తాతప్పలరాజు పూతరేకులు - అచ్చంగా తెలుగు

తాతప్పలరాజు పూతరేకులు

Share This

తాతప్పలరాజు పూతరేకులు

- వంశీ


కుర్రోడయిన ముదునూరి మంగరాజు పట్టకారు తెచ్చి నాపరాళ్ళలాగా బిగుసుకుపోయున్న అప్పలరాజు కండలకి దాన్ని పట్టించి నొక్కాలని యమ యాతన పడతా, చిట్టచివరికి ఓడిపోయాడు.
          “చెప్పేనా నా కండలకి పట్టకారు కూడా జడుసుకుంటదని,” అన్నాడు. ఆ పందెంలో నెగ్గిన తాతప్పలరాజు.
          అందగాడయిన అప్పలరాజు దూకుడు మనిషి కూడా. అలాగే ఆ మనిషికున్న ధైర్యం అంతా ఇంతా కాదు. ఇద్దరు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు వున్న ఆ అప్పలరాజు ఆస్తి తన రెండు రెక్కలే.
          ఆ ఆత్రేయపురంలో బలసిన రాజులతో ‘తాతప్పిగా’ అని ఓ మోస్తరోళ్ళతో ‘తాతప్పన్నా’ అని పిలిపించుకునే చిలువూరి తాతప్పలరాజు ఒక పేద రైతుకూలి. వూళ్ళో ఎవరే పని చెపితే అది చేస్తాడు.
          బారపాకు బంధం కాళ్ళతోనే తాడిచెట్టెక్కుతుంటే ఒళ్ళంతా కమ్మేస్తా తేనెటీగలు కుట్టేస్తుంటే భరిస్తానే తేనెపట్టు మొత్తం వెనక కట్టుకున్న మట్టికుండలో వేసేసుకునిగానీ కిందకి దిగడు. పెంకుటిళ్ళల్లోకొచ్చిన కోడెతాచు తోకట్టుకుని గిరగిరా తిప్పి గిరాటేసి చంపేస్తాడు... పగబట్టిన పాములు పొలాల్లో వున్న పుట్టల్లో దాక్కుంటే పనిగట్టుకెళ్ళి గునపం పారల్తో పుట్ట తవ్వి బుసకొడతా లేస్తున్నా పాము మెడకాయట్టుకుని మెలిదిప్పి చంపి పిల్లకాలవలోకి విసిరేస్తాడు... పిచ్చికుక్క సందుల్లో కల తిరుగుతా జనాల పిక్కలు కరిచేస్తుంటే దుడ్డు కర్రతో తరిమి తరిమి చెంపేకా దాని కాలికి చేంతాడు కట్టి లాక్కెళ్ళి గోదారొడ్డున కప్పెడతాడు. దిక్కులేని వాళ్ళెవరన్నా చచ్చిపోతే ఆ పీనుగుల్ని ఏటిగట్టుకి తీసుకెళ్ళి పండించి మరీ వస్తాడు.
          ఒక్కోమాటు ఆంబోతులు వరిపొలాల్లో కొచ్చి తొక్కి పారేస్తుంటే దుడ్డుకర్రట్టుకుని పొలిమేర దాటేదాకా తరిమేస్తాడు. ఒకోసారి ఆ ఆంబోతు తన మాటింటే దాన్ని ఆవులకి తగిలిస్తాడు.
          చూడి గేదెలకి ‘మాయ’ వస్తే... గేదెలకే ప్రమాదం. అది జరక్కండా లోపలికి గెంటటమా... మాయ తాళ్ళు పేని ఆటిని రైతులకి పంపించడమా... ఇంకా గొప్పేటంటే మద్దిలంకలోనూ, పెద్దలంకలోనూ చెప్పా పెట్టకుండా ఒక్కోమాటు గోదారి పొంగుతా గేదెలూ ఎడ్లూ మనుషులూ ఇలాగ దొరికినోళ్ళని దొరికినట్టు తనతో పాటు లాక్కుంటాపోతుంది. ఆలాంటప్పుడు నావ కట్టడానికి పల్లోళ్ళు కూడా ధైర్యం చెయ్యరుగానీ అప్పల్రాజు మట్టుకి ముందుకి దూకుతాడు. తెప్ప గట్టుకుని వద్దిపర్రు పైన గోదాట్లోకి దిగి కొట్టుకుపోతున్నాటిని కాపాడుకొస్తాడు. ఎకరం చేనుకి ఒక్కడంటే ఒకడే గుల్లతిప్పి నీళ్ళు తోడేస్తాడు.
          జనం అడిగేరని ఆళ్ళ కోసం ఎన్నెన్నో గుండె నిబ్బరప్పన్లు చేస్తే ఆళ్ళు మట్టుకి తవుడు వడ్లో, సేరు జొన్నలో, అడ్డెడు గంట్లో తన బరకం సంచిలో పోస్తే ఆటినే పరమానందపడతా తీసుకెళ్తాడు. ఇంతజేసిన మనిషి ఒకోళ్ళయితే కంచుగ్లాసుడు చల్లి(మజ్జిగ)స్తే తాగేసి దణ్ణాలెట్టి వచ్చేస్తాడా తాతప్పల్రాజు.
          ఎండాకాలం రోజులు. బ్రిటిషు దొరలు గుర్రాల మీదెళ్తున్నారు. ఎవరో పెద్ద దొరగారు బొగ్గు వేన్ లో వెళ్తున్నారు. రాజుల కోడలు పుట్టింటికనుకుంటాను ఆ పల్లకీలో వెళ్తుంది. వాళ్ళందర్నీ దాటుకుంటా వచ్చిన బొర్రయ్యగారి ఎంకట్రాజుగారు వాళ్ళింటి ముందు తాళ్ళు పేన్తున్న తాతప్పల్రాజుని, “ఒరే తాతప్పిగా... పల్లికాలవ గట్టుచెక్క దగ్గరున్న మా చింతచెట్టెక్కి కొంచెం దులిప్పెట్టవా... ఈ ఆత్రేపురంలో నువ్వు తప్పితే ఆ పనింకెవడివల్లా కాదురా... నీకు మించిన మగోడూ మారాజూ ఇంకెవడు లేడ్రా ఈ వూళ్ళో,” అన్నాడు.
ఆ గొప్పింటి రాజుగారి పొగడ్తలకి లొంగిపోలేదు, పొంగిపోలేదుగానీ చెప్పేడు గదాని ఎకాఎకీనెళ్ళి ఏటిగట్టు మీదున్న ఆ ఎంకట్రాజుగారి చింతలతోపులో మొదటి చింతచెట్టెక్కడం మొదలెట్టేడు.
          ఆ చెట్టునిండా ఆకుల కంటే కాయలే ఎక్కువ. అయితే అది మామూలు చెట్టు కాదు. చాలా పెద్ద ఎత్తున్న ఆ చెట్టుకి లెక్కెట్టలేనన్ని కొమ్మలు. మిట్ట మధ్యాహ్నమపుడు కూడా ఆ చెట్టు పైకెక్కితే చిట్టచీకటి. అర్ధరాత్రపుటంత చీకటి. కటిక చీకటి కారు చీకటి. ఎవర్నడగండి ఎపుడడగండి చింతచెట్టంత చిక్కటి నీడనిచ్చే చెట్టెక్కడా లేదు వుండదు.
          అలాంటి చెట్టు లోపల ఏదో శక్తి వుందని ఆత్రేయపురం జనాలనుకుంటారు. రుజువులు కూడా చాలా వున్నాయి.
కొన్నేళ్ళ ముందర ఈ చింతచెట్టు కాయలు కోస్తానే కుప్పాల దేశియ్య కొమ్మ జారి పడిపోయేడు. సింగన్న గారి ఎర్రెంకన్న యితే కాయలు దులిపి కొమ్మట్టుకు దిగీ గిగుతానే రక్తం గక్కుకుంటా ప్రాణాలొది లేసేడు. ఇదంతా ఎందుకులేగానీ బుర్రయ్య గారెంకట్రావు దగ్గర పాలేళ్ళుగా కుదిరే వాళ్ళంతా ఆ చింతచెట్టెక్కడం దప్ప మిగతా పన్లు మాత్రం జేస్తం అని ఒప్పందం చేసుకున్నాకే పన్లోకి కుదురుతారంటే.... ఆ చెట్టెంత ప్రమాదకమైందో తెలుస్తుంది.
చిటారుకొమ్మ మీదున్న అప్పల్రాజు దీపాలవేళకి దాదాపు చెట్టు కాయలు మొత్తం దుళ్ళగొట్టేశాడు.
అన్నీ దులిపేసి అన్నీ అవగోట్టేసేకా .... చివరాఖర్లో దిగబోతుంటే ఆ చీకటి చెట్టు కొమ్మల్లోంచి ఒకటే హోరు. ఎవరో ఒక ఆడమనిషి అరుపు.
ఎల్లెల్లెహె అంటున్న అప్పల్రాజుని కొమ్మల మధ్యలోంచొస్తున్న వాలుగాలి ఒకటే కుదిపేస్తుంది. కిందకి పడగొట్టడానికి పనిగట్టుకు మరీ ప్రయత్నాలు చేస్తుంది.
గోవులు గోదారిగట్టు దాటి గోధూళి వేళకి ఇళ్ళకి చేరే వేళకి కిందికి దిగి దుళ్ళగొట్టిన చింతపళ్ళని గోతాల్లో మూటగట్టేక పాలేరెంకన్నతో ఎడ్లబండికి కబురెట్టి ఆమధ్య వూళ్ళో కట్టిన తారాశాశాంకం నాటకంలో పద్యం పాడుకుంటూ ఇంటికెళ్ళిపోయాడు.
విచిత్రమంటే ఇదేగామోలు. ఆ వెంకట్రాజు తోపులో రాక్షసి చింతచెట్టు దిగి హాయిగా ఇంటికొచ్చి వాళ్ళావిడ కాచిన పుల్లటి బొచ్చుపులుసేసుకు అన్నం తిన్న అప్పల్రాజు ఆ మర్నాడు ముదునూరి గోపాల్రాజు గారి గాదుల్లో ధాన్యం దించాలనడిగితేనిచ్చెనేసుకుని ఎక్కేడు.
పదిమెట్లెక్కాడో లేదో అ నిచ్చెనిరిగింది. దభాల్మని కిందబడ్డాడు. బలమైన గుండె ధైర్యమున్న తాతప్పల్రాజు నడుం ఫటీల్మంటా విరిగింది.
ఏదో మూటగట్టినట్టు ఆ మనిషిని తీసుకొచ్చి వాళ్ళింటి ముందు పారేశారు అప్పల్రాజుని. “అయ్యయ్యో ఇంటిల్లిపాదినీ పోషించే మనిషిలా అయిపోయేడేంటి,” అనేసి ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళు.
కొవ్వూరు గంగారావు డాట్రు దగ్గరికి పాక్కుంటా దేక్కుంటా వెళ్ళిన అప్పల్రాజు ఆయన ఆయుర్వేద వైద్యం రాత్రనకా పగలనకా చేయించుకుంటున్నాడు. అలా చేయించుకుంటూనే వాళ్ళింటిల్లిపాదీ ఎలా మాడిపోతున్నారో గుర్తోచ్చేడంతో రాత్రికి రాత్రి ఆత్రేయపురం వచ్చేశాడు.
రావడమంటే వచ్చేడుగానీ మూటగట్టినట్టు మంచం మీద పడుంటున్నాడు తప్ప ఏ పని చెయ్యడానికీ పనికిరాకుండా పోతున్నాడు. ఒకప్పుడు మా వూరికే బలవంతుడు, మహావీరుడు.. మండే సూర్యుడు అంటా పొగిడిన జనం ఇప్పుడు తాతప్పల్రాజనే వాడొకడున్నాడన్నసంగతే మర్చిపోయేరు.
తాతప్పల్రాజింట్లో జనం ఆకలితో మాడిపోతున్నారు. పెద్దకొడుకైన నర్సరాజు తెగులుగొట్టోడు. చిన్న కొడుకు లక్ష్మీపతిరాజు మట్టికి చదువు మానేసి ఇంటిని పోషించడానికి కూలీనాలీ చేస్తా సందలడ్డాకా ఎవర్నడిగేవాడో ఏంటో తెల్డుగానీ గోదారొడ్డు కెళ్ళి రకరకాల ఆకులూ అలమలూ తెచ్చి సూరి తండ్రి నడుంకి పట్లు వేసేవాడు.
ఏది ఏమైనా ఏడాదికాలంలో తాతప్పల్రాజు కుటుంబం దరిద్రంతో మలమలమంటా మాడిపోయింది. ముగ్గురు కూతుళ్ళలో పెద్దది ఆకలి బాధకి తట్టుకోలేక నిండు ప్రాణాలొదిలేసింది.
మంచంలో కదల్లేని తాతప్పల్రాజు కాటికెళ్తున్న కూతురు శవం చూస్తా కుదెల్లిపోయేడు. రాత్రనకా పగలనకా ఏడుస్తా వున్నాడు. ఇన్నాళ్ళూ వూళ్ళో ఎందరికో ఎన్నెన్నో సాయాలు చేశాడు. ఒకటి కాదూ రెండు కాదు ఎన్నెన్ని రకాలుగానో ఉపయోగపడ్డాడు. అలా అడ్డందుకు ఆ జనాల్లో ఒక్కడంటే ఒక్కడు ఇంటికొచ్చి పరామర్శించినోడ్లేడు. అందుకు తనెవర్నీ ఏమీ అనలేదు, ఏ తిట్టూ తిట్టుకోలేదు. తన కసంతా తన మీదే, తన పగంతా ఈవేళ ఎందుకూ పనికిరాకండా పోయిన తన మీదే.
అలా...అలా పళ్ళు కొరుక్కుంటా ఆలోచించుకుంటా పోతున్న చిలువూరి తాతప్పల్రాజు, “నూరు ఆరైనా... ఆరు నూరైనా నేను మళ్ళీ లేచి నడుస్తాను. ఈ ఆత్రేయపురం ఊరంతా పూర్వంలా కలతిరుగుతాను. చెట్లూ పుట్టలూ ఎక్కుతాను. ఈసారి పాముల్ని, విషప్పురుగుల్నే కాదు దెయ్యాల్ని కూడా చంపుతాను. ఒకప్పుళ్ళా గాకుండా ఇక ముందు బోల్డంత సంపాదిస్తాను. పోయిన పెద్దదాన్లాగ మిగతా నా బిడ్డల్ని కాటికంపను గాక ఆంపను... మిగిలిన్నా బిడ్డల్ని మారాజుల్లాగా మా రాణుల్లాగా జూసుకుంటాను. ఒట్టు...అక్కడెక్కడో పోలవరం అవతలున్న ఆ ఆదిశక్తి గండి పోశమ్మ తల్లి మీదొట్టు...ఇంకా ఎగువలో వున్న పేరంటంపల్లి పరమేశ్వరుడి మీదొట్టు,” అనేశాడు. తథాస్తు దేవతలున్నారేమో అప్పన్న మాటలు విన్నారేమో. ఆ మాటన్న తర్వారనించీ కొంచెం కొంచెంగా కదలడం మొదలెట్టేడు.
కొవ్వూరు గూని డాక్టరుగారిచ్చిన మందు ఠంచనుగా వేసుకుంటున్నాడేమో కుక్కి మంచం మీదుండే మనిషి ఇప్పుడు లేచి కూర్చోగలుగుతున్నాడు.
కొన్నాళ్ళు గడిచినియ్యి. చిన్నకొడుకు లక్ష్మీపతిరాజు అన్ని మైళ్ళూ నడుచుకుంటా కొవ్వూరెళ్ళి ఆ గంగరాజు డాక్టరుకి జరిగింది చెప్పడంతో రాదారి పడవెక్కొచ్చిన ఆ డాక్టరుగారు మందులు మార్చెళ్ళారు.
దాంతో కర్రట్టుకొని నడవడం మొదలెట్టేడు. ఇంకొన్నాళ్ళు గడిచినయ్యి. మళ్ళీ వచ్చిన కొవ్వూరు డాక్టరు మళ్ళీ కొత్త మందులు నూరిచ్చెళ్ళాడు.
ఆశ్చర్యం... అద్భుతం... ఒకప్పుడులా ఆత్రేపురం వూళ్ళో అడుగెట్టాడు తాతప్పల్రాజు. చుట్టూ మూగి పలకరిస్తున్న రాజుల్ని, రారాజుల్ని పట్టించుకోడం మానేసి మెల్లమెల్లగా నడుస్తున్నాడు... ఆ తర్వాత కల తిరుగుతున్నాడు... ఆర్నెల్ల తర్వాత పరుగెడ్తున్నాడు.... ఇంకో ఆర్నెల్ల తర్వాత ఏకంగా గేలాపెత్తుతున్నాడు.
ఊళ్ళో ఎవర్నీ ఏమాత్రం పట్టించుకోని తాతప్పల్రాజులో ఏదో జయించాలి ఏదో సాధించాలి...సంపాయించాలి...అన్న పట్టుదల, పొగరు బాగా బాగా మరీ బాగా పెరిగిపోతున్నాయి. వీటన్నింటికీ కారణం తిండి లేక కాటికెళ్ళిన తన పెద్దపిల్లే!
విజయనగరం అవతలున చీపురపల్లి నుంచి ఒక రాజుల కుటుంబంలో తల్లీ కూతుళ్లు- ఇద్దరూ మొగుళ్ళు పోయినోళ్ళే, వాళ్లూళ్ళో ఏం జరిగిందో తెల్దుగానీ ఈ దిగువ గోదావరి గ్రామమయిన ఆత్రేయపురానికి వలస వచ్చేరు.
ఆ తల్లీకూతుల్లిద్దరూ ప్రతి ఇంటికీ వెళ్ళి, ‘పూతరేకులు తీసిస్తాం మాకింత అన్నం పెట్టండి,’ అని బతిమాలుకుంటుంటే పూతరేకులేంటని  తెల్లబోతా ఒకటే మాటాడుకుంటున్నారు. అలా చాలాసేపు మాటాడుకున్నాకాళ్ళు, ‘ఈళ్ళెవళ్ళో  మన పక్కోళ్ళు గాదు తూర్పోళ్ళు, తూర్పు రాజుల ఆడోళ్ళు అక్కడేం జేసోచ్చేరో... మనకెందుకులే పెంట,’ అనుకుంటా తలుపులేసేసుకుంటన్నారు.
అలా పగలంతా అడుక్కుని రాత్రుళ్ళు దిగువ గోదారొడ్డు కెళ్ళి పడుకుంటున్న ఆ తల్లీకూతుల్లిద్దరూ ఆ పొద్దుటిపూట గోదారొడ్డున గేలాపెత్తుతున్న తాతప్పల్రాజు కళ్ళల్లో పడ్డారు.
యమార్జెంటుగా ఆ తల్లీకూతుళ్ళని వాళ్ళింటికి తీసుకొచ్చిన తాతప్పల్రాజు, “అమ్మా తోబుట్టువుల్లారా నా తల్లుల్లారా ఆకళ్ళతో వున్నారు. ముందు పలారాలు చెయ్యండి,” అంటా ఇంట్లో వాళ్ళనందర్నీ గదమాయించి వాళ్ళింట్లో వున్నాటిల్తో దిబ్బరొట్టి ముక్కలు కాల్పించి వాళ్ళకి పెట్టించేడు.
కడుపు నిండిన ఆ తల్లీకూతుళ్ళని కాసేపు ఏమీ కదపకండా గోవులన్నీ మేతకెళ్ళే వేళయ్యేకా, అడిగేడు. “ఏంటి తల్లుల్లారా... ఏంటో పూతరేకులంటా చెప్పేరు ఏంటయ్యి?” అన్నాడు.
ఆ తల్లీకూతుళ్ళు అప్పల్రాజింట్లో వున్న సేరు ముతక దంపుడు బియ్యం గోదారి నీళ్ళల్లో నానబెట్టారు. కుమ్మరోళ్ళింటికెళ్ళి ఓ బాన తెమ్మని పొయ్యి వెలిగించిన కూతురు తెచ్చిన బానని తిరగేసి ఆ పొయ్యి మీద పెట్టింది. ఇంట్లోకెళ్ళి ఒక అడుగు పొడుగుండే పల్చటిగుడ్డ చింపి తెచ్చింది తల్లి.
బొడ్లోకి చీరని ఎగదోసిన కూతురు ముక్కాలిపీట రుబ్బురోలు ముందరేసుకుని గొంతుక్కూచుని రెండు గంటల్నించి నానబెట్టిన బియ్యాన్ని రుబ్బురోట్లో వేసి గంట దాటేదాకా రుబ్బుతా వుండేసరికి అ బియ్యప్పిండి చిక్కటి పాలల్లాగయ్యింది. చిన్న కర్రముక్కకి గుడ్డ చుట్టి దాన్ని మంచినూనేలో ముంచి కుండ తలమీద పూస్తుంటే ఛయ్యిమంటా మరిగింది.
కుండ వేడెక్కడం ఆవిడ నూనె రాయడం అలా కుండ నూనెని తాగడం మానేదాకా రాస్తానే వుంది.
అంతలో అక్కడికి జేరిన ఆడగుంపు, “బంగారం లాంటి మంచినూనెని అలా పాడుజేత్తారేంటి?” అనడిగితే, “పాడుజెయ్యడం గాదు కుండ పదునుజెయ్యడం అంటారు దీన్ని,” అందావిడ.
“అంటే?” అన్నారాళ్ళు.
“అలా జెయ్యకపోతే ఈ కుండ తలమీద పిండి వెయ్యగానే అట్టులాగా బిగుసుకుపోయి కుండ కంటుకుపోద్ది,” అంటా పదును చేసే పనయ్యేక ఇందాక తెచ్చిన ఆ పల్చటి గుడ్డముక్కని వరిపిండి పాలలో ముంచి తీసి పల్చగా విప్పుతా ఆ కుండ తల మీదేసి లాగింది.
అంటే. “చ్చే...య్” మంటా రెప్ప మూసి తెరిచేలోగా కుండ తల మీద గ్లాస్కోగుడ్డ ముక్కలాంటిది లేచింది. ముసలావిడ దాన్ని తీసి చుట్టూమూగిన ఆడోళ్ళ కందిస్తా, “దీన్నే పూతరేకు అంటారు,” అంది.
పల్చని పాము కుబుసంలాగా పల్చని ఉల్లిపొర కాయితంలాగ పెద్దాపురం పట్టుగుడ్డముక్కలాగ వున్న ఆ పూతరేకుని కొంచెం చిదిపి నాలిక మీదేసుకుంటే ఇట్టే కరిగిపోయింది. “రూసీపసీ లేదు. చప్పగా గడ్డిలా గుంది.” అనేసేరాడోళ్ళు.
వాళ్ళ మాటల్నేం పట్టించుకోని ఆ తల్లీకూతుళ్ళు రెండు గంటలపాటు రెండొందల పూతరేకుల్ని తీసి ఒజ్జుగా ఓ చేటలో పేర్చారు.
కూతురు బెల్లం తరిగిస్తే తల్లి పూతరేకుల్ని తడిగుడ్డలో కొంచెం నానబెట్టి ఒకో పూతరేకునీ పళ్ళెంలో బెట్టి దానిమీద నెయ్యినీ బెల్లాన్నీ జల్లెకా చాలా చక్కగా మడతపెట్టిందా పూతరేకుని. చుట్టూ మూగిన ఆడోళ్ళలో వున్న ఆ వూరి పెద్ద జగన్నాథరాజుగారి భార్యని రుచి చూడమంటా అందించింది. ఒణుకుతున్న వేళ్ళతో ఆ పూతరేకుని పట్టుకొన్న జగన్నాథరాజుగారి భార్యయిన జయభాస్కరమ్మ ఓ మూల కొరికి తిన్నాకా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది.
దాంతో ఆవిడ చుట్టూ మూగిన ఆడోళ్ళకి ఒకటే కంగారు. బెంబేలెత్తిపోతా ‘ఎవైందలాగుండిపోయే,’ రంటా అరిచేరు.
“ఇదేంటిలాగుంది?” అంది జయభాస్కరమ్మ.
“ఎలాగుంది?” అన్నారంతా.
“ఇది పూతరేకు గాదు.”
“మరి?”
“ఐబాబోయ్... ఎంత బాగుందో. అమృతంలాగుంది.”
దాంతో ఆ ఆడోల్లంతా తలో పూతరేకూ చుట్టించుకు తింటా ఆ తల్లీకూతుళ్ళని ఒకటే పొగడ్డం మొదలెట్టేరు.
చలిగాలులు వీచే రోజులయ్యి. చిత్రం గాకపోతే మిట్ట మధ్యానమే ఇంత చలా? గోదాట్లో వెళ్తున్న మరపడవలో దొరలెవరో విహారానికెళ్తూన్నారు. గట్ల మీద కొబ్బరిచెట్లకి దిగిన గెలలు కళకళ్ళాడిపోతా కదుల్తున్నాయి. గోదారి గట్టు మీద ఉంటున్న తల్లీకూతుళ్ళ ఆ తాటాకుపాక అందంగా వెలిగిపోతుంది.
తిన్నగా ఆళ్ళింటి ముందుకెళ్ళి నిలబడ్డ తాతప్పల్రాజుని చూసిన ఆ తల్లీకూతుళ్ళు ఆదుర్దాగా ఎదురెళ్ళి ఆ మనిషి కాళ్ళ మీద పడిపోయేరు.
“పైకి లేవండమ్మా... అమ్మా మీరు రోజూ చేసే పూతరేకులు నాకియ్యండి. వందకింతనిస్తాను.” అన్నాడు.
“అన్నం పెట్టి ఆదుకున్నఆ తండ్రులు మీరెలా చెప్తే అలాగే,” అన్నారాళ్ళు.
ఆ రేకులు వాళ్ళింటికి తెచ్చుకున్న తాతప్పల్రాజు ముందు నీళ్ళు చల్లిన ఒకో రేకునీ తడిసిన గుడ్డని నేలమీదారేసినట్టు తుంగచాప మీద పరిచి ముందు నెయ్యి జల్లేడు. తర్వాత నేతిలో దోరగా వేపి రోట్లో కుమ్మిన జీడిపప్పు పొడుం, యాలక్కాయల గింజల పొడుం, బాదంపప్పుల పొడుం, తాటికల్లుతో పండే తాటిబెల్లం పొడుంలో (అసలు సిక్రేటిక్కడుంది మరి) కలిపిన గుండని ఆ పూతరేకుల మీద తెగజల్లి చుట్టచుట్టి దాని కెడాపెడా మళ్ళీ నెయ్యి పోసి తయారుచేసిన పూతరేకుల్ని ఒక జంగిడీలో సర్దుకొని నెత్తిమీద పెట్టుకుని ఎర్ర కంకరబాటమ్మట లొల్లలాకుల దగ్గరకి బయల్దేరేడు.
బస్సులు కార్లూ లేని కాలం. లొల్లకాలవలో పడవలూ, స్టీమర్లూ లాంచీలతో ఒకటే తొడతొక్కిడిగా వుంది. రూపాయికి అరవై కానులు. ఒకో పూతరేకు ఖరీదు ఒక కానీ చెప్తున్నాడు అప్పన్న. అది విన్న గంటా గళాసు రంగాసూరి “అయ్యబాబోయ్ ఇంత రేటెట్టి దాన్నెవడు కొని తింటాడు,” అంటా గుండెలు బాదు కుంటున్నాడు.
ఆడన్నట్టే ఎవడూ కొనడం లేదు. ఏరోజు  తెచ్చినియ్యి అమ్ముడవ్వక ఆవేళ సాయంత్రం కాలవలో పోసెళ్ళాల్సొస్తుంది. ఇలా కొన్నాళ్ళు గడిచినియ్యి. తాతప్పల్రాజులో ఎలాంటి నీరసం లేదు. ఏదో మొండి ధైర్యం. వెండి కొండంత ఆశ. ప్రతిరోజు సాయంత్రం కలలు గంటానే ఆ ఖాళీ జంగిడీతో ఇంటికెల్తున్నాడు. అతన్ని చూస్తున్న ఇంట్లో జనం మనిషి మెదడు కేవన్నా తేడా చేసిందా అనుకుంటున్నారు.
ఆవేళ ఒక లాంచీ ఆగింది రేవులో, అందులోంచి దిగుతున్నోల్లంతా దొరలే. తెల్లదొరలు మంద కింద దిగుతున్నారు. వాళ్ళంతా రాజమండ్రీలో వుండే ఎడ్వార్డ్ ఫాక్స్ దొరగారి టీమ్ అంట. వాళ్ళలో ఒక దొర తాతప్పన్న పూతరేకుల చుట్టలు చూసి అవి జేబురుమాళ్ళనుకుని అందులో ఒకదాన్ని తీసుకుని మూతి తుడుచుకుంటుంటే ఆ దొర తెల్లమూతికి బెల్లం నెయ్యీ అంటుకున్నాయి. దాంతో, ‘డర్టీ హెంకీ,’ అని తిడతా పూతరేకు చుట్టని కాలవలో పారేశాడు.
ఆ పారేసెళ్ళిన మనిషెనకే నిలబడ్డ ఇంకో దొరగారు అప్పన్న జంగిడీలో పూతరేకు చుట్ట తీసుకుని కొరికి రుచిగా చప్పలించి మొత్తం తిన్నాకా ఇందాక జేబురుమాలనుకొని కాలువలో పారేసిన దొరని, “హే... థాంప్సన్,” అంటా పిల్చి, “ఇట్స్ నాటె కర్చీఫ్.. వండర్ఫుల్ స్వీట్ మేన్,” అన్నారు. ఆ అన్న మనిషెవరో కాదు. పెద్ద దొరగారు. ఆ టీమ్ కి లీడరయిన ఎడ్వార్డ్ ఫాక్స్ దొరగారు.
వాళ్ళ లీడరు అలా అనడంతో దొరలంతా తలో పూతరేకు చుట్టా తీసుకు తిన్నారు. ఆ తినడం అలా ఇలా కాదు మా రుచిగా తిన్నారు. అసలు రుచంటే ఇదే మరి అంటా తిన్నారు.
ఐదు నిమిషాల్లో తాతప్పల్రాజు జంగిడీ మొత్తం ఖాళీ అయిపొయింది.
ఆ దొరలలా తినడం చూసిన జనం అప్పలరాజు చుట్టూ మూగి అడిగితే “రేపు తెస్తాన్లే ,” అంటా ఆనందంగా ఆత్రేయపురానికి తిరుగుముఖం పట్టేడు.
ఆవేల్టి నించీ తాతప్పలరాజు పూతరేకులకి లొల్లలాకుల దగ్గర గిరాకీ తెగ పెరిగిపోయింది. ఇప్పుడు జంగిడీ కాదు, ప్రతీరోజు పెద్ద గంపతో దిగిన అప్పల్రాజు వచ్చిన గంప వచ్చినట్టు ఖాళీ అయిపోతుంది. ఆ పూతరేకుల్ని మనోళ్ళ కంటే దొరలే ఎక్కువ కొనడంతో చూస్తున్న మనోళ్ళు ఆటిలో ఎంత రుసి లేకపోతే ఆ తెలివైన తెల్లోళ్ళలా ఇరగబడి కొంటారు అంటా లెక్కలేసుకున్నారేమో మరిక్కడ్నించి కొనడమే కొనడం, వచ్చిన అప్పన్న గంప వచ్చినట్టయిపోతుంది. కొంతమందయితే సరాసరి ఆత్రేయపురమొచ్చేస్తున్నారు.
ఈళ్ళని చూస్తున్న ఆత్రేయపురం రాజుల కుటుంబాల్లో తాతప్పలరాజంటే ఒకటే కోపం పెరిగిపోతుంది. అది చూసిన కొందరు రాజులు, “ఈ తాతప్పిగాడు మన రాజుల్లో చెడబుట్టేడ్రా.... ఈ దరిద్రుడేంట్రా... ఆ లొల్లలాకుల దగ్గర అయ్యేంటో పూత సుట్టలమ్ముకుంటున్నాడంట.” అంటా తక్కిన రాజుల జబ్బలు గిల్లేరు. ఈళ్ళ మాటలాళ్ళ నషాళానికెక్కినయ్యి.
“ఆడు రాజుగాదు ఆడెవడో లేబరోడు. ఆడ్ని మన రాజుల వంశంలోంచి వెలేద్దాం,” అనేశారు. అనడమేంటిక వూరు వూరంతా ఒకటయ్యి ఆ చిలువూరి తాతప్పల్రాజు కుటుంబానికి పెళ్ళి పిలుపులు, నీళ్ళు, పాలు అన్నీ ఆగిపోయినియ్యి. తాతప్పన్న ఎదురైతే, ఛి..చ్చీ  అంటాకాండ్రించి ఉమ్మేస్తున్నారు.
చాన్నాళ్ళ నించి ఇదంతా పరమ శాంతంగా వింటా చూస్తున్న చిలువూరి తాతప్పలరాజు, ఒక్కసారి పైకి లేచి, “మామూలుగా వున్నపుడు ఈ ఆత్రేయపురానికి కథానాయకుడు అని పొగిడిన జనమంతా నా నడుం విరిగి మంచం మీద పడ్డప్పుడెవరొచ్చారు... నేను దరిద్రం అనుభవిస్తున్నప్పుడు, అన్నం లేక చచ్చిపోయిన నా కూతుర్ని కాటికంపినప్పుడేం జేసేరు. నాకేం జేసేరు. ఎవరో తల్లులు తెచ్చిన పూతరేకుని నా పద్ధతొకటి కనిపెట్టి తయారుచేసుకొని అమ్ముకుంటా పొట్ట పోసుకుంటే మీకందరికీ నామర్ధాగా వుందా.. నన్ను లేబరోడంటారా... నిజమే మరి. నే లేబరోడ్నే... మీరంతా నన్ను వేలివేస్తారా... వద్దులే..నేనే మిమ్మల్ని వెలి వేస్తున్నాను,” అంటా ఆత్రేయపురం వూరి లేబరోళ్ళ జబ్బల మీద చేతులేసి తిరగడం మొదలెట్టేడు. పల్లె సమ్మయ్య దగ్గర మోచేతి వల ఎయ్యడం నేర్చుకోడం మొదలెట్టేడు.
జనం మీద కోపం పెరిగిన ఆ తాతప్పల్రాజు చుట్టే పూతరేకు చుట్టకయ్యే ఖర్చుకే అమ్ముతున్నాడు. అదేంటోగానీ అమ్మకాలు మరీ మరీ పెరిగిపోవడంతో అందులో కూడా ఎంతో కొంత మిగుల్తుంది. తాతప్పన్న కుటుంబం సుబ్బరంగా బతుకుతుంది. మిగిల్న ఈ మాత్రం డబ్బుల్తోనే ఏటి ఒడ్డున ఎకరం పొలం కొన్నాడు.
ఇంత డిమాండు పెరిగిన పూతరేకులమ్మి సంపాయించిన రొక్కంతో ఒకే ఒక్క, ఎకరం పొలం కొనడమూ చిత్రం గదా... విచిత్రం గదా అనుకున్న ఆ ఆత్రేయపురం జనం ఆ తాతప్పన్న పూతరేకు చుట్టలకి పెడ్తున్న ఖర్చుని లెక్కెట్టగలిగేరు. అయ్యయ్యో ఆ అప్పిగాడ్నింతకు ముందేవన్నా అన్నామేమో... ఇప్పుడింకేం అనంలే అనుకున్నారేమో మరనడం మానేశారు.
అప్పుడప్పుడూ ధవిలేశ్వరం నించి తెల్లదొరలు స్టీమర్ల మీద లొల్లలాక్కాడ బంగ్లాలో దిగేవాళ్ళు. ఆళ్ళంతా తిరిగెళ్ళేటప్పుడు తాతప్పల్రాజు పూతరేకు చుట్టాల్ని ఇదాయికంగా పట్టుకెళ్ళేవాళ్ళు.
