మల్లెలా పరిమళించండి

జి.నారాయణరావు


సన్నజాజులు పూసినట్టుగా మల్లెలు పూయవు.
మనసు వస్తే చల్లగా మబ్బు పట్టినట్టుగా, మనసు వస్తే మగనికి నచ్చిన చీర వెతికి కట్టినట్టుగా, మనసు వస్తే పురినంతా విప్పి నెమలి దుమికి దుమికి ఆడినట్టుగా, మనసు వస్తే టపటపమని వడగండ్లుగా రాలి చిత్తడిగా చిట్లినట్టుగా మనసు వచ్చినప్పుడే పూస్తాయవి.
ఎండలు రావాలి. ఎండలు మండాలి, అప్పుడు పూస్తాయవి, విరిసీ విరయక, విడివడీవడక, గుత్తులు గుత్తులుగా, పూస్తాయవి. మల్లెలే అల్లిన మాలలు కొన్ని... మరువంతో కాసిన్ని... దవనంతో మరిన్ని... కనకాంబరాల ఛాయతో ఇంకొన్ని, దూరందూరంగా కట్టినవి, చిక్కగా కట్టినవి, వరుస వదిలి కట్టినవి... గుప్పుగా గుమ్మెత్తగా మత్తుగా మహత్తుగా మల్లెలు... మల్లెలమ్మా మల్లెలు.... సెంటుమల్లెలు బొండుమల్లెలు రేకమల్లెలు నాటుమల్లెలు మోటుమల్లెలు...వేసవిని చల్లార్చే మల్లెలు. .. ఆకుపచ్చ తొడిమ... తెల్లని మొగ్గ... ఆకుపచ్చని కాడ మీద పూచిన తెల్లని చందమామలా... ఎంత అదృష్టవంతుడు శివుడు. నల్లమల అంతా విరబూసిన మల్లెలను చెంచులు ఏరేరి తేగా, మాలగా ధరించి మురిసిపోతుంటాడు, ఆ మల్లికార్జునుడు. కేవలం మల్లెలకే ఇన్ని సొబగులను ఎందుకు ఇస్తుంది ప్రకృతి? మౌనంగానే ఎన్నో సందేశాలను ఇచ్చే ప్రకృతి ఇందులో ఏమైనా సందేశాన్ని ఇమిడ్చిందా ?
నిశ్చయంగా ఉంది. పువ్వులన్నింటిలో మల్లెలదో ప్రత్యేక తీరు. ఏడాదికి ఒక్కసారి విరబుయ్యాలంటే ... అవి ఎన్నో ఓర్చుకోవాలి. ప్రచండ గ్రీష్మాన్ని తట్టుకొనే శక్తిని తెచ్చు కోవాలి. దహించే ఉష్ణాన్ని భరించగలిగే ఓర్పు సాధించాలి. సాధిస్తే? కొన్నాళ్లు ఆగితే? ఓపికగా ఎదురు చూస్తే? చినుకు. చిటాపటా చినుకు. వరదెత్తే చినుకు. ఎండను ముద్ద చేసే చినుకు. వాన చినుకు. అది ఇన్నాళ్ళూ వేచిన తనలోని తపననంతా కలబోసి, ఒక్కసారి గుమ్మెత్తించే పరిమళంతో విరబూసే మధురక్షణానికి స్వాగతగీతిక !
అలాగే బతుకు చినుకు మనపై వాలి, చిగురించేదాకా వేచి చూడాలి. 'నా జీవితం ఇంతే, ఇక బ్రతికి ఉండడం దండగ...' అనుకుని ఎవరో ఆత్మహత్య చేసుకుంటున్నారట.... ' యెంత చేసినా, ఫలితం శూన్యం... ' అనుకుంటూ ఎవరో నిస్పృహ పొందుతున్నారట.... కాని అది ఒక మలుపే గాని... ముగింపు కాదని, వారు ఒక్కక్షణం ఆలోచిస్తారా ? ఇన్నాళ్ళూ కష్టపడి పెంచిన బ్రతుకనే వృక్షానికి... కాయలు కాసి, ఫలాలు అందించే సమయానికి... మొదలంటా నరకాలనుకునే వారి మూర్ఖత్వమని ఒక్కసారి పునరవలోకనం చేసుకుంటారా ? మల్లెల్లారా ... వీరికి ఇవన్నీ వద్దని చెప్దామా... ఈ వేసవి పోతుందని చెప్దామా... వసంతం వచ్చి, కొత్త చిగురులు తొడిగి, కోయిలల గానం మధ్య బ్రతుకు మల్లెలు పరిమళించే సమయం త్వరలోనే రానున్నదని చెబుదామా ? రండి, మల్లెలను చూసి, మల్లెలా పరిమళించే సమయం కోసం వేచి ఉందాము.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top