వెన్నెల యానం - 4

భావరాజు పద్మిని


( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, సీతారామపురం మామిడి తోటలో ఆమె దొంగతనం చెయ్యబోయిన పాలేరును కొడుతూ, భయపడి చెట్టెక్కిన శరత్ తో అతనికి భయమన్నదే లేకుండా చేసేట్లు ఆమె చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు శరత్... కాలేజీ బంద్ మూలంగా లేకపోతే, గోదావరి ఒడ్డున నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని, ఏదో రాసుకుంటున్న శరత్ ను ఆటపట్టించి, జానపద భాషలో గోదావరిపై గేయం రాయమని అడుగుతుంది చంద్రిక. తాను రాస్తే, ఆమె వెంటనే ట్యూన్ కట్టి పాడాలని, సవాల్ చేస్తాడు శరత్. శరత్ రాసిన పాటను చూసి, ఎలా పాడాలో అనుకుంటూ ఆశ్చర్యంతో కళ్ళు మూసుకుంటుంది చంద్రిక.  ఇక చదవండి...)
వసంతంలో వగరు మామిడి చిగుర్లు తిన్న కోటి కోయిలలు ఒక్కసారి పలికాయా అనిపించింది. వీనులవిందై, మైమరపించే గంధర్వ గానం అంటే ఇదేనా ? తొలకరికి తడిసిన స్వచ్చమైన మట్టివాసనతో తయారైన మట్టిపూలలో ఇమిడి ఉన్న సుగంధం ఇంత మధురంగా ఉంటుందా ? ఏ గానం నేర్వకుండానే విధాత దీవెనలతో పలికే పల్లెకారు పాట...  ఇంత ముగ్ధంగా ఉంటుందా ? (ఈ పాట పాడిన లింక్ ను క్రింద జతపరిచాను... వినండి.)
కళ్ళు మూసుకుని, పాట పాడుతున్న చంద్రిక వంకే తదేకంగా చూడసాగాడు శరత్. ఆమె నుదుట గోదావరి అలలకు ఎగసి పడ్డ నీటి చుక్క, ముత్యంలా మెరుస్తోంది. బహుసా, ఆ గోదారి తల్లి తన దీవెనలను ఈ రూపంలో తనకు అందించిందేమో ! లేదులేదు, ఈమే స్త్రీ రూపంలో వచ్చిన గోదావరీ మాతేమో ! ఆ క్షణంలోనే అతని మనసులో చంద్రిక పట్ల ఒక ఆరాధనా భావం కలిగింది. రెప్ప వెయ్యకుండా చూస్తున్న శరత్, పాట ముగిసి, చంద్రిక తనవంక చూడడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
“అద్భుతంగా పాడారు. మీరే గెలిచారు...” అన్నాడు శరత్.
“లేదు, మీ సాహిత్యం గెలిచింది. అదే నాతో ఇలా పాడించింది.” అంది చంద్రిక.
“సరే ఐతే,గెలుపు మనిద్దరిదీ కాదు, మనలో ప్రేరణ కలిగించిన ఈ గోదావరిది... సరేనా ? నా మిత్రులు నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు, ఇక నేనూ నెమ్మదిగా బయల్దేరతాను..” అంటూ లేచాడు శరత్.
“మళ్ళీ కలుద్దామండి, బై ,” అని చెప్పి, లేచి తనూ కాలేజీ దిశగా నడవసాగింది చంద్రిక.
******
చెప్పడం ఆపి, నీటి వడికి కంగారు పడుతున్న శరత్ వంక చూసింది చంద్రిక. తను కూడా తెడ్డు తీసుకుని, అతనికి సాయం చెయ్యసాగింది. కాసేపటికి పూల పడవ మళ్ళీ మామూలుగా నడవసాగింది. వెన్నెల యానం కొనసాగింది.
