ప్రేమతో నీ ఋషి – 4 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 4

Share This

ప్రేమతో నీ ఋషి – 4 

- యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కార్పొరేట్ ప్రపంచాన్ని కొన్నేళ్ళపాటు కుదిపెయ్యగల ఆ సందేశం గురించి తెలియాలంటే... మనం కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో ఏమి జరిగిందో తెలుసుకోవాలి... గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  భారత్ లోని CA లు అందరికీ మిష్టర్ శర్మ ఆధ్వర్యంలో లండన్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, వారి ద్వారా భారత క్లైంట్ లు ‘వైన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ లో పెట్టుబడి పెట్టేలా చేస్తాడు ఋషి. తర్వాత ‘ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ లో పనిచేసేందుకు ఆసక్తితో మాంచెస్టర్ శాఖకు బదిలీ అయ్యి వస్తాడు. ఇక చదవండి...)
రాత్రి పదకొండయ్యింది. ఋషి భోజనం ముగించుకుని, హెడ్ ఆఫీస్ లో  సమర్పించాల్సిన ‘మంత్లీ పెర్ఫార్మన్స్ నోట్’ ను తయారుచేయసాగాడు. అది దాదాపుగా పూర్తిచేసి, ఆర్ట్ మార్కెట్ ను గురించిన మరింత సమాచారం కోసం ఋషి ఇంటర్నెట్ బ్రౌస్ చెయ్యసాగాడు.
మొదట అతను మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ వెబ్సైటు ను చూసాడు. అందులోని సమాచారం ద్వారా అతను ఆర్ట్ మార్కెట్ లో ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాల్ని అర్ధం చేసుకోగలిగాడు. అతను వెబ్ నుంచి ఆర్ట్ ను ప్రత్యామ్నాయ పెట్టుబడి విధానంగా వాడేందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సంగ్రహించాడు.
మరింత బ్రౌస్ చేసాకా,అతను తన ఫేస్బుక్ ఎకౌంటు లోకి లాగ్ ఇన్ అయ్యాడు. తన పాత స్కూల్ మిత్రులను కలిసేందుకు సహకరించింది కనుక, అతనికి ఫేస్బుక్ అంటే ఎక్కువ ఇష్టం. ఏ వ్యాపార ప్రతిపాదనైనా ఆరంభించే ముందు, ఏవైనా సంబంధబాంధవ్యాలకు అవకాశం ఉందేమో అని చూడడం అతనికి అలవాటు.
నిజానికి, అతను మొదట మిష్టర్. శర్మ ను ఫేస్బుక్ ద్వారానే కలుసుకోగలిగాడు. అతను ఫేస్బుక్ లో CA ఇన్స్టిట్యూట్ లింక్స్ కోసం బ్రౌస్ చేస్తూ, హైదరాబాద్ నుంచి వారు స్టడీ టూర్ కై లండన్ వస్తున్న విషయం తెలుసుకున్నాడు.
అతని చేతులు ఇప్పుడు మౌనంగా ‘ఫ్రెండ్ ఫైండర్’ ఆప్షన్ ను వాడడం మొదలుపెట్టాయి. అతను మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కు సంబంధించిన గ్రూప్ లకై వెతకసాగాడు.
కొన్ని క్షణాల అన్వేషణ తరువాత, అతను గేలరీ కు సంబంధించిన కొంతమంది ఉద్యోగుల జాబితాను తయారుచేసాడు. గేలరీ లో తాను సంప్రదించతగిన భారతీయుల పేర్ల కోసం శోధిస్తూ, అతను మరికొంత సమయం గడిపాడు.
కొన్ని క్షణాల్లో, అతను బ్రౌస్ చేస్తున్న ఫేస్బుక్ పేజి పై ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోను చూసి, అతను కొద్ది క్షణాలు రెప్ప వెయ్యటం మరిచిపోయాడు.
