మంచి సలహా                                                  

 వడ్లమాని బాలా మూర్తి  


“ఏమైంది జయంతీ? అలా డల్ గా కూర్చున్నావూ “?
“అబ్బా తల బద్దలై పోతోంది ఉమా.  మా అత్తగారితో రోజు గొడవే. ఎలా చేసినా,  ఏం చేసినా ఆవిడకి నచ్చదు”.
“పోన్లే జయంతి, ఎంతయినా పెద్దవాళ్ళు కదా. మనమే సర్దుకు పోతుండాలీ.”
“ ఏం సర్డుకుపోవడమో! తెల్లారి ఒక్క నిమిషం ఆలస్యంగా లేస్తే సణుగుడు. ఆఫీస్ కి ఆలస్యమై పోతోందని, టిఫిన్ సర్డుకోకుండా వచ్చేస్తే మళ్లీ ఓ లెక్చరు! ప్రాణానికి సుఖం లేదనుక్కో. నీకు నా ప్రాబ్లెంఅర్ధమవదు! నీకైతే చక్కగా అర్ధం చేసుకొనీ, నీతో సహకరించే అత్తగారుంది.”
“చూడు జయ, చప్పట్లు రెండు చేతులతో తడితేనే చప్పుడౌతుందని మన పెద్దవాళ్ళంటారు”. “అంటే నాది కూదా తప్పుందంటావా”?
“నేనలానలేదు. ఒక్కటాలోచించూ, ఆవిడ నీకు అన్నింట్లోనూ సహాయం చేస్తుందా”?
“అంటే నేను లేనప్పుడు తనే చూసుకుంటుంది. పొద్దున్న, మడిగా చేసుకోవాలనీ వంట ఆవిడే చేసుకుంటుంది. పిల్లలూ స్కూల్ నుంచి వచ్చేక వాళ్ళకీ పాలు కలిపీ ఇయ్యడం ఆవిడే చూసు కుంటుంది. రాత్రి వంట నేనే చేస్తాను. పిల్లలిని తయ్యరుచేసి స్కూల్ కి పంపడం, వాళ్ళ హొమ్ వర్కులు  చేయించడం  నేనూ మా ఆయనా చూసుకుంటాము”.
“సరే నువ్వెప్పుడైనా ఆవిడ తరఫు నించీ ఆలోచించావా?”     “అంటే?”
“ఆవిడ ఎక్కడి కైనా వెళ్తుందా?”
“ఆదివారం నాడు గుడికీ వెళ్తారు. ఏదైనా పెళ్ళి ప్రసంగం వస్తే తీసుకేదతాం. మా ఆయన ఒక్కరే సంతానం కనుక వేరే ఎక్కడకి వెళ్ళరు. మా పక్కింటి పిన్నిగారితో కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటారు.”
“ఏమిటి? ఏదో సీరియస్ గా మాట్లాడేసుకుంటున్నారు?”
“రా రా సునందా! జయంతికి తల నొప్పిగా ఉందట, కారణాలు అడుగుతున్నాను.”
“ఏమైందీ? మళ్లీ అత్తగారి ప్రబ్లమా? ఏదో విసుక్కున్నా, తిట్టుకొన్నా అత్తగారైతే సర్దుకు పోతారు. మా కైతే.... ఏం చెప్పను! ఆ శివమ్మ వచ్చేదాకా భరోసా లేదు . ఏడున్నరకల్లా రావాలనీ  చెప్పేపెట్టుకున్నామా. అది ఒక్కనాడు ఎనిమిదిన్నరకు ముందు రాలేదు. పిల్లల ఆటోవాడు అదే టైమ్కి వస్తాడు. పిల్లల్ని సమయానికి తయ్యారు చెయ్యడం, డబ్బాలు, పుస్తకాలు సర్ది పంపడం చేసేప్పడికి,మా ఆయన టిఫిన్ కి వచ్చేస్తారు. మా ఇద్దరి బాక్స్ లు సర్దే సరికీ తొమ్మిదై పోతుంది. నాకు టిఫిన్ తినే సమయం కుడా ఉండదు.  రోజూ ఆదరాబాదరాగా ఆఫీసుకి రావడమే. జీవితమంటే విసుగు,విరక్తీ వచ్చేస్తోందనుక్కో. దీనికి తోడూ ఏదో ఒక కారణం చెప్పి నెలలో మూడో నాలుగో డుమ్మాలు, సరే ఆదివారం సెలవు సరేసరి.   ఓకే బై, నేను  వెడుతున్నా నాకు అర్జెంట్ గా ఫైల్ పంపాలి”. అనీసునంద వెళ్ళిపోయింది.
