సంకీర్తనలతో శ్రీచక్రార్చనమొనర్చిన శ్రీవిద్యోపాసకులు -ముత్తుస్వామి దీక్షితులు - అచ్చంగా తెలుగు

సంకీర్తనలతో శ్రీచక్రార్చనమొనర్చిన శ్రీవిద్యోపాసకులు -ముత్తుస్వామి దీక్షితులు

Share This

సంకీర్తనలతో శ్రీచక్రార్చనమొనర్చిన శ్రీవిద్యోపాసకులు -ముత్తుస్వామి  దీక్షితులు   

మధురిమ 


భారత దేశంలోని శాస్త్రీయ సంగీతాన్ని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు.1.కర్ణాటక సంగీతము 2.హిందుస్థానీ సంగీతము.మొదటిది దక్షిణ భారతదేశంలో బహుళ జనాదరణ పొందితే రెండవది ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందినది.17వ శతాబ్దం లో అంటే దాదాపుగా 1750వ సంవత్సరం నుండీ 1850వ సంవత్సరం వరకు గల కాలాన్ని  కర్ణాటక సంగీతానికి స్వర్ణ యుగంగా పరిగణిస్తారు.ఎందుకంటే ఈకాలంలోనే సంగీత త్రిమూర్తులైన త్యాగరాజ స్వామివారు,ముత్తుస్వామి దీక్షితులవారు,శ్రీ శ్యామ శాస్త్రులవారు జీవించి,ఎన్నెన్నో అమృతతుల్యములైన కీర్తనలను   రచించి,స్వరపరిచి ఆ ఎనలేని సంకీర్తనా నిధిని భావితరాలకు రాగ ,భావ పెన్నిధి గా అందించారు. సంగీత త్రిమూర్తులలో త్యాగరాజ స్వామి తరువాత పరిగణింపదగినవారు శ్రీ ముత్తుస్వామిదీక్షితులవారు. వీరు 1775-1835 కాలమునకు చెందిన వారు.
 జననం ,తల్లి తండ్రులు: వీరు క్రీ. శ. 1775 మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం మార్చి 24వ తేదీన నేటి తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు లో జన్మించిరి.తల్లి - సుబ్బలక్ష్మి అమ్మాళ్ ,తండ్రి- రామ స్వామి దీక్షితులు.
 వీరి  జన్మ వృత్తాంత్తాన్ని పరిశీలిస్తే వీరు ఎంతటి కారణ జన్ములో అర్థం అవుతుంది.తండ్రిగారైన రామ స్వామి దీక్షితులవారు తమకు సంతానం లేనందున భార్యా సహితంగా తన నలభైయవ ఏట తమిళనాడు లో ని వైద్యనాథన్ కోవెలను దర్శించి, గుడిలో గల ముత్తుకుమార స్వామిని ప్రార్ధించగా ఆ స్వామి వర  ప్రసాదంగా కృత్తికా నక్షత్రంలో ఓ కుమారుడు జన్మించెను.అందుకే వీరికి ముద్దుకుమారస్వామి అని నామకరణం చేసిరి.
 వీరు ముత్తుస్వామిదీక్షితులుగా ఎలా మారారంటే  వైదీస్వరన్ కోవెలలోని గల శ్రీ బాలాంబికా అమ్మవారికి శ్రీ చిదంబరనాధస్వామి అనే గురువు సహాయంతో వీరు జన్మించినతరువాత  రామస్వామి దీక్షితులు యధాశాస్త్రంగా నవావరణ పూజ ఒనర్చగా ఆ దేవి స్వప్నమున వీరికి ముత్యాల హారమును ప్రసాదించినది.తమిళంలో ముత్తు అనగా ముత్యము కనుక ముత్తుస్వామి అనియు ,శ్రీ విద్యా పూర్ణదీక్షాపరులగుటచే దీక్షితులనియు నామము వచ్చుటచే వీరికి ముత్తుస్వామిదీక్షితులు అన్న నామం స్థిరమైనది. వీరి జన్మవృత్తాంత్తమంతయూ వీరు భజరేరే చిత్త బాలాంబికాం  అను కృతిలో వివరించి యున్నారు.
