డిసిప్లైన్ (కధ)

       గొర్తి వెంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)


 "సెక్షన్ హెడ్ అయ్యాక కోదండం డిసిప్లైండ్ మనిషైపోయాడేంటి గురూ?"
అతని ఆఫీసులోగానీ, స్నేహబృందంలో గానీ యిద్దరు వ్యక్తులు కలిస్తే కోదండం గూర్చి చెప్పుకొనే మొదటి వాక్యమిదే! చదువుకొనే రోజుల్లో కూడా లేని ' డిసిప్లైన్ ' అతనికిప్పుడు అర్ధాంగి కన్న ఎక్కువైపోయింది. అతను మాట్లాడే ప్రతిమాటలోను డిసిప్లైన్ పై కోదండానికున్న తహతహను చూపుతూంటుంది.
   ఒకరోజు యింట్లో ఆఫీసుఫైళ్ళతో కుస్తీ పడుతున్నాడతను.  ఆరేళ్ళ కూతురు ఏడుస్తూ అతన్ని సమీపించింది. అతను పట్టించుకోకపోయేసరికి శ్రుతి పెంచింది. " ఏమిటి? " చిరాగ్గా అరిచాడతను.
   "అన్నయ్య. . నా పెన్ను లాగేసుకొన్నాడు" ఏడుస్తూ చెప్పింది.
   "ఈ మాట చెప్పటానికి నా పని పాడుచెయ్యాలా? ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ మీ అమ్మకివ్వాలని ఎన్నిసార్లు చెప్పాను?.. . ఛీ. . ఛీ . . . మరీ డిసిప్లైన్ లేకుండా పోతోందీ కొంప. ." తండ్రి కేకలకు నోరు మూసేసిందా పిల్ల. ఆ కేకలకు పరుగున వచ్చిందతని భార్య.
  " నీ కూతురు పెన్ను దానన్న లాగేసుకొన్నాట్ట.  అది యిక్కడకొచ్చి నా బుర్ర పాడుచేస్తోంది " భార్యపై అరిచాడతను.
   " బాగుంది. .తండ్రి కదాని మీకు చెప్పింది. ఆ మాత్రానికే కేకలెయ్యాలా?"
   " చిన్న సమస్యలను నీతో చెప్పాలి గాని నా దగ్గరకు రాకూడదు.  నీకూ కష్టమైతేనే నా దగ్గరకు రావాలి అదీ ప్రొసీజర్! " అన్నాడతను.
  " బాగుంది. తండ్రితో మాట్లాడ్డానికీ ఓ పద్ధతుందని పసిపిల్లకేం తెలుస్తుంది?" భార్యమాటలకు గొంతు స్థాయి హెచ్చించాడు.
   "తెలియకపోతే తెలుసుకోవాలి.  ఆఫీసులో చిన్న విషయాలన్నీ సెక్షన్ హెడ్డే చూసుకొంటాడు.మరీ పెద్ద విషయాలకే ఆఫీసరు దగ్గర కెడతారు. ఆ లెక్కప్రకారం యింట్లో చిన్న తగవులను సెక్షన్  హెడ్డువైన నువ్వే చూసుకోవాలి. అది తెలుసుకోక మాటకి మాట చెబుతావా? ఎక్కువ మాట్లాడితే మెమో యిచ్చి సంజాయిషీ అడుగుతాను. జాగ్రత్త!"
  భర్తతో వాదించలేక కూతుర్ని నాలుగంటించి అక్కడినుంచి యీడ్చుకుపోయింది.
   మరొకరోజు -
     కోదండం  భోజనం తిని సోఫాలో కూర్చుని న్యూస్ పేపరు చదువుతున్నాడు. తొమ్మిదేళ్ళ కొడుకు భయపడుతూ అతన్ని సమీపించాడు. కొద్దిక్షణాలు చూడనట్లే నటించాడతను.
  " నాన్నా! . . .స్కూల్లో ప్రోగ్రెస్ కార్డిచ్చారు. . దానిపై మీ సంతకం. .. " నసుగుతున్న కొడుకు చేతిలో పెన్ను, కార్డు లాక్కుని, దానిపై ఏదో గిలికి వాడి మొహాన కొట్టాడు.అది చూసిన వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వచ్చే కన్నీళ్ళాపుకొంటూ వంటింట్లోకెళ్ళాడు.  మరుక్షణం కోదండం భార్య దూకుడుగా వచ్చింది. ఆమె చేతిలో ప్రోగ్రెస్ కార్డుంది.
  " వాడు దీనిమీద మీ సంతకం అడిగితే 'త్రూ ప్రోపర్ ఛానల్ ' అని వ్రాశారేంటి? " గద్దించిందామె.
