వెన్నెల యానం - 5

భావరాజు పద్మిని


( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, సీతారామపురం మామిడి తోటలో ఆమె దొంగతనం చెయ్యబోయిన పాలేరును కొడుతూ, భయపడి చెట్టెక్కిన శరత్ తో అతని భయం మటుమాయమయ్యేలా ఆమె చెప్పిన మాటలు, గుర్తుచేసుకుంటాడు శరత్... కాలేజీ బంద్ మూలంగా లేకపోతే, గోదావరి ఒడ్డున నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని, ఏదో రాసుకుంటున్న శరత్ ను ఆటపట్టించి, జానపద భాషలో గోదావరిపై గేయం రాయమని అడుగుతుంది చంద్రిక. తాను రాస్తే, ఆమె వెంటనే ట్యూన్ కట్టి పాడాలని, సవాల్ చేస్తాడు శరత్. శరత్ రాసిన పాటను అద్భుతంగా పాడుతుంది, అతని మనసులో చంద్రిక పట్ల ఒక ఆరాధనాభావం కలుగుతుంది. ఫ్రెషర్స్ పార్టీ కి వెళ్ళినప్పుడు నదిలో మునిగిపోతున్నసీనియర్లను తాను రక్షించిన వైనం చెప్తాడు శరత్. వారి పడవ గోదావరి మధ్యనున్న ఒక లంకకు చేరుకోగా, ఎయిర్ బెడ్ వేస్తున్న శరత్ ను ఆటపట్టిస్తూ ఉంటుంది చంద్రిక. ఇక చదవండి...)
“వేసుకున్నవాడిదే పక్క, ఓహో ఈ గాలి పక్క(ఎయిర్ బెడ్) ఎంత మెత్తగానున్నది... అరె, ఏంటి అలా చూస్తున్నావు ? ఓహో, నీకూ కాస్త చోటు కావాలా ? ఐతే, ఓ చంద్రికా... తొలిరేయి పెళ్ళికూతురిలా పడవలో ఉన్న టెట్రా ప్యాక్ లోని పాలు గ్లాసులో పోసుకుని, సిగ్గుపడుతూ మెల్లిగా వచ్చి, కాలి బొటనవేలితో నేలను రాస్తూ నిల్చోమ్మా... అప్పుడు ఆలోచిద్దాం ...” తలకింద చేతులు పెట్టుకు పడుకుని, ఆవలిస్తూ అన్నాడు శరత్.
అసలే కోపంగా ఉందేమో, విసవిసా నడిచి వచ్చి నిల్చుని నేల చూపులు చూడసాగింది చంద్రిక.
“ఆహా, మాయాబజార్ సినిమాలో మాయా శశిరేఖ లాగా యెంత గొప్పగా నడిచావు ? కొత్త పెళ్లికూతుళ్ళు అందరికీ ఈ నడక వీడియో తీసి చూపించాలి... అసలు గజ గామిని, హంస నడక తర్వాత , చంద్రిక నడక అని కొత్త ఉపమానం తీసుకురావాలి...” వినోదంగా చూస్తూ అన్నాడు శరత్.
“ఐ హర్టు ... పో నీతో పచ్చి, నన్నేడిపిస్తున్నావ్ ... “ బుంగమూతి పెట్టేసుకుని, ఇసుకతిన్నెల మీదే చతికిలబడి, అటు తిరిగి కూర్చుంది చంద్రిక.
“త్వమసి మమ భూషణం త్వమసి మమజీవనం ...’ అంటూ ‘ ఓ చెలీ ! నీవే నాకు భూషణము, నీవే నాకు జీవనము, నీవే నా భవసాగర మాణిక్యానివి, ఇదిగో నీకు నమస్కరిస్తున్నాను. నన్ను ప్రేమతో అనుసరించు. నా హృదయము నీకొరకే తపిస్తున్నది...” అనే అర్ధం వచ్చే “ ప్రియే చారుశీలే !” జయదేవ అష్టపదిని ఆర్ద్రంగా ఆలపించాడు శరత్.
పాటలోని మాధుర్యం తన హృదయాన్ని తాకుతున్నా, బెట్టు వదలలేదు చంద్రిక... అసలు అటు తిరిగి చూడనేలేదు.
“స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం ... దేహి పద పల్లవ ముదారం...” అంటూ అతను కొనసాగించగానే ఒక్క ఉదుటన లేచి, అతనివద్దకు వెళ్లి అల్లుకుపోయింది చంద్రిక.
“శరత్... యెంత గొప్ప పాట పాడావు... ఇది జయదేవ అష్టపదులలో 19 వదైన ‘దర్శనాష్టపది’. అష్టపదులను రాస్తున్న జయదేవుడు, ఇందులో తన చెలి రాధ కోపాన్ని తగ్గించడానికి, ‘కోమలమైన నీ పాదాలను నా తలపై ఉంచు,కనీసం అలాగైనా నీ విరహబాధ కాస్త తీరుతుంది...’ అని అర్ధం వచ్చే ఈ చరణాన్ని రాసి, ‘అయ్యో, రాధ పాదాలు దేవదేవుడైన కృష్ణుడి నెత్తిన ఉంచమని రాసాను, ఇది చాలా తప్పు,’ అనుకుని, తను రాసింది చింపేసి, స్నానానికి వెళ్ళాడట. అప్పుడు ఏమైందో తెలుసా ?”
“నువ్వే చెప్పు, నువ్వు చెప్తే వినాలని ఉంది...” మృదువుగా ఆమె నుదుట చుంబిస్తూ అన్నాడు శరత్.
“స్వయంగా కృష్ణుడే జయదేవుడి రూపంలో వచ్చి, వారి ఇంట భోజనం చేసి, అదే చరణాన్ని తిరిగి రాసి, వెళ్ళిపోయాడట ! కృష్ణ దర్శనం అయ్యింది కనుక, ఈ అష్టపదిని ‘దర్శనాష్టపది’ అంటారు. అంటే... రాధ పాదాల్ని తన తలపై ఉంచడంలో తప్పు లేదని, కృష్ణుడే స్వయంగా చెప్పినట్లు కదా ! అలాగే, సత్యభామ కధలో ఆమె తన పాదంతో కృష్ణుడి తలను తన్నితే, ‘ తంతే తన్నావు కానీ, ఓ చెలీ, నీ కోమలమైన పాదాలు కందిపోలేదు కదా ‘ అని అడుగుతాడు కృష్ణభగవానుడు. ఆ మాటలకు ఆమె కోపం ఎగిరిపోతుంది, మనసు కరిగిపోతుంది. ఇలాగే అనేక కావ్యాల్లో, అలిగిన నాయికని మెప్పించేందుకు నాయకుడు ఆమె పాదాలు పట్టుకున్నట్టుగా చదివాము. ఎందుకంటావు ? దీని వెనుక ఏదైనా అంతరార్ధం ఉందా ?” సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది చంద్రిక.
“ఉంది చంద్రా !  దైవం మనకిచ్చిన అతి గొప్పవరాల్లో ప్రేమ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ ప్రేమకు ప్రతిబంధకం అహం. స్త్రీ అయినా, పురుషుడైనా తాను ప్రేమించినవారిని తన్ను తాను ప్రేమించినట్లుగా, నిజానికి అంతకంటే గొప్పగా ప్రేమించాలి. మన కాళ్ళు పట్టుకోడానికి మనకి ఎటువంటి అభ్యంతరం ఉండదుగా, అలాగే మనం ప్రేమించిన వాళ్లవీనూ. అంటే- నేను, నా భార్య... ఒకటే... రెండు దేహాలలో ఉన్న ఒకే ఆత్మ మేము... అన్న అద్వైత భావన గుండెల్లో బలపడితే తప్ప, నిజమైన శృంగారం, రసానుభూతి అనుభవంలోకి రాదు. ఏ ఒక్కరిలో తమ ఆధిక్యత చూపాలన్న ఆరాటం ఉన్నా, వారి దాంపత్యం రసహీనమవుతుంది. అందుకే, స్వయంగా భగవంతుడే అహపు తెరలు కమ్మిన నాయిక మనసు కరిగిపోయేలా, నీ కాళ్ళు కూడా పట్టడానికి సిద్ధం... అంటూ, అహం లేనప్పుడే నిజమైన ప్రేమ, తాదాత్మ్యం సాధ్యం అని స్వయంగా ఆచరించి చూపారు. ఈ సూత్రాన్ని పాటించిన దంపతుల జీవితం ఆనందమయమౌతుంది. కదూ... ఇదేనా నాతో నువ్వు చెప్పించాలని అనుకున్నది... “ అడిగాడు శరత్.
అతను చెప్పిన విషయంతో ఏకీభావిస్తున్నట్లుగా కనురెప్పలను మూసి, “ సమున్నత భావాలున్న నీవంటి భర్త దొరకడం నా అదృష్టం శరత్,” అంటూ చటుక్కున అతని బుగ్గపై ముద్దుపెట్టింది చంద్రిక. “అదృష్టం నీది మాత్రమే కాదు చంద్రిక, నాది కూడా,” అంటూ ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు శరత్.
ఇద్దరి మధ్యా మౌనం ... మనసుమనసుతో మాట్లాడుకునేటప్పుడు ఇక మాటలతో పనేముంది ? ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తోంది. అతని వెచ్చటి శ్వాస ఆమెను తడుపుతోంది... ఇద్దరి తనువుల్లో సన్నటి ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రేమను పండించుకుంటున్న ఆ జంటను చూసేందుకు చంద్రుడు మరింత క్రిందికి వచ్చాడా అన్నట్లు, వెన్నెల పుచ్చపువ్వులా దీవంతా పరచుకుంది.
వెన్నెల వేడెక్కింది... వెన్నెల వెన్నెలనే హత్తుకుంది... వెన్నెల వెన్నెల్లో కరిగిపోయింది... వెన్నెల వెన్నెలలో కలిసిపోయింది.
**************
రెప్పలపై పడ్డ నులివెచ్చని సూర్యకాంతికి మెలకువ వచ్చి, నెమ్మదిగా లేచి కూర్చుంది చంద్రిక. పక్కన శరత్ లేడు. నిలబడి చుట్టూరా చూసింది, కనిపించడే ! అటూ, ఇటూ చూస్తుండగా... గోదారి నీళ్ళలో అలికిడి వినబడింది. అటుగా వెళ్ళిన చంద్రికకు ఎవరూ కనిపించలేదు. కాస్త నీళ్ళలోకి దిగి ముందుకు నడిచి చూస్తుండగా... ఒక్క ఉదుటన నదిలోంచి లేచిన శరత్, ఆమెను కూడా నీళ్ళల్లో ముంచేసాడు.
“హేయ్, ఆగు, ఏవిటీ అల్లరి...” అంటూ అతన్ని వారించి, లేచి నిలబడ్డ చంద్రిక నడుమును గట్టిగా ఒడిసి పట్టుకుని, ‘ సరిగోదావరి స్నానాలోయ్... తప్పేముంది, ఇప్పుడు నువ్వు నా పెళ్లానివి...నాకు హక్కుంది...’ అన్నాడు శరత్.
‘అలాగేకాని, ఇప్పుడే నిద్దర లేచాను కదా, కాస్త ఫ్రెష్ అవ్వనివ్వు... తర్వాత చూద్దాం...’ అందామె విడిపించుకుంటూ.
‘అటులనే దేవీ ! ముందుగా తమరు కాస్త నా వీపును రుద్ది, తదుపరి నిష్క్రమించుడు. తమ కొరకు కాఫీ కలిపి, ప్రక్కన ఫ్లాస్క్ లో ఉంచితిమి, గ్రోలుడు...’ గ్రాంధిక భాషలో అన్నాడతను.
“ఏంటి ? నేను నీ వీపు రుద్దాలా ? పెళ్ళాంతో సేవలు అప్పుడే మొదలా ?”
“రాత్రి దేవి గారు అహము కూడదని సెలవిచ్చినారు, అందులకే అది నిరూపించుకొను అవకాశమును వారికి కల్పించ సంకల్పించినాము...”
“ఓహో, అటులనే నాధా... నేను తక్షణమే వెళ్లి , 100 నిమ్మకాయల శక్తిగల విం బార్ ను తెచ్చి, పీచుతో తమ వీపు తోమెదము, అనుమతినివ్వుము...” దాసిలా నటిస్తూ అంది చంద్రిక.
“స్త్రీలు వాడు లేపనములు మేము సంగ్రహించము. కోమలమైన నీ కరములే చాలును దేవీ ! కాలయాపన చెయ్యక మా ఆజ్ఞను శిరసావహించుము...” మహారాజు పోసులో అన్నాడు శరత్.
కిలకిలా నవ్వేసి, ‘అలాగే, వెనక్కి తిరుగు,’ అంటూ అతని వీపు రుద్దుతూ...’ శరత్... మనం కలిసి చదువుకునే రోజుల్లో  నన్ను పెళ్ళిచేసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నావా ?’ అడిగింది చంద్రిక.
“నీకో విషయం చెప్పాలి చంద్రిక... చిన్నప్పటి నుంచి నాకో కల వచ్చేది.. ఆ కల్లో ఒక అందమైన అమ్మాయి...”
“ఆగాగు, డ్రీం గర్ల్... అంటే, హేమామాలిని వచ్చేదా ? నీది బాగా పాత టేస్ట్...”
“లేదు... కల్లో ఒకమ్మాయి కనిపించేది. నాలాగే ఆటపాటల్లో, కళల్లో, చదువులో మేటి అయిన అమ్మాయి. అచ్చంగా నా మనసు అద్దంలో ప్రతిబింబంలా ఉండే అమ్మాయి, మా కాలేజీలో నాతోటే చదువుతుందని, ఆమెనే నేను పెళ్లి చేసుకుంటానని... తియ్యటి కల... ఎన్నిసార్లు వచ్చిందో..”
“హాయ్, ఆ అమ్మాయి నేనేనా ? ఐతే చిన్నప్పుడే నువ్వు కాలేజీ రేంజ్ లో కలలు కనేవాడివా ?” ఉత్సాహంగా వీపు రుద్దడం ఆపి, ముందుకు వంగి అంది చంద్రిక.
“అబ్బే, నువ్వయ్యే అవకాశం ఎంతమాత్రం లేదు, ఎందుకంటే, నా కలలరాణి కనబడ్డవాల్లనల్లా కరాటే తో చితగ్గోట్టలేదు...” కవ్విస్తూ అన్నాడు శరత్.
“సర్లే గాని, ఈ సినిమా కధ చెప్పడం ఆపి, ఇక అసలు విషయానికి రా... ఈ సెంటిమెంట్ బరువుకు నా చీర కొంగు తడిసిపోయింది...” కొంగు గోదాట్లో పిండుతూ అంది చంద్రిక.
“అరెరె , ఐతే, నీ కాలికి మట్టి అంటకుండా... అలా తీసుకెళ్ళి, కూర్చోబెట్టి, చెప్తాను, పద...” అమాంతం ఆమెను తన చేతులపైకి ఎత్తుకుని మోసుకువెళ్ళసాగాడు శరత్...
(సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top