 బాల్యం: బాల్యంలో వీరు కావ్య,నాటకాలంకార శాస్త్రములోనూ,మంత్ర,యోగ,జ్యోతిష,వ్యాకరణ,చంధస్సు మొదలగు శాస్త్రములలో కృషి చేసి విశేష పాండిత్యమును  సంపాదించిరి.మాతృ భాష అయిన తమిళమునందేకాక సంస్కృతాంధ్రములలో కూడా అపార పాండిత్యమును సంపాదించిరి.
విద్యాభ్యాసము : దీక్షితులవారి విద్యాభ్యాసము గూర్చి తండ్రి ప్రత్యేక శ్రద్ధ వహించినారట. వీరిచే సంగీత సాధన చేయించుటేకాక సంగీత శాస్త్ర మర్మములను కూడా విశదీకరించి చెప్పేవారట.రామస్వామి దీక్షితులవారు కూడా గొప్ప సంగీత విద్వాంసులే, వీరే ముత్తు స్వామి దీక్షితులవారి మొదటి సంగీత గురువులు కూడా.
ఇదిలా ఉండగా మణలి  అను ప్రాంతo యొక్క ప్రభువైన ముత్తుకృష్ణ మొదలియార్ తిరువారూరునకు తీర్థయాత్రకు వచ్చినప్పుడు రామస్వామి దీక్షితులవారి గానాన్ని వినటం తటస్థించి ,వారి సంగీత జ్ఞానమునకు ముగ్ధులై ఆయనను తమ సంస్థానమున విద్వాంసునిగా ఉండమని ప్రార్ధించగా రామస్వామి అందుకు అంగీకరించి తన కుటుంబ సమేతముగా వచ్చి మణలిలో  స్థిరపడెను. ముత్తుస్వామి దీక్షితులవారి వివాహంకూడా ఇక్కడే జరిగెను.
మణలికి ఓనాడు శ్రీ చిదంబరనాధయోగి అనే సిద్ధపురుషుడు వచ్చినారట.వారికి రామస్వామి దీక్షితులవారు తమ ఇంట ఆతిధ్యం ఇచ్చినారట.ఆయన దీక్షితుల యొక్క వినయవిధేయతలకు,పాండిత్యమునకు సంతసించి దయతో ఒక మహామంత్రమును ఉపదేసించెను. ఆయనతోపాటే కాశీకి తీసుకు వెళ్ళెను. దీక్షితుల వారు కాశీలో అయిదు సంవత్సరాలు మంత్రావృత్తి చేసుకొనుటయే కాక అష్ట మహా సిద్ధులను సంపాదించి వేదాంత శాస్త్రోపదేశమును కూడా పొందిరి.
ఒకనాడు శ్రీ చిదంబరనాధయోగి కాశీక్షేత్రములో  అన్నపూర్ణాంబికా ఆలయమునకు దీక్షితులవారిని తీసుకు వెళ్ళి "నీ పై దేవికి పరిపూర్ణమైన అనుగ్రహము కలిగినదనియు,ఇహపరములందు భక్తి ,ముక్తి నొసగి కాపాడగలదనియు ,తుదకు మోక్షమును కూడా ఇవ్వగలదనియు, బ్రతికియున్నంత  కాలము ఆమెను పూజింపమనియూ  చెప్పిరి."