“అవును, ఈ నది వేగం చూస్తే గుర్తొచ్చింది, ఫ్రెషర్స్ పార్టీ అప్పుడు నాకు అమ్మవారు పోసి, నేను రాలేకపోయాను. అప్పుడు నలుగురు సీనియర్లు నీళ్ళలో మునిగిపోయిన సంఘటన, మన కాలేజీ మొత్తానికి విషాదాన్ని మిగిల్చింది. నువ్వు ప్రాణాలకు తెగించి, మునిగిపోతున్న ముగ్గురిని కాపాడావని, చెప్పారు. చీమ చిటుక్కుమంటే, ఉలిక్కిపడే శరత్ ధీరుడేనా ఇంత సాహసానికి ఒడికట్టింది ?అని నేను ఎన్నో సార్లు ఆశ్చర్యపోయాను. ఆ రోజు అసలేమి జరిగిందో చెప్పు,” అడిగింది చంద్రిక.
“ కాలేజీలో సీనియర్లు జూనియర్స్ కి ఫ్రేషర్స్ పార్టీ ఇస్తారు. తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు జూనియర్స్, వాళ్లకి ఫేర్వెల్ పార్టీ ఇస్తారు, ఇదంతా అన్ని కాలేజీలలోనూ జరిగేదే కదా ! జూనియర్స్ అందరికీ రావులపాలెం బ్రిడ్జి దగ్గర ఉన్న జొన్నాడ లోని అరటి తోటల్లో ఉదయం నుంచి, సాయంత్రం వరకూ సరదాగా గడిపి, సాయంత్రం గోదావరిలో కొంతమంది హాయిగా స్నానం చేసి, బయల్దేరాలని అనుకున్నాము.
ఆ రోజు తినే ఆహారపదార్ధాలన్నీ ప్యాక్ చేసుకుని, ఒక వాన్ మాట్లాడుకుని, బయలుదేరాము. దారి పొడుగునా పాటలు, అంత్యాక్షరి తో సరదాగా గడిచిపోయింది. అరటి తోటలో దుప్పటీలు పరిచి సీనియర్స్ , జూనియర్స్ ఎదురెదురుగా కూర్చున్నాము. చివరి సారి రాగింగ్ అంటూ, ఇద్దరు అమ్మాయిల్ని పిలిచారు. ఒక పెద్ద టేకు ఆకు మీద, గండుచీమను వేసిచ్చి, ‘రాం నాం సత్య హై, ‘ అని అరుస్తూ, తోట చుట్టూ తిరిగి రమ్మన్నారు. చీమ క్రింద పడితే, మరో రౌండ్ తప్పదట ! అంతా ఒకటే నవ్వులు, గోల... వాళ్ళ వెంట ఊరేగింపుకు వెళ్లినట్టు కాపలా...
తర్వాత సిద్ధూ గాడిని పిల్చి, ఒరేయ్, మాలక్ష్మి మేడం ను ఇమిటేట్ చెయ్యరా... అన్నారు. వాడు మొదలెట్టాడు.
ముందుగా అక్కడున్న ఒక అరిటాకును తెంపి, దానిమీద పుల్లతో ఏదో రాసినట్టు నటించాడు. అది చేతిలో పుస్తకంలా పట్టుకుని, వయ్యారంగా నడుస్తూ వచ్చాడు.
“స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ప్రోగ్రామింగ్ గురించి ఎంచక్కా ఈ గైడ్ లో రాస్కుంది చూసి, చదివుతూ రాస్తూ చెప్తానే. మీరు చరిత్ర అడక్కుండా చెప్పేది మాత్రం వినాలి. మీరు మంచి వాళ్ళుట, మీకస్సలు డౌట్స్ రావట , ఏం ?” అంటూ కళ్ళజోడు ముక్కు మీదకు లాక్కుని, దానిపైనుంచి అందరినీ చూసాడు.
“మనం ఊరెళ్ళేటప్పుడు పెట్లో బట్టలు సర్డుకుంటాం కదా, అలాగే కంప్యూటర్ డేటా ని దాని బుర్రలో సర్దుకుంటుంది. బట్టలు కొనడం, కుట్టిన్చుకోడం, ఉతకడం, ఇస్త్రీ చెయ్యడం లాగా... డేటా దాచడానికీ ఒక లెక్కుంటుంది. దాన్ని ఫ్లో చార్ట్ గా ముందు మనం వేసుకోవాలి అని ఈ పుస్తకంలో డేటా చెప్తోంది...” అంటుండగా...
