ప్రేమతో నీ ఋషి – 6 

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి ఫ్రెండ్ అభ్యర్ధనను అంగీకరిస్తుంది స్నిగ్ధ. ఇక చదవండి...)
రోజులు గడుస్తుండగా, ఆర్ట్ మార్కెట్ మీద మరింత పట్టు కోసం, అవగాహన కోసం ఋషి తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ ఉద్దేశంగా అతను అనేక ఆర్ట్ గాలరీ లను సందర్శించి, మ్యూజియంలలో సమయం గడిపాడు. అతను అనేక ఆర్ట్ ఆక్షన్స్ (వేలం) లను దర్శించి, అనేకమంది బ్రాండెడ్ ఆర్ట్ డీలర్ లను కలిసాడు. ఎంతగా సంప్రదింపులు జరిపితే, ఆర్ట్ ప్రపంచం అంత నిష్కపటంగా కనిపించింది అతనికి.
ఒక ప్రైవేట్ బ్యాంకర్ గా ఋషికి ఎల్లప్పుడూ పైస్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి, అవగాహన చేసుకునే అవకాశం దొరికేది. ఏ ప్రత్యేక ఉత్పత్తిలోనైనా, అతనికి ద్రవ్యత లక్షణాలు, రాబడులు, నష్టాలు, వంటి కీలకమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం తెలుసు.
కాని, ఆర్ట్ రంగంలో పెట్టుబడులు అతనికి పూర్తి విభిన్నంగా అనిపించాయి. ఇందులో అభిరుచి, ఆసక్తి అనేవి మిగతా వాటికంటే ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఒక వ్యక్తికి ఉన్న అభిరుచి అతన్ని చిత్రాల దిశగా నడిపి, మక్కువ పెంచుకునేలా చేస్తే, మరికొంత ఆసక్తి దానికి తోడైనప్పుడు, అది అతన్ని ఆర్ట్ ప్రపంచం గురించి మరిన్ని అంశాలు కనుగొని, ఎన్నో విషయాలు నేర్చుకునేలా చేస్తుంది.
ఒకవిధంగా అతనికి ఆర్ట్ లో పెట్టుబడి పెట్టడం, ఒకరి కళాదృష్టిపై పెట్టుబడి పెట్టడంలా అనిపించింది. చిత్రాల సేకరణ అనేది, ఆనందమయమైన పెట్టుబడుల్లో ఒకటి, అని అతను గుర్తుంచాడు. జీవితాంతం అవి మనకు కనువిందు చెయ్యడం మాత్రమే కాదు, వాణిజ్యం కోసం విలువైన వస్తువులుగా కూడా ఉపయోగిస్తాయి.
తర్వాతి దశలో, ఋషి కళాఖండాలు, ఫోటోలు, శిల్పాలు వంటి వాటిని అధ్యయనం చేస్తూ, చిత్రాలు  వెయ్యటం లోని స్ట్రోక్స్ వేసే పద్ధతి, వాడే రంగులు, ఉపరితల పరిశీలన వంటివి అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాడు. తన భావనకు అందినవన్నీ ఆసక్తిగా గమనించి, తర్వాత వాటిలో అంతర్లీనంగా ఉన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. ఈ ప్రక్రియలో, అతను రంగుల తారతమ్యాలు, కుంచెతో మెరుగులు దిద్దే విధానాలు అన్నీ అవగాహన చేసుకుని, ప్రసంశించే స్థాయికి చేరుకున్నాడు,
ఆర్ట్ మార్కెట్ పట్ల తన అభిరుచిని మరింత పెంపొందించుకునేందుకు, అతను ఎన్నో ఆర్ట్ పత్రికలను, పుస్తకాలను చదవసాగాడు. పత్రికలలో వచ్చే ఆర్ట్ కాలమ్స్, విమర్శకుల వ్యాఖ్యలు అన్నీ చదివేవాడు. అతని మొబైల్ లో ఉన్న క్యాలెండరులో లండన్ చుట్టుప్రక్కల జరగబోయే అనేక ఆర్ట్ ఎక్సిబిషన్ ల రిమైండర్స్ ఉండేవి.
