ప్రేమతో నీ ఋషి – 7 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 7

Share This

ప్రేమతో నీ ఋషి – 7 

- యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. ఇక చదవండి...)
ఆ రోజు నుంచి వారి స్నేహం కాఫీ లు, డిన్నర్ లు, సుదూరపు నడకలు, ఆర్ట్ గేలరీలు దర్శించడం వంటి వాటి ద్వారా రోజురోజుకీ పెరిగింది. వారి అన్యోన్యత పెరిగిన కొద్దీ, తాము మరింత  దగ్గరైనట్లు వారు భావించసాగారు. వారు అనుభూతి చెందుతున్న సామీప్యం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అది వారిద్దరికి అత్యంత గౌరవం ఉన్న ‘చిత్రకళ’ అన్న అభిరుచి ఆధారంగా రూపొందింది.
కాలేజీ రోజుల్లో, అంతా వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటారు. కాని, వారు ఎదుగుతున్న కొద్దీ, ప్రేమ భావనలు ఒక వ్యక్తి వృత్తిపరమైన, వ్యక్తిగతమైన లక్షణాల ద్వారా జనిస్తాయి, ఋషి, స్నిగ్దల విషయంలో అదే జరిగింది.
ఋషి చిత్రకళ పట్ల ఆమెకున్న ఆసక్తిని, అభిరుచిని ఆరాధిస్తే, వృత్తిపరంగా ఋషి చేపట్టిన అస్సైన్మెంట్ కోసం, వివరంగా అన్నీ తెలుసుకునేందుకు అతను చూపించే శ్రద్ధ, ఆమెను ఆకర్షించింది.
దీనివల్ల, కొన్ని వారాల్లోనే వారు స్నేహితుల కంటే దగ్గరై, తరచుగా కలుస్తూ ఎక్కువ సమయాన్ని గడపసాగారు. ఈ సామీప్యం, వారు అభిప్రాయాల్ని పంచుకుని, ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోడానికి అవకాశాన్ని ఇచ్చేది.
వారి బంధం దండలో దారంలాగా ఇమిడిపోయింది అని వారిద్దరూ అంగీకరించారు. ఈ స్నేహాన్ని పెళ్లి రూపంలో కొనసాగించి, మున్ముందు కూడా కలిసి నడవాలని వారు అనుకోసాగారు. దీని గురించి వారు బాహాటంగా చర్చించుకోకపోయినా, ప్రేమ భావన, దాన్ని పెళ్ళిగా మార్చాలనే కోరిక ఎల్లప్పుడూ వారి మనస్సులో ఉంది.
రోజులు గడుస్తుండగా, రిషి తన పనిని కొనసాగిస్తూనే, స్నిగ్ధ సాంగత్యాన్ని కూడా పొందసాగాడు. ఆమె కూడా తన కొత్త ఆఫీస్ లో చేరి, మహేంద్ర మాంచెస్టర్ శాఖలో పనిచెయ్యడం మొదలుపెట్టింది.
****
అతి తక్కువ కాలంలోనే మహేంద్ర చేత విశ్వాసపాత్రమైన ఉద్యోగినిగా గుర్తించబడడంతో కొత్త ఉద్యోగం ఆమెకు ఉత్తేజకరంగా అనిపించింది. ఆమె నేత్రుత్వ లక్షణాలను బట్టి, మహేంద్ర తన సంస్థ పలు చోట్ల నిర్వహించే అంతర్గత శిక్షణా కార్యక్రమాల్లో ఆమెను పాలుపంచుకునేలా చేసాడు.
