డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి గారితో ముఖాముఖి

Share This

డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి గారితో ముఖాముఖి

- భావరాజు పద్మిని



సాధారణంగా మనం తెరమీద కనిపించే పాత్రలనే చూస్తాము కాని, తెర వెనుక ఆ పాత్రలకు తమ గొంతుతో జీవం పోసే డబ్బింగ్ ఆర్టిస్ట్ ల గురించి మనకు తెలీదు. ఇప్పటి వరకూ దాదాపు 1200 ల సినిమాలకు పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు ప్రవీణ్ చక్రవర్తి గారు.గాయకుడిగా, మాటల రచయతగా, ఆంకర్ గా, న్యూస్ రీడర్ గా, ఈవెంట్ మేనేజర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. జెమిని సినిమాలో విలన్ క్యారెక్టర్ కు ఆయన చెప్పిన డబ్బింగ్, విశేష ఆదరణ పొంది, ఆయనకు డైలాగ్ స్టార్ అనే పేరును సాధించిపెట్టింది. ప్రవీణ్ గారి ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీ కోసం... 
 నమస్కారం ప్రవీణ్ గారు. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి.  
నమస్కారమండి. మాది విజయనగరం జిల్లా శృంగవరపు కోట దగ్గర ఉన్న వల్లంపూడి అనే పల్లెటూరు. నాకు ముగ్గురు అన్నలు, ఒక చెల్లెలు. మా కుటుంబంలో ఎవరికీ కళలతో అనుబంధం లేదు. మా తాతగారు ప్రభుత్వ డాక్టర్ కావడంతో మా నాన్నగారిని విదేశాల్లో చదివించారు. అందుకే మా ఇంట్లో ఆధునిక వాతావరణం ఉండేది. అలా ఇంట్లో ఉన్న టీవీ చూస్తూ, టీవీ మీద మక్కువ ఎక్కువైంది. నేను మాఊర్లోనే ఉండే సూర్యనారాయణ శాస్త్రి గారు అనేవారి ఇంట్లోనే ఎక్కువగా ఆడుకుంటూ, దాదాపు ఆయన వద్దనే  పెరిగాను. 
 కళల పట్ల చిన్నప్పటి నుంచే మీకు అభిరుచి ఉండేదా ? 
ఉండేదండి. మా ఊర్లో ' పద్మ టూరింగ్ టాకీస్ ' అని, ఒకేఒక థియేటర్ ఉండేది. అక్కడ రోజూ సినిమా వేసే ముందు 'నమో వెంకటేశా' అనే ఘంటసాల గారి పాటతో మొదలుపెట్టేవాడు. ఆ పాట వినీ, వినీ పాట మీద మక్కువ పెరిగింది. శనివారం పాడే భజనలు విని, నాకూ పాడాలని అనిపించి, పాల్గొనేవాడిని. విశాఖలో నేను చదివిన CBM స్కూల్ క్రైస్తవ స్కూల్. అక్కడ ఆదివారం జరిగే గిటార్, డ్రమ్స్ వాయిస్తుంటే చాలా ఆసక్తిగా గమనించేవాడిని. భజన శాస్త్రీయ సంగీతం, ప్రార్ధన వెస్త్రెన్ సంగీతం, రెండూ విని పాడేవాడిని. కాలేజీ కి వెళ్ళేటప్పటికి ఏ.ఎన్.ఆర్ , ఎన్టీఆర్  గారి సినిమాలు చూడడం వల్ల, ఆ సినిమాల ప్రభావం నాటకరంగానికి నన్ను తీసుకువెళ్ళింది. అక్కడ సాంబమూర్తి స్టేడియం వద్ద ఉన్నవాళ్ళు అందరూ నాటకరంగంలో నిష్ణాతులు. వాళ్ళను చూసి, నాటకం మీద మక్కువ పెరిగింది. ‘దొంగ’ అన్నది నేను వేసిన మొదటి నాటిక. ఇందులో నాకొక చిన్న పాత్ర ఇచ్చారు. నేను డైలాగ్ చెప్పిన ధాటి విని, ‘నీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది, మంచి ఆర్టిస్ట్ గా ఎదుగుతావు, ‘ అన్నారు. ఆ తర్వాత అనేక నాటకాలు వేసాను. ఒక శివరాత్రి నాడు, నేను వేసిన ‘మాయాప్రపంచం’ అనే నాటకానికి మంచి గుర్తింపు లభించింది. అది ఒక డాన్స్ మాస్టర్ తన విద్యార్ధుల్ని వల్లో వేసుకునే పాత్ర. కళ పేరుతో వంచించే పాత్ర. 2.15 నిముషాల నాటకం అది. నాతో వేసిన నటి చాలా పేరున్నవారు. ఆవిడంత సీనియర్ తో నటించడం వల్ల, నాకు బాగా , మద్రాస్ నుంచి వచ్చిన  – మోహన్ జి అనే దర్శకులు, నన్ను డైరక్షన్ విభాగంలో పనిచేసేందుకు చెన్నై రమ్మని ఆహ్వానించారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకున్నాను. 
 మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది ? దీనికి మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది ?
తాతగారి ప్రోత్సాహం ఉండేది, మాఇంట్లో నాకు పూర్తి స్వాతంత్రం ఉండేది.  మాది సనాతన ముస్లిం కుటుంబం, నేను తప్ప . నాకు ఎందుకో కులముద్ర వేసుకోవటం ఇష్టంలేదు. అందుకే పేరు కూడా మార్చుకున్నాను. నాకు అన్ని కళల్లో ఉన్న ప్రావీణ్యం చూసి నా మిత్రులు ‘ ప్రవీణుడు ‘ ప్రవీణ్ అని పిలిచేవారు. అందుకే అదే పేరు పెట్టేసుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరేందుకు చెన్నై వెళ్ళినప్పుడు, కొత్త పేరుతో, కొత్త రంగంలోకి వెళ్ళాలని అనుకున్నాను. కొత్త జీవితం చూడాలనుకున్నాను.
నేను వెళ్ళే ముందే ఒక ప్రెస్ మీట్ జరిగింది. నటీనటుల్లో ప్రవీణ్ చక్రవర్తి ని తీసుకుంటున్నాము అని నా పేరు కూడా చెప్పారు. ఈ సినిమాలో నాకు హీరో ఫ్రెండ్ పాత్ర ఇస్తానన్నారు. కాని, ఒక ఏడాది గడిచిన తర్వాత, నన్నే హీరో గా పెట్టి
సినిమా తీసారు. దానిపేరు – సజీవమూర్తులు. అది 90 లలో వచ్చింది. అందులోని కధాంశం గుడ్డి ప్రేమ. హీరో గుడ్డివాడు, సంగీతకారుడు. హీరొయిన్ నర్తకి. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లోనే అయ్యింది. మా కాలేజీ లో నా నాటకాలకి, షూటింగ్ లకి స్పెషల్ పర్మిషన్ లు ఇచ్చేవారు. సినిమా షూటింగ్ వేసవి సెలవల్లో కావటంతో, సినిమా పూర్తి కాగానే, మళ్ళీ కాలేజీ చదువు కొనసాగించాను.
ఉచ్చారణ, వాయిస్ మాడ్యులేషన్ పరంగా మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా ?
చిన్నప్పటి నుంచి రేడియో చాలా ఇష్టంగా వినేవాడిని. అద్దంకి మన్నార్ గారి రేడియో వార్తలు, కందుకూరి సూర్యనారాయణ గారు, ఇలా అనేకమంది గొంతులు వినేవాడిని. అదే సమయంలో కాకరాల గారు నాకు పరిచయం అయ్యాకా, వారు నాకు డైలాగ్ లు చెప్పటం నేర్పేవారు. అప్పటికే నేను ఒక సినిమాకు హీరోగా పనిచేసాను. 10 రోజులు వెళ్లాను. కన్యాశుల్కంలో గిరీశం పాత్ర నాతో వేయించాలని ఆయనకు ఉండేది. అభ్యుదయభావాలు, సంగీతం, సాహిత్యం మీద మంచి పట్టున్న కాకరాల గారంటే నాకు తగని అభిమానం. 