ఋషి దృష్టిని ఆకర్షించిన ఫోటోలో ఉన్న స్త్రీ , ఏదో పుస్తకం చదివేందుకు, ఒకవైపుకు తిరిగినట్లుగా ఉంది. ఒక ప్రక్కనుంచి మాత్రమే కనిపిస్తున్న ఆమె చక్కటి వదనాన్ని, ఆమె బుగ్గల ఎర్రదనం అధిగమిస్తోంది. అది ఆమె వేసుకున్న గులాబి రంగు డ్రెస్ వల్ల మరింత ఇనుమడిస్తోంది. ఫోటోను ముదురు రంగు బాక్గ్రౌండ్ లో తియ్యటం వల్ల, ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆమె ముక్కుపుడక, ఆమె అందాన్ని మరంత పెంచింది. ముక్కుపుడకపై పడిన కెమెరా ఫ్లాష్ ఫోటోలో చాలా అందంగా కనిపిస్తోంది. కాని, ఆమె చిరునవ్వు ముందు ఇవన్నీ వెలవెలబోతున్నాయి. మతిపోగోట్టేలా ఉన్న ఆమె చిరునవ్వు చూసి, ఋషి విస్మయం చెందాడు. తెలియని పారవశ్యంలో ‘ఆడ్ ఫ్రెండ్’ బటన్ నొక్కాడు.
పిల్లలు ఫోటోలలో అందంగా కనిపిస్తారని అంటుంటారు. కారణం చాలా తేలిగ్గా చెప్పచ్చు – వాళ్ళు ఫొటోజెనిక్ గా ఉండేందుకు తగిన సూచనలన్నీ పరాకుగా పాటించేస్తారు. వాళ్ళు ప్రశాంతంగా, ఎటువంటి దిగులూ లేకుండా, ఆడుతూ వారు చూపే హావభావాలలో స్వచ్చంగా కనిపిస్తారు. అందుకే ఫోటోలకు సంబంధించిన ఉత్తమ పోస్ లు ఏవంటే, మనలోని పసిపాపను బయటికి తెచ్చేవే !
ఫొటోజెనిక్ ఫేస్ ఉన్నవారు సరదాగా, సంకోచాలు లేకుండా, సంతోషంగా తనలోని ఆనందమయ కోణాన్ని ఆవిష్కరించేవారు అయ్యిఉంటారు. ఋషి చూస్తున్న ప్రొఫైల్ పిక్చర్ లోని స్త్రీ, ఫొటోజెనిక్ ఫేస్ కు ఉండాల్సిన అర్హతలనన్నింటినీ కలిగిఉంది. అది ఋషి ఆమె పూర్తి  ప్రొఫైల్ ను చూసేలా చేసింది.
ఆమె పేరు స్నిగ్ధ, ప్రస్తుతం మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో ఇంటర్న్ గా పనిచేస్తోంది.
******
“ స్నిగ్ధ గుప్త, వయసు 24 ఏళ్ళు, పుట్టుకరీత్యా భారతీయురాలు, ఆర్ట్ బిజినెస్ లో మాస్టర్స్, ప్రస్తుతం మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో ఇంటర్న్ గా పనిచేస్తోంది, “ అంటూ చేతిలో ఉన్న రెస్యూమ్ చూస్తూ చదివాడు మహేంద్ర.
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం ప్రాజెక్ట్ లో తనకు సహకరించేందుకు గానూ, మహేంద్ర దసపల్లా ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతనికి తోడుగా నగరంలోని ప్రఖ్యాత ఆర్ట్ డీలర్ అయిన ‘అప్సర పండిట్’ ఉంది.
“ఎస్ సర్, గుడ్ మార్నింగ్, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది,” , అంది స్నిగ్ద చక్కగా నవ్వుతూ, అలా నవ్వటం ఆమెకు సహజంగా అలవడింది. “గుడ్ మార్నింగ్ మామ్ ,’ అంటూ ఆమె అప్సరను కూడా పలకరించింది.
తన మనసుకు చాలా నచ్చిన ప్రాజెక్ట్ కనుక, ఇటీవల వరకూ అన్ని వ్యవహారాలు మహెంద్రే చూసుకోసాగాడు. అది భారతీయత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే 500 భారతీయ కళాఖండాల సేకరణకు సంబంధించిన .500 కోట్ల మెగా ప్రాజెక్టు. ఈ చిత్రాలను గతంలో విశ్వవిఖ్యాతులైన భారతీయ చిత్రకారులు చిత్రీకరించారు.