వ్యాపార ప్రయాణాల సమయంలో, ఒక విశిష్టమైన చిత్రకారుడి శైలి, ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా ఉందో తెలుసుకునేందుకు, అతను తనకు నచ్చిన ఆర్టిస్ట్ లకు సంబంధించిన జీవితచరిత్రలు, చిన్న పుస్తకాలు, పత్రాలు వంటివి తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళేవాడు.
ఈ పద్ధతులన్నీ ఒక ఆర్టిస్ట్ కు అతని పనికి ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకునేందుకు అతనికి సహాయపడ్డాయి. క్రమంగా, ఆర్టిస్ట్ చిత్రాలలో వాడే మాధ్యమాలు, అతని ఊహాశక్తిని బట్టీ వారు ఎన్నుకునే నేపధ్యాలను అంచనావేసే విషయంలో, అతను నిపుణుడు అయ్యాడు. అతని ఫేస్బుక్ పోస్ట్ లలో పెయింటింగ్ నేపధ్యాలకు సంబంధించినవి ఉండసాగాయి.
ఒకరోజు అతను తన వాల్ పై ‘పోలో ఆర్ట్’ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసాడు. అందులో పోలో ఆడుతున్న వ్యక్తుల బొమ్మలు చిత్రించిన ఫోటోలు ఉన్నాయి.
క్రీడలకు సంబంధించిన వర్గంగా, లేక క్రీడలు ఆడుతున్నవారి పోర్ట్రైట్ లకు సంబంధించిన కళగా పోలో ఆర్ట్ ప్రాచీన కాలంనుంచి గుర్తింపును పొందింది. రాజ్పుత్ లు క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, మునుపటి కాలంలో ఈ కళలో నిపుణులైన భారతీయ చిత్రకారులు కూడా ఉన్నారు.
ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చెయ్యడం పూర్తవగానే, చాట్ విండో స్నిగ్ధ మెసేజ్ తో బజ్ మనడం చూసాడు.
“మీరు బ్యాంకింగ్ కంటే, పెయింటింగ్ లో అధిక ఆసక్తిని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నారు?” స్నిగ్ధ అతన్ని అడిగింది.
ఋషి అప్పుడే అప్లోడ్ చేసిన పోలో ఆర్ట్ కలెక్షన్ ను ఆమె చూడసాగింది. అతని వాల్ పోస్ట్ లు అన్నీ, ఆర్ట్ ప్రపంచానికి సంబంధించిన బోలెడంత సమాచారంతో నిండి ఉండడం ఆమె గమనించింది.
“ఒకవిధంగా మీరన్నది నిజమే ! నేను మొదట బ్యాంకర్ ని. కాని, క్రమంగా ఆర్ట్ నాకొక వ్యాపకంగా మారుతున్నట్లు తోస్తోంది “ బదులిచ్చాడు ఋషి.
అతని తాజా అభిరుచిని కొనసాగిస్తూనే, ఋషి ఆసక్తి మరొక కళాఖండం గురించి కూడా మరింత తెలుసుకోవాలన్న దిశగా సాగింది – స్నిగ్ధ వైపుకు.
ఆమె అందంతోబాటు, వృత్తిలో ఆమె చూపించే చురుకుదనం కూడా అతనికి బాగా నచ్చింది. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను, సమతుల్యంగా, గౌరవంగా, నైపుణ్యంతో నడిపే కొత్తతరం స్త్రీలంటే అతనికి ప్రత్యేకమైన ఆసక్తి. ప్రస్తుతం, అతని లిస్టు లో ఉన్న అటువంటి స్త్రీ స్నిగ్ధ మాత్రమే.
“అయితే, మీరు ఇప్పటివరకు చూసినవాటిలో ఉత్తమమైన కళాఖండం ఏది ?” స్నిగ్ధ ప్రశ్నలు కొనసాగించింది.
తన జీవితంలో, తనవంటి అభిరుచినే కలిగిన ఈ కొత్త వ్యక్తి గురించి ఆమె మరింత తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. సంబంధాలను నిలబెట్టడంలో అభిరుచులు కలిసిన సాంఘిక సంబంధాలు ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. ఈ అభిరుచితో కూడిన ఆసక్తిలో నిజాయితీ ఉంటే, ఈ సంబంధాలు చాలా చక్కగా కొనసాగుతాయి.
