కాపలా

బి.ఎన్.వి.పార్ధసారధి 


అది సబ్ రిజిస్త్రార్ కార్యాలయం. ఉదయంనుంచి  సాయంత్రం దాకా లావా దేవీల రిజిస్ట్రేషన్లు జరుగుతూనే వుంటాయి. కార్యాలయం లోపల సిబ్బంది ఎవ్వరూ పైసా పుచ్చుకోరు. అలాగని ఎవరైనా ఈ సిబ్బందిని చూసి వీరంతా నిజాయితీ పరులని అనుకొంటే ప(త)ప్పు లో కాలేసినట్టే. రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూతా చాలానే  డాక్యుమెంట్స్ రైటర్స్ దుకాణాలు వున్నాయి. సిబ్బంది కి ముడుపులన్నీ ఈ డాక్యుమెంట్స్ రైటర్స్ ద్వారా అందుతాయి. సిబ్బంది లోని బంట్రోతునుంచి సబ్ రిజిస్త్రార్ వరకు అణా పైసలతో సహా ఎవరికి అందవలసినది వాళ్లకి ప్రతీ రోజూ సాయంత్రానికి డాక్యుమెంట్ రైటర్స్ ముట్ట చెబుతారు.
సబ్ రిజిస్త్రార్ కార్యాలయం లో సిబ్బందితో పాటు ఓ కుక్క కూడా వుంది. సిబ్బంది లో ఎవరు వచ్చినా రాక పోయినా కుక్క మాత్రం రోజూ తప్పకుండా వస్తుంది. కుక్క రెండు సందర్భాలలో రోజూ అరుస్తుంది. ఒకటి – “పైసలు ముట్టినై మీరు పని కానివ్వండి” అని డాక్యుమెంట్స్ రైటర్స్ సిబ్బంది తో చెప్పినప్పుడు. రెండు- సాయంత్రం ముడుపుల వాటాల పంపకం జరిగినప్పుడు. విచిత్రం ఏమిటి అంటే కార్యాలయం  సిబ్బంది ఎప్పుడైనా కుక్క తినటానికి బిస్కట్లు వగైరా ఏమిచ్చినా సరే ససేమిరా వాటిని కుక్క ముట్టుకోదు. అంతకన్నా మరో విచిత్రం ఏమిటంటే డాక్యుమెంట్ రైటర్స్ దుకాణాలలో మనుషులు ఏమిచ్చినా సరే కిమ్మనకుండా వాటిని నాకి నాకి మరీ తింటుంది ఆ కుక్క. బహుశా కార్యాలయం సిబ్బంది  ప్రభుత్వం నుంచి  జీతం తీసుకుంటున్నా లంచం లేనిదే పనిచేయ్యకపోవటం,  డాక్యుమెంట్ రైటర్స్ మధ్య వర్తులుగా జనాలకి వారి పనులు లౌక్యంగా చేయించి పెట్టడం , కుక్క విచిత్ర ప్రవర్తనకి ఒక కారణం కావచ్చు. లేదా కుక్క దృష్టిలో సిబ్బంది కన్నా డాక్యుమెంట్ రైటర్స్ తక్కువ లంచగొండిదారులుగా అనిపించి వుండవచ్చు. కారణం ఏమిటి అన్నది కుక్కకే తెలియాలి. సాధారణం గా కుక్క రోజంతా కార్యాలయం లోపల , రాత్రి కార్యాలయం బయట గడుపుతుంది. కొన్ని సార్లు బంట్రోతు సాయంత్రాలు కార్యాలయం తాళాలు వేసేటప్పుడు కుక్క లోపల ఏ మూలో కునుకు తీస్తూ పడుకుని వుండటం , అది గమనించని బంట్రోతు మర్నాడు ఉదయం తాళాలు తీసేటప్పుడు కుక్క లోపలే వున్నాదన్న విషయం గ్రహించటం అప్పుడప్పుడూ జరుగుతూ వుంటుంది.
