Thursday, July 23, 2015

thumbnail

అన్నదోషాలు

అన్నదోషాలు

‘ఉర్వి నాహారదోషంబు విజ్ఞాన నాశనంబునకు మూలంబు’ – ఆముక్తమాల్యద.
అంటే మనం తినే అన్నాన్ని బట్టి, మనలో సంస్కారాలు కలుగుతాయి. వంశపారంపర్యంగా వచ్చే గుణం, రూపం, సంస్కారం, సంపదలకు అన్నమే కారణం. పిల్లల జీవితాలపై వారి తల్లిదండ్రులు భుజించే ఆహారం యొక్క, పిల్లలతో తినిపించే ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది. అన్నానికున్న ప్రాధాన్యతను వేదాలు కూడా వక్కణించాయి. ఆహారం గురించి గీతలో కృష్ణభగవానుడు చెప్పినది ఒకసారి మననం చేసుకుందాం.
మనుషుల స్వభావమును బట్టి వారికి ఇష్టాలైన ఆహార పదార్థాలను కూడా సాత్త్విక, రాజస, తామస ఆహారాలుగా విభజించ వచ్చు. వారి ప్రవృత్తిని బట్టి, స్వభావాన్ని బట్టి వారు ఆశించే ఆహారాలు వివరించబడతాయి.
సాత్త్వికమైన ఆహారం ఆయువును, ఆరోగ్యాన్ని బలమును, సుఖమును, సంతోషమును అభివృద్ధి పరుస్తుంది. వానిలో పాలు, చక్కర, మొదలగు స్నిగ్ధపదార్థాలు పుష్టిని కలిగిస్తాయి. ఓజస్సును అభివృద్ధి పరిచే స్థిరపదార్థాన్ని, సాత్త్విక స్వభావమును పెంపొందించు హృద్య పదార్థాలను మాత్రమే సాత్త్వికులు ఇష్టపడతారు.
రాజస స్వభావంగాలావారి ఆహార పదార్థాలు ఎక్కువగా పులుపు, కారము, ఉప్పు, చేదు రుచులను కలిగి ఉంటాయి. వానిలో మిక్కిలి వేదివస్తువులు, మాడిన పదార్థాలు, దాహం కలిగించే గుణాలు అధికంగా కనిపిస్తాయి. ఇవి చింతను, రోగాన్ని, దుఃఖాలను కలుగచేస్తాయి. ఇటువంటి ఆహారము రాజస ఆహారమని పిలువబడుతుంది.
తామసభోజనం సరిగా ఉడకని, సరిగా పండని, అర్ధపక్వములైన ఆహార పదార్థాలను కలిగి ఉంటుంది. అవి రసహీనంగా, చెడువాసనగల దుర్గంధయుక్తాలుగా ఉండవచ్చు. పాసిపోయిన పదార్థాలు, ఎంగిలి చేయబడిన ఆహారము తామస ఆహారం అనబడుతుంది. అపవిత్రమైన అపరిశుభ్రమైన పదార్థాలు తామస లక్షణాలను మాత్రమే ప్రకోపింప చేస్తాయి. సాత్త్విక, రాజస, తామస భోజనం ఆరంగించువారి స్వభావములు కూడా భిన్నంగా గోచరిస్తాయి.
ఆర్యులు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నమే జీవిని బ్రతికిస్తుంది, పోషిస్తుంది, శక్తినిస్తుంది – అదే మితిమీరి భుజిస్తే ప్రాణం తీస్తుంది. అన్నానికి సర్వవశీకరణ శక్తి ఉంది. దాని శక్తికి లోబడి, తప్పుడు పనులు చేస్తామేమో అన్న భయంతో కొందరు నిజాయితీపరులు పరుల ఇళ్ళలో భోజనం చెయ్యరు. ఈ అన్నం విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చూద్దాము.
ఇదివరలో శుచిగా స్నానం చేసి, దైవనామం జపిస్తూ అన్నం వండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చెయ్యలేకపోయినా, కనీసం అన్నం వండేటప్పుడు మీ సమస్యలు, చీకాకుల గురించి ఆలోచించకండి. వండేవారి మనసు వికలమై ఉన్నప్పుడు ఆ దోషం వారి దృష్టి ద్వారా, వాళ్లకు తెలియకుండానే, ఆహారంలోకి, తద్వారా తినేవారి దేహంలోకి వెళ్లి, అనారోగ్యాన్ని కలుగచేస్తాయి.
బుఫే లలో చూస్తూ ఉంటాము, వాళ్ళు మొహాలు అసహ్యంగా పెట్టుకుని, ముష్టి వేసినట్లు వడ్డిస్తారు. అటువంటి చోట యెంత తక్కువ తింటే అంత మంచిది. ఒకవేళ తప్పనిసరై అయిష్టపు మొహాలతో వడ్డించే చోట తినాల్సి వచ్చినప్పుడు, బైటికి రాగానే తాంబూలం సేవించండి. తమలపాకులకు సకల దృష్టి దోషాల్ని హరించే శక్తి ఉంది.
అన్నాన్ని ఎప్పుడూ వృధా చెయ్యవద్దు.
మీ ప్లేట్ లో ఉంచిన ఆహారం, ఆ రోజుకి దైవం మీకు అందించిన ప్రసాదం. అందుకే ఒకసారి వడ్డించినవి తియ్యమని, తినమని అడక్కండి.
వంటలు ఎలా ఉన్నా, వంకలు పెట్టకుండా మౌనంగా తినండి. గుళ్ళో ప్రసాదం ఎలా ఉన్నా, తింటారు కదా, ఇదీ అంత పవిత్రమైనదే.
ఎవరైనా భోజన సమయానికి మీ ఇంటికి వచ్చి, మీరు తినే ఆహారం వంక తదేకంగా చూస్తున్నప్పుడు, వారినీ భోజనం చెయ్యమనండి, తినకపోతే, కనీసం వారికి వెంటనే కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వండి. నీటికి దోషాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి ఉంది.
బైటికి వెళ్ళినప్పుడు మీరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు.
ఈ కాసిన్ని మెళకువలు పాటిస్తే, కుటుంబాల్లో తరచుగా అనారోగ్యం పాలు కావడం ఉండదు. పైన ఉదాహరించిన అంశాలు, సూచనల్లో, కొన్ని మా పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ సెలవిచ్చినవి. నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, సంపూర్ణ గురుఅనుగ్రహంతో వచ్చిన ఈ ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాసపత్రికలో ఈ నెల – దాదాపు 1200 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పిన  డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి గారి ముఖాముఖి, మనల్ని అప్రతిభుల్ని చేసేంత గొప్ప బొమ్మల చిత్రకారుడు ఆర్టిస్ట్ రాజేష్ గారి పరిచయం, పుష్కరాల సందర్భంగా గోదావరి ఒడ్డున మ్రోగిన అందెల సవ్వడి గురించి బ్నిం గారు అందించిన విశేషాలు, సంతూర్ శివకుమార్ గారి పరిచయం వంటి ఎన్నో విశిష్టమైన అంశాలు ఉన్నాయి. ఇవేకాక, హరివిల్లు లోని సప్తవర్ణాల వంటి ఏడు కధలు, పంచెవన్నెలు ఐదు సీరియల్స్... ఇంకా ఎన్నో  ఆసక్తికరమైన అంశాలు మీ కోసం వేచిఉన్నాయి. చదివి, ఎప్పటిలాగే మీ దీవేనల్ని అందిస్తారని ఆశిస్తూ...
భావరాజు పద్మిని.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information