రాజిగాడు

- ప్రతాప వేంకట సుబ్బారాయుడు


‘రాజిగా, ఏమయిందిరా నీకు? మేమందరం మట్టితోటె జత కట్టినం, నువ్వన్నా సక్కగ దొరబాబులెక్క ఉంటవు సదూకొమ్మని నాయనతోని గొడవపడి నిన్ను పట్నం పంపిన, పైసలకు మేము తన్లాడుతున్నా గది నీకు తెల్వనీయకుండా ఎప్పుడుగావల్నంటె అప్పుడు అమ్పినం. ఎవరన్నా అడిగినా అడగకున్నా ‘మావోడు పట్నంల సదువుతున్నడని’ గొప్ప సెప్పుకునెటోల్లం, నీ మీదనే పానాలు పెట్టుకుని బతుకుతున్నంర. గిట్ల అర్దంతరంగా సస్తావురా? గసలు సదువుమాని పోర్లెంబడ బడుడేందిరా? నువ్వు గీ పట్నం వచ్చెదాక ఊర్ల ఎట్లుండెటోనివి?’
 ‘దేవమ్మా! నీ కొడుకు మంచిగ చదువుతాడే, ఆడిని పట్నం పంపించి జదివిస్తే..ఇగ సుక్కల మధ్య సంద్రుడేనే, ముసలోల్లు అయినక మిమ్మల్ని మస్తు బద్రంగా సూసుకుంటడు, కాలు కిందపెట్టనీయడే’ అని పంతుల్లు దినాం సెబుతుండెటోల్లు, ఊర్లందరూ నిన్ను మెచ్చుడే కదరా, గసలు అయన్నీ చూసే నిన్ను పట్నం బంపిన. గా పోరి యనకాల బడి కత్తితొ గొంతుకోసి, ఏందిరా ఇయన్నీ, నువ్వే సేసినావురా ఇంత ఆగం? నీ అయ్య కోడిని కోస్తుంటె సూడలేకపోయెటోనివి మనసు మా మెత్తంగా వుండెడిది, గంత పని ఎట్ల చేస్తివిరా కొడక? లోకమంతా ఇప్పుడు నిన్ను ఏలెట్టి సూపబట్టె, నువ్వు సచ్చినందుకు..అదీ పిచ్చికుక్కలెక్క సచ్చినందుకు నా కన్నపేగు మండిపోతందిరా. నిన్ను కోడిలెక్క రెక్కల కింద పెట్టుకుని సాకినాను. తల్లిని కదరా, ఊకుండగలనార. గా పాడుపని సేసేటప్పుడు నీ మీదే పేనాలు పెట్టుకున్న నేను యాదికి రాలేదురా? నీ చెల్లన్నా యాదికొచ్చుండదు, లేకుంటే గట్ల సేసేటోనివార?’ గుండెలు బాదుకుంటూ మార్చురీలో వున్న కొడుకు శవం దగ్గర శోకాలు పెడుతోంది దేవమ్మ. తండ్రి చంద్రయ్య మోకాల్ల మధ్య తలపెట్టుకుని ఓ మూల కూర్చున్నాడు.
ఊర్లో సగం మంది అక్కడే వున్నారు. పేపరు వాళ్ళు, టీ వీ ల వాళ్ళతో ఆ ప్రదేశం హడావుడిగా వుంది. దేవమ్మ కడుపుశోకాన్ని అర్జెంటుగా టెలికాస్ట్ చేసి లబ్ది పొందాలని చూస్తున్నారు. సమయం చిక్కితే ఇంటర్వ్యూ చేసి ‘అలాంటి కొడుకుని అసలు ఎలా కన్నారు? పెంచారు? ఊర్లో వున్నప్పుడు ఇలాంటి కీచక పనులే చేసేవాడా?’ అని అడగడానికి ఛానల్ వాళ్ళు మైకులు పట్టుకుని కాచుకునున్నారు.
అత్యంత పాశవికంగా..హేయంగా కనిపించే ఆ సంఘటనకి నేపథ్యం-
******
రాజిగాడు పట్నం కాలేజీలో చేరి నలుగురు స్నేహితులతో హాస్టల్లో వుంటున్నడు.
స్వతహాగా తెలివైన వాడు అవడంతో లెక్చరర్లకి, తోటి విద్యార్థులకి దగ్గరయ్యాడు. ఒకరోజు-
అతని రూమ్ కి రాణి వచ్చింది. రాణి రాజిగాడి క్లాస్‍మెట్. రాజిగాడు ప్రిపేర్ చేసిన నోట్స్ కోసం వచ్చింది. మిగతా ముగ్గురికి అది ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే? రాణి ఎవరితో మాట్లాడదు. తన పనేదో తనే చేసుకుంటుంది. మంచిగా చదువుతుంది.