శ్రీనివాస్, లక్ష్మి  కొత్త దంపతులు. వారికి నాలుగు నెలలక్రితమే వివాహం అయింది. మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఈ నూతన దంపతులు , వారితోపాటు ముగ్గురు సాక్ష్యులు సబ్ రిజిస్త్రార్  కార్యాలయం కి వచ్చారు. తిన్నగా వెళ్లి డాక్యుమెంట్స్ రైటర్ దుకాణం లో మ్యారేజీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కాగితం పది రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. అంతకు ముందు రోజే  నెట్ లో పూర్తి వివరాలు సేకరించటం వల్ల దరఖాస్తు కాగితం తో పాటు జత పరచ వలసిన పత్రాలు , ఫోటోలు, పెళ్లి పత్రిక , తదితర వివరాలు అన్నీ సంపూర్ణంగా కార్యాలయంలో ఇచ్చారు. డాక్యుమెంట్స్ రైటర్స్ ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా వచ్చిన వీళ్ళని చూసి గుమాస్తా వెంటనే గ్రహించాడు – వీళ్ళు మామూలుగా ఇవ్వాల్సిన ముడుపులు ఇవ్వలేదని. పత్రాలు అన్నీ సవ్యంగా వున్నాయి. ఎక్కడా లొసుగు లేదు. దరఖాస్తు పత్రాలని ఆఫీసర్ కి పంపించాడు. తమ కోడ్ లాంగ్వేజ్ లో అంద వలసిన ముడుపు అందలేదని ఆఫీసర్ కి తెలియచేసాడు గుమస్తా . ఆఫీసర్ దరఖాస్తు పత్రాలని పరికించి చూసాడు. అతనికీ ఎక్కడా ఏ తేడా కనిపించలేదు. మనసులో చిరునవ్వు నవ్వి “ శ్రీనివాస్ గారు ఎవరూ ? “ అని ప్రశ్నించాడు. శ్రీనివాస్ తోపాటు అతని భార్య లక్ష్మి కూడా ఆఫీసర్ దగ్గరకి వెళ్ళింది. ఆఫీసర్ సౌమ్యంగానే “ అన్నీ సవ్యంగానే వున్నాయి కానీ దరఖాస్తు పత్రం లో భార్యాభర్తల వివరాలు ఎవరికి వారు విడి విడిగా స్వ దస్తూరితో రాయాలి. కానీ మీరు దరఖాస్తు పత్రం పూర్తిగా ఒకే దస్తూరి తో నింపారు. మరో దరఖాస్తు పత్రం తీసుకొని మీ వివరాలు ఎవరికి  వారు విడి విడిగా భర్తీ చేయండి .” అన్నాడు చిరునవ్వుతో . నిరుత్సాహంగా మరో దరఖాస్తు పత్రం కోసం వెడుతున్న లక్ష్మీ శ్రీనివాస్ దంపతులని పిలిచి గుమాస్తా “ మీ కాగితాలు అన్నీ సవ్యం గానే వున్నాయి. ఈ ఆఫీసర్ ఇలాగే ఏదో ఒక వంక పెడతాడు. మీ పని త్వరగా కావాలంటే ఇదుగో ఈ డాక్యుమెంట్ రైటర్ ని పట్టు కొండి. మీ పని త్వరగా అవుతుంది. లేదా మీరు ఇబ్బంది పడతారు “ అన్నాడు తన పక్కనే వున్న డాక్యుమెంట్ రైటర్ ని చూపిస్తూ .  ఆ రోజు శనివారం. పెళ్లి నాటికి శ్రీనివాస్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మి ఉద్యోగం  హైదరాబాద్ లో. శ్రీనివాస్ హైదరాబాద్ రావటానికి లేదా లక్ష్మి బెంగుళూరు వెళ్ళ టానికి తమ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఏ సంగతీ తేలలేదు. ఈ నేపధ్యంలో శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ కి శనివారం ఉదయం వచ్చాడు. కాల కృత్యాలు తీర్చుకొని తిన్నగా భార్య లక్ష్మి , ముగ్గురు