శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారితో ముఖాముఖి 

- భావరాజు పద్మిని 


నమస్కారం !
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు 21 వ శతాబ్దపు వాగ్గేయకారులలో ఒకరు. ఇప్పటివరకు 800లకు పైచిలుకు అన్నమయ్య కీర్తనలు స్వరపరిచారు. 400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400 పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012 లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా శ్రీ కామాక్షి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందారు. అడిగిందే తడవుగా ఇవాళ ఆయన మనతో ముచ్చటించేందుకు సమ్మతించడం మన అదృష్టం.
నమస్కారం, బాలకృష్ణప్రసాద్ గారు.
నమస్తే అండి.
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం  గురించిన సంగతులు చెబుతారా ?
పుట్టింది రాజమండ్రి. 3 ఏళ్ళ వరకే అక్కడ పెరిగాను కాబట్టి, లీలగా కొన్ని చిన్న జ్ఞాపకాలు ఉన్నాయి. తర్వాత సికింద్రాబాద్ వచ్చేసాము. తర్వాత నాకు 28 ఏళ్ళ వయసు వచ్చేవరకు 25 ఏళ్ళు అక్కడే పెరిగాను. స్కూల్ ఫైనల్ వరకే అక్కడ చదువుకున్నాను. తర్వాత అన్నమాచార్య స్కాలర్షిప్ ట్రైనింగ్ కని, టి.టి.డి ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి, గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద శాస్త్రీయ సంగీతం, అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడానికి 1976 లో అంటే, నా 28ఏళ్ళ వయసులో తిరుపతికి వచ్చాను. ఇప్పటికి తిరుపతికి వచ్చి, 39 ఏళ్ళు అవుతోంది.
బాల్యం అంతా ఆటపాటలతో అందరిలానే గడిచింది. బాగా పాడుతూ ఉండేవాడిని. నా పాటంటే అందరికీ ఆకర్షణ. నన్ను బాగా అభిమానంగా, ప్రేమగా  చూసుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరడిగినా, అడిగిందే తడవుగా పాడటమే కాక, అడక్కపోయినా పాడడమే నా స్పెషాలిటీ. అలా నోట పాట ఎప్పుడూ ఉండేది. రోజూ పాడుతూ ఉండేవాడిని.
అమ్మ కృష్ణవేణి, నాన్నాగారు గరిమెళ్ళ నరసింహారావు గారు. మా ఇంట్లో మా అమ్మకి 5 గురు చెల్లెళ్ళు, మా అమ్మ తర్వాత ఉన్న పెద్దపిన్ని- ఈవిడని కూడా మా నాన్నగారే చేసుకున్నారు, వీళ్ళంతా చిన్నతనంలో మా ఇంట్లోనే ఉండేవారు, పాడుతూ ఉండేవారు. సుప్రసిద్ధ సినీగాయని ఎస్.జానకి మా అమ్మకి మూడో చెల్లి. కాబట్టి, ఇంట్లో ఎప్పుడూ పాట మ్రోగుతూనే ఉండేది.
మా అమ్మ, వాళ్ళ పెద్దచెల్లెలు వరలక్ష్మి అని, ఆవిడ వయోలిన్ వాయించేవారు. నాన్నగారు హార్మొనీ లో సిద్ధహస్తులు. తర్వాత వయోలిన్, మృదంగం కూడా నేర్చుకున్నారు. వీళ్ళందరూ సంగీత పాఠాలు చెబుతూ ఉండేవారు. ఇంటికి ఎప్పుడు చూసినా, పొద్దున్నా, సాయంత్రం చాలామంది పిల్లలు వచ్చి నేర్చుకునేవారు. అట్లా, నా చెవిలో సంగీతం పడుతూ ఉండేది, నేను పాడుతూ ఉండేవాడిని. వినికిడి మీద వచ్చిన సంగీతం ఎక్కువ చిన్నతనంలో. ఇంట్లో సినిమా పాటలు, లైట్ మ్యూజిక్ కూడా బాగా పాడేవాడిని. సినిమా పాటలు అంతా పాడేవారు, మా నాన్నగారు తప్ప.
సంగీతంపట్ల మీకు అభిరుచి మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా ? అన్నమయ్య పాటలు కూడా పాడుతూ ఉండేవారా ?
సహజంగా వచ్చేసింది అది. చిన్నప్పుడు నాకు అన్నమయ్య ఎవరో కూడా తెలీదు. పాటలు ఏవో ఒకటి రెండు పాడాను కాని, అవి అన్నమయ్య వని తెలీదు. అసలు తిరుపతి అన్నదే తెలీదు, ఇంత ప్రతిష్టతగల దైవం ఇక్కడ ఉన్నారనీ తెలీదు. 25 ఏళ్ళ వయసు వచ్చాకా, హైదరాబాద్ లో నేను లైట్ మ్యూజిక్ పాటలు పాడుతూ ఉండగా సి.వి.సాయిబాబా గారని, ఒక మంచి మ్యూజిక్ కంపోసెర్ ఉండేవారు. చాలా మందిని పోగేసి, స్టేజి షోలు చేసేవారు. అందరికీ ఇళ్ళకు వెళ్లి మరీ పాటలు నేర్పేవారు, అంత ఆసక్తి ఆయనకు. అతనికి పాడేటప్పుడు వేంకటేశ్వర స్వామి మీద పాటలు పాడడం తప్ప, ఇంకేమీ తెలీదు.
