Saturday, August 22, 2015

thumbnail

వినతి(విరించికి)

వినతి(విరించికి)

                

  -  గొర్తి వెంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)


వలవేసి స్త్రీజాతికి - వెలివేసే మగవారికి
ఏమి శిక్ష వేస్తావురా విరించి?
చెప్పరా నీ బదులు వివరించి  
అధికారిణి తానైనా - లక్షలెన్నో అర్పించి
పనిచేయని సోమరికి అర్ధాంగిగా తానెడితే
తాగి చిందులేస్తాడు - తన్ని గోలచేస్తాడు
సహనశీలి సతిప్రేమకు సమాధి కట్టేస్తాడు
మదియించిన మగవారల - విరించీ!
మర్దించే వ్రాత వ్రాయి సవరించి!
ఆవులింత, అల్లుడొకటే! సమయాన్ని  సరకుగొనరు
పదిమందిలో పట్టుకొని పరువు తీసి పెడతారు
యింటిపేరు మార్చుకొని - యింట దీపమెట్టుతున్న
యిల్లాలికి కంటినీరు కానుకగా యిస్తారు
ధరణికి తలమానికమని - విరించీ!
 తరుణి గీత మార్చవయ్యా దయ ఉంచి
ఆడదాన్ని బ్రతకనిస్తే మగవాడికి బ్రతుకునిచ్చు
ఎదసీమలో కొలువుంచి అనవరతం పూజించు
పదిలముగా పదినాళ్ళూ తన మంచిని ఆశించే
ఆ అంశను వెలివేస్తే నీ వంశమే పోతుందని
చెప్పరా మగజాతికి - విరించీ!
 నీ చట్టాన్ని మార్చవోయి కరుణించి 
(ఆడపిల్ల ఆప్యాయత నాశించేది చిన్నప్పుడు తండ్రి, తదుపరి భర్త. వీరి ప్రేమ లభించనిచో ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో కళ్ళారా చూశాను. ఆ స్పందనతో వ్రాసిన ఈ కవితను పాటగా కూడా పాడుకోవచ్చును. ఆడది వంటింటి కుందేలుగా చూసే రోజుల్లో,పుట్టిన కూతురిని వీరనారిగా మలచి నాటి రాజదురంధరుల ఆలోచనలకు భిన్నంగా, యీ దేశంలో తొలిసారిగా, మన తెలుగునాట  ఒక స్త్రీని సింహాసనంపై కూర్చోపెట్టిన కాకతీయ ప్రభువు గణపతిదేవుని వారసులం. ఆ వీరనారి రుద్రమ్మ సోదరులం. ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లను బ్రతకనివ్వండి. ఆమె మీ వంశానికి బ్రతుకు నిస్తుంది, పదికాలాలు బ్రతకనిస్తుంది)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information