నేనూ – నా గోదావరి - అచ్చంగా తెలుగు

నేనూ – నా గోదావరి

Share This

నేనూ – నా గోదావరి

-  శ్రీమతి నండూరి సుందరీ నాగమణి


అది 1972. అప్పుడు నాకు పదేళ్ళ వయసు. ఐదో తరగతి పాసై ఆరో తరగతికి రాగానే నాన్నగారికి భీమవరం నుండి కాకినాడకి బదిలీ అయింది. ఎప్పుడూ రైలెక్కి దూరప్రయాణం చేయలేదు అప్పటికి... అందులోనూ గోదావరి దాటటం... ఉహు, అసలే తెలియదు. అందుకే ఉదయంపూట పాసింజర్ లో బయలుదేరాం అందరం, ప్రయాణాన్ని ఆస్వాదించటానికి... నేను కిటికీ పక్క సీటు తీసుకున్నాను. నా ఎదురుగానే చిన్నారి తమ్ముడు... మూడేళ్ళ బుడతడు...
అప్పట్లో రైలు బళ్ళు బొగ్గింజనువే ఉండేవి. వాటి ముఖం నల్లగా, నక్షత్రం డిజైన్ తో,  నెత్తి మీద ఎర్రని లైటు, అవిశ్రాంతంగా పనిచేసే ఉద్యోగులతో ఉండేది. రైలు బోగీలు ముక్కుపొడుము రంగులో ఉండేవి. రైలు నిండా చెక్క బెంచీలే... కుషన్ సీట్లు అసలు ఉండేవి కాదు.  కిటికీలకు కమ్మీలు కూడా ఉండేవి కాదు. లోపలినుంచి తల బయటికి పెట్టి ఇంచక్కా ఇంజన్ దర్శనం చేసుకోవచ్చు. కళ్ళల్లో బొగ్గు నలుసులనూ నింపుకొని ఏడవ వచ్చు... ఆరోజు రెండు సార్లు నా కళ్ళల్లో నలుసులు పడ్డాయి...
రైలు నిడదవోలు దాటింది మొదలు నాన్న ఉత్సాహంగా చెప్పసాగారు. కొవ్వూరు అనే స్టేషన్ వచ్చిన తరువాత, గోదావరి నది వస్తుంది... అక్కడ మనం బ్రిడ్జీ మీదనుంచి రాజమండ్రీ వెళతాము అని... ‘నది’ గురించి క్లాసు పుస్తకాలలో చదవటమే కాని దాని పరిమాణం తెలియదు. అప్పట్లో ఇప్పట్లోలా మీడియా, లేదు కదండీ... అందుకని వాటి ఫోటోలు కూడా చూసి ఎరగము. అందుకని నది అంటే ఒక కాలువ లాంటిది అనే అభిప్రాయంలో ఉన్నాను.
మధ్యలో రైల్లో అమ్మటానికి వచ్చినవి అన్నీ కావాలని మేము పేచీలు పెట్టటం, నాన్న, అమ్మా ఇంట్లోంచి తెచ్చిన తినుబండారాలు ఇవ్వటమూ... అయినా వేరుసెనగపప్పు కొనిచ్చేదాకా నేను ఊరుకోలేదు.
ఈలోగా కొవ్వూరు వచ్చింది. అన్నట్టు మరచిపోయాను. భీమవరంలో రైలు ఎక్కింది మొదలు నా నోట్ బుక్ లో వరుసగా ప్రతీ స్టేషన్ పేరూ రాసుకుంటూనే ఉన్నాను. అప్పట్లో అదొక ఆనందం కదా... కొవ్వూరు రాగానే మనసులో ఎంతో ఆనందం... చిన్నప్పటినుండీ వింటున్న గోదావరి నదిని కళ్ళారా చూడబోతున్న ఆనందం అది... కొవ్వూరు స్టేషన్ ని వదిలేసింది మా రైలు బండి.
అకస్మాత్తుగా రైలు శబ్దం లయ మారింది... పెద్ద పెద్ద శబ్దాలతో గుండెల్లోనే పరుగు తీస్తున్నట్టు అనిపిస్తూంటే, మా రైలు బండి సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించిన హావ్ లాక్ బ్రిడ్జ్ మీదికి ప్రవేశించింది... ఈ వంతెన 1900వ సంవత్సరం నుంచీ వాడుకలోకి వచ్చిందని తెలిసి, ఆశ్చర్యపోయాం. దీని పొడవు మూడు కిలోమీటర్లు అట.
టక్ టక్ టక్ టక్ టాక్... టక్ టక్ టక్ టక్ టాక్...
ఆహా ఏమి లయ?
ఎర్రటి ఎండలో తల్లి గోదావరి చల్లగా నవ్వుతూ దర్శనమిచ్చింది...అమ్మలూ అమ్మమ్మలూ సంచుల్లోంచి చిల్లర పైసలు తీస్తున్నారు...చిన్నపిల్లలు నేనంటే నేనంటూ... నీళ్ళలోకి చిల్లర విసురుతున్నారు...
‘గోదావరి అంటే చిన్న కాలవేమో అనుకున్నా... ఇదేంటమ్మా ఇంత పెద్దదా?’
