గీత - అధీత - 5
చెరుకు రామమోహనరావు
సమస్య మనది -- సలహా గీతది -- 9
సమస్య : మానవునికి చావు పుట్టుకలున్నాయికదా ! మరి మానవుని ఆశ్రయించి వున్న ఆత్మకు చావు లేదంటారెందుకు?
సలహా : ఆత్మకు చావు లేదని ముందే చెప్పుకొన్నాము. ఇంకా సందేహము వీడలేదు కాబట్టి కొంచెము విస్తృతముగా చెప్పుకొంటాము. ఆత్మ ఒక బంగారు ఆభరణ మనుకొందాము. శరీరమునకు ధరింప జేసితే అది శరీరమునంటియుంటుంది. మరి locker లో ఉంచితే అక్కడే వుంటుంది. మరి దానిని చెరిచి వేరే ఆభరణము చేయించితే అందులోనే వుంటుంది. అది నీవు గుర్తిన్చినావు కాబట్టి ఆ రహస్యము నీకు మాత్రమె తెలుసు. అది తెలియని వారు ఇది వేరే ఆభారణమనే అనుకొంటారు. అసలు , సొమ్ములు వేరువేరయినా బంగారము అదే కదా. తెలుసుకొంటే 'వడ్లగింజ లోనిది బియ్యపుగింజ' అని అర్థమౌతుంది. తెలుసుకోకుంటే వడ్లగింజ వడ్లగింజ గానే వుంటుంది.
ఈ విషయాన్నే శ్రీ కృష్ణపరమాత్మ ఏమని చెప్పినాడో చూద్దాము:
న జాయతే మ్రియతే వా కదాచి త్రాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యః శాశ్వతో'యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే 20 -- 2
పుట్టుట లేదది గిట్టుటలేనిది
ఇప్పటి కప్పటి కెప్పటి కైనా
ఆత్మ శాశ్వతము అవ్యయమైనది
మట్టి కలియునది కట్టెయొక్కటే ( స్వేచ్ఛాను వాదము 20 -- 2 )
ఇది పుట్టినదీ లేదు చావబోయేదీ లేదు. ఇదిఆగదు. కేవలము మజిలీలు మారుస్తూవుంటుంది.ఇది నిత్యము,శాశ్వతము, నశ్వరము, సనాతనము, అభంగము మరియు అవినాశము. శరీరమునకే మరణము .
కట్టె కాలిందని బాధ పడే దానికంటే కట్టె కాలుటకే ఉండేదని తెలుసుకో. అప్పుడు చింత కాసింత కూడా నీ చెంతకు రాదు. ఇదే విషయాన్నే కఠోపనిషత్తు లో లోని ద్వితీయ వల్లి లోని 18 వ శ్లోకము ఇంచుమించు ఇదేవిధంగా వుంటుంది. భావము ఒకటే అయినపుడు భాషలో పోలిక ఉండుట సహజమని నా తలంపు. కఠోపనిషత్తు లోని శ్లోకము :
న జాయతే మ్రియతే వా విపశ్చి ననయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతో'యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ( కఠోపనిషత్తు -- ద్వితీయ వల్లి -- 18 ) ఆత్మా పుట్టదు చావదు అది దేనినుండీ పరిణమించదు. దానినుండీ కూడా ఏదీ పరిణామము పొందదు.శరీరము నశిస్తూ వున్నపుడు కూడా జన్మ రహితమూ , అనస్వరము శాశ్వతము, సనాతనము అయిన ఈ ఆత్మకు నాశమనేది లేదు. పరమాత్మ చెప్పినమాటనే దార్శనికులు మనకు ముందే తెలిపియున్నారు. ఉద్వేగము వదిలి ఉత్సాహము ప్రదర్శించినచో మనము ఎన్నోవిషయములను ఎంతో చక్కగా తెలుసుకొని నడచ్కోనవచ్చును.
******************************************************
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
Comment with Facebook
No Comments