అనేక సందర్భాల్లో వీటిని ‘జాతీయ చిత్రకళా నిధులు’ గా వెల్లడించారు. కాని బ్రిటిష్ పాలనా సమయంలో వీటిలో చాలావరకూ దేశం దాటి వెళ్ళిపోయాయి. వీటిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అందుకోసమే, ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ వారు స్వీకరించి, ప్రస్తుతం మహేంద్రను చైర్మన్ గా నియమించారు. ఇది ఒక కొత్త ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించి,  అన్ని రాష్ట్రప్రభుత్వ పెద్ద ప్రాజెక్ట్ లకు ఇదే మార్గాన్ని అవలంబిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి, మహేంద్ర వ్యక్తిగతంగా అనేక గంటలపాటు శ్రమించి, మ్యూజియం కై ఎంచుకున్న ప్రతి కళాఖండం అసలైనదేనని, ఆర్ట్ మ్యూజియం ప్రతిష్టను ఇనుమడింపచేసేదని, నిర్దారించుకునేవాడు. వృత్తిపరంగా, అతనికొక ‘నేషనల్ ఐకాన్’ గా ప్రభుత్వ, వ్యాపార సంబంధికులలో గుర్తింపును తెచ్చే ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది.
దీనికోసం అతను అన్ని ప్రధాన ఆర్ట్ ఫెయిర్ లకు ప్రయాణించాలి. చివరికి, అతను తన ఆఫీస్ మాంచెస్టర్ లో ఉంటే బాగుంటుందని ఆలోచించాడు. త్వరలోనే అది ప్రతిపాదించిన ఆర్ట్ మ్యూజియం కు ఓవర్సీస్ హబ్ గా మారింది.
తన విస్తృతమైన ఆర్ట్ కు సంబంధించిన వ్యాపార వ్యవస్తానాలతో లండన్ ఆర్ట్ కొరకు ఒక అంతర్జాతీయ కేంద్రంగా నెలకొంది. కాని, మహేంద్రకు లండన్ లో ఉండడం ఇష్టంలేదు.
మాంచెస్టర్ యూనివర్సిటీ యొక్క ఆలమ్ని అసోసియేషన్ ఇండియన్ వింగ్ కు అతను చైర్మన్. అందుకే అతను మాంచెస్టర్ లో ఆఫీస్ ఉంటే మంచిదని భావించాడు. ఈ ఆఫీస్ ద్వారా, అతను మాంచెస్టర్ లోని తన ఆలమ్ని అసోసియేషన్ పనుల్ని, లండన్ లో ఆర్ట్ డీల్స్ ను పూర్తిచేసే పనుల్ని ఒకేసారి చూసుకోవచ్చని, భావించాడు.
ఈ ఆఫీస్ నిర్వహణ వ్యవహారాల్లో మృణాల్ దేశ్ పాండే అతనికి పూర్తిగా సహకరిస్తున్నాడు. ఆర్ట్ మ్యూజియం కు తగిన అరుదైన భారతీయ చిత్రాల గుర్తింపులో ఆర్ట్ డీలర్ అయిన అప్సర పండిట్ అతనికి సాయం చేస్తోంది.
ఒక చిత్రానికి యెంత వెల చెల్లించవచ్చు అనేది, సేకరించిన వారిని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే చిత్రాల సేకరణ అనేది, ఆ వ్యక్తియొక్క కళాత్మక దృక్పధాన్ని బట్టి, ఉన్నతమైన భావనలను బట్టి ఉంటాయి.
సరిగ్గా, ఇక్కడే ఆర్ట్ డీలర్ ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తారు – ఈ అభిరుచికి సంబంధించిన అంశాలను అవగతం చేసుకుని, వృత్తిపరంగా ఎంతో విలువైన ఆర్ట్ మార్కెటింగ్ చైన్ మొత్తాన్ని వీరు నిర్వహిస్తారు. ఆర్ట్ డీలర్స్, ఆర్ట్ కు సంబంధించిన అన్ని లావాదేవీలు జరిగే వ్యాపార కేంద్రాలైన- స్థానిక ఆక్షన్ హౌస్ లతో సంబంధాలు కలిగిఉంటారు.
