తృప్తి 

- భావరాజు పద్మిని 

విశ్వంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్నేకోరుకుంటారు. మానవుని సహజ స్థితి ఆనందం అంటాయి ఉపనిషత్తులు. కాని  మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడు. కారణమేంటి ?
ఆకలితో రోడ్డుపై నకనక లాడుతూ తిరిగేవాడికి, పట్టెడన్నం లభిస్తే చాలు, అనుకుంటాడు. కడుపు నిండగానే, కట్టుకునేందుకు సరైన బట్టలు ఉంటే చాలు అనుకుంటాడు. ఆ తర్వాత నిలువ నీడ, తిరిగేందుకు వాహనం, డబ్బు, , పదవులు, విలాసాలు... ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితాకు అంతే ఉండదు. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు వీటితో పాటు ఇతరులతో పోల్చుకుని, వారికంటే గొప్పగా ఉండాలన్న తపనతో, బెంగ పడుతూ లోలోపలే కృంగిపోతున్న వారిని కూడా చూస్తున్నాము. అంటే, మనిషికి ఇక్కడ కరువయ్యింది ఏమిటంటే - తృప్తి !!
తగినంత లేదనే భావన ఎక్కడో బలంగా ఉండడం వల్లే పోగుచేసుకోవాలనే కోరిక  అంత బలంగా ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గరఎంతున్నా, అది మనకు సరిపోవటం లేదు. మన దగ్గర ఉన్న దానికన్నా మనం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాము.  అక్కడికి చేరిన క్షణం, మనం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటాము ; ఇంకొంచెం; ఇంకొంచెం; ఇంకొంచెం….  సముద్రంలో అలల్లా, కోరికలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు- అంటారు. ఎండలో నడుస్తున్నవానికి చల్లని నీడ తృప్తినిస్తుంది. అలానే ఆ స్థితిలో దాహార్తికి చల్లని నీళ్ళు తృప్తి కలిగిస్తుంది. ఆకలితో సతమతమవుతున్నవానికి పట్టెడన్నంతో కడుపు నింపితే ముఖంలో తృప్తి తాండవమాడుతుంది. పరీక్షల్లో విద్యార్థి కృతార్థుడైనా, నిరుద్యోగికి ఉద్యోగం లభించినా, శ్రమనెంచక ఇల్లు కట్టినా, కూతురుకు పెళ్లిచేసినా ఆ వ్యక్తుల ముఖాలలో కనిపించే ‘తృప్తి’ని మాటలో వర్ణించలేం.
సంతోషానికి కారణం తృప్తి. అయితే తృప్తి అనే జీవితాదర్శం నిలవాలంటే దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలోకి స్వాగతించటం అవసరం. అలా కానప్పుడు, 'తృప్తి' అనే ఆ వస్తువు యాంత్రికంగా నిలవజాలదు. ఏదో ఒకనాడు అది పోతుంది; అసంతృప్తినే మిగుల్చుతుంది. కారణం - ఇదంతా భౌతికమైన తృప్తి.
భౌతికంగా మనిషికి లభిస్తున్న తృప్తి మనుస్సు కారణంగా లభిస్తున్నది. ఈ తృప్తి అనిత్యమైనది. అశాశ్వతమైనది. భగవంతుడు నాలోనే ఉన్నాడు నాకు ఇంకేమి తక్కువ లేదు అని భావించినప్పుడు అసలైన తృప్తి, సంతోషం కలుగుతాయి. తక్కువ, ఎక్కువ అన్న భావనలు ఎప్పుడు వస్తాయంటే ‘నేను’ అన్నీ చెయ్యాలి, సంపాదించాలి అనుకున్నప్పుడు. ‘నేను ’ అనుకుంటే తృప్తి ఉండదు. అదే భగవంతుడు ఇస్తున్నాడు. అర్హతను బట్టి ఇస్తున్నాడు అనుకుంటే కనుక తృప్తిని ఇస్తుంది.
ఉన్నదానితో, దైవం ఇచ్చినదానితో తృప్తి పడకపోవడం, లేనిదానికోసం పాకులాడడం వల్ల వచ్చిన అనర్ధాలు పైవన్నీ ! ఒకరకంగా తెచ్చిపెట్టుకున్న కష్టాలు. ఇలా కష్టాలు పడ్డ ఒక రైతు కధని చెప్పుకుందాము.