సాక్ష్యులతో సబ్ రిజిస్త్రార్ కార్యాలయం కి వచ్చాడు. మరలా ఆదివారం  రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి సోమవారం ఉదయానికి బెంగుళూరు చేరుకోవాలి. అతనికి శలవులు లేవు. వున్న శలవులన్నీ పెళ్లి తర్వాత హనీమూన్ కోసం ఉపయోగించు కున్నాడు. గుమాస్తా మాటలు విని శ్రీనివాస్ కంగారు పడ్డాడు. ఇవాళ ఎట్టి  పరిస్థితిలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పని అయిపోవాలి . లేదా మరోసారి ఈ పని మీద బెంగుళూరు నుంచి రావలసి వుంటుంది.  శ్రీనివాస్ హడావుడిగా గుమాస్తా పక్కన వున్న  డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వెళ్లి అంతా వివరంగా చెప్పాడు. ఎలాగైనా సరే ఇవాళే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పని పూర్తి అవ్వాలని , ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆ డాక్యుమెంట్ రైటర్ ని ప్రాధేయ పడ్డాడు. మాములుగా అయితే మనిషిని బట్టి ఐదు వందలో వెయ్యో పుచ్చుకునే ఈ పనికి రెండు వేలు వరకు శ్రీనివాస్ దగ్గర గుంజవచ్చని గ్రహించాడు డాక్యుమెంట్ రైటర్. చివరికి బేరం పదహేను వందలకి కుదిరింది. బేరం కుదిరిన అరగంటలో ఆఫీసర్, శ్రీనివాస్ వాళ్ళ దరఖాస్తు కాగితాలని స్వీకరించాడు. ఆఫీసర్ దరఖాస్తు కాగితాలని పుచ్చుకుంటున్నప్పుడు  ఎక్కడో వున్న కుక్క అకస్మాత్తుగా వచ్చి మొరిగింది.బంట్రోతు కర్ర తో వచ్చి కుక్కని అదిలించాడు. కొంతసేపటి తరువాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చెంతనే వున్న తన దుకాణం వద్ద శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకుంటూ డాక్యుమెంట్ రైటర్ “ రేపు ఆదివారం శలవు కదా. కాబట్టి సోమవారం ఉదయం నాకు ముందుగా ఫోన్ చేసి రండి. మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పకుండా ఇస్తాను “ అన్నాడు. శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటర్ కి డబ్బులు ఇస్తున్నప్పుడు కుక్క వచ్చి మొరగటం ప్రారంభించింది. డాక్యుమెంట్ రైటర్ కి డబ్బులు పుచ్చుకునే సమయం లో కుక్క మొరగటం  అలవాటు కాబట్టి ఊరుకున్నాడు. అలవాటు లేని శ్రీనివాస్  కుక్క ని అదిలించడానికి  ప్రయత్నం చేసాడు. డాక్యుమెంట్ రైటర్ వెంటనే శ్రీనివాస్ ని వారిస్తూ “ ఈ కుక్క మొరగటం మాకు మామూలే “ అని నవ్వుతూ శ్రీనివాస్ చేతులోంచి డబ్బులు తన చేతులోకి తీసుకున్నాడు. ఇంతలో కార్యాలయం లోంచి బంట్రోతు చేతిలో కర్ర తో వచ్చి కుక్కని అదిలించాడు. కుక్క మొరుగుతూనే డాక్యుమెంట్ రైటర్ దుకాణం నుంచి బయటకి వెళ్ళింది. సోమవారం తన భార్య లక్ష్మి వచ్చి సర్టిఫికేట్ తీసుకుంటుందని డాక్యుమెంట్ రైటర్ కి చెప్పాడు శ్రీనివాస్. సరే నన్నాడు డాక్యుమెంట్ రైటర్.