76 లో AIR లో భక్తిరంజని రికార్డింగ్ కనీ, అప్పుడు ప్రొడ్యూసర్ గా ఉన్న పాలగుమ్మి విశ్వనాధం గారు, హైదరాబద్ కు నేదునూరి కృష్ణమూర్తి గారిని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. వారి సారధ్యంలో పాడడానికి నన్ను, చిత్తరంజన్ గారిని, లలితా హరిప్రియ గారిని, ఛాయాదేవి గారినీ ఎన్నుకున్నారు. అప్పుడు ఒక 5,6 పాటలు పాడడం జరిగింది.
అంతకుముందు మరో సందర్భంలో 1,2 అన్నమయ్య పాటలు నానోట పలికాయి. కాని, వాటి ఇంపాక్ట్ నా మీద ఏమీ లేదు. నాకు ఏం తెలీదు, ఆకర్షణ అంటూ ఏర్పడ లేదు. కొన్ని పాటలు మెకానికల్ గా పాడేసి, బాగుంది అనుకున్నాను అంతే. 75 లో 2,3 పాటలు ట్యూన్ చేసాను కూడా. కాని అన్నమయ్య గురించి ఏమీ తెలీదు. ఏదో అక్షరాలు బాగున్నాయి, పాట భావం బాగుంది అనిపించి ట్యూన్ చేసాను. 76 లో నేదునూరి గారి నోటివెంట పాట విని,   భక్తిరంజని రికార్డింగ్ చేసినప్పుడు మాత్రం వాటి ప్రభావం నామీద బాగా పడింది. అప్పుడు, టి.టి.డి స్కాలర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తోందని అని ఆయన చెప్పడం, నేను అప్లై చెయ్యడం, సెలెక్ట్ అవ్వడం, ఇక్కడికి రావడం జరిగింది. ఇంక ఆ తర్వాత అన్నమయ్య మీద ఒక వ్యామోహం పెరిగిపోయింది.
అప్పటివరకూ అన్నమయ్య కీర్తనలు అంటే శాస్త్రీయ సంగీత బాణీలలోనే ఉండేవి కదండీ, మీరు పదాలుగా పాడే ఒక కొత్త పద్ధతిని తీసుకుని వచ్చారు. ఇది ఎలా మొదలయ్యింది ?
ఒకరకంగా చెప్పాలంటే నాకంటే ముందు ఈ పని చేసినవారు గురువుగారు నేదునూరి గారు, బాలమురళి గారని చెప్పవచ్చు. ఎందుకంటే నాకంటే ముందు స్వరపరచిన వాళ్ళు వీళ్ళు, నేను వీళ్ళందరి తరువాతి వాడినే కదా ! మొట్టమొదట రాళ్ళపల్లి అనంతశర్మ గారు ప్రయత్నించారు. అదే సమయంలో మంత్రాల జగన్నాధరావు గారు కూడా సెమీ క్లాసికల్ లోనే చేసారు. ఆయన 450 పాటల దాకా స్వరపరిచారు. రాళ్ళపల్లి గారు 108 పాటల దాకా చేసారు. రాళ్ళపల్లి గారైతే, ‘తాళ్ళపాక పాటలు’ అని పుస్తకానికి టైటిల్ పెట్టారు. ఎందుకంటే అన్నమయ్య కుమారుడు, మనవడు రచించిన పాటలు కూడా రాసిన పాటలు మనం అన్నమయ్య పేరుతోనే పాడుకుంటున్నాము. అవన్నీ రాశిలో బాగున్నా, వాసిలో చాలాతక్కువ వాళ్ళవి.
పెద్ద తిరుమలయ్యవి వెయ్యిన్నర దాకా ఉంటాయి కాని, చిన్న తిరుమల్లయ్యవి కొన్ని వందలలోనే ఉంటాయి.
టి.టి.డి స్కాలర్షిప్ ట్రైనింగ్ లో చేరాకా, మీ ప్రస్థానం ఎలా కొనసాగింది ?