అంతర్జాతీయంగా గుర్తింపును పొందిన ఆర్ట్ హౌస్ లు రెండు ఉన్నాయి – క్రిస్టీస్ ఇంకా సౌత్ బే – ఇవి కలిసికట్టుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా జరిగే ఆర్ట్ కు సంబంధించిన వేలాల్ని స్వాధీనం చేసుకుంటాయి. ఈ 300 బిలియన్ల USD ని నిర్వహించేందుకు తగిన మానవ వనరులు సమకూర్చడం కోసం సౌత్ బే ఆక్షన్ హౌస్ లండన్, సింగపూర్, US లలో ఆఫీస్ లు ఉన్న ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పరిచింది.
స్నిగ్ధ ఈ సంస్థ యొక్క లండన్ కేంద్రంలో మాస్టర్స్ ను పూర్తి చేసి, ఈ కోర్స్ యొక్క చివరి సర్టిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో ఇంటర్న్ గా పనిచేస్తోంది.
ఈ శిక్షణ మలిదశకు చేరుకోవడంతో, ఒక స్థానిక వార్తాపత్రికలోని ప్రకటన ఆధారంగా, ఆమె మహేంద్ర యొక్క మాంచెస్టర్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది.
మహేంద్ర ఇన్నాళ్ళూ, మృణాల్ మరియు అప్సర సాయంతో ఆఫీస్ పనిని చూసుకునేవాడు. కాని, హైదరాబాద్ లో ఉన్న అతని సాఫ్ట్వేర్ సంస్థ తాజాగా వృద్ధిచెందింది. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎన్నో మెగా ప్రాజెక్ట్ లను స్వీకరించసాగాడు. అది ఈ మధ్య అతన్ని చాలా బిజీ గా ఉంచుతోంది. అందుకే మాంచెస్టర్ ప్రాజెక్ట్ ఆఫీస్ పై అతను సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాడు.
అనుకున్న 500 ఆర్ట్ వర్క్స్ లలో ఇప్పటివరకు వారో కేవలం 150 కళాఖండాలను మాత్రమే అనేక ఆర్ట్ ఫెయిర్ ల నుండి, ఆక్షన్ హౌస్ ల నుండి కొనుగోలు చెయ్యగలిగారు. మిగిలిన కళాఖండాల ఎంపికకు తగిన సమయం లేకపోవడంతో మహేంద్ర ఇందులో వ్యక్తిగతంగా పాలుపంచుకోలేకపోతున్నాడు.
మహేంద్ర నుంచి ఈ వ్యాపార కార్యకలాపాలను స్వీకరించడం కోసమే స్నిగ్ద ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆర్ట్ మ్యూజియం ప్రారంభోత్సవం త్వరలోనే జరుగుతుందని ప్రకటించడం వల్ల, అతను ఇది ఎంతో కీలకమైనదని భావించాడు.
“ ఆర్ట్ మార్కెట్ ను నీ వృత్తిగా స్వీకరించేలా నీకు ప్రేరణ కలిగించిన అంశం ఏమిటి ?” బ్లాక్ కాఫీ తాగుతూ అడిగాడు  మహేంద్ర. అతను ఆమెకు కూడా బ్లాక్ కాఫీ అందించాడు. స్నిగ్ద కాఫీ ఇచ్చినందుకు వినయంగా కృతఙ్ఞతలు తెలిపి, “సర్, నా దృష్టిలో ఆర్ట్ అనేది ఒక సమాచార మాధ్యమం – ఒక దృశ్య సమాచారం. ఒక అందమైన ప్రకృతి దృశ్యం ఒక కవి కలాన్ని కదిలించినట్టు, ప్రశాంతమైన జలపాత ధ్వని, ఒక సంగీతకారుడికి ప్రేరణ కలిగించినట్లు, ఒక ఆర్టిస్ట్ తెల్ల కాగితంపై తన ఆలోచనలను, భావాలను కుంచెతో ఆవిష్కరిస్తాడు. అనంతమైన భావాలను వ్యక్తపరిచేందుకు చిత్రకళ ఒక మాధ్యమం. “
ఆమె బదులిస్తూ, వారి ముఖాల్లోని భావాల్ని చదివేందుకు అప్సర, మహేంద్ర వంక చూసింది. ఆమె అప్సర చాలా ఆకర్షణీయంగా ఉందని, ఆమె దుస్తులు ఆమె ఆకృతికి వన్నె తెచ్చాయని, గమనించింది.