స్నిగ్ధ రానున్న ఆర్ట్ ఫెయిర్ ల గురించి తెలుసుకునేందుకు అనేక ఆర్ట్ పత్రికలు చూస్తూ, ఆర్ట్ వెబ్సైటులు పరిశీలిస్తూ, మామూలుగా తన రోజును మొదలుపెట్టింది. ప్రతి ఆర్ట్ ఫెయిర్ కి వారి వెబ్సైటులలో ఒక కేటలాగ్ లేక బ్రోచర్ ఇవ్వబడుతుంది. చాలావరకు ఆర్ట్ ఆక్షన్ హౌస్ లు కొంత డబ్బు చెల్లిస్తే, అక్కడకు వచ్చేవారికి ముందుగానే కేటలాగ్ లు పంపుతాయి.
భారతీయ కళాఖండాలుగా పరిగణించదగ్గ కొన్ని పెయింటింగ్స్ ను స్నిగ్ధ కేటలాగ్ నుంచి ఎంపిక చేసింది. అవి ప్రాజెక్ట్ హైదరాబాద్ కు సరిపోతాయో, లేదో తెలుసుకునేందుకు వాటిని మరింత అధ్యయనం చేసింది. ఒక్కొక్క పెయింటింగ్  వెల – కోటి నుంచి 5 కోట్ల దాకా ఉండడంతో, ప్రాజెక్ట్  కోసం ఎంపిక చేసే ముందే వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ఎంతో అవసరం.
అందులోనే రివ్యూలు, సలహాలకు అనుగుణంగా ఒక్కొక్క పెయింటింగ్ కు పర్చేస్ ఆర్డర్ తయారుచెయ్యటం ఆమె బాధ్యత.
ఆ రివ్యూ ఆధారంగా, ఆమె ఇప్పటివరకు 150 కళాఖండాలను గుర్తించి, మహేంద్ర ఆమోదం కోసం పంపింది. ప్రతి 15 రోజులకి, మహేంద్ర ఆమె పంపినవాటిని పరిశీలించి, ప్రాజెక్ట్ కు సరిపోతాయని అతను కూడా అనుకున్నవాటిని ఆమోదించేవాడు. ఈ జాబితాతో కలిపి, ఇప్పటివరకూ ఎంపికైన మొత్తం పెయింటింగ్స్ సంఖ్య 300 లకు చేరుకుంది.
స్నిగ్ధ చేరేముందు ఈ పనిని మృణాల్ చూసుకునేవాడు. మృణాల్ పంపినవాటిలో చాలావరకూ మహేంద్ర తిరక్కొడుతూ ఉండగా, స్నిగ్ధ విషయంలో అది చాలా అరుదుగా జరిగేది.
స్నిగ్ధ  ఒక పెయింటింగ్ గురించి సిఫార్సు చేసేముందు, ఆమె నిశిత పరిశీలనకు, చూపించే శ్రద్ధకు ఈ ఘనత దక్కుతుంది.
ఆమె చిత్రాల విలువను నిర్ధారించేటప్పుడు, ఆమె వాటిలో సాంకేతిక మేధస్సునే కాక, వాటిలోని కళాత్మకమైన విలువను కూడా పరిగణనలోకి తీసుకునేది. ఆమె దృష్టి కళాఖండాలను గుర్తించడంపై మాత్రమే కాక, ఒక నిర్దిష్టమైన చిత్రంలోని అపూర్వమైన లక్షణాల వర్ణనపై కూడా ఉండేది.
ఉదాహరణకు, తైలవర్ణ చిత్రాల విలువను నిర్ధారించేటప్పుడు అందులో వాడిన తైలం ఏ రకానిదో, చిత్రం యొక్క నేపధ్యానికి ఆ తైలం వాడడం వెనుక ఉన్న ఆవశ్యకతను ఆమె గమనించేది. ఆమె ఎంపిక చేసిన చిత్రాలలో ప్రామాణ్యతను, వాటి చిత్రీకరణలోని సొగసును, నేర్పును ఆమె రూఢి చేసుకునేది.
