‘మాస్టారూ...మీరే మా 'స్టారు'! - అచ్చంగా తెలుగు

‘మాస్టారూ...మీరే మా 'స్టారు'!

Share This

‘మాస్టారూ...మీరే మా 'స్టారు'!

- నండూరి సుందరీ నాగమణి


మీరున్నంత కాలం...తెలుగు పాట...గర్వంగా తల ఎత్తుకు తిరిగింది... 
మాధుర్యానికి మారుపేరైన మీ కంఠసీమలో కొలువై నిలిచిపోయింది...

మీరు పాడుతూ ఉంటే... అమృతం ధారగా జాలువారింది... 
ఆ గానం రేడియో పెట్టెలో ప్రతి ఇంటా మారు మ్రోగిపోయింది...

బంగారాన్ని కరిగించి మీ గళంలో పోసాడా ఆ దేవదేవుడు? 
ఆర్ద్రతను మేళవించి మీ గాత్రాన్ని చేసాడా ఆ బ్రహ్మదేవుడు?

లాలిపాటలైనా, భక్తి పాటలైనా, ప్రేమగీతాలైనా, విప్లవ గీతాలైనా... 
విషాద గీతాలైనా, విరహ గీతాలైనా, మమత గీతాలైనా, లలితా గీతాలైనా...

దేశభక్తి గేయాలైనా, జానపద గేయాలైనా...
హుషారు గీతాలైనా, హాస్య గీతాలైనా...
 మీ గాత్రంలో...ఇట్టే ఒదిగిపోతుంది 
ఆ భావం...ఇట్టే ఒలికిపోతుంది తీయదనం...

నవరసాలు...నవ విధాలుగా పోకడలు పోతాయి మీ గొంతులో... 
ఏ స్వరమైనా మీ స్వరంలో పలికాక, జీవ స్వరమే అవుతుంది...
సరిగమలు కొత్త నడకలు నేర్చుకున్నాయి మీరు పాడుతూ ఉంటే... 
రాగాలు గారాలు పోతూ...మరింత మధురమయ్యాయి మీరు బాణీలు కడుతూంటే...

హిందుస్థానీ, కర్ణాటక సాంప్రదాయాలు...
పౌరాణిక, జానపద బాణీలు... 
పాశ్చాత్య వరుసలు, బెంగాలీ సంగీతం...
ఏ మధురిమనూ వదలలేదుగా మీరు!

మీరు ఆంధ్రభూమిలో జన్మించటం మాకు దక్కిన వరం... 
సినీ సంగీతలక్ష్మి సిగలో వాడని పూవు మీ స్వరం...
నేడే మీ పుట్టిన రోజు... మీకు పరోక్ష విద్యార్థులమైన మేమంతా... 
భక్తి ప్రపత్తులతో...మీకు తెలియజేస్తున్నాము మా జోహారులు...జోతలు...
దయచేయండి ప్రేమతో, వాత్సల్యంతో మీ దీవెనలు....ఆశీస్సులు... 
వినమ్రంగా వంచిన మా శిరస్సులపై...సేసలుగా...జాలువారగా...
[అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారికి భక్తిపూర్వకంగా]
****

No comments:

Post a Comment

Pages