“ఒకరు తమను తాము స్వేచ్చగా ఆవిష్కరించుకునే గొప్ప చికిత్సకారిగా చిత్రకళ పనిచేస్తుంది, దీన్ని అద్భుతమైన వ్యాపకంగా కూడా మార్చుకోవచ్చు. ఒక చిత్రం మమతను సృష్టించగలదు, లోలోపల అలజడిని  సృష్టించగలదు లేక ఒకరి జీవితంలో ఆనందాన్ని నింపగలదు. నావరకు చిత్రాలను, చిత్రకళను చదవడం అనేది, మనిషి జీవితాన్ని కళాత్మకమైన దృష్టితో చదవడం. “ తేల్చి చెప్పింది స్నిగ్ధ.
ఆమె స్పందన మహేంద్రను మెప్పించింది. అభిరుచి, వృత్తితో కలిసిన చోట ఒక వ్యక్తి చూపే అంకితభావం నాణ్యమైన ఫలితాల్ని ఇస్తుందని, అతని నమ్మకం. స్నిగ్ధ కు పనిపట్ల ఆ మక్కువ ఉందని అతను తెలుసుకున్నాడు.
“నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాజెక్ట్ కోసం నీకు కావలసిన కీలకమైన అర్హతలేమిటో నీకు తెలుసా ?” అడిగింది అప్సర జోక్యం కల్పించుకుంటూ.
“మేడం, భారత చరిత్రలోనే ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ మొట్టమొదటి అరుదైన ప్రాజెక్ట్ అని నాకు తెలుసు. అంతర్జాతీయ ఆర్ట్ మ్యూజియం లతో పోటీపడేలా ఒక ఆర్ట్ మ్యూజియం ఏర్పరచి, హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకు ఇదొక ప్రయత్నం. ఇది సఫలం కావాలంటే, కేవలం సేకరణకారుల వద్దనున్న భారతీయ కళాఖండాలను కలిగిఉండడం మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతిని, చరిత్రను ప్రతిబింబించేలా కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మనం మ్యూజియం లో చిత్రాలను ఉంచేముందే, అవి అసలైన చిత్రాలని నిర్ధారించాలి.”
మహేంద్ర స్నిగ్ధ చెప్పింది విని, ఉత్సుకతతో కాస్త ముందుకు జరిగాడు. ఒక గమ్మత్తైన చిరునవ్వుతో స్నిగ్ధను ఇలా ప్రశ్నించాడు.
“చిత్రాలు అసలైనవో కాదో నువ్వు ఎలా నిర్దారిస్తావు ?”
ఆర్ట్ ప్రపంచంలో ఆర్ట్ ఫోర్జరీ లు అనేవి అతి సాధారణమైన మోసాలు. కళాఖండాల విషయంలో మోసాలకు గురయ్యే అవకాశాలు మూడు.
మొదటిది, అసలు చిత్రకారుడు వేసిన బొమ్మనే మోసపుచ్చేందుకు మరొక చిత్రకారుడి చేత వేయిస్తారు. రెండవది, కళాఖండాల మార్కెట్ వేల్యూ పెంచేందుకు వాటికి అబద్ధపు అదనపు హంగుల్ని(రాచరికపు వారసత్వం వంటివి ) ఆపాదిస్తారు. మూడవది, అసలు ఆ చిత్రకారుడు వెయ్యని బొమ్మని, అసలైనదంటూ అమ్ముతారు.