‘ఆ, మరేమని అనుకున్నావు చంటీ... ఈ రైలు దాటటానికే ఇంచుమించు పది నిమిషాలు పడుతుంది...’ చెప్పారు నాన్న.
ఎప్పుడూ స్టేషన్ వచ్చే ముందు ఆగిపోతుందిటగా సిగ్నల్ లేక కాసేపు...ఇలా ఈ వంతెన మీదనే ఆగిపోకూడదా?
అబ్బా, సూరీడి కిరణాలు గోదారి అలల మీద ఎంత బాగా మెరుస్తున్నాయి? ఆ లంకల్లో కుర్రాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు?
తడిసిన ఇసుక ఎంత బావుందో... తెరచాపల పడవలు ఊగుతూ ఎలా వెళుతున్నాయో...
‘ఇదేంటమ్మా, అటువైపు కొత్త బ్రిడ్జీ కడతున్నారట... అదిగో అక్కడే కదా...  అది పూర్తి అయ్యాక, క్రింద రైలూ, పైన బస్సులూ ఒకే సారి వెళతాయి అట...’
‘ఇది ఉండగా ఎందుకమ్మా కొత్త బ్రిడ్జీ?
ముక్కుపొడుం రంగులో వాలుగా ఉన్న కమ్మీలతో ఇది  భలే అందంగా ఉంటుంది కదా... అయ్యో, అయిపోయిందమ్మా... రాజమండ్రీ వచ్చేస్తోంది... అదిగదిగో ఆ పొగ పేపర్ మిల్లుకి సంబంధించినదట...
ఈ పక్క చూడు, ఇదే కోటిలింగాల రేవు... ఎంత బాగుందో కదా...’
మాటలు అవుతూనే ఉన్నాయి, మా రైలు బ్రిడ్జీ దాటేసి, ‘గోదావరి’ స్టేషన్ లోకి ప్రవేశించింది.
అది మొదలు, ఎప్పుడు కాకినాడ నుంచి మా ఊరికి వెళ్ళాలన్నా, తర్వాత నాన్నకి కాకినాడనుంచి నర్సాపురం బదిలీ అయ్యాకా అదే బ్రిడ్జి మీదనుంచి ప్రయాణం, మళ్ళీ మళ్ళీ గోదావరమ్మ దివ్య దర్శనం.
నర్సాపురంలోనూ గోదావరి ఉండేది. దానిని వశిష్ట గోదావరి అంటారు. అంటే గోదావరి తల్లి సముద్రుడిలో సంగమించే ముందుగా రెండుగా విడిపోతుందట... ఒకటి గౌతమి, రెండవది ఈ వశిష్ట... నర్సాపురం వచ్చిన కొత్తలో (అప్పటికి నాకు పదిహేను నిండాయి) తమ్ముడిని, నన్నూ తీసుకుని పడవల రేవుకు తీసుకు వెళ్లి నాన్నగారు గోదావరిని చూపించారు. అక్కడే ‘మూగమనసులు’ సినిమా షూటింగ్ అయిందని తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాం.
వై.యన్ కాలేజీలో చదువుకునేటప్పుడు  కాలేజీకి పక్కనే గోదావరి కాబట్టి నా ప్రియనేస్తం కృష్ణమణితో అప్పుడప్పుడూ నది ఒడ్డున ఉన్న ‘కొండాలమ్మ తల్లి’ ఆలయానికి వెళ్ళటం అలవాటు అయింది. అక్కడి సూర్యాస్తమయం, అవతలి గట్టున ఉన్న కొబ్బరి తోటలు... ఆ సౌందర్యం అపురూపం...
అంతర్వేది తీర్థానికి ఎన్నిసార్లు వెళ్లాలని అనుకున్నా వీలు అయ్యేది కాదు. తమ్ముడు  మాత్రం స్కౌట్స్ తరఫున కాంప్ కి వెళ్ళాడో తీర్థానికి. తరువాత ఉద్యోగ పర్వం మొదలై, సాగరతీరానికి వెళ్ళిపోయాను  (విశాఖపట్నం). తర్వాత భాగ్యనగరం.
క్రిందటి పుష్కరాలకు 2003 లో రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించాను. అదే మొదలు ఆ నదీమతల్లి చల్లని స్పర్శ తగలటం.
తరువాత క్రిందటేడాది స్నేహితులమంతా కలిసి పాపికొండలు యాత్ర చేసి వచ్చాము. ఆరోజు మాఘ పూర్ణిమ. ఫిబ్రవరి 14వ తేదీ... కనురెప్ప వేయకుండా ఆ వెన్నెల్లో గోదావరి అందాలను ఆస్వాదిస్తూ సమయం గడిపివేసాము. ఆ మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రమ్మన్నా రావు మరి...
ఇదిగో, మళ్ళీ ఈ ఏడాది కూడా పుష్కర స్నానం ఆచరించాలని సంకల్పం... దైవం అనుగ్రహిస్తే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళతాము.
ఇదీ గోదావరితో నా అనుబంధం.
***

No comments:

Post a Comment

Pages