జాజిగెడ్డ

వెంపరాల.వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి.


కాలం మారింది ..కాదు ,ప్రవాహం లో రోజులు కొట్టుకుపోయాయి.ఎన్నో సంవత్సరాలు గడిచాయి. కాల గమనం లో రోజులుపరిగెడుతున్నా,అభివృద్ది పధంలో దేశం ముందుకెళుతున్నా అక్కడి రహదారి పరిస్తితి అలానే వుంది..ఇన్నాళ్ళకి ఈ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల్లోని ప్రజల మొహం లో ఆనంద చాయలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.
*****
ఇరవై సంవత్సరాల క్రితం..ఒక రోజు.
శ్రావణ మాసం లో అదీ పండు వెన్నల తో కళ కళ లాడాల్సిన పౌర్ణమి రోజు.ఘాడాంధకారం తో అమావాస్య ని తలపించేలా వుంది.సాయంత్రం చిరు జల్లులు మొదలయ్యాయి,అలా మరో గంట లో ఆ జల్లులు వాన గా,ఆ వాన తుఫాన్‌ గా,ఆ తుఫాన్‌ ప్రళయం గా,ఆ ఉప్పెన లాంటి ప్రళయం మా జీవితాల్లో ఆరని చిచ్చు గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు..
ఆరోజు శ్రావణ పున్నమి కావడం తో టే ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా అలంకరించు కొని మా చెల్లి ఎంత వేగం గా నాకు రాఖీ కట్టాలా అని ఎదురుచూస్తుంది.దాన్ని ఆటపట్టిద్దామన్న కోరికతో నేను లేవకుండా జాగు చేస్తున్నాను.ఇంతలో బారెడు పొద్దెక్కడంతో లేవక తప్పలేదు.మొత్తానికి చెల్లి రాఖీ కట్టడం ,నేను తాయిలం చెల్లించుకోవడం రెండూ  జరిగాయి.
అప్పట్లో ఫో న్లు విరివిగా లేవు.అందునా ఆ పల్లెటూర్లో అసలేలేవు.
ఈ మహా ప్రళయం లో పిడుగు లాంటి వార్త మోసుకొచ్చాడు నూకరాజు.ఈ వార్త తేడానికి మామూలు కష్టం పడ లేదు అతను.తన ప్రాణాల్నే పణం గా పెట్టాడు.ఒకటి కాదు,రెండు కాదు,పద్నాలుగు మైళ్ళు చుట్టూ తిరిగి వచ్చాడు.
ఆ ప్రళయం మహోగ్రరూపం దాల్చడం తో ఈ సారి రహదారి గట్లన్నీ  తెంచుకొని నీళ్ళు ప్రవహిస్తున్నాయి. అప్పన్నదొర పాలెం అనే గ్రామం మెయిన్‌ రోడ్‌ ని ఆనుకొని వున్న కొత్తకోట కు పది కిలోమీటర్ల దూరం లో వుంది.ఆ చుట్టు పక్కల అన్నీ పల్లెటూర్లే.వ్యవసాయం,కూలి పని ఆధారం గా అక్కడి ప్రజలు జీవనం సాగించేవారు.
ఇక మేమున్న బూరుగుపాలెం అక్కడికి అంటే అప్పన్నదొర పాలానికి ఆరు కిలోమీటర్ల దూరం.ఈ రెండు గ్రామాలను కలుపుతూ పారే జలాశయం పేరు జాజిగెడ్డ.మామూలు గా వర్షాలు లేనప్పుడు ఆ ఇసుకలో చల్లని గాలికి,చుట్టూ విస్తరించిన తోటల మధ్య నడుస్తూ వుంటే కలిగే ఆనందం ఏ ఊటీ,కొడైకెనాల్‌ లోనూ దొరకదన్నట్టు గా వుంటుంది.ఆ ఇసుకలో పారే చల్లని నీరే అక్కడి ప్రాణాధారం.అక్కడి ఊట చలవల్లోని నీటినే ఆ ప్రాంత ప్రజలు తాగునీటి గా వుపయోగిస్తారు.ఆ నీరు పంచదార కలిపిన కొబ్బరినీళ్ళ లా,తాగితే ప్రాణం లేచొచ్చినట్టు గా వుండడం విశేషం.
ఆ అప్పన్నదొరపాలెం లో మా మామ్మగారు ఒక ఆశ్రమ వాతావరణం లో ఒక ఇంటిని కట్టుకొని ప్రశాంతంగా అక్కడే నివసించేవారు.అక్కడి ప్రజలకి తనకి తెలిసిన నాలుగు మంచిమాటలు చెప్పడం ద్వారా వాళ్ళని చైత న్యవంతుల్ని చేయడం జరిగేది.అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ మాతో కాలం గడిపేవారు.రెండు చోట్ల కి పెద్ద గా దూరం లేకపోవడం తో ఇబ్బంది వుండేది కాదు.
ఆవిడంటే ఆ ఊరిలో అందరికీ ఒక గౌరవభావం ఉండేది.పల్లెల్లో అభిమానాలు,ఆప్యాయతల తీరే వేరు..అందునా ఆ రోజుల్లో..కల్మషం లేని ప్రేమలు,వాత్స్యల్యం తో కూడిన వరసలు,ఆ సరదాలు,ఆ వెటకారాలు..మెట్రో మహా నగరాల్లో మనం మచ్చుకైనా చూడలేమని అనిపిస్తుంది.ఆ జ్నాపకాలు మనకి తీపి గుర్తుల్లా కలకాలం మన మదిలో అలా నిలిచిపోతాయి. ఆ నూకరాజు మాకు చిన్నప్పుడు తాటిచెట్ల మీద కి ఎక్కి తాటికాయలు కొట్టి ఇస్తే,నేను మా చెల్లి పోటీ పడి తిన్న రోజులు వున్నాయి.మా ఊరి కరణం గారి పొలం లో తిన్న ఉడుకు బెల్లం రుచులు జీవితాంతం వెంటాడేవే.
