శ్రీసరస్వతీ శతకము - చేబ్రోలు సరస్వతీదేవి - అచ్చంగా తెలుగు

శ్రీసరస్వతీ శతకము - చేబ్రోలు సరస్వతీదేవి

Share This

శ్రీసరస్వతీ శతకము - చేబ్రోలు సరస్వతీదేవి

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం


'కవి కలహంసి' బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె 1900 వ సం. లో పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లా లో జన్మించారు. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు. ఈమె సరస్వతీ రామాయణము, శ్రీ సరస్వతీశతకము, సత్యనారాయణ వ్రతకల్పము ఆత్మోపదేశము, పతివ్రతాశతకము వంటి రచనలు చేసారు. సరస్వతీదేవి సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. ఈమె గురువు కందాడై కృష్ణమాచార్యులు, పంచకావ్యములు, నాటకాలంకారములు జ్ఞానసముపార్జన దృష్టితో బోధించేరని సుమిత్రాదేవి పేర్కొన్నారు. ' శ్రీ సరస్వతీ !' అన్న మకుటంతో రాసిన 'సరస్వతీ శతకం' లోని కొన్ని పద్యాలు చూద్దాము... 

ఉ. శ్రీదయివాతభాగ్యమును చెల్వగువిద్యయునిత్యశాంతియున్ 
భేదమొకింతలేక సితనీరజవాసిని! భక్తకోటికిన్ 
మోదముతోడనియ్యగల మూర్తివినీవనియెంచి యాత్మలో 
పాదసరోజయుగ్మముల పైబడివేడెద శ్రీసరస్వతీ! 

 ఉ. భారతి! చంపకంబులును భవ్యములైతగునుత్పలంబులున్ 
చేరిచి పూజుసేయుటకు సిద్ధముచేసితి శుద్ధభక్తిమై 
పారములేనినీకరుణ పైపయిఁజూపి కృతార్ధసేయుమా 
నేరుపుచాలదయ్యెనిఁక నివశరణ్యము శ్రీసరస్వతీ! 

ఉ. తెల్లనిచీరగట్టి కడుఁ దేజముతుంపెసలాడుపీఠమం 
దుల్లముపల్లవింప స్వరయోగమనోహరవీణమీటుచున్ 
ఫుల్లసరోజనేత్రములు పూర్ణకృపారసమున్ వేలార్చునో పల్లవపాణి! 
కొల్చెదభవత్పాదయుగ్మము శ్రీసరస్వతీ! 

ఉ. సంపదగల్గినప్పుడెద సంతసమందు విపత్తుగల్గినన్ 
బెంపువహింపబోదుమఱి ప్రేమదలిర్ప సమత్వభావమే 
యింపువహింప నెమ్మదిని నేడ్తేఱనాటుమ క్రోధబుద్ధియున్ 
జంపివిశాలభావములు సమ్మతినిమ్మిఁక శ్రీసరస్వతీ! 

చ. కొడుకులుసేయుదోసములు కూర్మిసహించెడు తల్లిదండ్రుల 
ట్లెడద కృపారసంబువహియించి పరాంబిక! నాదొసంగులన్ 
తడవునుసేయకే సయిచి ధర్మవిధనమునందు జ్ఞానమున్ 
బడయఁగనీయుమా సుకృతమార్గమునందగ శ్రీసరస్వతీ! 

 చక్కటి భావసహితమైన ఈ పద్యాలను చదవండి, చదివించండి, ముందు తరాలకు అందించండి.

No comments:

Post a Comment

Pages