అక్కడ స్కాలర్షిప్ స్టూడెంట్ గా చేరాకా, అంతవరకూ నేను నేర్చుకున్న సంగీతం ఒకెత్తు, అంటే, ఇంట్లో పిల్లలకి నేర్పిన గమకాలు లేని సంగీతమే విన్నాను. హై స్టాండర్డ్ మ్యూజిక్ తెలీదు. అయితే 18 -20 ఏళ్ళు వచ్చాకా మా పిన్నమ్మ డిప్లొమా కోసం కాలేజీ కి వెళ్ళటం, నాన్నగారు మ్యూజిక్ కాలేజీకి వెళ్ళడం, వాళ్ళు ఆ కోర్స్ లు అన్నీ వయోలిన్ మీద ప్రాక్టిస్ చేస్తుంటే వినడం వంటివాటితో, క్లాసికాల్ గమకాలూ అవీ పరిచయం అయ్యాయి. కీర్తనలు పాడడం, స్వరం వెయ్యడం వంటివి చేస్తూ ఉండేవాడిని, చిన్న కచేరీలు చేస్తూ ఉండేవాడిని. అయినా అసలైన సంగీతం గురించి పెద్ద పరిజ్ఞానం లేదు. నేదునూరి గారి వద్దకు వచ్చాకా అసలు మంచి సంగీతం అంటే ఏమిటి, ఎలా వినాలి, ఎలా నేర్చుకోవాలి, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, అసలు రాగం అంటే రాగస్వరూపం ఎలా ఇవ్వాలి అన్నవి ఆయన మాటల్లో చెబుతూ ఉండేవారు. రోజూ ఆయన ఉదయం 5 గం. లేచి, సంగీతం పాడుతూ, రెండు, రెండున్నర గంటలు సాధన చేసేవారు, నేను ఆయనతో తంబూర తీసుకుని వాయించేవాడిని. అలా నేను ట్రైనింగ్ లో ఉన్న ఏడాది పాటు, ఆయన పాడుతున్నప్పుడల్లా, తంబుర వాయిస్తూ, ఆయన సాధన చేస్తున్నప్పుడు వింటూ ఉండేవాడిని. తర్వాత నాకు పాఠం చెప్పి, కాలేజీ కి వెళ్ళేవారు. అప్పట్లో ఆయన తిరుపతి కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉండేవారు. సాయంత్రం వచ్చాకా, నాకు మళ్ళీ పాఠం చెప్పేవారు. పగలంతా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. అలా ఆయన దగ్గర వినగా వినగా , ఆయన వద్ద నేర్చుకోగా ఈ కర్ణాటక సంగీత బాణీ మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం, మంచి అవగాహన ఏర్పడ్డాయి.
ఆయన నాకు 30 త్యాగరాజ కీర్తనలు, 5-6 వర్ణాలు నేర్పారు, అంటే, వచ్చినవే, వాటిని ఆయన సంస్కరించారు. కొన్ని కొత్త కీర్తనలు నేర్పారు. ఒక 30 అన్నమయ్య కీర్తనలు నేర్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు రాళ్ళపల్లి గారు చేసిన కీర్తనలు కూడా లలితసంగీత స్థాయిలోనే ఉంటాయి. అలాగే, మంత్రాల జగన్నాధరావు గారి కీర్తనలలో కూడా ఈ ధోరణి జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. అలాగే, వీరి సమకాలీకుల్లో, అంటే 60 ఏళ్ళకు ముందు, బాలమురళి గారు స్వరపరిచారు, ‘నారాయణ తే నమోనమో, ఎక్కడి మనుష్య జన్మంబు’ అటువంటివి, లలిత శాస్త్రీయ సంగీత బాణీల లాగే అనిపిస్తాయి. ఆ తర్వాత నేదునూరి గారు మొదలుపెట్టారు. ఆయన స్వరపరచిన మొదటి పాట ‘ఏమొకో చిగురుటధరమున ‘ అనే పాట కీర్తన అనేందుకు లేదు, పాట అనే అనాలి. ‘నానాటి బ్రతుకు ‘ అనే పాట రేవతి రాగం లోనిది కూడా ఇటువంటిదే. ఆ పాటల స్వరూపం, కంటెంట్, వాటిలో ఉన్న ఫీల్ అలాంటిది కనుక, వాటిని పాట అనే అనాలి, అలాగే చెయ్యాలి. అందులో ఉన్న అన్నమయ్య హృదయం ఆవిష్కరించిన వారికి ఎవరికైనా, ఇందులో లలిత, జానపద సంగీత ధోరణులు ఉన్నాయి కనుక, అలా వెయ్యాలి, అన్న అభిప్రాయానికి రాక తప్పదు. ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ లోనే ప్రార్ధనలుచేసినట్లు, వీరు సంగీత విద్వాంసులు కనుక, ఈ సంకీర్తనలు స్వరపరిచినప్పుడు, వాటిని త్యాగరాజాది వాగ్గేయకారులు బాణీ లోనే స్వరపరచడం జరుగుతుంది. వారి మనసు ఆ గమకాలకి, పోకడలకి అలా ఏర్పడి ఉంటుంది. అయితే ఈ పాటల్లో ఉన్న భాష కొంతవరకు, భావం,తాళగతి తెలియక చెయ్యక తప్పని స్థితి ఏర్పడుతుంది. విద్వాంసులు కూడా కొన్ని తెలీక చేసారు.
గురువుగారు ఏడాది కోర్స్ చెప్పాకా, ఇంకో ఏడాది పశుపతి గారు చెప్పారు, నా రెండేళ్ళ కోర్స్ లో. వారు కూడా కొన్ని కీర్తనలు చేసారు. కొన్ని లలిత సంగీత ధోరణిలో, కొన్ని కీర్తనల్లాగా చేసారు. వారుకూడా అన్నమయ్య కీర్తనలు కాక,  ఒక 30 వరకు త్యాగరాజాది వాగ్గేయకారుల కీర్తనలు నేర్పారు. కాబట్టి, తిరుపతిలో స్వరపరచిన సంగీతకారుల పాటలు కూడా సెమీ క్లాసికల్ లోనే ఉన్నాయి. ఇవి నేర్చుకుంటున్న దశలో నేను ట్యూన్ చెయ్యడం మొదలు పెట్టాను.