మరునాడు ప్రాతః కాలమున శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారు గంగా స్నానమునకు బయలుదేరగా చిదంబరనాధయోగీంద్రులు వారితో ఈవిధంగా చెప్పిరి"నీవు గంగా నదిలో దిగినప్పుడు నాలుగైదు అడుగులు ముందుకు వేసి నీకు లభ్యమైన దానిని తీసుకురమ్ము" అని ఆనతినిచ్చితిరి.ఆతరువాత దీక్షితులవారికి గంగానదిలో ఒక వీణ లబించినదట దానిపైన దేవనాగరిలిపిలో శ్రీరామ అని వ్రాసియున్నదట.దీనిని తెచ్చి యోగీంద్రునకు సమర్పించిరట.యోగీంద్రులు ఆ వీణను తన ఆశీస్సులతో మరలా దీక్షితులవారికి అనుగ్రహించి "ఇది నీకు గంగా దేవి అనుగ్రహించిన ప్రసాదము.నీవు గొప్ప వాగ్గేయకారుడివి,వైణికుడవు కాగలవు"అని ఆశీర్వదించినారట.గురువుగారి ఆ అనుగ్రహభాషణమే వారి అంతిమ పలుకులైనవట. తరువాత గురువుగారి ఆజ్ఞ మేరకు తిరిగి మణలికి వచ్చినారట.
తిరుత్తణి ప్రయాణము: దీక్షితులవారి జీవితములోని ఇది చాల ముఖ్యమైన సన్నివేసముగా పరిగణింపవచ్చును.వారు కాశీ నుండి వచ్చిన తరువాత   శ్రీ సుబ్రహ్మణ్యుని దర్శనార్థం తిరుత్తణి వెళ్ళగా అక్కడ స్వామి సన్నిధిలో సుబ్రహ్మణ్య పంచాక్షరీ మహామంత్రం చేసుకొనుచున్నప్పుడు చెంగల్వరాయుడనబడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక మహా పురుషుని రూపంలో దర్శనమిచ్చి నోటిలో కండ చక్కెరను వేసి అంతర్ధానమయ్యెను. దైవానుగ్రహం వలన వెంటనే దీక్షితులవారు ఆశువుగా "శ్రీనాధాది గురుగుహజయతి" అను మాయామాళవగౌళ  రాగంలో సంస్కృతంలో మొదటి కృతిని రచించారు. ఆ తరువాత క్రమముగా సంబోధన ,ప్రథమా మొదలగు 7 విభక్తులలోను గురుగుహాంకితముగా "గురుగుహ"ముద్రతో 9 కృతులను రచించెను. ఇక అప్పటినుంచీ ఆయన జీవించి ఉన్నంత కాలం అలా రచనలను చేస్తూనే ఉన్నారు.
రచనలు,రచనాశైలి: దీక్షితులవారు తన జీవితకాలంలో సుమారుగా ఒక 500 కృతులను  రచించియున్నారు.అయితే వీరి రచనలు ఎక్కువ భాగము సంస్కృతములోనే రచింపబడెను. అవి నారికేళ పాకముగనుండి పండితాస్వాద యోగ్యమైనట్లుగా సామాన్య జనులకు అర్థంకావు.వారి కృతులను విన్నప్పుడు ఆయనకుగల మంత్ర శాస్త్ర పాండిత్యము,దేవతా ప్రతిమా లక్షణ విజ్ఞానము ఆయన సంస్కృత భాషా పాండిత్యము,చందో వ్యాకరణ ప్రతిభా పాఠవాలు, ఇవన్నీ స్పష్టముగా తెలుస్తాయి. దీక్షితులవారి అన్ని రచనలలో గురుగుహ ముద్ర కనిపిస్తుంది
 దీక్షితులవారి అన్ని  రచనలలో తిరువారూరులోని త్యాగరాజస్వామి ఆలయంలోని దేవతామూర్తులపై రచించిన  కృతులు ఎంతో విశిష్టమైనవిగా పేర్కొనబడతాయి. ఎంతో జనాదరాణ పొందిన "వాతాపి గణ పతింభజే" కృతి కూడా ఈ ఆలయములో గణపతిపై రచించినదే  తిరువారూరు త్యాగరాజ స్వామిపై 13 కృతులను,అమ్మవారైన కమలాంబ,నీలోత్పలాంబపై నవావరణ కృతులను రచించారు. కర్ణాటక  సంగీత సామ్రాజ్యంలో ఈ కమలాంబా నవావరణ కృతులకు అత్యంత ప్రముఖ స్థానము కలదు.ఇవి గానం చెయ్యలన్నా ,వాయించాలన్నా ఎంతో విశేష ప్రతిభ కావలెను.ఆ జగన్మాత అయిన ఆ లలితాపరమేశ్వరీ దేవి సూక్ష్మరూపం శ్రీచక్రం.మంత్ర తంత్ర శాస్త్రంలో నిష్ణాతులైన దీక్షితులవారు ఆ శ్రీచక్రార్చన ప్రక్రియనంతా ఈ నవ ఆవరణ కృతులలో ఇమిడేలా రచించారు.
