శివ తత్త్వము

డా. వారణాసి రామబ్రహ్మం


శివ శబ్దము జ్ఞానమునకు పర్యాయ పదము. శ్లోII శివరూపాత్ జ్ఞానమహః త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖి రూపాత్ ఐశ్వర్యం భాస్కరాత్ ఆరోగ్యం చ భవంతి ll   (సాంబకృత సూర్య స్తోత్రం) शिव रूपात् ज्ञानमह: त्वत्तो मुक्तिं जनार्दनाकारात् शिखि रूपात् ऐश्र्वर्यम् भास्करात् आरोग्यं च भवन्ति      (साम्ब कृत सूर्य स्तोत्रं) తాత్పర్యము: శివుని వలన జ్ఞానము, విష్ణువు వలన మోక్షము, సుబ్రహ్మణ్యస్వామి వలన ఐశ్వర్యము, సూర్యభగవానుని  వలన ఆరోగ్యము కలుగుతాయని పెద్దల ఉవాచ. అలా శివుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానప్రదాత కూడా.సత్-చిత్-ఆనందస్వరూపుడైన పరమాత్మ, సత్య-శివ-సుందరుడు కూడా. ఇక్కడ 'చిత్', 'శివ' - శబ్దములు జ్ఞానసంబంధములు. 'చిదానందరూప శివోహం' అనీ మనకు తెలుసు. సరియైన జ్ఞానము కలిగితే, కుదిరితే, మనసు నిండా ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రశాంతమయం అవుతుంది. మనసు పున్నమి చందమామయై పరమాత్మనుంచి పడిన జ్ఞాన కిరణములను ఆహ్లాదరూపంలో ప్రతిఫలిస్తుంది. మనము ఆనందమయులమై పరమాత్మతో విలీనం చెంది అద్వైతానుభూతిని అనుభవిస్తూ సివులము అవుతాము. మన ఉనికికి మూలమైన ఆత్మయే ప్రజ్ఞానము. శుద్ద జ్ఞానము ఇదే. ప్రపంచము ఏర్పడడానికి మూలకారణమైనది పరమాత్మ. ఈ రెండు ఒకటే. ఉll  ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వా డెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్!       [ పోతన భాగవతం (8 -73)] అని భాగవతం విశదీకరించిన  పరమాత్మ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శివ కేశవాద్వైతుడు. పూర్ణ భక్తియే జ్ఞానము. శంకరుడు భక్తజనకింకరుడు. జ్ఞానవైరాగ్య స్వరూపుడైన మౌనియు సదాశివుడే. భక్తపాలనా కళాశీలుడు ముక్కంటి. మార్కండేయుని కాలుని నుంచి కాచి చిరంజీవిని చేసిన భక్త సులభుడు రుద్రుడు. మనందరి క్షేమమూ చూసే తండ్రి. వసిష్ఠ, వామదేవ గౌతమాది ఋషులు ఎన్నో శివ స్త్రోత్రములను ఇచ్చారు. కాశ్మీరముతో సహా భారతావని అంతటా  ప్రాకిన శివ తత్త్వము, శైవారాధన ఈశ్వరుని శివుని చేసాయి. తమిళ దేశములో నాయనమారులు, ఆంధ్రదేశమున నన్నెచోడుడు, పాలుకురికి సోమన, శ్రీనాథుడు మొదలైన శివకవులు; ఆరాధించిన, మనసార నుతించిన, స్తుతించిన, కీర్తించిన దైవము; భక్తజన వశంకరుడైన శంకరుడే. కన్నడ దేశములో ప్రభవించి, శివతత్పరులై, శివ సాయుజ్యమునొందిన, బసవేశ్వరుడు, అక్కమహాదేవి గణనీయులైన శివభక్తులు. పై అందరు మనకు ఆదర్శ భక్తులు. అనుసరణీయులు. తెజస్వ్సరూపుడైన అరుణాచలేశునికి శ్రీ రమణ మహర్షి  అనుంగు బిడ్డ. జ్ఞానభాస్కరుడైన ఈశునికి దీటైన జ్ఞానదీపిక. కణిక. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు వెల్లివిరిసే ప్రదేశాలు మొదలుగా అంతటా విలసిల్లే ఈశ్వరుడు భక్తపరాధీనుడు, గంగాధరుడు, పార్వతీ సహచరుడు, పశుపతి. మౌనియై, సంచారియై, సరళ జీవితానికి ప్రతీకయై సుఖస్వరూపుడై వెలిగే విశ్వేశ్వరుడు అపర్ణా కళత్రుడు. సదా తాపమున ఉంటూ తల్లి హైమవతిని పరిణయమాడి గృహస్థైన శివుడు అర్థనారీశ్వరుడు. స్త్రీపురుష అద్వైతానికి నిదర్శనం. శ్రీ దక్షిణామూర్తి స్వరూపుడై వటతరుమూలవాసి అయిన జగత్పిత శివుడు తన మౌనాశీస్సులతో మనకు జ్ఞాన వైరాగ్యములనొసగి ధన్యులచేసి కాచుగాక. श्रीर्भूयात्    శ్రీర్భూయాత్

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top