సీనియర్ గోపి చెయ్యెత్తాడు ... “ ఏం ? ముందే చెప్పానుగా డౌట్ లు అడగద్దని, కూర్చో, ‘ కసిరాడు సిద్ధూ గాడు, అచ్చం మాలచ్చిమి మేడం లాగా. అంతా ఘోల్లున నవ్వులు.
‘మేడం ప్లీజ్, ఒక్క డౌట్... ‘ అన్నాడు గోపి.
‘నువ్ కూర్చుంటావా, నేను క్లాసు లోంచి, వెళ్లిపోనా ? నాక్కోపం వస్తే, నేను వెళ్ళిపోతా, తెల్సుగా...” పళ్ళు కొరుకుతూ అన్నాడు సిద్ధూ. అది, మాలక్ష్మి మేడం అసలు డౌట్ లు అడక్కుండా చేసేందుకు, కనిపెట్టిన కిటుకు. ఆవిడలాగే చేసాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సిద్ధూ. ఆ తర్వాత కొందరు నటీనటుల్ని ఇమిటేట్ చేసాడు. అంతా చాలా సేపు హాయిగా నవ్వుకున్నాం.
మధ్యాహ్నం కావడంతో అంతా భోజనాలకు ఉపక్రమించాము. అనేక రకాలు తనివితీరా తిన్నాకా, అక్కడున్న గోదావరి పాయ అయిన గౌతమి వద్దకు వెళ్లి, స్నానాలకు ఉపక్రమించారు ఈతొచ్చిన కొందరు. నాకు ఆసక్తి లేకపోవడంతో,  ఒడ్డున కూర్చుని, వారిని గమనించసాగాను. తమతో వచ్చిన ఆడవాళ్ళ ముందు గొప్పలకి నానా విన్యాసాలు చేస్తూ, లోలోపలికి పోసాగారు. ఇంతలో జరిగింది ఒక అనుకోని విపత్తు !
ఉత్తరాదినుంచి వచ్చిన వరదనీరు నిండిపోవడంతో, ఒక్కసారిగా రావులపాలెం బ్రిడ్జి గేటు లు అన్నీ ఎత్తేసారు. విపరీతమైన వేగంతో జొన్నాడ వద్దకు ఉరకలెత్తింది గోదావరి. పిల్లచేపల్లా, లోపలికి దిగి ఈదుతున్న సీనియర్స్ ప్రవాహ వేగానికి నీటిలో కొట్టుకుపోసాగారు. అంతా అసహాయంగా చూస్తున్నారు.
వాళ్ళని చూస్తుంటే, నాకు ఆ క్షణంలో, వాళ్ళమీద పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకు వచ్చారు. ఆపై నా ధైర్య దేవత - చంద్రిక మాటలు గుర్తుకొచ్చాయి. నేను ప్రక్కనే పడవకు లంగరేసి కట్టిఉన్న తాడు తీసుకుని, దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకోమని కొందరికి చెప్పి, నీళ్ళలో దూకాను. ఈతలో నేను చాంపియన్ నే ! నా పూర్తి శక్తిని రెక్కల్లో నింపి, ముందుకు కొట్టుకుపోతున్న వసంత్ ను జుట్టు పట్టుకు తెచ్చి, తాడుకు కట్టాను. ఒడ్డున ఉన్నవాళ్ళు అతన్ని, నన్ను   బలంగా గట్టుకు లాగారు. అలాగే వెనక్కు, ముందుకు ఈదుతూ ఫణి, శ్రీనివాస్ లను రక్షించి, నేను ఒడ్డుకు చేరి, స్పృహ కోల్పోయాను. కాసేపటికి మెలకువ వచ్చి చూస్తే ఏముంది ? అప్పటివరకూ మాతో సరదాగా గడిపిన సీనియర్స్ లో నలుగురు కొట్టుకుపోయారట! రాత్రికి వాళ్ళ శవాలు దొరికాయి. అంతా ఒకటే ఏడుపులు... అప్పటివరకూ ఆనందంగా గడిపిన అందరిలో విషాదం ! యెంత అశాశ్వతమైనది జీవితం ? దిగులు మబ్బులు కమ్ముకున్న అందరం చివరకు ఎలాగో ధైర్యం తెచ్చుకుని, వెనక్కు వచ్చాము.
