స్పూర్తి 


నమస్కారం ! ఉదయాన్నే ఉత్తేజకరమైన మంచి మాటలు ఉంటే, రోజంతా సంయమనంతో, ఉత్సాహంతో గడపగలుగుతాము కదా ! అందుకే మీకు స్పూర్తిదాయకంగా ఉండేందుకు ప్రారంభించినదే ఈ 'స్పూర్తి' శీర్షిక. చదవండి... చదివించండి...  

దైవం ఉండేది ఎక్కడ?

- భావరాజు పద్మిని 

అయ్యో, అది కూడా తెలీదా? గుడిలో ఉంటారండీ. అందుకే ,గుడిని చాలా శుబ్రంగా ఉంచుతారు. రోజూ తుడుస్తారు, కడుగుతారు, గ్రహణాలు వస్తే సంప్రోక్షణ చేస్తారు. ఎటువంటి అమంగళ కరమయిన పనులు జరుగకుండా, నిరంతరం ఆలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. సరే, అంతేనా, కేవలం గుడిలోనే దైవం ఉంటారా? ఈ సందర్భంగా ఎప్పుడో చదివిన చిన్న కధ జ్ఞాపకం వస్తోంది. నిండు సభలో, ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోంది. ' హే ద్వారకావాసా ! శరణు ' అంది ద్రౌపది. బదులు లేదు. 'హే మధురాపురి నివాసా! రక్షించు.' అని వేడుకుంది. బదులు లేదు. 'హే హృదయవాసా! అంతర్యామి. నీవు తప్ప వేరు దిక్కు లేదు ', అంటూ అర్ధించింది. వెంటనే కరుణించాడు ఆ దయాసముద్రుడు. అంటే...దేవుడు ఎక్కడో ఉండడు ,భగవంతుడి స్థానం మన మనస్సు. దైవ మందిరాన్ని యెంత పవిత్రంగా ఉంచుతామో, మనస్సనే మందిరంలో దైవం కొలువుండాలంటే, అది అంతే పవిత్రంగా ఉంచాలి . కాని, మనం ఏమి చేస్తాం ? ఈర్ష, అసూయ, ద్వేషం, వైరం, కుళ్ళు, కుతంత్రం...ఇవన్నిటినీ మోసుకు తిరుగుతూ వ్యాపింప చేస్తాం. చెప్పండి, ఇటువంటి దుర్గంధపూరితమయిన వాతావరణంలో దైవం ఎలా ఉంటారు ? అసంభవం...అందుకే 'నాది...నాది ...' అని తపించే వాళ్లకి ఏదీ మిగలదు . నిజానికి ఏది నాది? అశాశ్వతమయిన ఈ జీవితంలోని ప్రతీ క్షణంలో ఏదీ నాది కాదు. ఈ నిముషంలో నాతొ ఉన్నవారు మరునిముషంలో ఉండరు. రాబోయే గంటలో నా జీవితం ఏ మలుపులు తిరుగుతుందో నాకు తెలీదు. కనిపించే అందరూ, వాళ్ళ మమతలు, పగలు, అసూయలు...అన్నీ అశాశ్వతమే. మరి మనం పుట్టింది ఎందుకు ?వీటన్నిటికీ అతీతమయిన, శాశ్వతమయిన దైవాన్ని తెలుసుకోవడానికి . అమృతమయమయిన దైవ ప్రేమను అనుభూతి చెందడానికి. కాని, 'నేను, నాది' అనే మాయ పొర మనకు, దైవానికి మధ్య అడ్డుతెర.ఆ తెర తొలగించి, ఒక్క సారి కనిపించే అందరిలో, అన్నిటిలో దైవం కొలువున్నారన్న నిజాన్ని దర్శించగలిగారా ...ఇక మీ జీవితం ధన్యం . ఎవరి మమతలూ మిమ్మల్ని కట్టి పడెయ్యవు . ఎవరి మోసం మిమ్మల్ని బాధించదు. అమృతం తాగిన వాడికి పటికబెల్లం చూపించి, ఇది తియ్యగా ఉంటుంది, తిను అంటే, ఎలా ఉంటుందో, ఇతరులకు మీ పట్ల ఉన్న భావనలు, ఆ దైవం అందించే దివ్యప్రేమ ముందు తృణ ప్రాయాలు . నవ్వినా, ఏడ్చినా, కళ్ళు మూసినా, తెరచినా, చివరికి పిడుగు మీ తల మీద పడ్డా, కళ్ళ ముందు అనుక్షణం దైవం నవ్వుతూ అనునయిస్తుంటే, ఆనందంగా విషాన్నయినా త్రాగాగలం. ఈ స్థితి కోసం ప్రయత్నించండి. శివావరణ లో ఉన్న మీరు, 'శివుడు' కొలువున్న ప్రతీ ప్రాణినీ శివునిగానే భావించి ప్రేమించండి. ప్రతీ వ్యక్తినీ వారి లోపాలు, సుగుణాలతో సహా అంగీకరించి ప్రేమించండి...ఇదే నిజమయిన ప్రేమకు నిర్వచనం. ఇది ఆచరించడం కష్టమే, అయినా మనం వేసే ప్రతీ అడుగు దైవాన్ని సమీపించే ప్రయత్నంగానే ఉండాలి . ఆ పరమేశ్వరానుగ్రహం మీ పై పరిపూర్ణంగా ప్రసరించుగాక. శుభమస్తు.
       

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top