ఒక రైతుకు నాలుగు గొర్రెలు, ఒక ఆవు, ఒక కుక్క ఉండేవి. భార్యా, నలుగురు పిల్లలతో ఉన్న ఒక్క పూరిపాక సరిపోక, అశాంతితో అలమటించసాగాడు. ఆ ఊరికి ఒక సాధువు విచ్చేసారు. రైతు ఆ సాధువు వద్దకు వెళ్లి, తనకు ఉన్న ఇల్లు సరిపోవటం లేదని, తనకో దారి చూపమని, విన్నవించుకున్నాడు. సాధువు ఆ రాత్రికి ఆవును ఇంట్లో కట్టేసి, పడుకోమన్నాడు. మర్నాడు రైతు సాధువు వద్దకు వచ్చి, ‘స్వామి, రాత్రంతా, ఆవు కూడా ఇంట్లోనే ఉండడంతో అసలు నిద్రపట్టలేదు. ఏం చెయ్యమంటారో సెలవివ్వండి...’ అని అడిగాడు. ‘ఈ రాత్రికి కుక్కని కూడా ఇంట్లో కట్టెయ్యి, ‘ అన్నాడు సాధువు. చాలీచాలని చోటులో ఆవు, కుక్క చేరటంతో ఆ జంతువుల అరుపులకు ఆ కుటుంబానికి రాత్రంతా నిద్ర కరువయ్యింది. మర్నాడు సాధువు గొర్రెల్ని కూడా ఇంట్లో కట్టెయ్యమన్నాడు. రైతు పరిస్థితి దయనీయంగా తయారయ్యింది.
“స్వామి, తమరి అంతరంగం ఏమిటో అసలు బోధపడటంలేదు. నేను చాలా దుఃఖంలో ఉన్నాను,” అన్నాడు దిగులుగా.
“నాయనా ! ఇప్పుడు జంతువుల్ని బయట కట్టేసి, ఈ రాత్రి మీ కుటుంబ సభ్యులు మాత్రం పాకలో నిద్రించండి.” అన్నాడు సాధువు. ఆ రాత్రి తన పూరిపాకలో నిద్రించిన రైతు ఆనందానికి అవధులు లేవు. తన ఇల్లు తనకు ఎంతో విశాలంగా అనిపించింది. మర్నాడు సాధువును దర్శించుకుని, కృతఙ్ఞతలు తెలిపాడు. అప్పుడు సాధువు,
"నాయనా! ఉన్న దాంతో తృప్తి పడేవాడే ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు తప్ప, డబ్బు ఉన్నవాడు కాదు. అందులో కూడా సంతోషం అనేది అందరికీ ఉండదు- తృప్తిగా ఎందుకుండాలో అర్థం చేసుకొని, దాన్ని జీవితంలో నిలుపుకోవాలనుకునేవాడికి తప్ప, వేరొకరికి ఆ భాగ్యం ఉండదు. లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఉన్నది ఆనందాన్ని ఇవ్వదు. నీవు నా వద్దకు వచ్చేసరికి ఉన్నదే, ఇప్పుడూ నీవద్ద ఉన్నది. కాని, అప్పుడు నీకు ఉన్నవాటి విలువ నీకు తెలీదు. అది తెలియచెప్పాలనే ఇలా చేసాను.” అంటూ రైతును దీవించి పంపాడు.
ఆలోచించి చూస్తే, మన స్థితి కూడా రైతు పూర్వ స్థితి వంటిదే ! ఈ రోజు అవసరానికి, విలాసానికి తేడా   లేకుండాపోయింది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది లభిస్తుంది, అయినా తృప్తి కలుగదు.
 “భక్తుడి యొక్క లక్షణం నిత్య సంతుష్ణుడు” అని శ్రీ కృష్ణ భగవానుడు చెబుతారు.  నిత్యమూ తృప్తిగా ఉన్నవాడు నా భక్తుడు. అటువంటి భక్తుడు నాకు ప్రీతి పాత్రుడు.
“భగవంతుడు తలచుకుంటే నాకు అవసరమైనది ఇస్తాడు. నాకు ఎప్పుడు ఎంత అవసరమో అది భగవంతుడికి తెలుసు. ఇంత గొప్ప సృష్టిని సృస్టించిన ఆయన అవసరాలను తీర్చే విషయంలో  ఆయన ఎంత ఆలోచించి ఉంటారో కదా !” అన్న వాస్తవం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు  అనవసరమైన వాటి మీద దృష్టి  వెళ్ళదు. ‘నేను చాలా అల్పుడను. అంత శక్తివంతమైన వాడు పరమాత్మ. ఏది ఇచ్చినా భగవంతుడు నాకు ఉపయోగపడేదే ఇస్తాడు. ‘’ అనే భావన కలుగుతుంది. ఈ భావన మనసులోని  అహంకారాన్ని దూరం చేస్తుంది. ఆనందం పొందటానికి ఉపయోగపడుతుంది. అప్పుడు తమ కర్మలు తాము చేస్తూ, తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఫలితాన్ని మాత్రం పరమాత్మపై వదిలేస్తారు. ఇలాంటి తృప్తిని కలిగినప్పడు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ జీవన ప్రయాణంలో సుఖాన్ని , సంతోషాన్ని  , శాంతిని పొందగలుగుతాము.
నిత్యమైనది, శాశ్వతమైనది అయిన తృప్తిని గురించి ఆలోచించగలుగుతాము. ఇది మన అంతరంగంలో ఉన్నది. మనోనేత్రం మిథ్యాజగత్తును చూస్తూ అనుభవించేది బాహ్మికమైన తృప్తి. దేహానికి మాత్రమే సంబంధించినది. మనోనేత్రాన్ని అంతరంగంవైపు మళ్లించి వీక్షిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ధర్మ సౌందర్య దర్శనం, ఆత్మానంద జ్యోతి ప్రకాశం గోచరమవుతుంది.
ఓం తత్సత్

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top