“మనం కళాఖండాలను కొనే నిర్ణయం ఖాయం చేసుకునే ముందు, ‘సర్టిఫికేట్ ఆఫ్ ప్రోవినెన్స్ ‘ ను పొందాలి. దీనివల్ల ఆ కళాఖండం మారుప్రతి కాదని తెలుస్తుంది. ఒక పేరొందిన చిత్రకారుడి కళను అంచనా వేసేందుకు ఇది ఉపయోగిస్తుంది. సర్టిఫికేట్ లో ఇచ్చినవిధంగా ఒక సమగ్ర చరిత్ర, చిత్రం అసలైనదే అని నిరూపించేందుకు ఉపయోగిస్తుంది. ఆర్ట్ డీలర్ లేక ఆక్షన్ హౌస్ ల ప్రధాన బాధ్యత ఈ ప్రోవినెన్స్ ఒక విశిష్టమైన ప్రొఫెషనల్ ప్రమాణాలను కలిగిఉన్నది అని నిర్దారించడం. “ బదులిచ్చింది స్నిగ్ధ.
స్నిగ్ధ సరైన విధానంలో జవాబిచ్చింది. మహేంద్రకు ఆమె జవాబు నచ్చినట్లు కనిపించింది.
“బాగా చెప్పారు. నిజానికి, సరిగ్గా ఇక్కడే నాకు మీ సహాయం కావాలి. అప్సర టెక్నికల్ పనులను చూసుకుంటూ ఉండగా, కళాఖండాలను భారత్ కు పంపేముందే ,నాకు నిర్వహణ బాధ్యతలను ఖచ్చితంగా చూసుకునేందుకు, ఎవరైనా కావాలి.”
అప్సర మహేంద్రకు అడ్డుపడుతూ స్నిగ్ధను ఇలా అడిగింది,” నాకు మరొక విషయం చెప్పండి. మీకు భారతీయ చిత్రాలను గురించి ఏమి తెలుసు ?”
ఇది ఇంటర్వ్యూ కోసం స్నిగ్ధ ముందే సిద్ధం చేసుకున్న కీలకమైన ప్రశ్న. ఆమె వెంటనే స్పందించింది.
“భారతీయ చిత్రకళ అనేది, భారత ఉపఖండంలో 3 వ శతాబ్దం నుంచి ఆధునిక యుగం వరకూ సృష్టించబడ్డ చిత్రాలకు వాడే సాంకేతిక పదం. భోగాలాలసమైన భావనలు, ఆకృతి పట్ల బలమైన దృష్టి భారతీయ చిత్రాల లక్షణాలు. విదేశీయులకు భారతీయ చిత్రాలు అతిగా స్పందించేవిగా కనిపించినా, క్రమంగా వచ్చిన మెరుగులను వారు మెచ్చుకుంటారు.”
ఇలా అంటూ ఆమె అప్సర శరీరాకృతిని చూసి, మనసులోనే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ప్రద్యుమ్న చిత్రాలలో చిత్రీకరించిన అందమైన స్త్రీల వరుసలో ఆమెను కూడా ఉంచి, ఊహించుకుంది.
“భారతీయ చిత్రకళలో సంస్కృతిక చరిత్ర, మతాలు, వేదాంతం మేళవించి ఉన్నాయి. మతాలకు, సాంఘిక, రాజకీయ, సంస్కృతిక అంశాలకు అతీతంగా చిత్రకళ భారత్ లో సంరక్షించబడింది. అందుకే భారతీయ చిత్రకళ గుహలలో, రాళ్ళలో గీసిన పురాతనమైన బొమ్మలనుండి, మధ్యయుగంలో మొఘల్ ఆర్ట్, ఇస్లామిక్ ఆర్ట్, బుద్ధిస్ట్ ఆర్ట్ లనుండి, సమకాలీన భారత చిత్రాల వరకు అనేక విధాలగా రూపాంతరం చెందింది.” కొనసాగించింది స్నిగ్ధ.
మహేంద్ర అడిగిన అన్ని ప్రశ్నలకు స్నిగ్ధ స్థిరంగా బదులిచ్చింది. ఆమె భారతీయురాలు కనుక, వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్ట్ కు ఉన్న ప్రాధాన్యతను ఆమె అర్ధం చేసుకుంది.