సోమవారం ఉదయం లక్ష్మి డాక్యుమెంట్ రైటర్ కి ఫోన్ చేసింది. “ నిన్న ఆదివారం రాత్రి కార్యాలయం లో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా కాగితాలు  కాలిపోయాయి. అదృష్ట్టవసాత్తు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ శనివారం సాయంత్రం నేను తీసి పెట్టుకోవటం వల్ల అది నాదగ్గర పదిలం గా వుంది. మీరు వచ్చి మీ సర్టిఫికేట్ ని తీసుకోండి “ అన్నాడు డాక్యుమెంట్ రైటర్ ఫోన్ లో. ఆఫీసు కి ఆలస్యంగా వస్తానని అనుమతి తీసుకుని డాక్యుమెంట్ రైటర్ దుకాణానికి వచ్చి తమ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని తీసుకుంది లక్ష్మి. నిప్పుకి కాలిన కాగితాలు ఒక గుట్టగా కార్యాలయం బయట పడి వున్నాయి. ఆ పక్కనే కుక్క శవం కూడా వుంది. “ శనివారం సాయంత్రం నేను కార్యాలయం తలుపులు తాళాలు వేసేటప్పుడు ఖచ్చితంగా కుక్క లోపల లేదు.” అన్నాడు బంట్రోతు. “ మరి ఆదివారం రాత్రి కుక్క అరుపులు వినే కదా ఇరుగుపొరుగు మేలుకుని చూస్తే కార్యాలయం లోపల మంటలు, సెగలు కనిపించాయి.” అన్నారు కొందరు డాక్యుమెంట్ రైటర్స్. “ శనివారం సాయంత్రం కుక్క కార్యాలయం లోపలే వుండి  వుంటుంది. బంట్రోతు చూసుకోకుండా తాళాలు వేసివుంటాడు. ఇలా ఇంతకూ ముందు కూడా కొన్ని సార్లు జరిగింది ” అన్నారు కొందరు మేధావులు.
 ఎవరికీ తెలియనిది ఏమిటి అంటే ఆదివారం రాత్రి మంటలు వస్తూన్నప్పుడు కార్యాలయం బయట వున్న కుక్క చూసి మొరగటం మొదలు పెట్టిందని, ఎంతకీ ఎవ్వరూ రాకపోవటంతో తెరిచి వున్న ఒక కిటికీ లోంచి కుక్క లోపలికి  దూకి ఇంకా గట్టిగా మొరగసాగిందని, జనం వచ్చి చూసి అగ్ని మాపక దళం వారికి ఫోన్ చేసి, వారు వచ్చేసరికి కాలిన కొన్ని కాగితాలతో పాటు కుక్క కూడా కాలి మరణించిందని.
 లక్ష్మి తమ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుని డాక్యుమెంట్ రైటర్ దుకాణం  నుంచి వస్తూ , సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట అవినీతి నిరోధక దినం అన్న బానర్ తగిలించి వుండటం గమనించింది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా అవినీతి నిరోధక దినం జరుపుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో లాగా మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో కూడా యధావిధిగా దైనందిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.  పైగా నిన్న ఆదివారం నాడు అగ్ని ప్రమాదం జరిగి కాగితాలు చాలామటుకు దగ్ధం అవటం మూలాన , ఉదయాన్నే కార్యాలయం అంతా శుభ్రంగా కడిగారు. ముగ్గులు మాత్రం పెట్ట లేదు ! మనసులో నవ్వుకుని తమ పని సజావుగా జరిగినందుకు దేముడికి మనస్సులోనే  దణ్ణం పెట్టుకుని తన ఆఫీసుకి వెళ్ళింది లక్ష్మి.
పేరుకి అవినీతి నిరోధక దినం అయినా ఆరోజు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో అంతా ఎప్పటిలాగానే జరుగుతోంది. “పైసలు ముట్టినై మీరు పని కానివ్వండి “ అని డాక్యుమెంట్స్ రైటర్స్ సిబ్బంది తో చెప్పినప్పుడు కుక్క అరుపులు వినిపించక పోవటం గమనించి  సిబ్బంది సంతోషపడ్డారు. ముఖ్యంగా బంట్రోతు చాలా సంతోషించాడు తనకి అస్తమానం కుక్కని అదిలించడానికి ఇంక కర్రతో పని లేదని. సాయంత్రం సిబ్బందితో ముడుపుల వాటాల పంపకం జరిగినప్పుడు మాత్రం డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా ఇంకమీదట కుక్క మొరగదని గ్రహించి చాలా బాధపడ్డారు.
తాను కాపలా కాసే ఆఫీస్ ను రక్షించడం కోసం ప్రాణాలకు తెగించిన కుక్క క్రమంగా వారి ఆలోచనల నుండి మరుగైపోయింది. కనీసం, ఒక కుక్కకున్న విచక్షణా జ్ఞానం, విశ్వాసం మనిషికి ఎప్పుడు అలవడతాయో !
***********

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top