Wednesday, September 23, 2015

thumbnail

రణ ధీరుడు (పెద్ద కధ)

రణ ధీరుడు (పెద్ద కధ)

- అక్కిరాజు ప్రసాద్ 


ప్రాగ్జ్యోతిషపురం నడిబొడ్డున విశాలమైన కోట. చుట్టూ దుర్భేద్యమైన 50 అడుగుల కోట గోడ, వందల ఎకరాలలో రాజ దర్బారు ఒక పక్క, అంతఃపురము ఒక పక్క, మంత్రాంగపు కచేరీలు ఒక పక్క, అతిథి గృహాలు, దాసదాసీ జనం యొక్క వసతి గృహాలు, చూచినంత దూరం కనిపించే పూదోటలు, సరస్సులు, సంగీత నృత్య మంటపాలు, జీవం ఉట్టిపడే శిల్ప సంపదలు...చూడగానే ఇంద్రుని అమరావతి అని తోచే శోభ కలిగిన రాజప్రాసాదం ఆ కోట.  రాజదర్బారులో శూరసేన మహారాజు గారి కొలువు తీరి ఉంది. సామంతులు, సైన్యాధిపతి రిపుమర్దన వర్మ, ముఖ్యాధికారులు, దండనాయకులు ఒక పక్క, ప్రజాప్రతినిధులు, పండితులు, కళాకారులు ఇంకొక పక్క, సింహాసనం కుడివైపు మంత్రి చతురబుద్ధి మరియు రాజగురువు శంకరభట్టు, విశాలమైన ప్రాంగణంలో ప్రజలు, సముచిత స్థానంలో అతిథులు రాజు గారికోసం వేచియున్నారు.
ఇంతలో ద్వారపాలకులు "అసమాన పరాక్రమ గండరగండ బిరుదాంకితులు, నవరత్న శోభిత తేజో విరాజితులు, అరివీర భయంకరులు, ధర్మపరాయణులు, శత రణ విజయోత్సాహులు, త్రిభువన మానినీ మానసచోరులు, మగధరాజ్య సింహాసనాధీశులు, రాజాధిరాజ రాజ మార్తాండ  శ్రీ శ్రీ శ్రీ శూరసేన మహారాజు గారు వేంచేస్తున్నారు" అని సభను సావధాన పరచారు. అనేక రకమైన రవములతో మహారాజు గారి ప్రవేశాన్ని సూచించారు.
చూచినంతనే ఆరాధనా భావం కలిగే మందహాసంతో, ఎంతటి శత్రువులనైన వెనుకడుగు వేయించే పౌరుషంతో, సమస్త శాస్త్రముల జ్ఞానాన్ని సూచించే వినయముతో, అనన్యమైన శివ భక్తిని సూచించే విభూతి రేఖలతో, రాజ్యాధికారాన్ని తెలిపే రాజతిలకము, విలువకట్టలేని మణులు పొదిగిన కిరీటము, కంఠహారములు, పట్టు వస్త్రములు, కంకణములు, రాజముద్ర కలిగిన ఉంగరము, మహారాణి ప్రేమానురాగములను సూచించే ముత్యాలహారములు ధరించి గంభీరముగా సింహగమనుడై శూరసేన మహారాజు అతిలోక సౌందర్యవతి, మగధ రాజ్య ప్రజలకు కన్నతల్లి వంటి రాణీ జగన్మోహినీ దేవితో సభలో ప్రవేశించారు.
సభలోని వారంతా లేచి నుంచున్నారు. సభ కరతాళధ్వనులతో, జయజయ ధ్వానములతో మారు మ్రోగింది. రాజదంపతులు సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నారు. పండితులు వారిని మంత్రోక్తంగా ఆశీర్వదించారు. ఆస్థాన కవులు ప్రభువుల వైభవాన్ని రాజ్య ప్రజల మనోగతాన్ని ఆశుకవితల ద్వారా నుతించారు. మహామంత్రి చతురబుద్ధి రాజ్యంలోని పరిస్థితులను వివరించారు. సేనాధిపతి రిపుమర్దనుడు శాంతిభద్రతల గురించి పలికాడు. అనంతరం మహారాజు గారు అందరికీ కృతజ్ఞతలు తెలిపి మహామంత్రిని ఆనాటి సభాకార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా కోరాడు.
"ప్రభూ! ఈరోజు ప్రధానాంశం  - నిర్భేద్యమైన మన కోట కాపరుల కళ్లుగప్పి, రెప్పపాటు కాలంలో ఎగిరి దూకి, పరుగెత్తి, అసమానమైన శరీర సౌష్టవంతో ఈ పరదేశీ మన కోటలో ప్రవేశించాడు. ఊహించనంత పరాక్రమము, తెలివితేటలు ప్రదర్శించి రాజుగారి అంతరంగిక మందిరంలోకి చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేస్తుండగా రిపుమర్దనుడు అతనిని పట్టుకున్నాడు. అతనిని మీ ముందు ప్రవేశపెట్టమని, మీకోసం సందేశముందని, మీతో మాత్రమే చెబుతానని అతను పట్టుబడుతున్నాడు. మీరు అనుమతిస్తే....."
శూరసేన మహారాజుగారు ముఖం గంభీరమైంది. తనకోట రక్షణ కవచాన్ని దాటి లోనికి రాగలిగాడంటే సామాన్యుడు కాడు అని గ్రహించాడు. ఒక్క నిమిషం కలవరం చెందినా దానిని ముఖంలో తెలియనీక అతను ఎవరో విషయమేమితో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో "ప్రవేశ పెట్టండి" అని అజ్ఞాపించాడు.
ఆరడుగుల విగ్రహం, బలిష్ఠమైన దేహము, విశాలమైన వక్షస్థలం, ఆజానుబాహువులు, ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు సైనికులు. ముఖంపై ముసుగు కళ్ల వరకు మాత్రమే కనిపించేలా కప్పి ఉంది. "ముసుగు తీయండి" అని శూరసేన మహారాజు హుంకరించాడు. సైనికులు ముసుగు తీయబోగా, ఆ ఆగంతకుడు తానే రెప్పపాటు కాలంలో ముసుగు తీశాడు. సభ అంతా ఎవరు ఎవరు ఎన్నడూ చూడలేదే? ఆహా ఏమి  అందం? ఏమి వర్చస్సు? ఏమి ఠీవి? అని చర్చించుకోసాగారు. రాజు గారి సంజ్ఞతో సభ నిశ్శబ్దమైంది. "ఎవరు నువ్వు" అని నిగ్గదీశాడు శూరసేనుడు.
"మహారాజా! అభివాదములు. అనుమతిలేకుండా మీ మందిరంలోకి ప్రవేశించే దుస్సాహసం చేసిన నా దుందుడుకుతనాన్ని క్షమించండి. కానీ, తప్పలేదు. నేను ఎవరో తెలిపే ముందు మీకొక విషయం తెలియాలి. ఆ విషయాన్ని నేను ఇక్కడ సభలో తెలుపలేను. మీరు అనుమతిస్తే, మీతో ఏకాంతంలో విషయమంతా వివరిస్తాను. నా నిజాయితీని నమ్మి నాకొక అవకాశమివ్వండి...." అని అభ్యర్థించాడు. మహామంత్రి చతుర్బుద్ధి రాజుగారితో "ప్రభూ! ఆగంతకుడిని రాజమందిరంలోకి అనుమతించడం శ్రేయస్కరం కాదు. మీ భద్రతకు ముప్పు" అని వారిస్తాడు. సేనాధిపతి రిపుమర్దనుడు కూడా "రాజా! ఈతడి దుస్సహసానికి కారాగారంలో బంధించి హింసించి నిజం వెళ్లగ్రక్కిస్తాను" అని ముందుకు దూకబోయాడు. శూరసేనుడు వారిని నివారించి ఒక్క నిమిషం ఆలోచించాడు. "ఎటువంటి శత్రువునైనా జయించగలిగే నేను ఒక సామాన్యుడికి వెరపడి వెనుకంజవేయటమా? ఇతడి మాటలలో నిజాయితీ కనిపిస్తోంది. ఒక ఆగంతకునికి నాతో మాత్రమే చెప్పవలసిన విషయం అంటే అది తప్పక దేశానికి సంబంధించినదే" అని నిర్ణయించుకున్నాడు.
"రిపుమర్దనా! ఈతడి చర్య తప్పక దుస్సహసమే. మన భద్రతా విభాగం వైఫల్యమే. కానీ ఈతనికి నేనొక అవకాశమివ్వాలని నిర్ణయించాను. వెంటనే నా మందిరానికి తీసుకొని రండి" అని సేనాధిపతిని ఆదేశించాడు. మహారాణి, మంత్రిగణం, సభాసదులు ఆశ్చర్యపోయారు. కలవరపడ్డారు. అయినా రాజుగారి మాట  శిరసావహించాలని మౌనంగా అంగీకరించారు. రాణీ జగన్మోహినీదేవి మదిలో ఎన్నో ప్రశ్నలు.....