ఈ స్పందన తర్వాత మహేంద్ర మనసులోనే ఆమెకు ఉద్యోగం ఖాయం చేసాడు. అతను ఒక కాగితాన్ని తీసుకుని, అందులో ఉన్న సమాచారం ఇంటర్వ్యూ అసెస్మెంట్ తో సరిపోయిందో లేదో సరిచుసుకున్నాడు.
“అయితే మీరు ఫేస్ బుక్ ను తరచుగా వాడుతుంటారా ?ఇండియన్ రైల్వేస్ పై మీ వాల్ పోస్ట్ కామెంట్స్, భారతీయ చిత్రాలపై మీ పోస్ట్ లు నాకు బాగా నచ్చాయి.” మెచ్చుకున్నాడు మహేంద్ర.
స్నిగ్ధ సందిగ్ధంలో పడింది. తనను కలిసే ముందే మహేంద్ర తన పేస్ బుక్ వివరాలను ఎలా చూసాడో ఆమెకు అర్ధం కాలేదు. ఈ మధ్య సెలవలకు భారత్ కు వెళ్ళినప్పుడు తాను ఇండియన్ రైల్వేస్ పై పోస్ట్ పెట్టింది.
“వాట్స్ యువర్ మైండ్ ?” అనే ప్రశ్నను వేలల్లో అడుగుతారు, తరచుగా ఫేస్బుక్ వాడేవారు రోజుకు కనీసం పది సార్లు దీనికి బదులిస్తారు.
ఒక ఉద్యోగానికి తగినవారి సత్తాను నిర్ణయించేందుకు ఇప్పుడు ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ లను అనేకమంది వాడుతున్నారు. ఇది క్రమంగా వ్యాపార ప్రపంచంలో ప్రధానంశంగా మారుతోంది.
ఇది విరుద్ధమైన పద్దతిగా చెప్పినా, ఫేస్బుక్ ద్వారా స్క్రీన్ చెయ్యటం వల్ల, ఒకరి వ్యక్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇండియా, చైనా జనాభాతో పోటీ పడేంత మంది యూసర్ లను కలిగిఉందని చెప్పుకునే ఒక ప్లాట్ఫారం ఇది.
మహేంద్ర చూస్తున్న నివేదికలో. స్నిగ్ధ వాల్ పై రాస్తున్న పోస్ట్ లను బట్టి, ఆమె వాడే భాష నాణ్యతను బట్టి, ఆమె పోస్ట్ చేసే టైం ను బట్టి, ఉద్వేగపు విలువలను బట్టి, స్నిగ్ధ గురించి అంచనా వేసిన సంపూర్ణ సమాచారం ఉంది.
ఈ అంశాలన్నీ, ఇంటర్వ్యూ చేస్తున్న HR వారికి ఆ వ్యక్తిని గురించి అంచనా వేసేందుకు కొంత సమాచారాన్ని ఇస్తాయి. అదృష్టవశాత్తూ, స్నిగ్ధ పై ఇచ్చిన రిపోర్ట్ సానుకూలంగా ఉంది, అది మహేంద్ర ఆమె విషయంలో ముందుకు వెళ్లి, ఉద్యోగం ఖాయం చేసేలా చేసింది.
మరికొన్ని క్షణాలు శిక్షణలో స్నిగ్ధ అనుభవాలను గురించి, ఆమె అదనపు ఆసక్తులు, వ్యాపకాలు, కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకుంటూ గడిచిపోయాయి. మహేంద్ర, అప్సర చివరికి ఆమె ఉద్యోగం ఖాయం చేసారు. వారు మృణాల్ ను ఆమెకు పరిచయం చేసి, మిగిలిన విధివిధానాలను పూర్తి చెయ్యమని, అతన్ని అభ్యర్ధించారు.
స్నిగ్ధ మహేంద్ర, అప్సర లకు కృతఙ్ఞతలు తెలిపి, మృణాల్ దారి చూపుతుండగా, ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె తన శిక్షణ చివరి రోజైన నేడు, వెంటనే కొత్త ఉద్యోగంలో చేరగాలిగినందుకు అమితానందం చెందింది.