“నన్నొక ఆర్ట్ నిపుణుడిగా భావించకండి. ఆర్ట్ ప్రపంచంలో ఇంకా నాకు పరిణితి లేదు. మీరు పూర్తి చేసిన ఫార్మల్ కోర్స్ లాగా కాకుండా, నా ఆసక్తి నా వృత్తిరీత్యా జనించినది. నేను నాకిష్టమైన కళాఖండం గురించి చెబితే మీరు నవ్వచ్చు,” అంటూ, ఫేస్బుక్ లో ఈ మెసేజ్ టైపు చేస్తూ నవ్వాడు ఋషి.
“పర్లేదు, మీ అధ్యయనంలో మీకు నచ్చిన ఆ పెయింటింగ్ గురించి చెప్పండి ?”
ఋషికి ఆర్ట్ లో ఉన్న ఆసక్తిని బట్టీ, అతని మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవాలని స్నిగ్ధ అనుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఇదే విషయంలో పనిచేస్తోంది – ఒక వ్యక్తికి రంగుల్లో ఉన్న ఆసక్తిని బట్టి, నచ్చిన చిత్రాలను బట్టి, అతని స్వభావాన్ని అంచనా వెయ్యటం.
“నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. కాని ఇప్పటివరకు, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ న్యూడ్ పోస్ స్కెచ్ కంటే అందమైన స్కెచ్ ను నేను చూడలేదు. ఆ సీన్ చాలా ప్రభావవంతమైనది, ఆ స్కెచ్ మనోహరమైనది.” అంటూ ఋషి తనకు ఇష్టమైన ఆర్ట్ పోస్ గురించి చెప్పాడు.
“అది చాలా చక్కటి ఛాయస్, నాక్కూడా ఆ స్కెచ్ చాలా ఇష్టం. టైటానిక్ చిత్రం తియ్యడం మొదలుపెట్టగానే కేట్, లియోనార్డో డికప్రియో పై తీసిన మొదటి షాట్ అది. ఇంకోసంగతి తెలుసా ? ఆ స్కెచ్ వేసింది, ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఆ సినిమాలో స్కెచ్ వేస్తున్నట్లుగా చూపిన చేతులు దర్శకుడివి, లియోనార్డో వి . అంతేకాదు, ఈ సినిమాలో డికాప్రియో కేట్ కు చూపిన స్కెచ్ బుక్ లో ఉన్న స్కెచెస్ అన్నీ కామెరాన్ వేసినవే,’ వెంటనే బదులిస్తూ ఋషికి చెప్పింది స్నిగ్ధ.
“నిజంగా? నాకు ఇవన్నీ తెలీదు. కాని మామూలు ప్రేక్షకుడిగా, కేట్, డికేప్రియో నటన చూసి, నేను విస్మయం చెందాను. కేట్ రోజ్ అనే పాత్రకు బలం చేకూర్చినట్టే, లియోనార్డో కూడా జాక్ డాసన్ పాత్రకు జీవం పోసాడు. నిజానికి, ఈ సినిమా ఒక పురుషుడు నిజాయితీగా ఒక స్త్రీకి తన సాన్నిధ్యంలో ప్రేమను అనుభవింపచేసేందుకు ఒక కొలమానంలా నేను భావిస్తాను.”
స్నిగ్ధ ఇప్పుడు చర్చలో పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ ఆమెకు ఆసక్తి కలిగిన ఆర్ట్, ప్రేమ రెండూ కలిసి కేంద్రీకరించబడి ఉన్నాయి.
“ అయ్యుండచ్చు. డికేప్రియో ఒక లవర్ బాయ్ గా అద్భుతంగా నటించాడు. అతని చక్కటి, తీరైన ముఖం అప్పట్లో ఎంతోమంది అమ్మాయిల హృదయాన్ని గెల్చుకుంది. ఇది బహుశా, అంతా అనేటట్లు, డికేప్రియో తన కడుపులో ఉండగా ఆమె తల్లి, ఇటలీ లోని మ్యూజియం లో ఉన్న లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ నే చూస్తూ ఉండడం వల్ల కావచ్చు,” చెప్పింది స్నిగ్ధ.