ఆమె నోట్స్ తీసుకెళ్ళాక, "అన్నా! ఏందే నీ గురించి రాణి మన రూమ్‍కి వచ్చింది."ముగ్గురూ అతడి మీద పడి కిత కితలు పెడుతూ అన్నారు.
"గదేం లేదురా బయ్! బుక్ తీస్కపోనిక వచ్చింది"
"మాకు చెప్పకె..ఎవ్వనితోనీ మాట్లాడది..నీ కోసం రూముదాక వచ్చిందంటె..ఆ..ఆఁ"
"వదలండిరా బయ్" అని తప్పించుకుని బయటకి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఆమె చాలాసార్లే అతనితో మాట్లాడింది. సబ్జెక్ట్స్ లో వున్న తన డౌట్స్ తీర్చుకునేది. ఆమెకి అతడంటే. అతడి తెలివంటే చాలా అభిమానం. లెక్చరర్ల తర్వాత, విషయం సులభంగా అర్ధమయ్యేట్టు చెప్పేది అతడే అనుకునేది.
ఓ మొగ ఆడ ఆకర్షణకి మూలం ఏర్పడేది చదువుకునే యుక్త వయసులోనే. ప్రేమ కథలు, సినిమాలు మైకం కమ్మించేది ఆ ప్రాయంలోనే. ఉడుకురక్తం ప్రవహించేది, అనుకున్నదానివైపు అడుగులేయించేదీ కూడా ఆ వయసే!
మామూలుగా మాట్లాడినా, ప్రేమ అనుకుని భ్రమ పడడం, కాదని తెలిసినప్పుడు మనశ్శాంతి కోల్పోయి నిద్రాహారాలు మానెయ్యడం కూడా ఆ వయసుకి మామూలే!
రాజిగాడు, రాణి కల్మషం లేకుండా కలసి తిరగడం, చదువులో పోటీ పడడం మిగతా ప్రపంచానికి ‘వాళ్ల మధ్య ప్రేమేమో’ అన్న భావన కలిగించింది.
వాళ్ళ బ్రాంచ్ లో మరో కాలేజీనుండి  ట్రాన్స్ ఫర్ పెట్టించుకుని వచ్చి చేరాడు అవినాష్.
అవినాష్ కూడా తెలివైనవాడు. ముఖ్యంగా కొన్ని సబ్జెక్ట్స్ లో పాదరసమే! అది గ్రహించింది రాణి. అతడితో కూడా డౌట్స్ క్లారిఫై చేయించుకునేది.
ఆ ముగ్గురూ కలిసే వుండేవారు. వాళ్ళ ప్రపంచం చదువే!
కానీ చుట్టూవున్న వాళ్ళకి, విధికీ రోజులు సాఫీగా సాగితే ఎలా?
ఒకరోజు-
"అన్నా. ఏందే ఇది? వదిన గా అవినాష్  గాంతోని తిరుగుతున్నది? ఆడు అచ్చినకాడ్నించి చూస్తున్నాం. నిన్ను పటించుకుంటలేదు."కోపంగా అన్నాడు రాంబాబు.
"వదినా? ఎవరు?"ఆశ్చర్యంగా అడిగాడు.
"ఏందే గట్లా మాట్లాడుతావు, తెల్వనట్లు? రాణి"
"తప్పురా, మేము చదువు గురించే మాట్లాడుకుంటాం. మీరు గట్లనుకునుడు తప్పు"
"లేదన్నా, పోర్లంతే మగాళ్ళని మోసం చేనీకనే పుడ్తరు. చాల్దినాలనుండి వదిన నిన్ను అస్సలు పట్టించుకుంటలేదు. నీకెట్లుందోగాని మాకైతే మనసు సుదరాయించట్లేదు."
ఆ తర్వాత గంటసేపు అదేవిధంగా అందరూ అతడి మనసులోకి మాటలతో విషం నింపారు.
‘వాళ్ళు తన దోస్తులు. వాళ్లన్న దాంట్ల నిజం వున్నది. మొన్నటిదాంక తనతోటిదే లోకం అన్నట్లు వుండె, గా అవినాష్ గాడొచ్చిన కాడ్నించి మాట్లాడ్తలేదు, సూస్తలేదు’ రాజిగాడి మనసు అగ్నిపర్వతమైంది, రక్తం సల సలా మరుగుతోంది.
రాణిని ఒంటరిగా కలిసి ఆమె చెయ్యి పట్టుకుని "రాణీ, నువ్వు ఆ అవినాష్ గాంతో మాట్లాడొద్దు ఇగ"అన్నాడు.