అప్పాయింట్మెంట్ కు సంబంధించిన మిగిలిన విధులను పూర్తిచేసేందుకు మృణాల్ ఆమెను తన క్యూబికల్ లోకి తీసుకెళ్ళాడు.
“మీ చిరునవ్వు మొనాలిసా తో పోల్చదగ్గ విధంగా ఉంది,” అన్నాడు మృణాల్ స్నిగ్ధకు కుర్చీ చూపుతూ, తగిన పత్రాలు సిద్ధం చేస్తూ.
“నిజంగా ? మీ పొగడ్తకు . కాని, ఒక స్త్రీ చిరునవ్వును మొనాలిసా నవ్వుతో పోల్చే ముందు మీరు మొనాలిసా గురించి తెలుసుకోవాల్సి ఉంది.”
స్నిగ్ధ మృణాల్ కు ఏదో చెప్పాలనుకుంటోంది. ఆమె వదనంలో కనిపిస్తున్న స్థిరత్వాన్ని చూసి, ఆమెను పొగడడం సరైనదేనా అని మృణాల్ సందిగ్ధంలో పడ్డాడు.
“నవ్వే కాకుండా మొనాలిసా గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది,” మృణాల్ ఇచ్చిన కాగితాలను భర్తీ చేస్తూ కొనసాగించింది స్నిగ్ధ. “మొనాలిసా ముఖ కవళికలు మీరు మీ దృష్టిని ఎటువైపు కేంద్రీకరిస్తారో, దాన్ని బట్టి మారతాయి. మీరు ఆమె కళ్ళ వంక చూస్తే, ఆమె నవ్వుతున్నట్లు ఉంటుంది. ఆమె పెదాలను చూస్తే, ఆమె నవ్వు మటుమాయమవుతుంది.”
మృణాల్ కలవరపడ్డాడు. అతనికి మొనాలిసా చిత్రం వెనుక అటువంటి వింత విశేషాలు ఉంటాయని తెలీదు. స్నిగ్ధ సంభాషణను కొనసాగించింది...
“మనిషి కన్నులో రెండు వేర్వేరు ప్రదేశాలు ఉంటాయి. మధ్య ప్రాంతంతో వస్తువులు స్పష్టంగా చూడడం, రంగులూ, వస్తువులూ గుర్తించబడడం, చిన్న అక్షరాలు చదవటం వంటివి చేస్తాము. దాని చుట్టూ ఉన్న ప్రాంతం వెలుగునీడల్ని , కదలికను, తెలుపు, నలుపు రంగుల్ని చూస్తుంది. మామూలుగా కేంద్రం నుంచి చూసే చూపు, దాని చుట్టుప్రక్కల చూపు లాగా నీడను చూడలేదు. అందుకే, మనం మొనాలిసా పెదాల వంక చూసి, ఆమె చిరునవ్వును గుర్తించలేము.”
మృణాల్ వెంటనే తన డెస్క్ నుంచి ఒక పత్రికను వెలికి తీసాడు. దానిపై మొనాలిసా చిత్రం ఉంది. దానివంక పరిశీలనగా చూసాకా, అతను స్నిగ్ధ చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు.
అతను మొనాలిసా ముఖంలోకి చూసినప్పుడు కనిపించిన మెరిసే చిరునవ్వు, ఆమె పెదవులను చూసినప్పుడు అతనికి కనిపించలేదు.
“ లియోనార్డో డా వించి స్ఫుమాటో టెక్నిక్ ను వాడి, ఒక పొర పెయింట్ పై మరొకదాన్ని వేసి, షేడ్స్ లో చిన్న మార్పులు చెయ్యడం ద్వారా దీన్ని సాధించాడు,” అని ముగిస్తూ, కాగితాలను మృణాల్ కు అందించింది స్నిగ్ధ.
ఆమె అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, సెలవు తీసుకుంది. అతను మొనాలిసా చిత్రపు వివరాలను గురించి, ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. స్నిగ్ధ చివరి రోజున తన పనులను పూర్తి చేసుకునేందుకు మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కు బయలుదేరింది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages