మీరు మారాలనుకుంటున్నారా? - అచ్చంగా తెలుగు

మీరు మారాలనుకుంటున్నారా?

Share This

మీరు మారాలనుకుంటున్నారా?

బి.వి.సత్యనగేష్


విత్తనం మొక్కవుతుంది. మొక్క చెట్టవుతుంది. చెట్టు మహావృక్షంగా మారి కొన్ని లక్షల విత్తనాలను సృష్టిస్తుంది. ఇది పరిణామక్రమం, మనిషి శరీరం కూడా అలాగే పరిణామం చెందుతుంది, కాని... మనసు సహజ సిధ్ధంగా పరిణామం చెందదు. మనసు పరిణామం చెందాలంటే మనిషి ప్రయత్నం చేసి తీరాలి. మానసికమైన మార్పునకు మనిషి ఆలోచనా వైఖరిలో మార్పు రావాలి. అప్పుడే మార్పును గుర్తించగలం.
ప్రకృతి కూడా ప్రతీ సంవత్సరం ఋతువుల ప్రకారం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలని తపన పడితేనే ఆ మార్పు జరుగుతుంది. ఇది సహజసిద్ధమైనది కాదు. గొంగళిపురుగు ఒక జీవి కనుక మార్పుకు ప్రయత్నం చేస్తుంది. కొన్ని గొంగళిపురుగులు ఆ మార్పు చెందకుండానే జీవితాన్ని చాలిస్తాయి. జీవుల్లో కెల్లా అత్యంత అభివృద్ది చెందిన మనిషి మార్పుకోసం ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే ఆ మనిషి కుటుంబంలో, సమాజంలో మెప్పు పొందగలుగుతాడు, తృప్తిగా జీవించగలుగుతాడు.
మనం సంతోషంగా వుంటూ మన చుట్టుప్రక్కల వారిని సంతోషంగా వుంచాలనుకుంటే మార్పును ఆహ్వానించడం తప్పనిసరి. మనిషిలో మార్పుకు మూలకారకం – ఆలోచనా సరళి. దాన్నే వైఖరి, దృక్పథం అంటాం, ‘నాలో మార్పుకు నేను ఎలా ఆలోచించాలి’ అని ప్రతీ వ్యక్తి ప్రశ్నించుకోవాలి. మార్పుకోసం ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనే తపన తో ‘ ఓపెన్ మైండెడ్’ గా స్వాగతించాలి. పారాషూట్స్ ఓపెన్ చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే మనిషి ‘ఓపెన్ మైండెడ్’గా తపనతో వుంటేనే మార్పు కలుగుతుంది. “నాలో మార్పు అవసరం, నేను మారితీరాలి, నా ఆలోచనా తీరులో నేను మారగలను” అనే తపనతో వుంటే ‘CHANGE’ అనే ఇంగ్లిష్ పదంలోనే సారాంశమంతా కన్పిస్తుంది. అదేంటో చూద్దాం.
C = CREATE OPPORTUNITIES
H = HANDLE THE SITUATION
A = ACCEPT THEM AS CHANLLENGES
N = NEVER QUIT
G = GAIN KNOWLEDGE
E = EVALUATE YOUR EXPERIENCES
జీవితంలో మార్పు కావాలంటే పై పదంలోని ఒక్కొక్క అక్షరానికి వున్న అర్ధాన్ని అదే క్రమంలో పాటిస్తే మార్పును తప్పనిసరిగా రుచి చూడగలం.
CREATE OPPORTUNITIES:
          అవకాశాలు వాటంతటి అవిరావు. మనం కల్పించుకోవలసిందే. “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా” అనే సినిమా పాట ఉండనే వుంది. కనుక “అదృష్టం,దురదృష్టం, కలిసి రావాలి” అని అనుకుంటూ కూర్చోకుండా అవకాశాలను కల్పించుకోవడమే మార్పుకు మొదటి మెట్టు. మనం వున్న వాతావరణంలోనే వుండి, ఎంతో వృద్ధిలోకి వచ్చిన వారిని అధ్యయనం చేస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్ధమౌతుంది. వారందరూ అవకాశాలను కల్పించుకున్న వారే కాని ఎవరో అవకాశాలను కల్పించి విజయాలను అదించలేదు.