 ప్రసిద్ధ శైవ దేవాలయాలైన  పంచభూతలింగ క్షేత్రాలు అయిదింటినీ దర్శించి అచటగల లింగరూపధారుడైన ఆ శివుని దర్శించి ఆనందానుభూతులతో 5కృతులను రచించిరి.
క్షేత్రనామము     లింగరూపము       సాహిత్యము
చిదంబరము         ఆకాశలింగము     ఆనంద నటన ప్రకాశం
శ్రీకాళహస్తి              వాయులింగము    శ్రీకాళహస్తీశ
అరుణాచలం         తేజోలింగము           అరుణాచలనాధం
జంబుకేస్వరము      జ్వలలింగము    జంబూపతే
కంచి                    పృధ్వీలింగము        చింతయమాకంద
 ఈకృతులలో పంచభూత  తత్వములను విభిన్న విశేషములతో దీక్షితులవారు అభివర్ణించిరి. ఆకాశమునకు,పృధ్వికి మధ్యనున్నది నీరు,వాయువు,అగ్నితో నిండియున్న జగత్తు.ఈ జగత్తు ఒకమిధ్య.సత్యము ఆకాశము.అది ఆనంద స్వరూపము.ఆనందమనగా పరమాత్మ.ఇలాంటి శాస్త్ర రహస్యాలెన్నో వారిపంచభూతలింగ స్థల కృతులలో విశ్లేషించి యున్నారు.
ఆగమ శాస్త్ర నిష్ణాతులైన దీక్షితులవారు షోడశ గణపతులపైన,నవ గ్రహములపైన కూడా రచనలు చేసారు.నవగ్రహాలపై కృతులను రచించడానికి ఒక కారణం  కలదని నానుడి.దీక్షితులవారి శిష్యునకు ఒకరికి విపరీతమైన శూలనొప్పి ఉండేదట.వైద్యమునకు అది నయము కాలేదు.జ్యోతీషులు గురు,శని గ్రహచారములు బాగుండలేదని చెప్పినారట.అప్పుడు శిష్యునిపై ఆయా గ్రహముల అనుగ్రహముకై కృతులు రచించి గానము చేయగా అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినాడట .ఈ విధంగానే మిగిలిన గ్రహముల పై కూడా రచించినారట.
 దైవం అంటే నమ్మకం. నిజంగా అతని నొప్పి, కృతిని గానంచెయ్యడం వలన పోయిందా అంటే ఈనాడు మనకి నమ్మశక్యం కాకపోవచ్చు.కానీ ఇలాంటివన్నీ కేవలం నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి.భావములోన,బాహ్యములోన కూడా పరమాత్మను చూడగలిగేవారు పరమాత్మ యొక్క నిజతత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగినవారు.దైవం సర్వవ్యాపకం,సర్వసమర్థవంతం ఇది అనుభవం వల్లనే ఎవరికి వారు తెలుసుకునే సత్యం.
ముత్తుస్వామి దీక్షితులవారికి చిన్నస్వామి ,బాలస్వామి అని ఇద్దరు సోదరులుండేవారు. వీరి సోదరులన్న  వీరికి చాలా ఆదరాభిమానములు ఉండెడివి.  పాశ్చాత్య సంగీత  వాయిద్యమైన వయొలిన్ ను కర్ణాటక సంగీతమునకు ప్రక్క వాయిద్యముగా స్వీకరించి ఆ వాయిద్యమునకు ప్రత్యేక స్థానము కలిపించినది బాలస్వామి దీక్షితులే. వారిరువురూ ఒకసారి తీర్థయాత్ర చేయుచున్నప్పుడు దురదృష్టవశాత్తూ  చిన్నతమ్ముడగు చిన్నస్వామి అకాల మరణము చెందెను.అప్పుడు బాలస్వామి చింతాక్రాంతుడై యాత్రముగించుకుని వచ్చుచుండగా మార్గమధ్యమున ఎట్టియాపురం మహారాజు ఇతనిని ఆదరించెను,వివాహమును కూడా జరపించదలిచెను. దీక్షితులవారికి ఈ సంగతితెలిసి బాలాస్వామిని చూచుటకై ఎట్టియాపురం వచ్చునప్పుడు మార్గమధ్యంలో వర్షాలులేక ఎండిపోయి ఉన్న పైరుని చూసి హృదయము ద్రవించగా "అమృతవర్షిణీ రాగం"లో "ఆనందామృత హర్షిణి అమృతవర్షిణి"అను కీర్తన అప్పటికప్పుడు గానం చెయ్యగా ఆ జగదంబ కృపవలన ఆకాశం మేఘావృతమై అద్భుతమైన వర్షం కురిసెనట.పాషాణాన్ని కూడా కరిగించగలిగే శక్తి సంగీతానికి ఉన్నప్పుడు అమృతహృదయురాలైన ఆ జగన్మాత, దీక్షితులవారి అమృతవర్షిణీ రాగ  కృతికి పరవశించి ఆనందభాస్పాలను రాల్చినదేమో... అమ్మయొక్క  ఆ ఆనందభాష్పాలే అమృత వర్షంగా దివినుండికి భువికి వచ్చినది అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
నవవిధ భక్తిమార్గాలలో ఉత్తమ మార్గం అయిన కీర్తనం తో ఇలా జీవితకాలం అంతా మోక్ష సాధన చేసిన వీరు కారణ జన్ములే మరి.1835వ సంవత్సరంలో అనగా వారి 60వ ఏట ఆశ్వయుజ బహుళ చతుర్దశి(నరక చతుర్దశి)  నాడు  దీక్షితులవారు అనుష్టానము ప్రారంబించుచుండగా సాక్షాత్తు అన్నపూర్ణా దేవి తేజో మూర్తి గా దర్శనమిచ్చినదట. త్రికాలజ్ఞులు కనుక తన అంత్యకాలము ఆసనమైనదని గ్రహించి వెంటనే శ్రీచక్రార్చన మొనర్చి "ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదా పూర్ణే సువర్ణే చిదానంద విలాసినీ" అన్న కృతిని రచించి గానం చేశారు.ఇదియే వీరు రచించిన చివరి కృతి . సాధారణ మానవులైన మనం మరణం సంభవిస్తుందని తెలిస్తే భయపడతాం.పుట్టినవారు గిట్టక తప్పదన్న నిజం తెలిసినా ఆందోళన చెందుతాము.కాని వారు దైవాంశ సంభూతులుకనుక వారికి అలాంటి చింతలుండవు.నిజానికి ఆ పరమాతంలో ఐక్యం చెందాలనే వారు జీవించినంతకాలం పరితపిస్తారు.
వెంటనే శిష్యులను పిలిచి "మీనాక్షీ ముదం దేహి" అన్న కృతిని గానం చెయ్యమని అడిగి వారితోపాటూ ఆయనకూడా గానం చేస్తూ "మీనలోచనీ పాశమోచనీ" అన్న పదములు రాగానే దీక్షితులవారు "శివే పాహి"అనుచూ కళ్ళు మూసుకున్నారట వెంటనే వారి బ్రహ్మ కపాలము చేదించబడి జీవాత్మ పరమాత్మయందు ఐక్యమయ్యెను.  ముత్తుస్వామి దీక్షితులవారు ఆసేతుహిమాచలమూ పర్యటించి ఆయన దర్శించిన పుణ్యక్షేత్రాలలో గల దేవతలపై కీర్తనలను రచించి తాను తరించడమే కాకుండా సంగీతప్రియులను కూడా తరింపజేసెను.
వీరి 'వాతాపి గణపతిం భజే' అన్న కీర్తనను క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages