ఉండ్రాళ్ళూ-ఉమేశమూ - అచ్చంగా తెలుగు

ఉండ్రాళ్ళూ-ఉమేశమూ

Share This

ఉండ్రాళ్ళూ-ఉమేశమూ

-ఆదూరి హైమావతి


మా ఉమేశానికి ఉండ్రాళ్ళంటే మహా ఇష్టం.వాడూ నేనూ బాల్య మిత్రులమేగాక, ఒకే కార్యాలయంలో ఉద్యోగం నేరపుతున్నాం.మా ఉమేశం వినాయక చవితినాడే పుట్టాడు.వాడి పుట్టుక పెద్ద ప్రహసనం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాడి పిన్నికీ అంటే బాబాయ్ భార్యకూ, వాళ్ళ అమ్మకూ ఒకే మారు కానుపు ఐందిట.మంత్రసాని పుట్టగానే ఇద్దరు పిల్లల్నూ తీసుకెళ్ళి శుభ్రంచేసి వీడ్ని పిన్నిపక్కనా, పిన్నికి పుట్టిన ఆడపిల్లను వీడి అమ్మపక్కనా పడుకో బెట్టిందిట! వీళ్ళామ్మ లబోదిబో నాకుపుట్టింది పిల్లాడు, పిల్లకాదు అని ఒకటేగొడవట! పిన్నేమో ' కాదుకాదు నాకేపిల్లాడు పుట్టింది.’ అదినీపిల్లే ' అనీనీ , చివరకు ఇంటిల్లిపాదీ వచ్చి పిల్లల్ని చూసి,వీడి అమ్మముక్కు పొడవుగా కొనదేలి ఉండటాన, పసిగుడ్డు ముక్కూ అలానే ఉందని పిల్లాడ్నికనింది వీళ్ళమ్మేనీ, పిన్ని ముక్కు చిన్నదిగా ఉండటాన ఆ పాపాయి ముక్కు చిన్నది గనుక పాపాయిని కనింది పిన్నేననీ తీర్పు ఇచ్చాక,బాలింతలు ఇద్దరూ గమ్మునైపోయారుట! అప్పటికీ చాటుమాటుగా వాళ్ళపిన్ని వీడికితన చనుబాలు పట్టి తృప్తిపడేదిట ! కాస్తంత పెరిగాక వీడిరూపు అచ్చంవాళ్ళమ్మలా ఉన్నట్లు కార్బన్ కాపీ అనితెల్సి వాళ్ళపిన్నిగమ్మునైపోయిందిట! అలావాడు ఇద్దరు తల్లుల చనుబాల ముద్దులకొడుకై బాగా బలంగా పెరిగాడు. వినాయకచవితినాడు పుట్టినందున వినాయకునిలాగే ఉంటాడు.వాళ్ళ బామ్మ చాలారోజులు వీడిపుట్టుక ప్రహసనం చెప్పి, చెప్పీ బోసినవ్వు నవ్వుతుండేది.
వినాయకచవితినాడు పుట్టడంతో నైవేద్యానికి చేసే ఉండ్రాళ్ళే వీడి పుట్టినరోజు ఫలహారాలయ్యాయి.అందుకేనేమో మా ఉమేశానికి ఉండ్రాళ్ళంటే మహా ఇష్టం.అప్పుడప్పుడూ ఉండ్రాళ్ళు ఫలహారానికి చేయమని వాళ్ళమ్మని గొడవచేసేవాట్ట. ఆమె అవి తినీతినీ వీడిపొట్టా, గణపతిపొట్టలా అవుతోందని భయపడి, " తప్పుబాబూ! ఉండ్రాళ్ళు వినాయకచవితి నాడే చెయ్యాలి, గణపతికి నివేదన చేసి మనం తినాలి, " అని చెప్పేదట !
దానితో మా ఉమేశానికి ' ఉండ్రాళ్ళ ' పిచ్చి ముదిరిపోయింది. ఎక్కడైనా కొనుక్కుతిందామన్నా ఉండ్రాళ్ళు ఏస్వీట్షాపులోనూ దొరకవాయె! .వినాయకచవితి వెళ్ళగానే" అమ్మా! మళ్ళావినాయకచవితి పండుగ ఎప్పుడొస్తుందే?" అని అడిగేవాట్ట! రానురానూ వీడి ఉండ్రాళ్లపిచ్చిఅందరికీ తెల్సి‘ ఉండ్రాళ్ళఉమేష్ ‘ గా ఇంటిపేరే మారిపోయింది. ఎలాగో చదువుపూర్తై ఇద్దరమూ ఒకే కార్యాలయోజ్యోగులమయ్యాం.మా ఇరువురికీ వివాహాలయ్యాయి. నాకు ముందు, ఒకనెలకే మా వాడికీనీ.
పెళ్లిచూపుల్లో వాళ్ళ అమ్మతో మెల్లిగా" ఉండ్రాళ్ళు చేయటంవచ్చో రాదో,కనుక్కోమని “చెవిలో గుసగుస లాడగా , ఆమె గుడ్లురిమి చూసిందిట! నోరుమూసుకోమని. పెళ్ళాయ్యాక , తమాషాగా వినాయక చవితిరోజే వీడిఖర్మకాలి మొదటిరాత్రైంది. అందంగా ఉంటుంది ఉమేష్ భార్య సత్యభామ. పాలగ్లాసుతో గదిలోకొచ్చిన భామతో ముందుగా మావాడు అడిగిందేంటో వింటే ఎవరికైనా నవ్వాగదు.
" ఈరోజు వినాయక చవితికదా !మీ ఇంట్లో ఉండ్రాళ్ళు చేసుకోరా?" అని. పాపం సత్యభామ పిచ్చిచూపు చూసిందిట! ఐనా మావాడు " అదే వినాయకునికి ఉండ్రాళ్ళునివేదన చేయరా?మా అమ్మ ప్రతి వినాయక చవితికీ చేసి నివేదన చేస్తుంది."అన్నాట్ట మళ్ళానూ.
ఆమె వెంటనే గది బయటికెళ్ళి"అమ్మా! ఆయనకు వినాయక చవితి ఉండ్రాళ్ళు కావాలిటే!" అని అడిగిందిట వాళ్ళామ్మను. ఆమెకు ఏమీ అర్ధంకాక " ఈరోజు అల్లుడు వస్తున్నాడని వినాయక చవితి ప్రత్యేక వంటలు చేయకుండా మామూలు స్వీట్స్ చేశానే ! ఉండు అన్నను స్వీట్ షాపుకు పంపి ఉన్నాయేమో చూడమంటాను."అని వాళ్ళబ్బాయిని స్వీట్ షాపుకు పంపిందిట.కాలం మారిపోయిందాయె , ఈరోజుల్లో చదువుకున్న చాలా మంది అమ్మాయిలకు' ఉండ్రాళ్ళు ' చేయటం రాదనేమోని ' పుల్లారెడ్డి’ స్వీట్ షాపులో ఉండ్రాళ్ళూ దొరుకుతున్నాయి! ఉండ్రాళ్ళు ఒక కిలో తీసుకువచ్చాట్ట పెళ్ళికూతురు అన్నగారు. పెళ్ళికూతురు తల్లి అవన్నీ ఒక ప్లేట్ లో సర్ది, లోపలికి పంపిందిట!
" చాలా థాంక్స్ సత్యా! నాకు వినాయక చవితికి ఉండ్రాళ్ళు తినే అలవాటు చిన్నతనం నుండీ, ఉంది. పైగా ఈరోజే నాపుట్టినరోజు కూడానూ. నీకు ఉండ్రాళ్ళు చేయటం వచ్చుగా ? రాకపోతే నేర్చుకో మీ అమ్మదగ్గర.." అంటూ ఉండ్రాళ్ళు లాగి స్తున్న తనభర్త ఉమేష్ ను చూస్తూ లోలోపల నవ్వుకుందిట తొలిరేయి కొత్తపెళ్ళి కూతురు. అదండీ మా ఉండ్రాళ్ళ ఉమేష్ కధాకమామీషూనూ.
***************************************

No comments:

Post a Comment

Pages