స్వాధ్యాయము 

అక్కిరాజు ప్రసాద్ 

సత్సాంగత్యం గురించి ఇంతకు ముందు వ్యాసంలో చెప్పుకున్నాము. మరి సత్సాంగత్యం దొరకని వారి పరిస్థితి ఏమిటి? వారికి ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు లేదా? సనాతన ధర్మం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పింది ప్రతి సమస్యకు పరిష్కారం చూపింది. ఈ విషయం గురించి ఈ భరతభూమిలో జన్మించిన ఒక మహాయోగి,  ఋషీకేశ్ లో నివసించి ముక్తిని పొందిన సద్గురువు స్వామి శివానంద గారి మాటల్లో తెలుసుకుందాం (వీరే అబ్దుల్ కలాం గారికి ప్రేరణనిచ్చి మనకు ఒక భారతరత్నాన్ని అందజేయటానికి తోడ్పడిన మహానుభావులు)
సత్సాంగత్యము అందుబాటులో లేని వారికి స్వాధ్యాయమే సత్సాంగత్యం. స్వాధ్యాయమనగా మన పవిత్రమైన గ్రంథాలను పఠించి వాటిలోని విషయాలను వీలైతే ఇతరులతో చర్చించి, పునశ్చరణ చేసుకోవటం. వివేకచూడామణి స్వాధ్యాయం చేస్తే ఆ కాసేపు ఆదిశంకరులతో సత్సంగము చేసినట్లే. శ్రీమద్రామాయణ పఠనం చేస్తే వాల్మీకి మహర్షితో సమయము గడిపినట్లే. కాకపోతే, స్వాధ్యాయంలో కావలసినది సరైన వాతావరణము. అనగా దేహ శుచి, పరిసరాల శుచి. ఇవి లేని చోట స్వాధ్యాయము ప్రభావవంతంగా, నిరాటంకంగా సాగదు.   ప్రతిరోజూ సాయంత్రం ఒక నియమిత సమయంలో ముగ్గురో నలుగురో కూర్చొని గ్రంథముల పఠనం చేసి చర్చించుకుంటే ఫలితం అధికంగా ఉంటుంది. రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత, తులసీదాసు రచనలు, ఉత్తమ పురుషుల జీవిత చరిత్రలు మొదలైనవి పఠించటం వలన మెల్ల మెల్లగా మనసు శుద్ధి అవుతుంది. నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గం యొక్క రుచి తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటా బయటా పనులలో నిరంతరం గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకు స్వాధ్యాయం మంచి సాధనం. అలాగే వృద్ధులకు కూడా.
స్వాధ్యాయులు భక్తి మార్గంలోని ఆదర్శాలను, మహాత్మ్యాలను, తీయదనాన్ని, భగవంతుని లీలలను, సత్పురుషుల గాథలను తెలియజేసే గ్రంథాలను పఠించాలి. అలా చేసినప్పుడు భక్తి వికసిస్తుంది.
స్వాధ్యాయం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భగవద్గీత మొదలైన మహత్తరమైన గ్రంథాలను ఏకాగ్రతతో అధ్యయనం చేయటం ఒకరకమైన సమాధి వంటిదే. భగవద్గీత సమస్త వేదముల, యోగముల సారాంశము. గ్రంథములను పఠించుట క్రియా యోగమే. అది మనసును శుద్ధి పరచి ఉత్కృష్టమైన, ప్రోత్సాహకరమైన ఆలోచనలతో నింపుతుంది. ఆధ్యాత్మిక సోపానంలో ముందుకు తీసుకువెళుతుంది. చెడు ఆలోచనలు తొలగించి, కొత్త మార్గాలకు దారి తీసి అటువైపు పయనింపజేస్తుంది. మనసును చంచలత్వమునుంచి దూరం చేస్తుంది. ఏకాగ్రతను ఏర్పరచి, సవికల్ప సమాధి స్థితికి తీసుకు వెళుతుంది. మనసు నెమరు వేసుకోవటానికి మంచి పచ్చిక బయళ్లవంటి ఆలోచనలను సృష్టిస్తుంది. పవిత్రమైన గ్రంథాలను పఠించటం ద్వారా వాటిని రచించిన ఉన్నతమైన వ్యక్తుల ఆత్మలతో మన మనసు అనుసంధానమవుతుంది. అది ఒక సత్సంగమే. మనసు ఉత్తేజపూరితమై పారవశ్యంలోకి వెళుతుంది.
సత్పురుషుల సాంగత్యం దొరకనపుడు స్వాధ్యాయం మనలోని సందేహాలకు సమాధానాలు అందజేస్తుంది. వీగిపోయే మనసుకు బలాన్ని ఇస్తుంది. ముక్తిమార్గంపై సంకల్పాన్ని పటిష్టం చేస్తుంది. మహానుభావులు ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధంగా అవరోధాలను ఎదుర్కొని ఏ విధంగా ముందుకు సాగారో తెలియజేయటం ద్వారా ఒక నమ్మకాన్ని, ఓజస్సును కలుగజేస్తుంది.
గ్రంథాలలో చెప్పబడిన విషయాలను ఆకళింపు చేసుకొని ఆచరించటమంటే మన శరీరంలోని గాయలను ఔషధ సేవ ద్వారా సాంత్వన పరచటం వంటి ప్రక్రియే. ఇక్కడ గాయాలు మన అజ్ఞానం వలన కలిగిన అశాంతి మొదలైనవి. పవిత్రమైన గ్రంథాలు మనకు కలిగే క్లిష్ట సమయాలలో ఉపశమనాలు, సంకట పరిస్థితులలో విలువలను గుర్తు చేసే అద్భుత సాధనాలు, అంధకారంలో వెలుగును చూపే కాంతిపుంజాలు, మనలోని కల్మషాలను తొలగించే అమృతగుళికలు, మనకు దిశానిర్దేశకాలు.
కాబట్టి, మనం గ్రంథాలలోని సారాన్ని గ్రహించి ఆచరిద్దాం. జ్ఞానం ద్వారా సమస్త శాస్త్రముల రహస్యాలను తెలుసుకుందాం. అన్ని విషయాల సత్యాన్ని కనుగొందాం. తద్వారా మన నైజాన్ని దైవం యొక్క సహజ లక్షణాలతో అనుసంధానం చేసుకుందాం. జ్ఞానం అనంతమైన శక్తికి, శాశ్వతమైన ఆనందానికి మూలం. జ్ఞానం కొండలవంటి క్లేశాలను తొలగిస్తుంది, పాపాలను నాశనం చేస్తుంది, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి శాంతిపూరిత సామరస్యాన్ని, పరిపూర్ణతను ఇస్తుంది.
- స్వామి శివానంద

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top