ఇంట్లో పుస్తకాలు చదువుకోవడం, చిన్నప్పటినుంచి సాహిత్యాభిలాష కూడా ఎక్కువగా ఉండడంతో, పాటలు రాసే అలవాటు 18 ఏళ్ళ నుంచే ఉండడంతో, అన్నమయ్య పాటలు నన్ను బాగా ఆకర్షించి, ఒక మత్తులో పడేసాయి. ఆ ఊపులో నేను స్వరపరచిన పాటల్లో లలిత సంగీత ధోరణిలో ఉండేవి ఎక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో, కీర్తనల ధోరణిలో కూడా నేను చేసాను. ఉదాహరణకి చెప్పాలంటే, ధర్మావతి రాగంలోని ‘మంగాంబుధి హనుమంతా ‘ అనే పాటకు నేను, దీక్షితార్ కీర్తనల లోని ‘సోల్ కట్టు స్వరాలు’ వాడాను. అంటే, సరి గ మ ప డ ని స్వరాలతో పాటు, తకతోం, దిద్దితై, తకతై వంటి మృదంగ గతులు కూడా ఉంటాయన్నమాట. అవి వాడాను. ఇందులో మంగా... అన్న సాహిత్యానికి, మా, గా అన్న స్వరాలు వాడాను. ప్రతిమధ్యమంతో సాధారణంగా ఎవరూ కీర్తన మొదలుపెట్టరు. అయితే, ధర్మావతి ప్రాచీన రాగం కాదు గనుక, నేనేం చేసానంటే, కొత్త ట్యూన్ తీసుకుని, కంపోస్ చేసాను. ఆ అభిరుచి సంగీతంలో అభిరుచి ఉన్న వాళ్లకు లాగా, నేనూ స్వరాక్షరాలతో పాడాను.
(ఇక్కడ వారు అద్భుతంగా పాడిన మంగాంబుధి అనే కీర్తనను, జయలక్ష్మి అనే కీర్తనను క్రింది ఆడియో లింక్ లో వినగలరు.)
అలాగే లలిత రాగంలో ‘జయలక్ష్మి’ కీర్తనను, రాగి రేకుల్లో ఉన్న రాగంలోనే స్వరపరిచాను. రాగిరేకులలో అన్నమయ్య రాగాలు రాసాడు కాని, తాళాలు రాయలేదు. ఏదో 5,6 పాటలకు ఉన్నాయి అంతే. కానడ, అఠాణా, బేగడ వంటి రాగాల్లో కూడా చేసాను. ‘కదిరి నృసింహుడు’ అఠాణా లో చేసినది. వీటిని బట్టీ నేను కేవలం లైట్ మ్యూజిక్ అనే చెప్పడానికి లేదు. నేను మొట్టమొదట్లో  అన్నమయ్య అంటే ఒక అవగాహన ఏర్పడ్డాకా చేసిన మొదటి పాట ‘వినరో భాగ్యము విష్ణు కధా’ అనే పాట బాగా ఫేమస్ అయ్యింది. ఇది సెమీ క్లాసికల్. అంటే నేను సంగీత, లైట్ మ్యూజిక్ ధోరణిలో కూడా పాటలు చేసాను. పాటలే నీకు ఎలా ట్యూన్ చెయ్యాలో ప్రేరణ కలుగజేసాయి.
మీరు చేసిన మొట్టమొదటి ఆల్బం ఏంటండి ?
మొదటి టి.టి.డి వారి ఆల్బం ‘వేంకటేశ్వర గీతమాలిక’ అన్నది. అంతకు ముందు నా ఫ్రెండ్స్ అంతా కలిసి, ఒక కాసేట్ రికార్డు చేయించారు. 1978 లో నా ఫాన్స్ ఒక 50 మంది కలిసి, అంతా చందాలు వేసుకుని, నాచేత పాడించి, కాపీ లు తీసి పంచారు. ఇలా చెయ్యకూడదు అని, మీరు ఉద్యోగంలో ఉన్నారని, టి.టి.డి వారు మమ్మల్ని కాస్త బెదిరించి ఆపారు. ఆపి, ప్రజలు కోరుకుంటున్నారు అని తెలుసుకుని, 6 నెలలు తిరక్కుండానే ‘వేంకటేశ్వర గీతమాలిక’ అనేపేరుతో ఒక కాసేట్ నాది, ఒక కాసేట్ శోభారాజుది విడుదల చేసారు.
కీర్తనలు అన్నమయ్యవి – స్వరం మీది’ అంటారు. దీని గురించి మీరు ఏమంటారు ?
ఇప్పుడూ, పుట్టినప్పటి నుంచీ పాటల పాడడం అనేది నాకు అడ్వాంటేజ్ అయ్యింది. అంతేకాక ఇంట్లో సంగీత వాతావరణం ఉండడంతో ఏ రాగం, స్వరజ్ఞానం, ఏ తాళం అన్న ఒక విచక్షణ వచ్చింది. దానివల్ల, చూసేందుకు లైట్ మ్యూజిక్ ధోరణిలా ఉన్నా, సంగీత జ్ఞానం ఉండడం వల్ల, పాటలకి ఆలోచనతో కూడిన ఒక తీరైన ఆకృతి కల్పించాగలిగాను. అది పండితపామరులను కూడా రంజింపచేసింది.
కొన్ని సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయట.
ప్రయత్నాలు చేసాను ఒక దశలో, కాని, రాలేదు. గట్టిగా ప్రయత్నం చెయ్యలేదు. నా లైన్ లో నేను నాకు ఇష్టమైన పాటలు పాడుకోసాగాను. సినిమాలో అలా కుదరదు కదా, నచ్చని పాట పాడితే రక్తి కట్టదు. ఆ ఫీల్డ్ లో నేను వెళ్ళినా రాణించలేనేమో, అనిపించింది. ఇక ప్రయత్నించలేదు.
లలిత సంగీతంలో మీరు చేసిన కృషి గురించి చెప్పండి.
దాదాపు 400 దాకా లలిత సంగీత గేయాలు రాసాను. భక్తి గీతాలే కాక, లవ్ సాంగ్స్, దేశభక్తి గేయాలు, ప్రకృతి అందాల గేయాలు, రాసాను. దాంట్లో సుమారు ఒక వంద వరకూ రికార్డు అయినాయి కూడా. ప్రైవేట్ రికార్డింగ్స్ లో నేను పాడడం, నాతోపాటు మరికొందరు పాడడం జరిగింది. 1974 లో నేను ‘కృష్ణ రవళి’ అనే పేరుతో 40 పాటలు రాసి, మా పిన్ని ఎస్.జానకి కి అంకితం ఇచ్చాను. దాని హక్కులు AIR హైదరాబాద్ వారు పూర్తిగా కొనేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా, అందులోని పాటలు చాలామంది లలిత సంగీత గాయనీగాయకులు పాడుతూనే ఉన్నారు. పి.బి.సాయిబాబా గారు అందులోని కొన్ని పాటలు బాలు గారు, ఇతర గాయకులతో రికార్డు చేసారు. అందులోంచి 10 పాటలు జానాకి పిన్ని ట్యూన్ చేస్తే, నేను వాటికి బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. అవి మళ్ళీ తను పాడింది. అప్పట్లో సంగీత అనే ఒక పాపులర్ కంపెనీ ఉండేది. అది, ‘కృష్ణరవళి’ అనే పేరుతో వీటిని రికార్డు చేసింది.
అలా నేను చేసిన పాటలే కాక, ఇతరులు రచించిన పాటలు కూడా రికార్డు చేసాను. సామవేదం షణ్ముఖశర్మ గారు ఋషిపీఠం కోసం రాసిన దాదాపు 50 పాటల్ని నేను స్వరపరచి, రికార్డు చేసాను. కందాడ సీతమ్మ గారని, ఒకావిడ ఆండాళ్ సంకీర్తనలు తెలుగులో 30 పాటలు రాసారు. ఎం. సి. శ్రీదేవి గారని, ఆవిడ వాటిల్ని పాడారు. నేనూ ఒకటి రెండు పాటలు తప్ప మిగతా 28 పాటలు పాడాను. అవన్నీ లలిత సంగీత ధోరణి లోనే స్వరపరిచాను. అలా చాలా చేసాను. పురందరదాసు కీర్తనలు కూడా టి.టి.డి. కే , నేను స్వరపరచి రికార్డు చేసాను. అవి కూడా లలిత సంగీత ధోరణి లోనే సాగాయి. తరిగొండ వెంగమాంబ పాటలు కూడా సెమీ క్లాసికాల్ ధోరణి లోనే చేసాను. AIR లలిత సంగీతంలో నేను ‘A’ గ్రేడ్ ఆర్టిస్ట్ ని. నేషనల్ ప్రోగ్రాం గా స్పెషల్ ఫీచర్స్ రికార్డు చేసినప్పడు, బలగా కృష్ణమోహన్, మల్లాది సూరిబాబు గారు కంపోస్ చేసిన ఫీచర్స్ లో నేను 9 ఫీచర్స్ లో పాడితే, 9 కీ నేషనల్ అవార్డు వచ్చింది.
నాదగ్గర నేర్చుకున్నవాళ్ళు చాలామంది పాడుతూ ఉన్నారు. ‘కృష్ణరవళి’ రెండో భాగంలో మళ్ళీ ఒక 40 పాటలు రాసి, మా జానకి పిన్నికే అంకితం చేసాను. అంటే మొత్తం 80 పాటలు కృష్ణరవళి రెండు భాగాలలో ఉన్నాయి. ఇవికాక, రంగభద్ర గారని, తెలుగు, సంస్కృత పండితులు -‘మహాప్రాణ దీపం’ వంటి సినిమా పాటలు రాసినతను ఆయన ట్యూన్ చేసిన పాటలు నేను పాడాను, నేనే ట్యూన్ చేసి, నేనే పాడాను.  అవి కూడా ఒక 40-50 పాటలు రికార్డు అయ్యాయి. అలా అన్నమాచార్య కీర్తనలే కాక, వందలాది లలిత గీతాలు చేసి, రికార్డు చేసి, రిలీస్ చేసాను. ఇందులో కూడా నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది.
మీ అబ్బాయికి వారసత్వంగా మీ గొంతును ఇచ్చారు. దీని గురించి చెప్పండి.
అంతా వేంకటేశ్వర స్వామి దయ, అంతే. పాట జ్ఞానం ఇచ్చినా, గొంతును ఇచ్చింది ఆయనే. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరూ పాడతారు, కాని చిన్నవాడు క్లాసికల్ లైన్ లోకి వెళ్ళిపోయాడు. అతనికి ప్రొఫెషనల్ టచ్ ఉంది. పక్కవాయిద్యాలు అవీ పెట్టుకుని పాడతాడు. పెద్దవాడు, తనకోసం తను పాడుకుని, ఆస్వాదిస్తాడు.
వివిధ చానల్స్ లో మీరు నిర్వహించిన సంగీత కార్యక్రమాల గురించి చెప్పండి.
చానెళ్ళలో చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసాను. ముందుగా నేను భక్తి టీవీ వారికి కృతఙ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే, అన్నమాచార్య కీర్తనలు బహుళ ప్రచారం పొందడంలో వారు కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ‘క్లాసు టీచింగ్’ అనే అవకాశాన్ని, ‘అన్నమయ్య హరి సంకీర్తనం ‘ అనే కార్యక్రమం ద్వారా ఇచ్చారు. ఇందులో మా అబ్బాయినే విద్యార్ధిగా పెట్టుకున్నాను, వారూ సమ్మతించారు. 125 పాటల్ని భక్తి టీవీ వాళ్ళు ఈ కార్యక్రమంలో దాదాపు రెండున్నర మూడేళ్ళ దాకా, ప్రసారం చేసారు. కొన్ని లక్షల మంది విన్నారు. అప్పుడు నాకు తెలీలేదు కాని, చాలా మందికి ఈ కార్యక్రమం ఉపయోగ పడింది. ఆ విధంగా అన్నమయ్య కీర్తనల ప్రచారానికి ఛానల్ ద్వారా నేను చేసిన ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు.
అలాగే, ‘అన్నమయ్య స్వరార్చన’ అన్న పేరుతో SVBC ఛానల్ వారు, నేను ట్యూన్ చేసిన 325 అన్నమయ్య సంకీర్తనల గురించి, అవి ఏ సందర్భాలో, ఎవరి ప్రోద్భలంతో, ఏ ఆలోచనలతో, ఎవరి సూచనలతో, ఏ రకాల అవసరాలకి స్వరపరిచానో, విశ్లేషిస్తూ, వాటి వెనుక ఉన్న కధను తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఈ ఫీచర్ 108 ఎపిసోడ్స్ తో  రెండున్నర ఏళ్ళ పైనే నడిచి, బహుళాదరణ పొందింది.
తర్వాత ‘నాదయోగి’ అన్న పేరుతో మా గురువుగారు నేదునూరి గారిని ప్రధానంగా ఫోకస్ చేస్తూ, వారు చేసిన 108 అన్నమాచార్య కీర్తనలు, వారి అనుభవాలు, వారు ఏయే రాగాల్లో ఏ పద్ధతిలో ఎలా చేసారు, వాటివెనుక ఉన్నటువంటి విషేశాంసాలు ఏమిటి అన్నవి వారే స్వయంగా మాట్లాడుతూ ఉండగా రికార్డు చేసి, చివరికి ఆ ఎపిసోడ్ చివర్లో, నేను, వారూ కలిసి పాడడం చేసేవాళ్ళం. వారు కొత్తగా చేసింది అయితే, వారు పాడేవారు, లేక ఇతర శిష్యులతో పాడించేవారు. ప్రధానంగా అందులో నేను పోషించిన పాత్ర, నేను ఆయన్ని ఇంటర్వ్యూ చెయ్యడం. ఏ రకమైన ప్రశ్నల ద్వారా, ఆయననుంచి సమాచారం రాబట్టి, ప్రజలకు అందించాలి అన్న ప్రణాళిక సిద్ధం చేసి, వారిని ప్రశ్నించేవాడిని. అది చాలా ప్రసిద్ధి పొంది, ఇక్కడివారే కాక, తమిళనాడు, కర్ణాటక ప్రజలు కూడా చాలామందిని చూసేలా చేసింది. మహానుభావులైన మా గురువుగారితో ఈ కార్యక్రమంలో పాల్గొనగలగడం నా అదృష్టంగా భావిస్తాను.