నేను ఒకసారి కోయంబత్తూరు లో మా ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు నన్ను ఒక పాట పాడమన్నారు. అది విని, పక్కింటివాళ్ళు వచ్చి, ఆ రాత్రి నాతో కచేరి పెట్టించారు. విన్నవారిలో సీతానాయుడు గారని, పెద్ద ఇండస్ట్రియలిస్టు భార్య –వారు నన్ను బాగా గుర్తుపెట్టుకుని, నేను వెనక్కి వెళ్ళాకా కూడా, పక్కింటి నెంబర్ కి ఫోన్ చేసి మరీ, ప్రోత్సహించేవారు. చెన్నై లో మా ఆఫీస్ ఉంది, నువ్వు అక్కడే ఉండవచ్చు, అన్నారు. నేను మద్రాస్ వెళ్ళాకా, వారు చెప్పిన విధంగా అక్కడే ఉన్నాను.
కూచిపూడిలో మీకున్న ప్రవేశం గురించి చెప్పండి ?
నాకు సాగరసంగమంతో నాట్యంపై మక్కువ పెరిగింది. శ్యామల వర్ధిని గారివద్ద నృత్యశిక్షణ పొందాను. ఒకదశలో వైజాగ్ లోని రామోజీరావు గారి ‘డాల్ఫిన్ హోటల్స్’ 15 వ వార్షికోత్సవం జరుగుతోంది. అప్పుడు నేనక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేసేవాడిని. అప్పుడు నేనిచ్చిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూసిన రామోజీరావు గారు, నన్నెంతో మెచ్చుకున్నారు. నేను నాటకాల్లో, ఊర్లో ఉన్నప్పుడు ఆర్కెస్ట్రాలో ఇలా అన్నింటిలో ఉండేవాడిని.
నేను చెన్నై వెళ్ళగానే మొట్టమొదట అడుగుపెట్టింది, వెంపటి చినసత్యం గారి కూచిపూడి డాన్స్ స్కూల్ లో. అక్కడే నాకు రమ్యకృష్ణ, బాలు గారి కుటుంబం , ఘంటసాల గారి కుటుంబం, ఇలా అంతా పరిచయం అయ్యారు. వెంపటి మాష్టారు గారు నన్ను చాలా అభిమానించేవారు. నేను ఎవరివద్దా, నా బాక్గ్రౌండ్ దాచలేదు. అయినా, ఇంతమంది ప్రముఖులు నన్ను ఆదరించారు అంటే – మతవిభేదాలు లేవు అనడానికి నేనే నిదర్శనం.
వెంపటి గారి కుటుంబసభ్యులు అంతా, నన్ను తమలో ఒకడిగా భావించేవారు. నేను ఇంజనీరింగ్ చదివానని, నన్ను వారి డాన్స్ స్కూల్ కట్టేటప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ గా ఉండమని, పూర్తి స్వేచ్చను ఇచ్చారు. నేను హేమామాలిని, శోభానాయుడు, మంజుభార్గవి గార్లతో బాలే లు చేసాను. రుక్మిణి కల్యాణంలో గొల్లవాడి వేషం వేసాను. ఇవన్నీ నాకు దక్కిన అరుదైన అదృష్టాలు.
 ఏ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ? డబ్బింగ్ ముందు మీరు ఎలా సాధన చేస్తారు ?
సాధన ఏమీ లేదండి. అవగాహన అన్నది పుట్టుకతో రావాలని నా అభిప్రాయం. గొంతు దైవం ఇవ్వాలి. నిజానికి నేను దీనికోసం నాకు ఇష్టమైనవి ఏవీ ఒదులుకోలేదు. చివరికి ఐస్ వాటర్ కూడా. నేను ఎక్కువ సినిమాలు చూడలేదు కాని, నటనలో ప్రావీణ్యం సంపాదించాలి అన్న పట్టుదల ఉండేది. సినిమా – అనేది పెట్టుబడితో కూడుకున్నది కావడంవల్ల, విభిన్న రంగాల్లో ప్రయత్నించాను.
