సు'రేఖా'చిత్రం -ఎం.వి.అప్పారావు - అచ్చంగా తెలుగు

సు'రేఖా'చిత్రం -ఎం.వి.అప్పారావు

Share This

సు'రేఖా'చిత్రం -ఎం.వి.అప్పారావు 

ఒక చిన్న చిలిపి ఊహ... రేఖల్లో చక్కగా ఒదిగి, భావాల్ని పలికిస్తే... ఆ కార్టూన్ ను చూసిన వారి పెదవులపై చిరునవ్వు మెరిస్తే... ఆ కార్టూనిస్ట్ కళ సార్ధకం అయినట్లే. తనదైన విలక్షణ శైలితో, చక్కటి కార్టూన్లను అందించిన ఎం.వి.అప్పారావు (సురేఖ) గారిని గురించి వారి మాటల్లోనే...
నాకు కార్టున్లు, బొమ్మలు గీయాలనే అభిరుచిని కలిగించిన వారు మా నాన్నగారు శ్రీ మట్టెగుంట వెంకట సుబ్బారావుగారు, అమ్మ సీతాలక్ష్మి. ఇద్దరికీ పుస్తకాలు చదవడం, పాటలు వినడం అంటే చాలా చాలా
ఇష్టం.
నాన్నగారు చాలా ఇంగ్లీషు, తెలుగు పత్రికలను కొనే వారు. టిట్ బిట్స్ అనే బ్రిటిష్ వార పత్రికలో ఎన్నో కార్టున్లుండేవి. అలానే ఇలస్ట్రేటెడ్ వీక్లీ, రీడర్స్ డైజెస్ట్, దినపత్రికలు మెడ్రాస్ మెయిల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ (ఆదివారం సన్డే స్టాండర్డ్ పేరుతో వచ్చేది), ఆంధ్రపత్రిక, వీక్లీ, భారతి, గృహలక్ష్మి, బాల,చందమామ. ఇంగ్లీషుపత్రికల్లో కార్టూన్ల భావం నాకు, అక్కయ్యకు చెప్పే వారు. నాన్న గుర్రం బొమ్మ చాలా బాగా వేసేవారు.
ఆదివారం వచ్చిందంటే మాకు పండగే!! ఆ రోజు నాన్నగారి ఇంపీరియల్ బ్యాంకు(ఇప్పుడు యస్బీఐ) సెలవుకదా. 1954 లో ఆంధ్రపత్రిక వీక్లీ దసరాకు పిల్లలకు చిత్రాల పోటి పెడితే నేను, చెల్లి కస్తూరి బొమ్మలు పంపాము. చెల్లి బొమ్మ, "నేనూ-మాసంగీతం మేస్టారు" కు బహుమతి వచ్చింది. నే వేసిన బొమ్మ తిరిగొచ్చింది. తరువాత 1958 లో నే వేసిన "సైలెంట్" కార్టూన్ మొదటి సారిగా ఆంధ్రపత్రిక వీక్లీలో అచ్చయి మూడు రూపాయలు పారితోషికంగా వచ్చింది. అటుతరువాత చాలా పత్రికల్లో నా కార్టూన్లు వచ్చాయి. కార్టునంటే సాధ్యమైనంత వరకు మాటలు వుండకూడదు. బొమ్మ చూడగానే భాష తెలియని వాళ్లుకూడా నవ్వుకోవాలి. కనీసం ఆ బొమ్మలో మనం చెప్పే విషయం ఎక్కడో అక్కడ తప్పక కనిపించాలి. లేకపోతే అది కార్టూన్ కాకుండా  ఒట్టి జోకే అవుతుంది.
 నాకు అభిమాన కార్టూనిస్టులందరినీ కలుసుకొనే అదృష్టం కలిగింది. శ్రీ బాపు- రమణగార్లు నేంటే ఎంతో అభిమానం చూపే వారు. 
సర్వశ్రీ బాబు, జయదేవ్, సరసి,ఈనాడు శ్రీధర్, డెక్కన్ క్రానికల్ సుభాని, బాచి, కుమారి రాగతి పండరి ఇలా ఎందరో. కార్టూనిస్ట్ శ్రీ యం.ఎస్.రామకృష్ణ మా ఎస్బీఐ కొలీగ్. నేను చాలాకాలం నుంచి పత్రికలకు నా కార్టూన్లు పంపడంలేదు. ఫేసుబుక్ లోనే పోస్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఓ మంచి లైబ్రరీ వుంది. ఇప్పటికీ పుస్తకాలు కొంటూనే వుంటాను. పాతకాలం గ్రామఫోను, స్టీరియో రికార్డు ప్లేయర్ , రికార్డులూ వున్నాయి. ఇంకా బాగా పనిచేస్తున్నాయి. 1953 -1980 వరకు చందమామ లు ఏ యేటికాయేడు బైండ్లుగా వున్నాయి. ఇప్పుడు నా పుస్తకాలు మిస్సవడంలేదు. ఏమంటే " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను , అవిప్పుడు మీకు బుక్ షాపుల్లో దొరుకుతాయి కనుక! నా పాతపుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను, అవిప్పుడు నాకు ఎక్కడా దొరకవు కనుక". ఇలా వ్రాసి నా పుస్తకాల దగ్గర వుంచాను కనుక ఎవ్వరు అడగటం మానేశారు.
నా శ్రీమతి పద్మ, నా ఆభిరుచికి ఎంతో సహకరిస్తుంది. అలానే మా పెద్దమ్మాయి చి:సౌ; మాధురి, అల్లుడు చి" చంద్రశేఖర్ పువ్వాడ(చెన్నై), చిన్నమ్మాయి చి"సౌ"మాధవి, అల్లుడు చి"వెంకట్ ప్రసన్నతాడినాడ (ముంబాయి) అబ్బాయి చి"కృష్ణశాయి, కోడలు చి"సౌ" నాగలక్ష్మి (ముంబాయి) నా అభిరుచికి తగ్గది ఏది కనిపించినా (పుస్తకమైనా,
వస్తువైనా కానుకగా ఇస్తుంటారు.

No comments:

Post a Comment

Pages