ప్రకృతే ప్రేరణ - అచ్చంగా తెలుగు

ప్రకృతే ప్రేరణ

Share This

ప్రకృతే ప్రేరణ

- జి. నారాయణ రావు 


నిజానికి దైవం ప్రకృతిలో ఎన్నో రహస్యాలను గుప్తంగా నిక్షిప్తం చేసారు. భగవంతుడు బుద్ధిజీవి అయిన మనిషిని సృష్టించి, అతని చుట్టూ అడుగడుగునా ఎన్నో విషయాలను బోధించే గురువులను ఏర్పరిచాడు. గురువులే ప్రాణులు. అదెలాగ ? అంటారా...
చిట్టి చీమను చూసి కష్టించి పనిచేయడం ఎలాగో నేర్చుకోవచ్చు..!
పడిలేచే కడలి కెరటాలను చూసి పడినా కూడా తిరిగి ప్రవహిస్తూ పరుగులు తీయడమెలాగో గ్రహించవచ్చు...!
లోకమంతా పురుగని విదిలించినా, తన గూడులో తనే తపస్సు చేసి, తపించి, లోకాన్ని తనవెంట పరుగులు పెట్టించడం ఎలాగో సీతాకోకచిలుకను చూసి నేర్చుకోవచ్చు.. !
చిన్న చిన్న పువ్వులనుంచి తేనె చుక్కలను తెచ్చి, పరిశ్రమతో ఒకచోటికి చేర్చే తేనెటీగలను చూసి, కృషికి ఉన్న గొప్పదనం తెలుసుకోవచ్చు... !
ఎన్ని సార్లు భంగపడ్డా, తిరిగి తన గూడును అల్లుకునేందుకు యెంత పట్టుదల కావాలో, సాలీడు ను చూసి నేర్చుకోవచ్చు... !
విరిసే కుసుమాన్ని చూసి వాడిపోతామని తెలిసినా, పరిమళాలను వెదజల్లుతూ పరులకోసం పాటుపడటం ఎలాగో వివరించవచ్చు... !
కోయిలను చూసి, బాహ్యరూపం ఎలా ఉన్నా, మధురంగా పలికితే, విలువ పొందగలమని చెప్పవచ్చు... !
చిన్న చెట్టుని చూసి, తాను ఎండలో ఉంటూ నలుగురికి నీడనిస్తూ నిగర్వంగా నిలబడటం ఎలాగో చెప్పవచ్చు ...! వీచే గాలిని చూసి నిస్వార్ధ సేవకు నిదర్శనం అంటే ఏమిటో విలువ తెలుసుకోవచ్చు ...!
పండువెన్నెలను పంచే చందమామను చూసి పరులకు ఆహ్లాదం కలిగించడంలోని పరమార్దం ఏమిటో విలువ కట్టవచ్చు ...! అస్తమించే సూర్యుడిని చూసి ఆశే శ్వాసగా రేపటికోసం ఎదురుచూస్తూ జీవించడమెలాగో అర్ధం చేసుకోవచ్చు....,,!!
కొవ్వొత్తిని చూసి త్యాగంలో ఉన్న గొప్పతనమెంతో అలవర్చుకోవచ్చు....!
చిరుతను చూసి, లక్ష్యంపై గురి పెట్టి, వేగంగా పరిగెత్తడం ఎలాగో తెలుసుకోవచ్చు... !
ఒక్కసారి ఆలోచించండి... అల్ప ప్రాణులే ఇన్ని అద్భుతాల్ని చెయ్యగలిగినప్పుడు, అత్యుత్తమమైన మానవ జన్మ పొందిన మనం ఏమీ సాధించలేమా ? ఈ ప్రకృతిలో మనమూ ఒక అద్భుతం కాలేమా ?
“ఒక ఆలోచనను (పనిని) చేపట్టండి. దానినే మీ జీవితంగా మలచుకోండి. దానినే తలపోయండి. దాని గురించే కలలు కనండి. దానిమీదే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం అదే ఆలోచనతో నిండిపోనివ్వండి.  దాన్నితప్ప మిగిలిన అన్ని ఆలోచనల్ని విడిచిపెట్టండి. ఇదే దారిని అవలంబిస్తూ, గొప్పగొప్ప  సత్పురుషులు రూపొందారు. విజయానికి ఇదే దారి.” అన్న వివేకానందుడి సూక్తిని అనుసరిస్తూ, విజయ పధానికి ఇప్పుడే తొలి అడుగు వేద్దాము.

No comments:

Post a Comment

Pages