HANDLE THE SITUATIONS:
          అవకాశాలను కల్పించుకున్న తర్వాత క్రొత్త పరిస్థితులు, క్రొత్త అనుభవాలను ఎదుర్కోవటం సహజం. మార్పు మాత్రమే మన ధ్యేయం అనుకుని పరిస్థితులను చాకచక్యంగా, ఓపికగా, పట్టుదలతో జయించగలిగితే మంచి అనుభవం వస్తుంది, వచ్చిన అనుభవంతో మరింత ఉత్తేజంతో ముందుకు సాగాలి.
ACCEPT THEM AS CHALLENGES:
          మార్పుకోసం ప్రతీ విషయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి, సమాధానం లేని సమస్యలు లేవు కనుక ప్రతీ సమస్యను సవాలుగా తీసుకుని పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. ఛాలెంజ్ గా తీసుకోవడమనేది ఒక రకమైన మనస్తత్వం అని నమ్మి ఆలోచనా ప్రక్రియ ద్వారా అటువంటి మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.
NEVER QUIT:
          విజేతలు విడిచి పెట్టరు. విడిచిపెట్టేవారు విజేతలు కాలేరు. ఇది జగమెరిగిన సత్యం. కనుక మార్పుకోసం చేసే ప్రయత్నంలో పట్టుసడలని ప్రయత్నాన్ని అలవాటు చేసుకోవాలి. దానివల్ల మనస్తత్వంలో మార్పు వస్తుంది. తద్వారా జీవితంలో మార్పు వస్తుంది.
GAIN KNOWLEDGE:
          అవకాశాలను సృష్టించుకుని, అవకాశాలను జారవిడవకుండా పరిస్థితులను జాగ్రత్తగా నిర్వహించి, ఛాలెంజ్ గా తీసుకుని, పట్టుదలతో చెయ్యడం వలన ఒక గొప్ప అనుభవం కలుగుతుంది. ఈ కొత్త అనుభవాన్ని నెమరు వేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. విజ్ఞానం వున్నవాడు విజయం వైపుకు దూసుకువెళ్తాడు. అనుభవం తో వచ్చిన విజ్ఞానం మార్పుకు పెద్ద పెట్టుబడి లాంటిది.
EVALUATE YOUR EXPERIENCES:
          మనకు కలిగిన అనుభవాలను పరీక్షించుకుంటే మనకొక విషయం అర్ధమౌతుంది. ఈ ప్రపంచంలో ప్రతీ విషయం నేర్చుకునే దశలో చాలా కష్టంగానే వుంటుంది. సాధన ద్వారా చాలా సుళువు అవుతుందని మనకు అర్ధమౌతుంది. కనుక ఏదీ కష్టం కాదు అనే మనస్తత్వం అలవాటౌతుంది. ఇది మార్పుకు ఎంతో దోహదపడుతుంది.
          ఉదాహరణకు... సైకిల్ తొక్కడం, అక్షరాలు నేర్చుకోవడం, స్కూటర్ నడపటం, ఈత కొట్టడం లాంటి ప్రతీ పని ప్రారంభదశలో కష్టంగానే అనిపించినా నేర్చుకున్న తర్వాత అది ఎంత సులభమైన విషయమో... అందరికీ అనుభవమే.
          మార్పు ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే మనం ఎప్పుడూ చేసిన పనులనే చేస్తూ వుంటే... ఎప్పుడూ వచ్చిన ఫలితాలే వస్తాయి కనుక మార్పు అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధుడు, వేమన లాంటి పుణ్యపురుషులు కూడా ఆలోచించే విధంలో మార్పు వచ్చిన తరువాతే పుణ్యపురుషులయ్యేరు. ఒక సగటు మనిషి ఆ స్థాయికి చేరాలని కాదు, కనీసం తను సంతోషంగా వుంటూ చుట్టు ప్రక్కలవారికి కూడా సంతోషం కలిగించాలంటే ఆలోచించే విధంలో మార్పు అవసరం. ఆ మార్పు జీవితాన్ని మారుస్తుంది కూడా! మార్పుకోసం పదండి ముందుకు.

No comments:

Post a Comment

Pages