మహేంద్ర ఒకసారి ఆమె ఎంపిక చేసిన 19 వ శతాబ్దపు చిత్రకారుడికి చెందిన ‘అ వ్యూ ఆఫ్ ద ష్రైన్ ఇన్ హిమాలయాస్’ అనే చిత్రాన్ని చూసి, ఆమెను ఎంతో మెచ్చుకున్నాడు. ఆ చిత్రం చిత్రకారుడి హిమాలయ యాత్ర తర్వాత వెయ్యబడింది, 1929 లో భారత్ లో ఆవిష్కరించబడింది.
ఆ చిత్రంలో చిత్రకారుడు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సమగ్రంగా కలిపి రూపొందించినట్టు, అది చూస్తే తెలుస్తుంది. ఆ పెయింటింగ్ ఒక పవిత్రమైన భావనను కలిగిస్తోందని, ప్రపంచపు దృష్టిని మరింత విస్తృతం చేసే ఆధ్యాత్మిక భావనను ఆవిష్కరిస్తోందని, మహేంద్రకు అనిపించింది.
చూపరులను ఆలోచింపచేసేలా ఉండే పెయింటింగ్స్ నే స్నిగ్ధ ఎంచుకునేది. కాన్వాస్ పై ఉండే ‘చెప్పకనే చెప్పేలక్షణం’ లేక చమత్కారంతో కూడిన నైపుణ్యం, చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది, ఇదే భావనను ఆర్ట్ మ్యూజియం కు వచ్చే చాలా మంది సందర్శకులు ఆస్వాదిస్తారు.
చివరికి, ఆమె కళాఖండాల సాధికారత గురించి కూడా ఆమె శ్రద్ధ వహించేది. వాటికి విలువకట్టే ముందే ఆమె, ‘సర్టిఫికేట్ ఆఫ్ ప్రోవెనన్స్ ‘ కోసం  పట్టుబట్టేది. ఆర్ట్ ప్రపంచంలో ఉన్న మోసాలను దృష్టిలో పెట్టుకుంటే, అసలైన చిత్రాల కోసం ఆమె పడే శ్రమ అర్ధం చేసుకోదగ్గదే.
అందుకే ఆర్ట్ రంగంలోని ఆర్టిస్ట్ ల సరికొత్త నేపధ్యాలను, తాజా పరిణామాల్ని అనుసరించినప్పుడే, అసలైన చిత్రాల్ని, వాటి విలువకు తగ్గట్టుగా ఎంపిక చెయ్యడం సాధ్యమవుతుంది.
ఒకసారి ఆ పెయింటింగ్ కొనుగోలుకు అనుమతి లభించగానే, ఆమె ఆ ప్రాజెక్ట్ ను అప్సర, మృణాల్ లకు అప్పగించేది.
అప్పుడు మృణాల్ అందులో ఉన్న వివరాలకు అనుగుణంగా, ఆ అమ్మే వ్యక్తిని సంప్రదించి, బేరసారాలు మొదలుపెట్టేవాడు.ఒకవేళ ఆ కళాఖండాన్ని పేరున్న అంతర్జాతీయ డీలర్ ల నుంచి కొనాలన్నా, ఆక్షన్ హౌస్ ల నుంచి కొనాలన్నా, అప్సర అతనికి సహకరించేది.
బేరసారాలు ముగిసాకా, కొనుగోలుకు తుది మెమో సిద్ధం కాగానే, వాటికి సంబంధించిన పత్రాలతో సహా, మృణాల్, స్నిగ్ధ  అన్నీ సిద్ధంచేసి, మహేంద్రకు పంపేవారు. మహేంద్ర దాన్ని ఆమోదించగానే, ఇండియా నుంచి మొత్తం బ్యాంకు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా అమ్మేవారి ఖాతాలో జమచెయ్యబడేది.
