ఎంచి చూడవైతిగాక - అన్నమయ్య కీర్తనకు వివరణ - అచ్చంగా తెలుగు

ఎంచి చూడవైతిగాక - అన్నమయ్య కీర్తనకు వివరణ

Share This
ఎంచి చూడవైతిగాక యింతి నీ కిన్నియుఁ గాదా
(అన్నమయ్య కీర్తనకు వివరణ )
                                                                                                                               డా. తాడేపల్లి పతంజలి
    ( నెల్లూరు రంగనాథ స్వామి దేవాలయము.  చాయాచిత్రం ;అంతర్జాల సౌజన్యం)      
“దగ్గర్లోనే అన్ని పెట్టుకొని  ఎందుకయ్యా! అంత కష్ట పడతావ్!”అనేది తెలుగు వాడి పలుకుబడి.ఈ పలుకుబడి ఆధారంగా అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు వ్రాసిన మధురభక్తి కీర్తన ఇది. ( రేకు: 88-3 సం:17-469కీ)
పల్లవి:
ఎంచి చూడవైతిగాక యింతి నీ కిన్నియుఁ గాదా మంచిదాయ యిఁకనైనా మఱవకువయ్యా
. 1:
 పొంగేటి జలధి దచ్చి పుట్టించితి వమృతము అంగనమోవినే కాదా అమృతము చెంగి పోయి వైకుంఠాన శేషునిపై బండితివి చెంగఁట నీచెలి యారు శేషుఁడే కాఁడా
. 2:
ఆకాసాన నొకడుగు అడిగితివి బలిని ఆకసము చెలినడుమందునే కాదా మేకొని వేదాలకుఁగా మీనవై పొడమితివి కైకొని సతికన్నులే గండుమీలు గావా
. 3:
 కోరి శ్రీవేంకటమనేకొండ యెక్కితివి నీవు కూరిమి చెలికుచాలు కొండలే కావా చేరి సర్వజీవులచిత్తములో నిలిచితి తేరి యాకె నీ వురానఁ దిరమాయఁ గాదా