ఆ నూకరాజు తీసుకొచ్చిన వార్త విని మా పై ప్రాణాలు పైనేపోయాయి.కష్టం వచ్చినప్పుడు మనిషి కి గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఆ భగవంతుడు.ఆశేతు హిమాచలం లో వున్న దేముళ్ళందిరికీ మొక్కుకొన్నారు.ఈ ఉపద్రవం నించి గట్టెక్కించమని.మానవ ప్రయత్నాలు ఎలా వున్నా,భగవంతుని రాతలు,ఆ జగన్నాయకుని గీతల్లోంచి తప్పించుకోలేమనే వాస్తవం ఆ క్షణం ఎంతటివారైనా మరువక తప్పదు కదా.
ఉదయం నించి అందరికీ ప్రవచనాలు చెప్పి ,సాయంత్రం వేగం గా ఇక్కడికి రావాలని చాలా హడావిడి పడ్డారని కానీ ఇంతలోనే ఆ మాయదారి దేవుడు ఉన్నట్టుండి ఆమె ని తనలో ఐక్యం చేసుకున్నాడని చెప్పలేక చెప్పాడు నూకరాజు.పేరుకైతే వృద్ధ్యాప్యం కాని ఎటువంటి నలత లేదనే చెప్పాలి.ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆ నారాయణుని తలచుకుంటూ ఆఖరి శ్వాస వదిలారని చెప్పాడు.ఊహించని ఆ పరిణామానికి ఏం చేయాలో తోచక ఏకా ఎకిన బయలుదేరి వచ్చానని చెప్పాడు.తాతగారు కాలం చేసి రెండేళ్ళు కాలం గడిచింది.ఒక్కర్తివే అక్కడ ఎందుకని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా అక్కడే వుండడం తో ఇంత ప్రమాదమొచ్చిందని మా నాన్న కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.ఆయన్ని ఆపే తరం కాలేదని చెప్పాలి.అందుకే అంటారు వాన రాకడ,ప్రాణం పోకడ ఎవరికీ తెలీదని.
అప్పన్నదొర పాలెం వెళ్ళే అవకాశం సుతారం లేదని తెలిసి గుండె స్తాణువు లా మారిపోయింది.అక్కడున్న అందరిలో ఒకటే ఆందోళన. ఎవరికీ ఏం చేయాలో తోచటం లేదు.అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలియడం లేదు.ఇక్కడ నించి అక్కడికి ఎలా వెళ్ళాళో అర్థం కావడం లేదు.ఏదయితే అదే అయిందని నాన్న బయలుదేరారు.కానీ వూరి జనం వెళ్ళనీయలేదు.ఆ రోజుల్లో...ఊల్లో కరెంటు వుండేదే అంతంతమాత్రం..అందులోనూ ఇలాంటి వాన కి ఇక అంతేసంగతులు.మళ్ళీ నాలుగైదు రోజుల వరకు దా ని  ఆశ ఎటూలేదు.అడుగు తీసి అడుగు బయటికి పెట్టే అవకాశం లేదు.గంట గంట కి వరుణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు.ఊరు దాటే మార్గం లేకపోయింది.దైవసంకల్పం ముందు మానవప్రయత్నం చిన్నబోయింది.
మరో రెండు రోజులకి వాన వెలిసింది.మహా ప్రళయం సాధారణ స్తితికి చేరుకుంది.వాన దేవుడి మహోగ్రరూపం చల్లారింది.కానీ అప్పటికే ఆమె ని  చివరి చూపు చూసే అదృష్టం లేకపోయింది. అతను పడ్డ భాధ కి మాటల్లేవు.కన్నతల్లి ఋణం తీర్చుకోలేకపోయానని,అంతిమ సంస్కారం జరపలేకపోయానని కన్నీరు,మున్నీరు అయ్యా రు .
అలాంటిది ఇన్నాళ్ళకి ఆ జాజిగడ్డ జలాశయ పధకానికి శంఖుస్తాపన జరగడం మహదానందాన్ని ఇచ్చింది ఆ చుట్టుపక్కల గ్రామవాసులకి...
కాలక్రమంలో అక్కడే పదవీ విరమణ చెయ్యడం,తర్వాత సిటీ కొచ్చి సెటిల్‌ అవడం జరగడం తో అక్కడి విషయాలు పెద్దగా తెలియలేదు.కానీ మళ్ళీ ఇన్నాళ్లకి ఇలా పత్రికలో  ఆ జలాశయ పధకానికి ఇన్నాళ్ళకు మోక్షం కలుగుతున్నందుకు ఒకింత ఆనందం కలుగుతోంది.ఎందుకంటే భవిష్యత్‌ లో ఇలాంటి పరిస్తితి రాదు కనుక.ఆ రోజే ఈ మార్గం ఉన్నట్టయితే ఈ జీవితాంతం ఈ భాధ అనుభవించాల్సి వచ్చేది కాదు కదా..అనుకుంటూ కళ్ళ కి ఉన్న చెమ్మ ని భుజం మీద తువ్వాలుతో తుడుచుకున్నారు నాన్న...
********

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top