బలం - బలహీనత 

- జి.నారాయణ రావు 

"బలహీనతకు విరుగుడు బలాన్ని గురించి ఆలోచించడమే కాని, బలహీనత గురించి దీర్ఘాలోచన చెయ్యడం కాదు. మనుష్యులు వారిలో దాగిఉన్న అఖండమైన శక్తిని గుర్తించాలి. " - స్వామి వివేకానంద.

కొంతమంది అన్నీ ఉన్నా, ఏవో బాధలను కొనితెచ్చుకుని, బాధపడుతూ కాలం గడిపేస్తారు. తమ పక్కింటి వారు ఆనందంగా ఉన్నారనో, కొత్త వస్తువులు కొనుక్కున్నారనో, తాము ఆశించింది అందలేదనో, ఇలా నిరాశకు గురౌతూ ఉంటారు. నిజానికీ, ఏ బాధా లేని మనిషి ఉండడు ! కళ్ళు మూసుకున్నవారికి వెలుగు కనిపించనట్లు, ఇటువంటి వారికి అపారంగా వారిపై ప్రసరిస్తున్న దైవానుగ్రహం గోచరించదు.
చిన్నతనంలో ఒక చాక్లెట్, బిస్కెట్, తాయిలం మన సమస్యలు. వాటికోసం దిగులూ, బెంగ. కాని ఇప్పుడు అవి లేవే ! ఏమయ్యాయి ? కర్త మారలేదు, కాని కర్మ మారింది. అంటే... మనం మారలేదు, కాని మనం చేసే పనులు మారాయి, బాధలు మారాయి. చిన్నప్పటి బాధలు ఇప్పుడు మనకు గుర్తుండవు, ఉన్నా, లెక్కలోకి రావు. అలాగే, ఇప్పుడున్న బాధలు కూడా కాలప్రవాహంలో పాతనీటిలా కొట్టుకుపోయేవే, తాత్కాలికమైనవే అని మనం గుర్తుంచుకోవాలి. ఒక చిన్న కధను చూద్దాము.
ఒక రాజ్యం లో అందరికి బాధలు పెరిగిపోయాయట. జనం ఎవరూ సంతోషంగా లేరు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. ఎవరికీ వాళ్ళు పక్కవాళ్ళని చూసి వాళ్ళు హాయిగా బతుకుతున్నారు అని అనుకుంటున్నారు. మంచివాడైన ఆ దేశపు రాజు కి ఈ విషయం చాలా బాధ కలిగి, ఒక మహర్షి ని కలిసి తన ప్రజల పరిస్థితి వివరించి చెప్పాడు. మహర్షి క్షణం అలోచించి 'బాధల మార్పిడి' అనే ఆలోచన చేసారు.
ఆ ప్రకారం రాజు నగరమంతా దండోరా వేయించాడు.
'మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎదుటివారితో కుండమార్పిడి చేసుకొనే వీలు కలిపిస్తున్నారు మహర్షి, అది ఓ గంట లోపులో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి' అని ప్రకటించాడు.
జనం ఆనందంగా చప్పట్లు చరిచారు. గయ్యాళి అత్త సమస్య, తాగుబోతు కొడుకు సమస్య, అనారోగ్యం సమస్య, కూతురు పెళ్లి సమస్య, ఆకలి సమస్య ....ఇలా అందరికి చిన్నవీ పెద్దవీ ఎన్నో ఇబ్బందులు. అందరు ఒకచోట చేరారు. సందడి మొదలైంది, గుసగుసలు వినిపిస్తున్నాయి, సమయం గడిచిపోతుంది. కానీ ఎవరూ తమ సమస్యను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు.
ఎలా మార్చుకోవడం? ముందు మన సమస్య పెద్దది అనుకున్నది, ఎదుటివాడిది విన్నాకా, మనదే నయం అనిపిస్తుంది. మహర్షి ఆ ఉపాయం ఎందుకు చెప్పాడో రాజుకు అర్థమైంది. తాము అర్థరహితంగా బాధ పడుతున్నామని ప్రజలకూ అర్థమైంది. మహర్షికి కృతఙ్ఞతలు తెలిపి, నిరాశను, దైన్యాన్ని విడిచి, ఉన్నదానితో ఆనందంగా ఉండసాగారు.
ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో తిండికీ, గుడ్డకీ లేక ఎంతో మంది అల్లాడుతున్నారు. నిలువ నీడ లేక చెట్ల క్రింద బ్రతికేవారు, పొట్ట చేతబట్టుకు కాలినడకన ఊళ్లు తిరిగేవారు అనేకమంది ఉన్నారు. అనారోగ్యంతో కదలలేని స్థితిలో చాలామంది అల్లాడుతున్నారు. మరి అటువంటప్పుడు మనకు మంచి ఆహారం, ఆరోగ్యం, ఆహార్యం ఉండడం పరిపూర్ణ దైవానుగ్రహమే కదా !
మనం ప్రతినిత్యం మన ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అవి ఏవో బాధల్ని తెచ్చి, మనల్ని కృంగదియ్యాలి అని చూస్తున్నాయో, వెంటనే అప్రమత్తమై, ఆ ఆలోచనలను తరిమేసేలా, మనసును అన్య విషయాలపైకి మళ్ళించుకోవాలి. మనలో ఉన్న శక్తియుక్తుల్ని మన ఉన్నతికే తప్ప, పతనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
దైన్యం మరణంతో సమానం. అంటే, ఇటువంటి శిక్షను మనకు మనమే బాధల రూపంలో విధిస్తున్నాము అన్నమాట ! జీవితం అన్నాక సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి... మనకైనా, మన పక్కవాళ్ళకైనా, అవి సహజం. బాధలున్నాయన్న బాధ పోతే ,దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది…మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, మనల్ని బలహీనుల్ని చేసేది, వేరెవరో కాదు, స్వయంగా మన ఆలోచనలే ! బలం - బలహీనత ఎక్కడో లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. అందుకే, ఆలోచనల మీద నియంత్రణ సాధించిన వ్యక్తి విజయ సోపానాలను అధిరోహిస్తాడు. మరెంతో మందికి ఆదర్శమవుతాడు. విజయీభవ !

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top