కనిపించుటలేదు! కాస్తంత ఆచూకీచెప్పరూ?
- ఆదూరి హైమావతి

ఐకమత్యం ఐపులేకుండా పోయింది 
కనికరం కానరావట్లేదు , 
కృషికళ్ళముందునుంచీ తప్పుకుంది, 
చిరునవ్వు మరెక్కడో చిక్కుక్కుంది,
 జాలి జాడా తెలీడంలేదు! 
దయాస్వభావం ఎక్కడో దాక్కుంది!!


దానగుణం దోబూచులాడుతోంది,
బోధన బాధతోపత్తాలేకుండాపోయింది , 
నిరాడంబరత నిర్గమించింది , 
ప్రఙ్ఞ పరాయిప్రాంతం వెళ్ళిపోయింది! 
బోధన బాధకులోనై వెళ్ళిపోయింది, 
మంచితనం మసకబారింది! 
వక్తృత్వము వలసబోయింది! 

విఙ్ఞానంవివశమైంది,
శ్రమ విశ్రమించను చాలాదూరం వెళ్ళింది, 
సంగీతము సంగ్రహించబడింది, 
సేవాభావం స్థలం మార్చుకున్నట్లుంది, 
సామర్ధ్యం సాగెళ్ళిపోయింది,
ఈ సకల సద్గుణాలఖని స్వర్గధామం చేరగా
అనాయాసేన మరణంతో 
సునాయాసంగా పయనమైపోగా,
మంచిగుణాలన్నీ మాయమైపోయాయి ,
కాస్తంత వెతికిపెట్టరూ !


ఏగుప్తశాఖైనా గోప్యంగా తెచ్చిపెట్టరూ?
భారతావని భయపడుతోంది!
బాధాతప్తహృదయంతో విలపిస్తోంది.
ఏమానవత్వమున్న సేవకుడైనాతిరిగి దేశానికి అందించరూ!
(కీర్తిశేషులు భారతావని ముద్దుబిడ్డడు , ప్రజలంతా ప్రేమించిన మనీషి కలాంగారికి అంకితం.)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top