“జయంతీ! మొదట్లో మా అత్తగారితో నాకూ ఘర్షణలైయ్యాయి. ఓరోజు నేను మా ఆయనా ఈ విషయం గురించీ డిస్కస్ చేసుకున్నాము. ఆయనే అన్నారు నువ్వు పిల్లలిని చూసుకుందుకుపనిమనిషినే పెట్టుకున్నావనుక్కో, నువ్వు దాని కండిషన్స్ కి వప్పుకుంటావు కదా, అలాగే అనుక్కొని అమ్మ కండిషన్స్ కీ వప్పుకో. అప్పుడు నీకు గొడవ ఉండదుగా అన్నారు. ఆలోచిస్తే అదినిజమేగా అని అనిపించింది. మా అత్తగారితో కుర్చునీ ఓ రోజు ఇద్దరం  ఈ ప్రాబ్లెం గురించీ మాట్లాడుకున్నాము. నేను నా ఆఫీసు, దాన్లో ఉండే సాధకబాధకాలు వివరించాను. ఆవిడ “నాకేం బాధ లేదే,ఏదో వయసు పైన పడుతోందా, మునుపటిలాగా చేయలేక పోతున్నాను. ఒక్కొక్కసారి విసుగు కోపం వస్తున్నాయి. అదీ నా మీదే సుమా”.
“సరే అత్తయ్యా నేనో పని చేస్తాను, రోజూ రాత్రిపూట నేను కూరలన్నీ తరిగి రెడీగా పెట్టేస్తుంటాను. పొద్దున్న కాఫీ టిఫిను నేను చేసేస్తాను. మీరు మీ నిత్యకృత్యాలు పూర్తీ చేసుకునీ పూజముగించీ, వంట మొదలు పెట్టొచ్చు. రాత్రి రొట్టెలు కూరా నేనోచ్చి చేసేస్తాను. అని చెప్పి. ఆవిడకి కొచెం రిలీఫ్ ఇచ్చేను.  అదేకాకుండా  ఆవిడ  గుడిలోనీ స్నేహితురాళ్ళందరి తో కలిసీ ఏడాదికి ఒక సారియాత్రలకు వెడతారు. అప్పుడు మా వెకేషన్ కుడా ప్లాన్ చెసేసుకుంటాము. కుదరక పోతే మేమిద్దరమూ వంతులవారిగా సెలవు తీసుకొని, పిల్లల్ని చూసుకుంటాము, ఆవిణ్ణి యాత్రలకు పంపుతాము.ఆవిడకీ ఈ వయసులో గుళ్ళూ గోపురాలు చూడాలనే కోరికా తీరుతుంది, రోజువారీ పనులతో కాస్త వెసులుబాటు కలుగుతుంది. ఆవిడ పుట్టిన రోజున, సంక్రాంతి, దసరాకి కొత్త చీర కొని పెడతాను. అదిఆవిణ్ణి కూడా తీసికెళ్ళి, ఆవిడ కి నచ్చినది కొంటాను. ఇది కాకుండా, ప్రతీ నెలా పాకెట్ మనీ గా ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెడతాను. ఆవిడ కూడా పిల్లల పుట్టినరోజులకి, మా పెళ్లి రోజుకీతోచినది మా చేతిలో పెడతారు. ఇలా మేమిద్దరమూ, ఏ గొడవలు లేకుండా హాయిగా ఆనందంగా గడిపెస్తున్నాము”.
“ఉమా నువ్వు చెప్పింది విన్నాక, నేను మా అత్తగార్ని అర్ధం చేసుకోలేదు అనిపిస్తోంది. నిజమే నేను మూర్ఖంగా ప్రవర్తించాను. చాలా థాంక్స్ ఉమ! నేను ఇవాళే ఆమెతో నా ప్రొబ్లెంస్ చెప్పి ఆవిడసలహా తీసుకుంటాను. బై “!
జయంతి మూడు వారాలు సెలవు తీసుకొని ఆఫీస్ కి వస్తుంది.
“హాయ్ ఉమా! హాయ్ సునందా! ఐ అమ్ వెరీ హాపీ! చాలా ప్రశాంతం గా ఉన్నాను. థాంక్స్ టు ఉమా! నీ సలహా బాగా పనిచేసింది. మా అత్తగార్కి నా ఆఫీస్ విషయాలు, నేను ఎదుర్కొనే సాధకబాధకాలు చెప్పెను.  మొన్న మా చుట్టాలు కాశి, ప్రయాగ టూర్ వెడుతుంటే మా అత్త గార్ని పంపేము. పది రోజులు నేను ఇంటినీ, పిల్లల్ని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాను. పిల్లలు కుడాచాలా సంతోషంగా ఉన్నారు. మా అత్తగారు తిరిగీ వచ్చేక అక్కడి కబుర్లు చెబుతూ ఉత్సాహంగా ఉన్నారు. ఆవిడ నాతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇంట్లో వాతావరణం చాలాప్రశాంతం గా ఉండనుక్కో! ఆవిడ తిరిగి వచ్చేకా ఇంకో రెండు రోజులు, ఇంట్లో అందరం కలిసీ సరదాగా గడిపేసాము. నిన్న మా అత్తయ్య మినప సున్ని ఉండలు చేసారు.మీ అందరికీ రుచిచూపించమని బాక్స్ లో పెట్టి ఇచ్చారు. అందరూ తీసుకోండి”.
“చాలా బాగున్నై సున్నుండలు జయంతి. నీ సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది”! “ఉమా, అంతా నీ సలహా వల్లే. నీ మంచి సలహాకు జే జేలు.”
*****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top