ఆమె మళ్ళీ ఇలా కొనసాగించింది, “ కాని మీ యువకులకి, ఒక స్త్రీ కేవలం ప్రేమను మాత్రమే అనుభూతి చెందాలని అనుకోదనీ, మీరు గుర్తించని ఎన్నో విషయాలను వినాలనుకుంటుందని, మీకు ఎప్పటికీ అర్ధం కాదు. ఉదాహరణకు, చిత్రం మొత్తంలో డికేప్రియో కేట్ కు ‘ఐ లవ్ యు’ చెప్పేది కేవలం ఒక్కసారే ! ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అతను ఆమెను గాడంగా ప్రేమించి ఉండవచ్చు, కాని తరచుగా ఈ విషయాన్ని ఆమెకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.” అంది స్నిగ్ధ.
ఋషి నవ్వి, ఇలా అన్నాడు,” అలాగే, నేను ఈ సంగతి గుర్తుంచుకుంటాను. కాని, ఒక యువకుడికి ఆర్ట్ లో, పోర్ట్రైట్ లలో ఆసక్తి ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఉంటే, ఈ సమస్య రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఆమె ఏదైనా  పోర్ట్రైట్ ను చూడగానే, అతను మెల్లిగా ‘కలర్ఫుల్ ‘ అంటే సరిపోతుంది. అలా అనేటప్పుడు పెదాల కదలిక ‘ఐ లవ్ యు’ తో సరిపోతుంది. ఆ రకంగా ఆమె, అతని విషయంలో ఆనందంగా ఉండచ్చు.”
“హ హ హ” స్నిగ్ధ బిగ్గరగా నవ్వసాగింది. ఆమె నెమ్మదిగా “కలర్ఫుల్” అనేందుకు ప్రయత్నిస్తూ, అలా అనేటప్పుడు లిప్ మూమెంట్ ‘ఐ లవ్ యు’ తో సరిపోవడాన్ని గమనించింది.
“అయితే, మీకొక గర్ల్ ఫ్రెండ్ ఉందా ?” ఆమె ఋషిని అడిగింది.
చివరికి, ఆమె తన ఆసక్తి వైపే మళ్ళుతున్నట్లుగా ఋషికి అనిపించింది. “లేదు, ఇంతవరకూ లేదు. ఈ రోజుల్లో అంతా చాలా బిజీ గా కనిపిస్తున్నారు.” బదులిచ్చాడు ఋషి.
ఋషి అస్పష్టంగా తన భావనలను స్నిగ్ధకు తెలిపి, ఆమె చొరవ తీసుకోవాలని ఆశించసాగాడు. అతను ఆశించిన దానికంటే, స్నిగ్ధ మరింత సూటిగా ఉంది. ఆమె వెంటనే ఉడికిస్తున్నట్లుగా ఇలా అంది, “ సరే, ఇప్పటినుంచి ఒక నెల వరకూ నేను బిజీ గా లేను. నాకొక కొత్త ఉద్యోగం దొరికింది, ప్రస్తుతం ఒక నెల నోటీసు గడువులో ఉన్నాను. కాబట్టి – ఒక నెల నేను ఖాళీయే.”
ఋషి వెంటనే ఇలా అడిగాడు,” మీకు కొత్త ఉద్యోగం ఎక్కడ వచ్చింది ?”
స్నిగ్ధ సందిగ్ధంలో పడింది, ఆమె ఋషి నుంచి ఆశించిన స్పందన ఇది కాదు. అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నానేమో అని ఆమె కాస్త బాధపడింది.
ఆమె బలహీనంగా, “ నేను పోర్ట్లాండ్ స్ట్రీట్ లో ఉన్న మహేంద్ర దసపల్లాకు చెందిన నిర్వాణ ప్లస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను. మహేంద్ర కొత్త అసైన్మెంట్ – ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీలో నేను ప్రధాన పాత్ర పోషిస్తాను. ఆర్ట్ మ్యూజియం కోసం కొనదగ్గ పెయింటింగ్స్ ఎంపికలో నేను అతనికి సహాయపడబోతున్నాను. ఇది చాలా ఆసక్తికరమైన పని. విశేషించి ఎందుకంటే, ఇది నన్ను ఇండియా కు కలుపుతుంది, మన రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ లో నేనూ పాలుపంచుకునేలా చేస్తుంది.”