"అదేంటి, నాకు చదువు విషయంలో నువ్వెంతో అవినాష్ అంతే, నువ్వెవరు నన్ను ఆయనతోని మాట్లాడొద్దు అన్నీకే" కోపంగా అంది.
"నేను సీరియస్ గా చెబుతున్నా నువ్వు ఆంతోని మాట్లాడొద్దు అంతే"
చెయ్యి విసురుగా విడిపించుకుని రాణి వెళ్ళిపోయింది.
రోజులుగడుస్తున్నాయి.
అవినాష్, రాణి కలిసి యాదృఛ్ఛికంగా మాట్లాడుకుంటూ రాజిగాడికి కనిపించినా, చుట్టూ ఉన్న సోపతిగాళ్ళు ‘చూసినవ అన్నా, కావాలని రాణొదిన గట్ల చేస్తున్నదె, నిన్ను బనాయించనీకి! నువ్వేదోకటి చెయ్యాల్నె’ అనడం రాజిగాడి ఒంట్లో రక్తం సక సక ప్రవహించి ముఖానికి చేరి ఎర్రబడడం ఎక్కువైంది.
ఓ మధ్యానం-
క్లాసయింతర్వాత  బయటకెళుతూ రాణి అవినాష్ ని నోట్స్ ఇవ్వమని రిక్వెష్ట్ చేసింది.
ఆ వెనకే వున్న రాజిగాడు రాణి చెయ్యి పట్టుకుని"నోట్స్ నా దగ్గరా వుందిగా, వొద్దన్నా వాడినెందుకు అడుగుతావ్"అని కోపోద్రిక్తుడయ్యాడు.
రాణి విడిపించుకుని సరాసరి ప్రిన్సిపల్ దగ్గరకెళ్ళి కంప్లయింట్ చేసింది.
ప్రిన్సిపల్ రాజిగాడిని పిలిపించి ‘చక్కగా చదువుకునెటొడివి, నీకేమైంది? ఇంకోపాలి ఇట్లకాకుండా చూసుకో, యాక్షన్ తీసుకుంటే నీ కెరీర్ ఖరాబౌతది’ అని మందలించాడు.
దాంతో రాజిగాడి మనసు వికలం అయిపోయింది. స్నేహితుల ఎత్తిపొడుపులు, రాణి ప్రవర్తన గుండెని భగ్గున మండించింది.
చర చర గేటు బైటకెళ్ళి అక్కడ కొబ్బరిబొండాలు కొడుతున్న వాళ్ళ దగ్గర కత్తి లాక్కుని ఆమెని కాంపస్ అంతా భయంతో పరుగులు పెట్టించి కస్సున మెడలో దించాడు. ఆమె మొదలు నరికిన చెట్టులా నేలపై కూలిపోయింది. క్షణాల్లో ఆమె చుట్టూ రక్తపు మడుగు. అందరి గుండెలు భయంతో అదిరిపోతున్నాయి. నోళ్ళు పిడచకట్టుకు పోతున్నాయి. కాలేజీ నుండీ బయటకి పిచ్చిగా పరుగులు తీసారు.
అతడి కోపం, నీళ్ళు చిలకరించిన పాల పొంగులా చల్లారింది.
అమ్మా, నాన్న, చెల్లీ, చదువుకు పైకి రావాలన్న తన ధ్యేయం అన్నీ గుర్తుకొచ్చాయి. ఏడుస్తూ, నిలువెల్లా వణకుతూ కుప్ప కూలిపోయాడు. అంతలోనే లేచి పరుగెడుతూ కాలేజ్ పై అంతస్తుకెళ్ళి అక్కడినుండీ కిందకి దూకేశాడు.
*****
రాజిగాడి జీవితం అలా విషాదంగా ముగిసింది.
అమ్మకి గర్భశోకాన్ని మిగిల్చింది.
నాన్నకి ఆసరా లేకుండా పోయింది.
చెల్లెకి తోడు దూరమైంది.
విజ్ఞానపు మెట్లెక్కుతూ ఆకాశపుటంచులు అందవలసిన రాజిగాడు స్నేహితుల మాటలు విని, క్షణికోద్రేకంతో, తప్పుచేసి తిరిగిరాని లోకాలకి చేరిపోయాడు. మచ్చలేని చంద్రుడిలా తమ బిడ్డను చూసుకోవాలన్న వాళ్ళ కుటుంబం ఆశల్ని మట్టిలో కలిపేసి, తల్లిదండ్రులకు మాయని మచ్చమిగిల్చాడు.
చెప్పుడు మాటలువిని, ఆవేశంలో విచక్షణ మరచి ప్రవర్తించే నేటి యువతకు రాజిగాడి కధ ఒక ప్రమాద ఘంటిక కావాలి.
******

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top