అమ్మేవారికి డబ్బు అందగానే, ఆ పెయింటింగ్ మాంచెస్టర్ ఆఫీస్ కు పంపేవారు. అక్కడ స్నిగ్ధ, మృణాల్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులోని పర్చేస్ ఆర్డర్ కు తగిన విధివిధానాలు పూర్తి చేసి, దాన్ని భారత్ కు ఎగుమతి చేసేందుకు అనుమతించేవారు. ఈ ప్రక్రియ అంతా వారం పదిరోజులు తీసుకునేది.
వృత్తిపరమైన జీవితంలో మృణాల్, అప్సర లతో, వ్యక్తిగతమైన జీవనంలో ఋషి తోనూ, ఆమెకు రోజులు హాయిగా గడిచిపోతాయని, ఆమె మొదట్లో భావించింది.
ఋషి విషయంలో అనుకున్నది అనుకున్నట్లే జరిగినా, మిగిలిన ఇద్దరితో ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆమె గుర్తించింది.
మృణాల్ నెమ్మదస్తుడు, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. స్నిగ్ధకు కొన్నిసార్లు అతని చూపులు ఇబ్బందికరంగా ఉండడం ఆమె గమనించింది. అందుకే ఆమె ఎప్పుడూ అతనితో ఎక్కువ మాట్లాడేది కాదు.
ఇక అప్సర గుణం ఎటువంటిదో స్నిగ్ధకు అంతుబట్టలేదు. ఆమె చాలా ఆస్తిపరురాలని, తెలివైనదని, తన సిబ్బంది  నుంచి ఒకటి రెండు సార్లు వింది. ముఖ్యంగా, అప్సర మహేంద్రకు చాలా దగ్గర మనిషిలా ఆమెకు అనిపించేది.
మహేంద్ర వారంలో 3 సార్లు ఆన్లైన్ ద్వారా, లేక ఫోన్ ద్వారా స్నిగ్ధను సంప్రదించేవాడు. కాని, అతను మాంచెస్టర్ కు మూడు నెలలకు ఒకసారి వచ్చి 3,4 రోజులు ఉండేవాడు. అలా వచ్చినప్పుడు, అతను ఆఫీస్ కు కేవలం ఒక్కసారే వచ్చేవాడు. మామూలుగా, అతను స్టార్ హోటల్ లో ఉండేవాడు. హోటల్ లోని కాన్ఫరెన్స్ రూమ్స్ ద్వారా తన సంప్రదింపులు జరిపేవాడు.
అటువంటి మీటింగ్స్ అన్నీ అప్సర షెడ్యూల్ చేసేది. ఈ మీటింగ్స్ అన్నీ వివిధ ఆర్ట్ డీలర్ లతో , అనేక దేశాల నుంచి వచ్చే, ఆర్ట్ పట్ల విభిన్నమైన ఆసక్తి ఉన్న సందర్శకులతో జరిగేవి.
స్నిగ్ధకుఆఫీస్ పనిని గురించి పూర్తి అవగాహన కలుగగానే, ఆమెను తన హై ప్రొఫైల్ మీటింగ్స్ లో పాలుపంచుకునేలా చేస్తానని, మహేంద్ర ఎప్పుడూ అంటూ ఉండేవాడు.
ఈ దశలో, ఇటువంటి మీటింగ్స్ అన్నీ అప్సర ఏర్పాటు చేసేది. కాని, మృణాల్ కూడా ఆ సమయంలో అప్సరకు పర్సనల్ సెక్రటరీ గా శాయశక్తులా ఆమెకు సహకరించేవాడు.
ఆ వ్యాపార లావాదేవీల గురించి తెలుసుకోవాలని, స్నిగ్ధకు ఆసక్తి ఉన్నా, ఆమె మహేంద్ర తనకు గీసిన గీతని ఎన్నడూ దాటలేదు. ఆమెకు వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని కలపడం, తద్వారా దృష్టి మళ్లడం కూడా ఇష్టంలేదు.
ఇది ఒకరోజు ఆమె అవసరంగా ఋషికి ఫోన్ చెయ్యాల్సి వచ్చేవరకూ కొనసాగింది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages