వందే గురు పరంపరాం - అచ్చంగా తెలుగు

వందే గురు పరంపరాం

Share This

వందే గురు పరంపరాం

- టేకుమళ్ళ వెంకట్ 


గురు పూర్ణిమ భారతీయులకు చాలా విశిష్టమైన పర్వదినం.  ఆ రోజున వేదవ్యాస మహర్షిని పూజించి మన గురుపరంపర లోని గురువులందరినీ స్మరించుకుని ధన్యులమయ్యే పుణ్య దినం.  ప్రస్తుతం మన దేశంలో భక్తి, జ్ఞాన రంగాలలో గురువులు ఎవరు ఎటువంటి విధానాలను ప్రభోదించినా, దానికి ప్రేరణ, ఆత్మ, సంకల్పం.... సాక్షాత్తూ...శ్రీ వేదవ్యాసులే ! “వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వమ్!”.  భగవద్గీతను అర్జునునిని ద్వారా సమస్త లోకాలకు బోధించిన శ్రీకృష్ణుడు జగద్గురువు. “కృష్ణం వన్దే జగద్గురుమ్!” అంటారు అందుకే...అలాంటి భగవద్గీతను గ్రంథస్థం చేసి భారతీయులకు అందించిన వేదవ్యాస మహర్షి ఇంకొక జగద్గురువు! “వ్యాసం వన్దే జగద్గురుమ్!”  ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసి మనకు అందించిన శ్రీ ఆది శంకరాచార్యులు ఇంకో జగద్గురువు! ఈ సృష్టి ఉన్నంత వరకూ.. భారతదేశమంతటా భక్తజనబృందాలూ, దేవాలయాలలోనూ.. పఠించి తరించే స్తోత్ర, శ్లోకాలలో ఎనభై శాతం శ్రీ శంకరాచార్య కృతమే! వేలాది సంవత్సరాల నుంచి, గురు శిష్య పరంపరగా మన వరకూ అందించిన మహానుభావులూ పరమ గురువులూ వేల మంది ఉన్నారు! ఐతే.....భారతీయ విద్యలన్నిటిలోకీ ఆధ్యాత్మిక విద్య ఉత్తమోత్తమం గా భావిస్తాము! కాబట్టి, గురువులు అందరిలోకీ ఆధ్యాత్మిక గురువులదే అగ్ర స్థానం ! వారిని స్మరిస్తూ... ప్రార్ధించడం.. మనం మన గురువులకిచ్చే.. నీరాజనం.
శ్లో || సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం
నారాయణం పద్మభువం వసిష్ఠమ్ శక్తించ తత్పుత్రం పరాశరంచ వ్యాసం
శుకమ్ గౌడపాదం  మహాంతం గోవింద యోగీంద్రం తదస్య శిష్యం
శ్రీ శంకరాచార్య అథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం
తమ్ తోటకం వార్తికాకారమన్యాన్ అస్మద్ గురూన్ సంతతమానతోస్మి
ఆదిలో ఈ జ్ఞానాన్ని నిర్గుణ పరతత్వమైన ఈశ్వరుడి నుంచి గ్రహించిన నారాయణుడితో గురు పరంపర ఆరంభమైంది. నారాయణుడి నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి వశిష్టుడికి, వశిష్టుడి నుంచి శక్తికి, శక్తి నుంచి పరాశరునికి, పరాశరుని నుంచి వ్యాసునికి, ఆయన నుంచి శుకునికి, శుకిడి ద్వారా గౌడపాదునికి, గౌడపాదుని నుంచి గోవింద భగవత్పాదునికి, వారి నుంచి శ్రీ శంకరాచార్యులకు, వారి ద్వారా పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరుడు, తోటకాచార్యులకు లభించింది. ఇలా పరంపరాగతమై తమ గురువు వరకు సంక్రమించిన ఈ అవిచ్ఛిన్న పరంపరను స్మరించుకుని తరిస్తాము.
ఈ కాలం లో రక రకాల గురువుల్ని మనం చూస్తున్నాము. ఎలాంటి వాడు గురువు? అనే ప్రశ్న కు సమాధానం.
శ్లో..శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.
అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు అని ఆర్యులు సెలవిచ్చారు.
గురువులలో రకాలు సాయిబాబా జీవిత చరిత్రలో తన గురువుగురించి వ్రాసిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి - "ఆయన నాకేమియు బోధించలేదు. కేవలం నన్ను ప్రేమతో చూసేవాడు. ఆ చూపునకే నాకు సకల విషయాలు అవగతమయ్యేవి".. ఆవిషయాలు "శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారధి  "ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...ఆ మహనీయుడే నీకు గురువు" అని వ్రాశారు..  ఆదిలో శ్రీ దక్షిణామూర్తి శిష్యుల సందేహాలకు మౌనం తోనే సమాధానమిచ్చేవారట.
ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.
  1. సూచక గురువు - చదువు చెప్పేవాడు
  2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
  3. బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
  4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
  5. విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
  6. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
  7. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.
ఈ గురుపౌర్ణిమ..ఆషాడ పౌర్ణమినాడు జరుపుకుంటున్నాం. ఈ ఆషాఢ మాస ప్రాశస్త్యం కూడా కొంచెం చూద్దాం. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన  బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని “బోనం” గా చెప్తారు(భోజనానికి వికృతి పదం) . దీనిని అమ్మవారికి  నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు  కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆషాడం అనారోగ్య మాసం అని కూడా  అంటారు. విపరీతమైన ఈదురుగాలుల తో చినుకులు పడే సమయం ఈ ఆషాడమాసమే. కాలువలోను, నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల లోనికి వచ్చి చేరిన నీరు మలినం గా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసం లోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయం లోనే వివాహాది శుభముహూర్తాలు  ఎక్కువగా ఉంటాయి , ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయం లో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యం తో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి . అల్లుడు అత్తవారింటికి వెళ్ళ  కూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ద్యాస తో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతే కాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను  అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల  ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు….అందువల్ల పెద్దలు నిర్ణయించిన పద్ధతులు చాందసమైనవి తీసి పారేయడం ఏమాత్రం తగదు.
మహాభారత గ్రంధకర్త అయిన "వేదవ్యాస మహర్షి" జన్మించినది  ఈ ఆషాడ పౌర్ణమినాడే.. వ్యాసుడు, పరాశర ముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును "వ్యాసపౌర్ణమి" మరియు "గురుపౌర్ణమి" అని కూడా అంటారు. వాస్తవానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడని భావిస్తారు. ఈ అనంత కాలచక్రంలో ధర్మం కృతయంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కయుగంలో 1 పాదంతో, నడుస్తుందని మనకు తెలుసు. కాలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు ప్రామాణికంగ రాసిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు. వేదమంటే అసలు ఎవరూ రాసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఒక ఉంటుంది. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు.
వ్యాసుడు నల్లగా ఉండేవాడని “కృష్ణుడు”  అని అన్నారు. నివాసము స్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం... కనుక “కృష్ణ ద్వైపాయనుడు” అని అంటారు. వేదాలని విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక “వేదవ్యాసుడు” అని, పరాశర మహర్షి కుమారుడు గనుక “పరాశరాత్మజుడు” అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక “బాదరాయణుడు” అని అంటారు. సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు. మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృఋణము---అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని వేదవ్యాసుడు తెలియచేప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు. గురుశిష్య సాంప్రదాయం ఏనాటిదో ఐనా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను నాల్గింటిని తన నలుగురి శిష్యులకు బోధించి, భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు.
మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి, లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి) నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి... పూజించాలి. ఆ గురువకు పాదపూజ చేసి. కానుకలు సమర్పించి, అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః
"గు" శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. "రు" శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, మనకు జ్ఞాన్నాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము  సాటి గురువులో భగవంతుని దర్శించగల భక్తి భావాలు మనలో రావాలి. "గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.  చివరిగా.. వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన వాక్యం గమనించ దగ్గది. “ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.”  ఎంత గొప్ప విషయాన్ని ఎంత తేలిక మాటల్లో చెప్పారో చూడండి.. ఈ రోజుల్లో ప్రపంచం లో జరిగే ప్రతి అశాంతియుత వాతావరణానికీ ఇది వర్తిస్తుంది. ఆచరణలో చేయగలిగిన నాడు..ఈ భూమండలమే శాంతి ధామమయి.. రామరాజ్యం వస్తుంది కదా!

No comments:

Post a Comment

Pages