మర్నాడు నా సాహసానికి, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ నుంచి పత్రికల దాకా, అంతా మెచ్చుకున్నా, కళ్ళముందు ప్రాణాలు నీటిపాలు అవుతున్న సన్నివేశం నాకు బాగా గుర్తుండిపోయి, కొన్ని నెలల పాటు నిద్ర లేకుండా చేసింది. అప్పటి నుంచి కాలేజీలో పార్టీ లు, వన భోజనాలు అన్నీ బాన్ చేసింది, యాజమాన్యం. “ చెప్తూ ఉండగానే శరత్ కళ్ళలో నీటి చారికలు, చిగురుటాకులా ఒణికిపోతున్నాడు...
అతన్ని అలా చూసి, చలించిపోయింది చంద్రిక. మళ్ళీ ఉత్సాహపరచాలని, ‘ఐతే ఆ సాహసబాలల అవార్డు నిజానికి నాకే దక్కాలన్నమాట, నేనే నీ ధైర్యదేవతను అని ఒప్పుకున్నావు కదా !” అంది.
' సాహసబాలల అవార్డు పిల్లలకు ఇచ్చేది, నేనేం పిల్లాడిని కాదు, ' ఆశ్చర్యంగా అంటూ ఆమె వంక చూసి, వెంటనే నవ్వేసిన శరత్... “ అదిగో, ఆ తాత చెప్పిన లంకలు అవే అనుకుంటా, చూడు, వెన్నెల్లో వెండి తివాసీ పరిచినట్లు ఎలా మెరుస్తున్నాయో ! చూడు,” అన్నాడు దూరంగా చూపిస్తూ.
“హమ్మయ్య, ఈ డ్రైవింగ్ లైసెన్సు లేని పడవ డ్రైవర్ తో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని, అరపూట వెన్నెల్లో భయపడ్డాను. ఇక నాకు ఆజాదీ రానుంది... వి డు ద ల ... విడుదల...” అంటూ ఇద్దరు సినిమాలో పాట పాడసాగింది చంద్రిక.
“ఓయ్ ! అసలే తింగరబుచ్చివి. సగం రాత్రంతా పడవ నడిపించావు, మిగతా సగం లంకల్లో రన్నింగ్ రేస్ పెట్టవు కదా, ప్రామిస్ చేస్తేనే... పడవ అటు పోనిస్తా, లేకపోతే... మళ్ళీ నట్టేట్లోకే ... త్వరగా చెప్పు...” అనుమానంగా చూస్తూ అన్నాడు శరత్.
“లేదులే ! ఈ పడవలో ఉన్న ఎయిర్ బెడ్ బాగా ఊదేసి, పక్కేసి పెట్టు. తర్వాత ఆ స్వీట్లు గట్రా ఇచ్చేస్తే, తినేసి, హాయిగా బజ్జుంటాను. అస్సలు పరిగెట్టను. ఒట్టు,” బుద్ధిగా చేతులు కట్టుకుని కూర్చుని, అంది చంద్రిక.
“ తమరి ఆజ్ఞ శిరోధార్యం చండీ రాణి ... తమరు శయనించండి, నిశాచరులు మీపై మనసు పడకుండా నేను మీకు కాపలా కాసుకుంటాను ” అంటూ కొంటెగా కన్నుగీటి, పడవ వేగం పెంచి, లంకల ఒడ్డుకు చేర్చాడు శరత్. అక్కడ ఒక కర్రను పాతి, పడవను తాడుతో కట్టేసి, ఎయిర్ బెడ్ లో గాలిని గాలి కొట్టే యంత్రంతో నింపసాగాడు...
పడవ అంచున కూర్చుని, “ప్రేమకోసమై లంకల పాలయ్యే పాపం పసివాడు... అయ్యో పాపం పసివాడు... “ అని పాడుతూ శరత్ ను ఉడికించసాగింది చంద్రిక.

(వెన్నెల యానం ఇంకా ఉంది...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top