సజీవమూర్తులు కాపీ చూస్తే, నాపాత్రకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అది చూసేదాకా నాకు అసలు డబ్బింగ్ అన్నది ఒకటి ఉంటుందనే తెలియదు. ఆ సినిమాలో నాపాత్రకి ఘంటసాల గారి కుమారుడైన ఘంటసాల రత్నకుమార్ గారు డబ్బింగ్ చెప్పారట. ఆ తర్వాత ధవళ మల్లిక్ గారు మొదట నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు. సాలూరి వాసూరావు గారు నన్ను బాగా ప్రోత్సహించేవారు. నేను మొదట ఒక టెలిఫిలిం కి డబ్బింగ్ చెప్పాను. అందులో రవళి అక్క హరిత హీరొయిన్, హీరో వసంత్ . అది విన్నవారు ‘ఈ ఫీల్డ్ ను శాసిస్తావు,’ అన్నారు. ఆ మాటలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి.
‘బంగారు కుటుంబం ‘ అనే సినిమాలో విక్రం గారికి డబ్బింగ్ చెప్పాను. వసంతకుమార్ గారి దగ్గర 80,90 సినిమాలు చేసాను. అనువాదబ్రహ్మ ఆయన. నాకు అనేక మెళకువలు నేర్పించారు. హృదయం సినిమాకి రాజశ్రీ గారు తెలుగు మాటలు, పాటలు రాసారు. అందులో హీరొయిన్ అక్క ప్రేమికుడి పాత్రకి డబ్బింగ్ చెప్పాను.
ఇక నా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా – విజయ. ఇది తెలుగు, తమిళ్ భాషల్లో రజనికాంత్ గారు తీసిన సినిమా. మొదట హీరో ఫ్రెండ్ పాత్రకి నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనుకుని, ఒక సందర్భంలో రజని గారిముందు నేను చెప్పిన క్లైమాక్స్ సీన్ డైలాగ్ విని, హీరోకు నాచేతే డబ్బింగ్ చెప్పించారు. ఇందులో సంజయ్ భార్గవ్, ప్రియా రామన్ నటించారు. నేను సంజయ్ భార్గవ్ కు డబ్బింగ్ చెప్పాను. అందులో ఫైనల్ సీన్ లో చెప్పిన డైలాగ్ విని, వసంత్ గారు నన్ను ముద్దుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సీన్  గొప్పగా పండింది.
ఇతరులతో పోల్చుకుంటే నేను భాషాపరంగా కాస్త వీక్ అయినా, నాకు వచ్చిన అవకాశాలతోనే ముందుకు వెళ్లాను. శ్రీకృష్ణ టీవీ సీరియల్ లో అశ్వద్ధామ పాత్రకి, కొన్ని నాటకాల్లో, సినిమాల్లో పాత్రలకి, రేడియో ఆర్టిస్ట్ గా కూడా చేసాను.
పిల్లల చానల్స్ లో డబ్బింగ్ చెప్పినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు ?
మంచి ప్రశ్న అడిగారండి. నన్నొకసారి డిస్నీ ఛానల్ ఇంచార్జ్ ఒకరు వాయిస్ టెస్ట్ కి పిలిచారు. ఇన్నేళ్ళ అనుభవం తర్వాత వాయిస్ టెస్ట్ కు వెళ్ళటం ఇష్టం లేక, వెళ్ళలేదు. వాళ్ళే మళ్ళి ఫోన్ చేసి, ఒక 2 ఎపిసోడ్స్ డబ్బింగ్ చెబితే, హాంగ్ కాంగ్ లో ఉన్న డిస్నీ ఛానల్ అధినేతలకి పంపుతామని కోరారు. ‘థామస్ ఇంజిన్’ అనే పిల్లల షో అది. దీనికి నేను 15 పాత్రలకి, 15 రకాల గొంతులు మార్చి, మాట్లాడాను. అది విన్న హాంగ్ కాంగ్ లోని అధినేతలు, భాష తెలియకపోయినా ఆశ్చర్యపోయి, “మొత్తం 125 ఎపిసోడ్ లు, అన్నిటికీ ఇలాగే చెయ్యగలరా ?” అని అడిగారు. చేస్తానన్నాను. మొత్తం రికార్డింగ్ కి 37 రోజులు పట్టింది. ఇది తెలుగులో పోగొ ఛానల్ లో వచ్చింది.