అర్థ విశేషాలు

పల్లవి:
ఎంచి చూడవైతిగాక యింతి నీ కిన్నియుఁ గాదా మంచిదాయ యిఁకనైనా మఱవకువయ్యా
          ఓ వేంకటేశా ! ఒక్కో అవతారంలో నువ్వు చాలా చాలా పనులు చేసావు. కాని ఆ   ఆ పనులు  చేసేటప్పుడు నీ ఆడుదాన్ని- (=ఇంతి) తలుచుకోలేదు. మనస్సులో ఆమె రూపాన్ని చూడలేదు కదా ! నువ్వు చేసిన  అవతారాల ప్రయోజనం అంతా ఆవిడ దగ్గరే ఉంది.
          కాని ఆవిడని మరిచిపోయి రకరకాల అవతారాలెత్తావు. మంచిది. ఇకనైనా ఏదైనా అవతారమెత్తినప్పుడు ఆ అవతార ప్రయోజనం మీ ఆవిడ దగ్గరే ఉన్నదన్న విషయం మరిచిపోకు.
చ. 1:
 పొంగేటి జలధి దచ్చి పుట్టించితి వమృతము అంగనమోవినే కాదా అమృతము చెంగి పోయి వైకుంఠాన శేషునిపై బండితివి చెంగఁట నీచెలి యారు శేషుఁడే కాఁడా
          దేవ దానవుల చేత అమృతం కోసం కూర్మావతారంలో సముద్రాన్ని మథింపచేసావు.వాళ్లు ఆ క్షీర సముద్రాన్ని మథిస్తున్నప్పుడు ఆ సముద్రపు నీళ్లు పైకి పొంగాయి. (=పొంగేటి జలధి) ఆ సముద్రాన్ని మథింప చేసి (=తచ్చి) అమృతాన్ని వాళ్లచేత పుట్టింపచేసావు.ఎందుకయ్యా! ఇంత శ్రమ పడ్డావు?! నీ భార్య ,మా అమ్మ అలమేలుమంగమ్మ  పెదవిలో ఆ  అమృతము ఉందికదా !
          ఒక్క దూకుతో వెళ్లి (=చెంగి పోయి) ఆ వైకుంఠములో వేయి పడగలు ఉన్న ఆ ఆది శేషునిపై వెళ్లి పడుకొన్నావు.
అక్కడికే వెళ్లి పడుకోవాలా? దగ్గర్లోనే నీ భార్య ,మా అమ్మ అలమేలుమంగమ్మ   నూఁగారు (ఆరు) ఆది శేషుడు కాదా?
(ఆరు= రోమరాజి, నూగారు (the line of hair upon the abdomen just above the navel.)
 విశేషాలు
ఆదిశేషుడు పతంజలిగా అవతారమెత్తిన కథలు విన్నాం
మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్నిఆది  శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు శేషువు పడగ ఎత్తి నప్పుడు కదిలించాడని అదే శేషాద్రి అని  విన్నాం.కాని ఒక్క దూకుతో వెళ్లి ఆ వైకుంఠములో వేయి పడగలపై స్వామి పడుకొన్న దృశ్యం పెదతిరుమలాచార్యులవరి  యోగ సమాథి  దర్శనమయి యుంటుంది. పుస్తకాల్లో మాత్రం ప్రసిద్ది లేదు.
          తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామిగా తిరువళ్ళూరు లో వీరరాఘవ స్వామిగా, నెల్లూరు లో రంగనాయకుల స్వామిగా ఆదిశేషుడిపై శయనించిన దృశ్యాలను ఈ రోజుకి మనం చూడవచ్చు.
చ. 2:
ఆకాసాన నొకడుగు అడిగితివి బలిని ఆకసము చెలినడుమందునే కాదా మేకొని వేదాలకుఁగా మీనవై పొడమితివి కైకొని సతికన్నులే గండుమీలు గావా
          ఎందుకయ్యా ! వామనావతారంలో  ఆ బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి ఆకాశములో  ఒక అడుగు అడుక్కొన్నావు. ఆ ఆకాశము నీ భార్య ,మా అమ్మ అయిన అలమేలుమంగమ్మ   నడుములోనే ఉందికదా ! (ఆకాశము అంటే శూన్యము. పాతకాలపు కవులు ఆడువారికి నడుములేనితనాన్ని అందంగా భావిస్తూ , ఆ సన్నటి నడుమును శూన్యమైన  ఆకాశంతో పోల్చేవారు)
          సమ్మతించి (= మేకొని) వేదాల కోసం   మత్స్యావతారము ఎత్తి చేపవయ్యావు. నువ్వు గ్రహిస్తే, లక్ష్య పెడితే  నీ భార్య ,మా అమ్మ అలమేలుమంగమ్మ   కన్నులు కొర మీనుల్లా (ఒక జాతి మంచి నీటి చేప) ఉండే   పెద్ద చేపలు.ఆ కన్నులనే చేపలతోనే వేదాల ఉద్ధరణ పూర్తయ్యేది. అనవసరంగా మత్స్యావతారము ఎత్తి శ్రమపడ్డావు.
చ. 3:
 కోరి శ్రీవేంకటమనేకొండ యెక్కితివి నీవు కూరిమి చెలికుచాలు కొండలే కావా చేరి సర్వజీవులచిత్తములో నిలిచితి తేరి యాకె నీ వురానఁ దిరమాయఁ గాదా
          కోరి కోరి శ్రీ వేంకటము అనే పేరున్న కొండ ఎక్కి అలసిపొయ్యావు.ఎందుకయ్యా ! ఆ శ్రమ నీకు. ప్రేమ(=కూరిమి) నిండిన  నీ చెలి స్తనాలు కొండలే కదా !
          నీ భక్తులయిన సర్వ జీవుల హృదయాలను సమీపించి వాళ్ల మనస్సుల్లో నిలిచావు. ఎందుకయ్యా ! ఆ బాధనీకు!
మొత్తంగా(= తేరి) ఆమె-(ఆకె)  అదేనయ్యా! మా అమ్మ నీ మనస్సులో స్థిరంగా ఉన్నది కదా!
ఉపసంహారం
          అలంకారం మనిషికి, కవితకి ఇద్దరికీ ప్రకాశాన్నిస్తుంది. ఈ కీర్తనలో కూడా అలంకారం ప్రాణం.
          పెద తిరుమలయ్య – అయ్య – అన్నమయ్య లానే – మధుర భక్తి అనే కుంచెతో గీసిన అందమైన కీర్తన అనే చిత్రమిది. చిత్రంలో రంగు – ఇలా ఉందేమిటండి- ఈ వర్ణన – మరీ ఇలా ఉందేమిటండి.. అమ్మ అవయవాలను అలా వర్ణించవచ్చా అండి.. అని అడిగే హక్కు మనకు లేదు.చిత్రాన్ని ఏరికోరి గీయించుకొన్నవాడు వేంకటాచలపతి. ఆయనకు అభ్యంతరం  లేనప్పుడు సామాన్యులమైన మనమెంత?
స్వస్తి.

No comments:

Post a Comment

Pages