ఇంకా ఛానల్ ద్వారా ప్రసారం అయిన సంగీత కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రామదాసు కీర్తనలు గురువుగారు నేర్పడం, నేను నేర్చుకోవడం, అలాగే అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడం వంటివి జరిగాయి. ఇవికాక, దూరదర్శన్ (అప్పట్లో కలిసే ఉండేది – సప్తగిరి ) వాళ్ళు రెండేళ్ళ ముందు, నేషనల్ ఆర్చీవ్స్ లో పెట్టడానికి ఒక రెండు గంటలు నాతో గురువుగారిని ఇంటర్వ్యూ చేయించారు. అందులో ‘నాదయోగి’ లో లాగానే వారిని రకరకాలుగా ప్రశ్నించి, వారి జీవిత విశేషాలు, సంగీత విశేషాలను రాబట్టి, ఆ ఛానల్ ద్వారా ప్రజలకు అందించాను. వాళ్ళు దాన్ని నేషనల్ ఆర్చీవ్స్ లో పెట్టడం వల్ల, నా గొంతు కూడా అందులో నిక్షిప్తం అయ్యింది.
అదికాక, నేను రచించిన ఆంజనేయస్వామి కీర్తనలను విజయవాడ రేడియో స్టేషన్ వారు రికార్డు చేసారు. వాటిని ఒక 10 ఏళ్ళు భక్తిరంజని లో తరచుగా వేస్తూ ఉన్నారు, ఆర్చీవ్స్ లో పెట్టారు. అలాగే దూరదర్శన్ వారు కూడా, నేను రచించిన ఆంజనేయస్వామి కీర్తనలను ఆర్చీవ్స్ లో పెట్టడానికే రికార్డు చేసారు. ఇలా మీడియాలో వాటిని భద్రపరిచే అవకాశం దక్కింది.
మీరు ఇప్పటివరకు రాసిన పాటలు, చేసిన కీర్తనలు మొత్తం ఎన్ని ?
800 అన్నమయ్య పాటల పైచిలుకు, స్వరపరిచాను. 400 పాటలపైన లలిత సంగీతంలో రాసాను, అందులో 80 ప్రచురించబడ్డాయి. అలాగే, క్లాసికల్ కీర్తనలు, వర్ణాలు,తిల్లానాలు, ఒక 400దాకా రాసాను. నేను పాడి, రికార్డు చేసిన అన్నమయ్య పాటలు 500 ఉంటాయి. ఇది కాక 10 అన్నమయ్య కీర్తనల నోటేషన్ పుస్తకాలు అచ్చు వేసాను, అందులో 8 టి.టి.డి వారు ప్రచురించారు, 2 మహతి కళా కేంద్రం అనే మా స్వంత సంస్థ తరఫున ప్రచురించాము.
ఇవి కాక, హనుమంతుడి మీద నేను రచించిన ప్రత్యేకమైన పాటలు ఒక 21 ఎన్నుకుని, ‘ శ్రీ ఆంజనేయ కృతి మణి మాల’ అనే పేరుతో 1995 లో, టి.టి.డి వారి ఆర్ధిక సహాయంతో అచ్చు వేసాము. దాన్ని రికార్డు కూడా చేసాము, అదిప్పుడు టి.టి.డి వారు మార్కెట్ చేస్తున్నారు. ఒక సందర్భంలో, 1992-97 మధ్యలో నా కంఠధ్వనికి ఇబ్బందులు వచ్చి, నేను మళ్ళీ పాడలేనేమో అన్న దశలో ఆంజనేయస్వామికి మొక్కుకుని, ప్రత్యేకించి రాసిన పాటలు అవి.
మీరు పొందిన అవార్డులు, ప్రశంసలు, మీ భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పండి.
చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి, టి.టి.డి ఆస్థాన విద్వాన్, 2010 నుంచి కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ గా ఉన్నాను. విజయనగరం వద్ద ఉన్న గరివిడి లో ‘సూర్య పీఠం’ అని ఒకటి ఉంది. అక్కడ కృష్ణయాజి గారని, మహాపండితులు, సూర్యోపాసకులు, సౌరదీక్షాపరులు ఒకరు ఉన్నారు. ఆయన ఆస్థానంలో పెద్దపెద్ద సంస్కృత పండితులు ఉన్నారు. అనేక ఉత్సవాలు చేస్తారు, పుస్తకాలు ప్రచురిస్తారు. ఆ పీఠం వారు నన్ను బంగారు గండపెండేరం తో సన్మానించారు.  సిలికాన్ ఆంధ్రా వారి ‘లక్షగళార్చన’ నిర్వహించిన సందర్భంగా ‘లక్షగళార్చన సారధి’ అనే టైటిల్ ఇచ్చారు. ఇందులో ఒక లక్షా అరవైవేల మంది ఎలుగెత్తి, ప్రత్యేకించి ఎన్నుకున్న సప్తగిరి అన్నమయ్య కీర్తనలు పాడారు.