అందరూ వెళ్లిపోయిన తరువార జగన్మోహిని శూరసేనుడితో "ప్రభూ! మీ నిర్ణయాన్ని ప్రశ్నించను, కానీ, నా మనసులో ఎన్నో సందేహాలున్నాయి ఈ విషయంలో. మీ మనోగతమేమిటి?" అని అడిగింది. శూరసేనుడు నవ్వుతూ "మోహినీ! వచ్చినవాడు సామాన్యుడు కాడు. తప్పక మన రాజ్య భవిష్యత్తును నిర్దేశించే ముఖ్యమైన సమాచారమేదో మోసుకు వచ్చాడు. లేకపోతే, సామాన్యులకు అలవికాని కోటను ఇంత అవలీలగా దాటి రాలేడు. అతని ముఖంలోని తేజస్సు, దేహంలోని కాంతి, కవళికలు చూస్తే అతను అమిత పరాక్రమ సంపన్నుడిలా గోచరించాడు. అటువంటి వానిని సందేహించనక్కరలేదు" అన్నాడు. రాజుగారి మాట విని ఊరట చెంది జగన్మోహిని అంతఃపురానికి బయలుదేరింది.
రాజమందిరంలో శూరసేనుడి ఎదుట ఆగంతుకుడిని ప్రవేశపెట్టారు. రాజుగారు ఏకాంతం అని ఆదేశించటంతో ఆ మందిరంలో వారిద్దరే మిగిలారు. శూరసేనుడు ఆ యువకుడిని సునిశితంగా పరిశీలించి "విషయం చెప్పు" అని సంజ్ఞ చేశాడు. యువకుడు రాజుగారి పాదాలకు నమస్కరించాడు. ఆశ్చర్యపోయాడు శూరసేనుడు. "ప్రభూ! రణధీరుడు నా నామము. విదర్భదేశానికి చెందిన వాడను. నాకు తల్లిదండ్రులెవరో తెలియదు. శివానంద సరస్వతి ఆశ్రమంలో పెరిగాను. స్వామి వారు నాకు అక్కడి గురుకులంలో సమస్త విద్యలు నేర్పించారు. వారే నాకు తల్లి తండ్రి గురువు దైవం. ఇటీవలి కాలంలో అక్కడికి ఒక దంపతులు వచ్చారు. వారు నడి వయసు దాటిన వారు. రాజాలంకారాలు లేకపోయినా వారి నడవడికలో రాజ కుటుంబీకులుగా నాకు తోచారు. వారు గురువుగారితో మాట్లాడుతుండగా గమనించాను. వారిలో ఏదో పగ, ప్రతీకార జ్వాల రగులుతున్నాయి. మాటల మధ్యలో గోప్యమైన రాజ్యంలో అరాచకం ప్రబలిందని, యువకులకు శిక్షణనిచ్చి తాను ఆ రాజ్యంపై తిరుగుబాటు చేయటానికి విదర్భ రాజు సాయం కోరటానికి వచ్చానని తెలిపాడు. శివానంద సరస్వతి ఆశ్రమంలో సరైన గురువులున్నారని విదర్భ రాజు గారు తనను ఇక్కడకు పంపాడని ఆయన తెలిపాడు. అజ్ఞాతవాసంలో ఉన్న రాజకుటుంబీకులని అర్థమయ్యింది.
ఆ దంపతులను గమనించాలని నిర్ణయించుకొని వారిపై నిఘా ఉంచాను. వారి దగ్గర ఉన్న వస్తువులను పరిశీలించగా వారికి మగధదేశంతో సంబంధముందని అనుమానం కలిగింది. మీ రాజ్యపు రాజముద్ర, పతాకం, కొన్ని పాత పాత్రలపై మగధ దేశపు కళాకృతులున్నాయి. అలాగే వారి వద్దనున్న వ్రాతపత్రాలలో దాదాపుగా పదివేల మంది సైనికుల పేర్లు, ఏయే ప్రాంతాలలో వారున్నది వ్రాసి ఉన్నాయి. మా గురువు గారు శివానంద సరస్వతి గారికి అన్ని విషయాలు తెలిపాను. ఆయన నన్ను మీకు అత్యవసర సందేశం అందించవలసిందిగా నన్ను నియమించారు. అందుకే ఇక్కడికి వచ్చాను" అన్నాడు రణధీరుడు.
శూరసేనుడు ఆలోచనలో పడ్డాడు.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information