లక్ష్మీ తత్త్వము - అచ్చంగా తెలుగు

లక్ష్మీ తత్త్వము

Share This

లక్ష్మీ తత్త్వము

డా. వారణాసి రామబ్రహ్మం 



శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని మనోల్లాసిని. మనకు సకల శుభములు కలిగించి సకల సంపదలను ఇచ్చే తల్లి. ధనము, ధాన్యము, విద్య, ధైర్యము, సంతానము, జ్ఞానము, వైరాగ్యము,ఆరోగ్యము, వీరత్వము  మొదలైన సిరులనిచ్చి మన బాగోగులను చూస్తూ మన్ని ఐశ్వర్యవంతులను చేసి బ్రోచే విష్ణు వల్లభ. తన తోబుట్టువులైన చంద్రుడు, అమృతము ల వలె చల్లదనము, అమృతత్వము మనకి పంచి మనని దివ్యులను చేసే దేవి.శ్రీ పీఠమునలంకరించి సురలచేత పూజించబడే దివ్య.
శ్రీ మహాలక్ష్మి మంత్రమూర్తి. ఎల్లప్పుడూ జ్ఞానముతో వెలుగుతూ ఉంటుంది. ఆమె మాహా మాయ కూడాను. ఇక్కడ మాయ అంటే మనచ్ఛక్తి  వైష్ణవీ రూపంలో సకల జనులను, చరాచర ప్రపంచమును స్థావరజంగమములను కాచే విష్ణు యువతి మహాలక్ష్మి. మన పాపములన్నిటిని హరించే కరుణా సాంద్ర. ఆమె సర్వజ్ఞురాలు. వరములనిచ్చేది. దుష్టనాశనము చేసి మన దు:ఖములను పోగొడుతుంది. ఆమె సిద్ధి, బుద్ధులను, భక్తి, ముక్తులను ప్రసాదించే తల్లి.
శ్రీ మహాలక్ష్మి ఆది అంతములు లేని శాశ్వత. ఆమె మూలశక్తి. ఆమె యోగజ్ఞ. యోగమునకు గమ్యము. యోగ జనిత ప్రసాదము. స్థూల సూక్ష్మముల ధారిణి. మాయా భయంకరురాలు. రుద్రరూపిణి.
ఎల్లప్పుడూ పద్మాసనయై అభీష్టములను నెరవేర్చే దేవి. శ్రీ పీఠ. జగత్తును రక్షించే మాత. ఆమె యందు జగత్తు స్థితిని స్థిమితాన్ని పొందుతుంది. నల్లని విష్ణునికి తెల్లని దేవి.
మోక్ష ప్రదాత మహావిష్ణువును మనం  పూజించాలనే సంకల్పము మనకి కలిగించి తాను మనలని సమస్త ఐశ్వర్యములతోనూ కూడా తులతూగేలా అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి సౌభాగ్యదాత్రి. స్త్రీలకు ఐదవతనము నిచ్చే పెద్ద ముత్తైదువ. బాలికలు, కన్యలు, వివాహితలైన స్త్రీలు జలజాతవాసిని అయిన శ్రీదేవికి భాగ్య,సౌభాగ్యముల కొరకు; సుఖసంతోషముల కొరకు, దీర్ఘసుమంగళీత్వము కొరకు పూజిస్తారు. శ్రావణ మాసంలో పున్నమి ముందరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించి కోరుకున్న కోరికలను ఈడేర్చుకుంటారు. అష్టలక్ష్మీ రూపిణి. శ్రీమహావిష్ణువు శిష్టరక్షణ, దుష్ట శిక్షణలు చేయుటకు భూమిపై అవతరించినపుడు ఆయనను అనుగమించి ధన్యయై మనల ధన్యుల చేస్తుంది. మనసునకు ఉత్సాహము, ఆహ్లాదము కలిగించే సంతోష లక్ష్మి.  శాంతము, మౌనముల మనమున నింపి మనం సదా ఆనందంగా ఉండే స్థితిని ఇస్తుంది. మంగళదాయిని, భాగ్యసౌభాగ్యదాత అయిన ఇందిర అష్టైశ్వర్యములను ఇస్తూ మనం జ్ఞానమార్గము నుంచి దృష్టి మరల్చకుండా చూసి విష్ణు పదాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందేలా చేసి మోక్షసామ్రాజ్యాభిషిక్తులను చేస్తుంది. అడిగెదనని కడువడి జను నడిగిన తను మగుడ నుడుగడని నడ యుడుగున్ వెడ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్
ఇలా పోతన్నగారిచే అందముగా డెందముల ఊయలలూపుచు వర్ణించబడిన శ్రీ మహాలక్ష్మి మనల
అన్నవస్త్రములకు లోటు లేకుండా కరుణిస్తూ, మనకు యశము, సుఖము, భాగ్యము కలుగ చేయుగాక. మాధవి మాధవుని అనుంగు చెలి. మధురాస్య, మధుర భాషిణి అయిన లక్ష్మీ దేవి మనలను బ్రోచుగాక!
శ్రీర్భూయాత్!

No comments:

Post a Comment

Pages