నాకు టి.టి.డి వారు, నేను చేసిన మొదటి ‘సంకీర్తన యజ్ఞం’ సమయంలో నాకు ‘అన్నమయ్య సంకీర్తన మహతి’ అన్న బిరుదు, గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఈ సంకీర్తన యజ్ఞాలు మొదలుపెట్టింది నేనే. ఇప్పటికి 8 సంకీర్తన యజ్ఞాలు చేసాను. మొదట్లో 7 రోజులు చేసేవాడిని, ఇటీవల చేసింది 12 రోజులు చేసాను( 2 ఏళ్ళ క్రితం తిరుపతిలో), ఇందులో కనీసం 200 కీర్తనలకు తక్కువ కాకుండా, పాడుతూ నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమం ఇది.
రమణీరాజా గారని, పెద్ద వ్యాపారవేత్త, వారికి ‘రాజా లక్ష్మి ఫౌండేషన్’ అని, తమిళనాడు లో బాగా ఫేమస్. వారు నాకు వారి సంస్థ తరఫున అన్నమాచార్య కీర్తనలకు నేను చేసిన సేవకు గానూ, స్పెషల్ అవార్డు ఇచ్చారు. విజయవాడలో నేను సంకీర్తన యజ్ఞం చేసినప్పుడు, వారు నా చేతికి బంగారు సింహకలాటం(కంకణం)తొడిగి, సన్మానించారు. అమెరికా వారు ‘అన్నమయ్య నాదజ్యోతి’ అన్న టైటిల్ ఇచ్చారు. ఇలా 40 వరకు బిరుదులు, సన్మానాలు ఉన్నాయి.
అన్నింటిలోకి మీరు అపురూపంగా భావించేది, ఏది ?
నా జీవితమంతా వేంకటేశ్వరుడి సేవలోనే గడిచిపోయింది కనుక, నాకు టి.టి.డి వారిచ్చిన ఆస్థాన విద్వాన్ అన్నదే అపురూపమైనదిగా చెప్పుకోవచ్చు.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
ఏదీ ప్రణాళికలు వేసుకుని నేను చెయ్యలేదు. కాకపొతే, భగవంతుడి దయ వల్ల, చేస్తున్న పనులను బట్టి, నన్ను గుర్తించేవారు ఉన్నారు, వాళ్ళ మనసులో నన్ను ఎల్లకాలం నిలుపుకుంటున్నారు, నా పాటల వల్ల  ఆనందిస్తున్నారు, అన్నవి చూసి, నా జీవితం ధన్యమయ్యింది అన్న మధురానుభూతి కలుగుతుంది. దాదాపు వెయ్యి అన్నమయ్య కీర్తనలు పాడగలను, 800 స్వరపరిచాను, వెయ్యీ స్వరపరచాలి అన్న ఒక కోరిక ఉంది. చెయ్యగలనో లేదో తెలీదు, ఇంకా 200 చెయ్యాలి కదా. ఈ లోపు కచేరీలు, ప్రయాణాలు చూసుకుంటూ స్వరపరచాలి. ఎప్పుడూ పాడే కీర్తనలు ఒక సెట్ గా ఉన్నాయి, మిగతావి అంతా తరచుగా విననివి ఇంకో సెట్ గా ఉన్నాయి. 800 కూడా చిన్న సంఖ్య కాదు కదా, అందుకే, పరిస్థితులు అనుకూలిస్తే చెయ్యాలని మాత్రం ఉంది.
భావి సంగీతకారులకి మీరిచ్చే సందేశం ఏమిటి ?
ఒకప్పుడు పెద్దా చిన్నా అంతరాలు ఉండేవి. ప్రతివాళ్ళు రికార్డు చేస్తున్నారు, మాకూ అభిమానులు ఉన్నారు అంటున్నారు, వాళ్లకు నేనేమి చెప్పేది ? ఇది వాళ్ళ విచక్షణకు సంబంధించిన విషయం. మొదట్లో నన్నూ, అన్నీ లైట్ మ్యూజిక్ లా అన్నమ్మయ్య పాటలు చేస్తున్నా అన్నారు, అందుకని, సంగీతం లాగా పాడాను, మళ్ళీ ఇంకో వర్గం వారు వ్యతిరేకించారు. ఎలా చేసినా జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారని తెలిసింది. ఇప్పుడు వేల మంది, లలిత సంగీత బాణీ లలోనే చేస్తున్నారు. ఇదిద్వారకు 40,50 ఏళ్ళుగా ఎవరైనా చేసారా, డూప్లికేట్ అవుతోందా అని ఆలోచించట్లేదు. అలా మా  మాది అన్నట్లు, చేసుకుంటూ ఉన్నారు. రికార్డింగ్ తేలిక అయ్యింది, వాళ్ళను ప్రోత్సహించే కంపెనీలవారు కూడా ఉన్నారు. అందుకే ఎవరికీ సలహాలు చెప్పెట్టూ, ఉపదేశాలు చేసేట్టు లేదు పరిస్థితి. కొంతమందైనా ఆలోచించి చేస్తే బాగుంటుంది. దైవం ఏవి, ఎన్నాళ్ళు, ఎలా కాపాడుకోవాలో అలా  కాపాడుకుంటారు, మహామహులు చేసిన కీర్తనలే పోయినాయ్ కదా, అంతా దైవేచ్చ.
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారితో నా పూర్తి ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి...

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top