మళ్లీ... అమ్మఒడి

పోడూరి శ్రీనివాస్ 


అమ్మ మనసేమో ...చందమామంత చల్లన !
అమ్మ ఒడేమో ... ఉదయభానుని కిరణాలంత వెచ్చన !!
          అమ్మ ఒడి సౌఖ్యాన్ని ...
          ఆ వెచ్చదనాన్ని ...
          పొత్తిళ్ళ నుంచీ
          అనుభవిస్తూనే ఉన్నాను.
అరవై ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ...
అమ్మ ఒడి లాంటి సౌఖ్యం నేనింత
వరకూ అనుభవించ లేదు –
చివరకు నీనేంతగానో ప్రేమించిన
నా భార్య కౌగిలిలో కూడా..
          ఒక్కసారిగా కాలచక్రం
          ఆగిపోతే ఎంత బాగుండును?
          ఆగిపోవడమే కాదు ...
వెనక్కు తిరిగితే ఎంత బాగుంటుంది??
          నేను మళ్లీ చిన్న పిల్లవాడినైపోవచ్చు
          అమ్మ చేతి గోరుముద్దలు ...
అమ్మ నోట లాలి పాటలు
అమ్మ స్తన్యపు అమృతధారలు ...
మాతృత్వపు గారాబాలూ ...
అల్లిబిల్లి ఆటపాటలు ...
లోకం తెలియని పోకడలు ...
ఊహకందని మధురానుభూతులు
          మళ్లీ నేను చిన్న పిల్లవాన్నై పొతే
          స్కూలుకు వెళ్లనని మారాములు ...
          పాలు తాగనని విదిలింపులు ...
          అమ్మ చేతినుంచి విదిలించుకుని,
          బుజ్జి తువ్వాయిలా పరుగులు ...
          స్కూలుకు వెళ్లే టైమయి .
          బస్ వాడు హారన్ మ్రోగిస్తుంటే
          అమ్మ చేతి కందకుండా ,
          పెరటిచెట్ల మధ్య పరుగులు తీస్తుంటే ...
          నన్ను పట్టుకోలేక అవస్థలు పడుతూ ...
          ఆపసోపాలతో అలసిన
          అమ్మ ముఖం చూసి
          జాలితో నేను దొరికిపోతే ...
          విజయగర్వంతో ...
          నన్ను తొందరగా తయారుచేసి
          స్కూలుకి పంపే అమ్మ తిప్పలు ... 
తలుచుకొంటేనే చాలు
ఒడలు పులకరించే
చిన్ననాటి, చిలిపి, చిన్నారి చేష్టలు ...
          ఈనాడు ... పెద్దవాన్నయాక
          నా మనవలు ఇవన్నీ చేస్తుంటే ...
          చిన్ననాడు నేనీపనులు అన్నీ
          చేశానని ...అవే..నా మనుమలు
          నేడు చేస్తున్నారని ...
          అహంతో... అంగీకరించలేని
నా మనస్సు –
వెధవ అల్లరి చేస్తున్నారని
వాళ్లను కేకలు వేస్తుంది.
          సృష్టి విచిత్రం కదూ!!!
                   పైగా... ఇపుడు నా ఆలోచనలెలా ఉన్నాయి?
కాలచక్రం వెనక్కు తిరిగిపోతే బాగుండును.
నేను మళ్లీ ... చిన్నపిల్లవాడినై పోతే బాగుండును.
నేను చిన్నపిల్లవాడినైపోయి
చిన్నతనంలో నేను చేసిన
అల్లరి అంతా...మళ్లీ చేయవచ్చు!
కానీ...అదే అల్లరి మా మనవళ్లు
చేస్తే..కోతి వెధవలు!
పెద్ద తరహాలేదు!!
          కానీ..నా...ఆలోచనలు నాకే నవ్వు తెప్పిస్తాయి.
నిజమే...
నేను చిన్న వాడినై పొతే!
మళ్లీ చిన్నవాడినై పొతే!!
          పెన్షన్ గురించి టెన్షన్ లేదు.
రేపు ఎలాగడుస్తుందన్న
ఆలోచన లేదు.
ఈ బిజీ యాంత్రిక జీవితంలో
దినదిన గండం – నూరేళ్ల ఆయుష్షులా
బతకాల్సిన అవసరం లేదు.
ఈ అనారోగ్య జీవితం...
లెక్క లేకుండా మింగే మందుబిళ్లలు...
నిత్యం బీపీ ...షుగర్ చెక్కింగులు...
ఎపుడు గుండాగి పోతుందో అనే బెంగ...
యాంత్రిక వాకింగ్ లు ...
          వీటన్నింటికీ ‘గుడ్ బై’ చెప్పేయచ్చు...
నేనోక్కసారి మళ్లీ చిన్నపిల్లవాడినైపొతే!
మళ్లీ అమ్మఒడిలో చేరి
అమ్మ లాలిపాటలు వింటూ...
అమ్మ స్తన్యపు అమృతధారలు గ్రోలుతూ...
నాలోకంలో నేను విహరిస్తూ ...
నా ఊహల్లో...
భగవంతునితో ఊసులాడుతూ...
ఈ లౌకిక ప్రపంచంతో
సంబంధం లేకుండా...
అలోకిక ఆనందాన్ని పొందుతూ!
అమ్మ చెంగు లాగుతూ...
పొత్తిళ్ళలో , కొంగుచాటు
చేసుకుని, స్తన్యమిస్తున్న...
ఆనందాన్ని అనుభవిస్తున్న –
అమ్మ... మొఖం వంక ఓరచూపులు
చూస్తూ – పమిట చాటు నుంచి
ముఖాన్ని, బయటకు చూపిస్తూ...
బోసినవ్వులు కురిపిస్తూ...
అమ్మ ముఖంలోని ఆనందాన్ని...
అమ్మ ఒడిలో నేను పొందిన
అలౌకిక ఆనందాన్ని...
మరవలేని నా మనస్సు...
మరోమారు...
నన్ను చిన్నపిల్లవాడిగా
మారిపోయి...
అమ్మ ఒడిలోని మాధుర్యాన్ని,
చవి చూడమంటున్నాయి.
మరోమారు నన్ను
అమ్మ ఒడి చేరమంటున్నాయి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top