పనిచెయ్యని ఆఫీసర్లకి పూతరేకులు పంపిస్తే ఠంచనుగా పనయిపోయేది. దూరాల్నించి ఆ వూళ్ళకొచ్చిన చుట్టాలకి పూతచుట్టిలిస్తే ఆనవాయితీ. పొరుగూళ్ళ ల్లో బంధువులింటికెళ్ళేప్పుడు ఆత్రేయపురం పూతరేకు చుట్టలు పట్టుకెల్లడం ఆనవాయితీ. పెళ్ళిళ్ళప్పుడు భోజనాల ఆకుల్లో ఈ పూతరేకు వేస్తే అబ్బో మా గొప్ప భోజనాలెట్టినట్టు. సారెల్లో పూతరేకుల కావిడి జేరితే ఒకటే అబ్బురం.
లొల్లలో పోలీస్ స్టేషన్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళ ఏలుబళ్ళో తక్కిన ఉద్యోగస్తులు సరే ముఖ్యంగా పోలీసోళ్ళని మా గౌరవంగా చూసుకునేది బ్రిటీష్ ప్రభుత్వం.
అలాంటా రోజుల్లో ఆవేళ ఒక పోలీసాయన కొండూరి శ్రీరంగరాజుగారనే జమీందారుని పెద్దమనిషని ఏమాత్రం గౌరవం లేకుండా మాటాడి పదిమందిలో పరువు తీసేడు. దాంతో ఆ రాజుగారా పోలీస్ ఇన్స్పెక్టర్ ని లాగి లెంపకాయ కొట్టేరు.
అంతే...ఇంకేముంది కేసు ఫైలైంది. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి.
చాలా తక్కువ వాయిదాల తర్వాత జిల్లా కోర్టు బెంచిలో కేసు తీర్పు దాకా వచ్చింది.
జమిందారూ, పెద్దమనిషీ అయిన శ్రీరంగరాజుగారికి ఉరిశిక్ష పడిపోయేలాగుందని అంతా తెగ భయపడిపోతున్నారు.
ఈమాట రంగారాజుగారి చెవిన బడింది. దానికాయన ఏమాత్రం ఒణక్కుండా బెణక్కుండా ఆత్రేయపురంలో వుండే తాతప్పల్రాజుకి కబురెట్టి వంద పూతరేకులు బ్రెహ్మాన్డంగా చేసుకురమ్మని వంద రూపాయలిచ్చేరు అంటే అరెకరం పొలం కోనేంత డబ్బు.
తిన్న ఏ ఒక్కడన్నా సరే శెభాషో అనేంత గొప్ప రుచిగా అప్పల్రాజు చేసుకొచ్చిన పూతరేకులు తీసుకున్న శ్రీరంగరాజుగారు గుర్రమెక్కి కాకినాడ బయల్దేరేరు.
రిచర్డ్ గుడ్ విన్ అనే ఆ జిల్లా జడ్జి గారింటికెళ్ళిన రాజుగారు,  ‘సిస్టర్’ అంటూ ఆ జడ్జి దొరగారి భార్యని పలకరించి, భక్తితో పూతరేకుల కట్ట అందించేటప్పటికి కరిగి నీరయిపోయింది. ఆ పూతరేకుల రుచి చూసిన ఆవిడ తల్లకిందులయిపోయి, ఆ తర్వాత సొంత అన్నగారి కంటే ఎక్కువ మర్యాదలు చేసిందా రాజుగారికి.
అలాగ ఆ నెలలో చాలాసార్లు తాతప్పల్రాజు పూతరేకులు పట్టుకెళ్ళిన శ్రీరంగరాజుగారు, ఆవేళ మాటాడకుండా మూగోళ్ళా వుండడం చూసి, “ఏవైంది  బ్రదర్...?” అంది జడ్జి భార్య.
నోరిప్పిన రాజుగారు, “చెల్లి... నా చెల్లి... ఇంకా ఈ బ్రదర్ నీకు కనపడ్డు... మా ప్లీడరుగారు జెప్పేరు తొందర్లో నాకు ఉరిశిక్ష పడోచ్చంట,” అంటా జరిగింది మొత్తం జెప్పేడు శ్రీరంగరాజు.
అంతే,
రాత్రికి రాత్రి మొగుడైన ఆ జడ్జిగారికేం చెప్పిందో మా తల్లి రంగారాజుగారి మేడ కేసు ఉన్న పళంగా కొట్టించేసింది. ఆ రాజుని నిర్దోషిని చేయించేసింది.
ఆ ప్రాంతం జమీందారు శ్రీరంగరాజు గారంతటోరి ఉరిశిక్ష రద్దు చేయించిన తాతప్పల్రాజు పూతరేక్కి గౌరవం ఉన్న పళాన మరీ పెరిగిపోయింది. అప్పల్రాజు వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలయ్యింది. ఏటా ఎకరం పొలం కొంటున్న అప్పల్రాజప్పటికి ఎనిమిదెకరాలు కొనగలిగేడు.
అప్పటిదాకా అతనికి దూరంగా ఉన్న వూళ్ళో స్నేహితులూ బంధువులూ ఒక్కొక్కళ్ళే దగ్గరకి జరగడం మొదలెట్టేరు. అలా ఆళ్ళంతా ఇంట్లో కోస్తుంటే రమ్మంటా పిలుస్తుంటే వెళ్తున్న తాతప్పల్రాజు ఆళ్ళని తన గుండెల్లోకి మట్టుకి తీసుకెళ్లడం లేదు.
********

No comments:

Post a Comment

Pages