖ్యమేగ మేలు సౌఖ్యమీయ!

  1. స్వర్ణమందు కలసి వర్ణయగు తామ్రము

నగలలోన మెరపు నాణ్య మొప్ప

ఉత్తముండు మార్చు యుత్త మందుని కూడ

మైత్రి నెరప  మేలు ధాత్రి యందు!

  1. కులము మతము లేదు కూర్మికెప్పుడు కూడ

జాతి వర్ణ భేద జాల మేది?

పేద గొప్ప యనుచు భేదభావము లేదు

మనసు దీర చేయు నెనరు చెలిమి!

***

 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top