వేదంలా ఘోషించే గోదావరి - అచ్చంగా తెలుగు

వేదంలా ఘోషించే గోదావరి

Share This

వేదంలా ఘోషించే గోదావరి

– పరవస్తు నాగసాయి సూరి


భారతదేశం... వ్యవసాయాధార దేశం. వందలాది నదులు, జీవనదులు కొలువైన పావన భూమి ఇది. నదుల ఒడ్డునే నాగరికతలు విలసిల్లాయి. భగవంతుడికి సైతం ఈ నదుల ఒడ్డునే ఆలయాలు వెలశాయి. అందుకే... మన జీవన విధానంలో నదులు భాగమయ్యాయి. మన సినిమాల్లో సైతం... దర్శకులు, నిర్మాతలతో పాటు... రచయితలు సైతం నదులకు పెద్ద పీట వేశారు. శుభసంకల్పం సినిమా సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం గంగా నదిలా కదిలింది. హరి పాదాన పుట్టావంటే గంగమ్మా. .. శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా.... ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా.. కడలి కౌగిలిని ..కరిగావంటే గంగమ్మా.. నీ రూపేదమ్మా .. నీ రంగేదమ్మా .. నీ రూపేదమ్మా .. నీ రంగేదమ్మా .. నడి సంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా .. నీలాల కన్నుల్లో సంద్రవే హైలెస్సో .... నింగి నీలవంతా సంద్రవే హైలెస్సో.. నీలాల కన్నుల్లో సంద్రవే.. నింగి నీలవంతా సంద్రవే ..హైలెస్సో .... ప్రతి నది గంగమ్మ నుంచి ఉద్భవించినవే. అందుకే మన దేశంలో నీటికి గంగ అని పేరు. సముద్రాన్ని సైతం గంగగా కొలిచే సంప్రదాయం మనది. ఆ మార్గంలోనే సీతారామశాస్త్రి ఈ పాటను రూపు దిద్దారు. హరి పాదాన పుట్టిన గంగమ్మ... పరమేశ్వరుడి తల మీదకు... అక్కడ నుంచి హిమగిరికి చేరి.... కడలి దాకా సాగింది. ఇన్ని చోట్ల తిరిగిన గంగమ్మను పావనమైన నదిగా చెబుతారు. అంతటి పావనమైన గంగకు రంగు, రూపు లేదు. సముద్రంలో చేరే చోట అసలు గడపే లేదు. అలాంటి గంగమ్మనే పవిత్రంగా భావిస్తున్న మనం... సాటి మనిషిని ఇంకెంత పవిత్రంగా చూసుకోవాలో అంతర్లీనంగా తెలియజేసే గీతమిది. అంతకు ముందే ఆంధ్రకేసరి సినిమా ఆరుద్ర సైతం మరో పాట రాశారు. గోదావరి, రాజమండ్రి ఘనతను తెలియజేసే ఇలాంటి గీతం మళ్ళీ రాలేదు.  మన సంస్కృతిలో వేద ఘోషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గోదావరి ఘోష కూడా అలాంటిదే. ఎంతో పవిత్రమైన ఘోషతో కవులకు ఆలవాలంగా శోభిల్లుతోంది. అదే విధంగా గోదావరి ఒడ్డున రాజరాజనరేంద్రుని రాజధానిగా విలసిల్లిన రాజమహేంద్రవరం... గత వైభవాన్ని కళ్ళకు కట్టే... గొప్ప కావ్యం లాంటి నగరం అంటూ రాజమహేంద్రి వైభవాన్ని తెలియజేశారు. వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం...గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం.. రాజరాజ నరేంద్రుడు మొదలుకుని కాకతీయ రాజులు, రెడ్డి రాజు, గజపతులు లాంటి ఎంతో మంది మహారాజులు ఈ నగరాన్ని ఏలారు. వారి కథలన్నింటినీ గోదావరి హోరు ప్రతి రోజూ కళ్ళకు కట్టి తీరుతుంది. రాజరాజ నరేంద్రుడు  కాకతీయులు తేజమున్నమేటిదొరలు రెడ్డిరాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కధలన్నీనినదించే గౌతమి హోరు శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాజ్ఞ్గేషు యేలోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే   అంటూ నన్నయ్య మహా భారతాన్ని మొదలు పెట్టాడు. అలా ఆదికవితి ఈ గోదావరి ఒడ్డునే పుట్టింది. శ్రీనాథుడికి, గోదావరికి గల సంబంధం కూడా చాలా గొప్పది. అలాంటి ఎందరో కవులకు గోదావరి తీరం ఆలవాలం. ఈ నది నీరు తాగితే చాలంట. కవితలు వాటంతట అవే పుట్టుకొస్తాయట. ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము నవ కవితలు వికసించే నందనవనము రాజులకు, కవిరాజులకే కాదు... దేవతలకు సైతం ఈ గోదావరి తీరం స్థిర నివాసం. ఎన్నో కట్టుకథలకు సైతం ఈ గోదావరి తీరమే ఆలవారం. గోదావరి అనగానే వరదకు గురయ్యే కోటిలింగాల రేవే జ్ఞప్తికి వస్తుంది. కోటి లింగాల రేవు కొట్టుకుపోతేనేమి మనకు వీరేశలింగమొక్కడు మిగిలాడు... అదిచాలు అంటున్నాడు ఆరుద్ర. దిట్టమైన శిల్పాల దేవలాలు కట్టు కధల చిత్రాంగి కనక మేడలు కొట్టుకోనిపోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు ఇంత ఘనమైన చరిత్ర ఉన్న గోదావరికి జరుగుతున్న పుష్కరాలకు అందరం తరలివెళదాం. తెలుగు వారి వైభవాన్ని చాటుదాం.

No comments:

Post a Comment

Pages