చాలాకాలం నుంచి, వ్యాపార నిమిత్తం మహేంద్ర దసపల్లా ను కలవాలని అతను ప్రయత్నిస్తూ ఉండడంతో ఆ పేరు వినగానే ఋషి అత్యుత్సాహం చూపించాడు. అతనితో స్నిగ్ధకు ఉన్న అనుబంధం తనకు మరింత ఉపయోగిస్తుంది, అనుకున్నాడు ఒక క్షణం. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన జీవితాలు కలిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అతనికి ఇప్పుడు అలా కలిపే అవకాశం వచ్చింది.
“ఓహ్! ఈ విషయం వినడం చాలా ఆనందంగా ఉంది. హార్దిక అభినందనలు. అటువంటి చారిత్రాత్మకమైన వ్యక్తులతో పనిచెయ్యడం చాలా మంచిది. అటువంటి అనుబంధం ఒక లీడర్ ఎలా పనిచేస్తాడో గమనించే అవకాశం ఇస్తుంది. మహేంద్ర తన సాఫ్ట్వేర్ కంపెనీ ని ఏర్పరచిన విధానం, వ్యాపార దిగ్గజంగా ఎదిగిన వైనం, ఎప్పుడూ ఒక స్పూర్తిదాయకమైన అంశంగా నాకు అనిపిస్తుంది. అతని సంస్థకు ఎంపిక అవ్వటం నిజంగా గర్వించదగ్గ అంశం.” ఋషి మహేంద్ర గురించి తనకు తెలిసిన విషయాలను ఆమెతో పంచుకున్నాడు.
మహేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి, ఆ రోజుల్లో CA విద్యార్ధులు చాలామంది నిర్వాణా ప్లస్ లో ఉద్యోగం గురించి కలలు కంటూ ఉండేవారు. నిజానికి, మహేంద్ర ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే. ఆంధ్రా లో ఉన్న ప్రతి కుటుంబం నుంచి, ఒక NRI కొడుకు విదేశాల్లో , నిర్వాణా ప్లస్ లో పనిచేస్తున్నందుకు అతనికి కృతఙ్ఞతలు చెప్పాలి.
ఒక సమయంలో, ఏ ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి జీవితంలోనైనా మూడు దశలు ఉండేవి – CA చదవటం, హైదరాబాద్ లో మొదటి రెండేళ్ళు గడిపేందుకు నిర్వాణ ప్లస్ లో ఉద్యోగం సంపాదించడం, చివరికి ఆ కంపెనీ ప్రాజెక్ట్ ల ద్వారా సంపాదించుకున్న నెట్వర్క్ లను ఉపయోగించి, US గ్రీన్ కార్డు హోల్డర్ గా మారి, మిగతా జీవితమంతా హాయిగా గడపడం.
ఋషి స్నిగ్ధతో మరికొంతసేపు చాటింగ్ చేసి, సైన్ అవుట్ చేసేముందు ఇలా అన్నాడు, “మంచి సంభాషణ. విష్ యు అల్ ది బెస్ట్. మీరు ఒక నెల ఖాళీగా ఉన్నారని, నేను గమనించలేదని ఆలోచించకండి. మీకు బోర్ కొట్టినప్పుడల్లా, నాకు మెసేజ్ ఇవ్వండి. నా నెంబర్ ఫేస్బుక్ లో అప్డేట్ చేసి ఉంది. బై,”అంటూ స్నిగ్ధ ఎలా స్పందిస్తుందో చూడకుండానే వెంటనే లాగ్ అవుట్ చేసాడు, అతనికి స్నిగ్ధ చొరవ తీసుకోవాలని కోరిక. ఇప్పటివరకూ ఆమె అవకాశాలని అందుకుంటూ పోతోంది. ఈ చివరి దాన్ని కూడా తీసుకుంటుందేమో అతనికి వేచి చూడాలని అనిపించింది.
ఋషికి తనలో ఏమి నచ్చిందో ఆమెకు తెలీలేదు. ఎక్కడో ఆమె ఇటువంటి భావన గురించి చదివింది – ఏ కారణం లేకుండా ఒకరిని ఇష్టపడం, వారి సాన్నిహిత్యంలో ఆనందంగా ఉండడాన్ని – ప్రేమ అంటారని.
ఆమె చదివింది నమ్మాలంటే, ఆమె ఇంకా దీని గురించి మరింత అనుభూతి చెందాల్సి ఉంది, అనుకుంటూ ఆమె నిద్రలోకి జారుకుంది.
*******
 (సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top