వర్క్ అయ్యాకా, వాళ్ళు ఎంతగా సంతోషించారంటే, ముందు మాట్లాడుకున్న 40,000 రూ. 1.75 లక్షలు ఇచ్చారు. నేను, నా భార్య లక్ష్మి, మా బాబు చాలా ఆనందించాము. ఆ డబ్బుతో, మా బాబు పుట్టినరోజునే కొనుక్కున్న A స్టార్ కారు, ఇప్పటికీ ఒక తీపిగుర్తుగా మావద్దనే ఉంది.
మీ మనస్తత్వం ఎటువంటిది ? సినీరంగంలో మీరు ఎదుర్కున్న ఒడిదుడుకులు ఎలాంటివి ?
నాది ముక్కుసూటి తత్త్వం. సినీరంగంలో కమర్షియల్ గా ఉండేవారిని మాత్రమే ప్రోత్సహిస్తారు. కాని నేను డిమాండ్ చెయ్యను. ఎందుకంటే అవకాశమే పెద్ద అంశం, అవతలి వాళ్ళ కష్టం కూడా అర్ధం చేసుకోవాలి. అనువాద చిత్రాలకు, మూలభాషలో ఇచ్చినంతే ఇవ్వమంటాను. అయితే, నా డబ్బింగ్ ను వేరే భాషరాని వారు పర్యవేక్షిస్తే నాకు కోపం వస్తుంది. అలా ఒక షారుఖ్ ఖాన్ సినిమా వదిలేసుకున్నాను. నేను ఓటమిని ఒప్పుకోను.
ప్రతిరోజూ, ప్రతిఒక్కరికీ ఒడిదుడుకులు ఉంటాయి. అయితే నేను ప్రతి అడ్డంకినీ సానుకూలంగా మార్చుకుంటా. మనం బస్సు మిస్ అయితే ట్రైన్, అదీ మిస్ అయితే విమానం, ఏదీ లేకపోతే... నడక... ఎలాగైనా గమ్యం చేరవచ్చు. కాకపొతే కాస్త ఆలస్యం అవుతుంది అంతే. అందుకే ప్రధాన రంగమైన సినిమాను కాకుండా, దానికి అనుబంధమైన రంగాన్ని ఎంచుకున్నా. కొన్ని అద్భుతమైన అవకాశాలు మిస్ అయ్యాను. కాని, అవే నాలో పట్టుదలని పెంచాయి. మనం ఎప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ సాధించాము అనుకోకూడదు. ఇతరులతో పోల్చుకోకూడదు. అసలు ‘మా ఇంటి ఆడపడుచు’ సినిమాలో విలన్ పాత్రకి, జెమినీ సినిమాలో విలన్ పాత్రకి నేను చెప్పిన డబ్బింగ్ కు నంది అవార్డు కోసం నామినేట్ చేసారు, కాని అవి అనువాద చిత్రాలు కావడంతో అవి తిరగ్గొట్టారు. ఇది కాస్త బాధ కలిగించింది.
జాకీ ఛాన్ కు డబ్బింగ్ చెప్పారట ?
అవునండి, ‘ఆక్సిడెంటల్ స్పై ‘ అనే చిత్రంలో మొత్తం 17 పాత్రలకి డబ్బింగ్ చెప్పాను. జాకీ ఎమోషన్స్, ఇండియన్ ఆక్టర్ లాగే ఉంటాయి. అదే జేమ్స్ బాండ్ కి ఇబ్బంది పడ్డాను. కరెంట్ తీగాకంటే వేగంగా ఉంటాయి, జాకీ మాటలు. అవి అందుకోడానికి కాస్త ఇబ్బంది పడ్డాననే చెప్పాలి. అలాగే ‘అజాతశత్రువు’ అనే సినిమాలో హీరో మమ్ముట్టి కి, కమెడియన్ కళాభవన్ మణి కి , ఒకేసారి గొంతులు మార్చి డబ్బింగ్ చెప్పాను.
ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్ లు, మీ భవిష్యత్ ప్రణాళికలు గురించి చెప్పండి. నేను తెర – ను తల్లిగా, భాష – ను తండ్రిగా భావిస్తాను. తెర మీద అంశాలన్నీ ఒకసారి చూస్తే చాలు, ఆకళింపు చేసుకుంటాను. జెమినీ న్యూస్ లో మొట్టమొదటి న్యూస్ రీడర్ ను నేనే. 2003 వరకూ అక్కడ చేసాను. అప్పట్లో ఒకరోజు ఉదయం న్యూస్ చదివి, మధ్యాహ్నం బాలు గారితో నా స్వరకల్పనలో ఒక సీరియల్ కు పాట పాడించి, సాయంత్రం వైజాగ్ లో ఒక ఫాషన్ షో నిర్వహించాను. గతంలో కధలు కూడా రాసి, బహుమతులు గెల్చుకున్నాను. నాకు సంగీతం పూర్తిగా రాదు. దూరదర్శన్ లో ఒక సంగీతదర్శకుడు ఎంతకీ రాకపోవడంతో, వంకాయల గారు నన్ను క సీరియల్ కి టైటిల్ సాంగ్ ట్యూన్ కట్టవయ్యా... అన్నారు. మీట్ మిష్టర్ ఆంజనేయులు అనే ఆ సీరియల్ కి నేను ట్యూన్ కడితే, సిరివెన్నెల గారు లిరిక్స్ రాసారు. తర్వాత వెన్నెలమ్మ, జయం వంటి సీరియల్స్ కి టైటిల్ సాంగ్స్ రూపొందించాను. ప్రస్తుతం భవాని, స్నేహ నటిస్తున్న ఒక ద్విభాషా చిత్రానికి మాటల రచయతగా మారాను. తెలుగులో ఆ చిత్రం పేరు – మేము అలాంటివాళ్ళం కాదు. శ్రీహరి గారి చివరి చిత్రం ఇది. ఈ చిత్రంలో నాలోని వైవిధ్యానికి సార్ధకత చేకూర్చింది. ఇందులో ఒక పాట నేనూ రాసాను, పాడాను. కో- డైరెక్టర్ గా పనిచేసాను. వాయిస్ డబ్బింగ్ ఇచ్చాను. ప్రస్తుతం యువత పోకడలు ఎలా ఉన్నాయి, అమాయకత్వంతో వారు చేసే మోసం ఎలా ఉంది అన్నది ఇందులో చూపారు. కేవలం పిల్లల్ని మార్కుల కోసం, రాంకుల కోసం చదివించకండి అన్నది ఇందులో ఇచ్చిన సందేశం. 18 ఏళ్ళ నా ప్రయాణంలో నాభార్య లక్ష్మి అందించిన ప్రోత్సాహం, చూపిన ఓర్పు మర్చిపోలేను. ఆమె షిర్డీ సాయి భక్తురాలు. ఆమె నాగురించి చాలా శ్రద్ధ వహిస్తుంది. మాది రెండు మతాల అనుభూతి. మేము చర్చ్ కి కూడా వెళ్తాం, అన్ని మతాల్ని ప్రేమిస్తాం. మా బాబు సాయి హర్షవర్ధన్. మేము చెన్నై లోనే స్థిరపడ్డాము. ఇవండీ నా సంగతులూ అంటూ ‘ విజయం’ సీరియల్ కు తాను స్వరపరచిన చక్కటి పాటను వినిపించారు ప్రవీణ్ గారు. పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగిన ప్రవీణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మనసారా ఆకాంక్షిద్దాం.
ప్రవీణ్ గారి నటన, డైలాగ్ లను క్రింది వీడియో లలో చూడండి. హీరోకి, కమెడియన్ కి గొంతు మార్చి, మాట్లాడిన క్రింది వీడియో చూసి, అచ్చెరువొందని వారుంటారా ?
ప్రవీణ్ గారి నటనను క్రింది వీడియో లో చూడండి.

No comments:

Post a Comment

Pages