   "అది పద్ధతి. నన్ను విసిగించకు " అంటూ పేపర్లో తలదూర్చాడతను. ఆమె కోపంగా చేతిలో పేపరు లాగేసరికి తారాజువ్వలా లేచాడతను.
  " పద్ధతి ప్రకారం ఏదైనా కాగితంపై ఆఫీసర్ సంతకం కావాలంటే దాన్ని సెక్షన్ హెడ్. . అంటే యిక్కడ. . నువ్వు చూశాక  నా దగ్గరకి పంపాలి. వాడికది తెలియాలనే అలా వ్రాశాను"
   " పోనీ దాన్ని చూసి నేనే పంపాననుకోవచ్చుగా "
   " దానిపై నువ్వు ఇనీషియల్ వేస్తేనే నువ్వు చూసినట్లు" కోదండం బదులుకు ఖంగు తిందామె.
  " బాగుంది. సక్రమంగా పనులవటానికి ఆఫీసులో కొన్ని పద్ధతులుండొచ్చు. వాటిని సంసారాల్లో కూడా అమలు చేయాలంటే ఎలా? అర్జంటుగా రమ్మని మా వాళ్ళు ఉత్తరం వ్రాస్తే సెలవుచీటి యిమ్మనేలాగుంది మీ తంతు.. "
 "యస్. . దానితో పాటు హెడ్ క్వార్టర్ లీవ్ పెర్మిషన్ కూడా తీసుకోవాలి. అంతేకాదు. నీ సెలవుచీటీకి మీ వాళ్ళు వ్రాసిన ఉత్తరం జతచేయాలి.అదీ పద్ధతి " భర్త మాటలకు  అవాక్కయింది.
  " జీవితంలో డిసిప్లైన్ లేకపోతే బ్రతకటం కష్టం. అది నువ్వు నేర్చుకొని పిల్లలకు నేర్పు" క్లాసు పీకాడతను.
  "ఇకపై అలాగే చేస్తాను. దీనిపై సంతకం చేయండి"
  " దానిపై నీ ఇనీషియల్ వేయి ముందు " భర్త చెప్పినట్లే చేసిందామె.
  ఏడాది తరువాత -
ఆసుపత్రిలో కళ్ళడాక్టరిచ్చిన మందులు తీసుకొని గది బయటకొచ్చాడు సుదర్శనం. అప్పుడే తన ముందునుంచి పోతున్న కోదండాన్ని చూసి పిలిచాడు. వెనక్కి తిరిగిన కోదండానికి సుదర్శనం కనిపించాడు.
  "ఏమయ్యా సుదర్శనం? ఏమిటిలా వచ్చావ్?"
   "వారంనుంచి తలనొప్పి చంపేస్తోంది బాబాయిగారూ! చూపించుకొని మందులు తీసుకొన్నా. మరి మీరు?" అడిగాడతను.
   "రాత్రి మీ పిన్నికి పురిటినొప్పులొచ్చాయోయ్! ఆపరేషన్ చేయాలని కొన్ని మందులు వ్రాశారు. కొని తెస్తున్నా"
   "అలాగా! పదండి. . " అంటూ అతనితో పాటు ఆపరేషన్ ధియోటర్  కొచ్చాడు సుదర్శనం. అప్పటికే ఆపరేషన్ మొదలైనట్లుంది. బయట నిలబడ్డ నర్స్ కోదండం యిచ్చిన మందులు తీసుకొని లోనికెళ్ళింది. పావుగంట తరువాత హుషారుగా బయటకొచ్చిందామె.
  " గుడ్ న్యూస్ కోదండంగారూ! . . .ఆపరేషన్ సక్సెస్. .కవలపిల్లలు. మగపిల్లలే! తల్లీ, పిల్లలూ క్షేమం"
  "ఇప్పుడు చూడొచ్చా?" ఆదుర్దాగా అడిగాడామెను.
   "పావుగంట ఆగాలి" అంటూ వచ్చినంత వేగంగా లోనికెళ్ళిందామె. నర్స్ చెప్పింది విని బలంగా గాలి పీలుస్తున్న కోదండాన్ని చూసి సుదర్శనం గుండె వేగం హెచ్చింది.
  " చూశావా సుదర్శనం? ఇన్నాళ్ళకు మా ఆవిడ నా డిసిప్లైన్ని వంట పట్టించుకొందయ్యా! కవలపిల్లలు. .అంటే యిద్దరిదీ ఒకే పోలికన్న మాట! మన ఆఫీసులో ప్రతీ లెటర్ కీ ఒక ఆఫీస్ కాపీ ఉంటుందికద! మా ఆవిడ ఆ రూలు ఎంత చక్కగా పాటించిందో చూడు. యిద్దరిలో ఒకడొరిజినల్ అయితే రెండవ వాడు ఆఫీస్ కాపీ అన్న మాట "
 కోదండం డిసిప్లైన్ స్టేట్మెంట్ కి  అసలే గుండెదడగా ఉన్న సుదర్శనం కళ్ళు తిరిగి ప్రక్కనున్న బల్లపై దబ్బున పడిపోయాడు.
          *           *             *

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top