Tuesday, June 23, 2015

thumbnail

కవిత: కొండవాగు

       కవిత: కొండవాగు       

        -  డా .వారణాసి రామబ్రహ్మం 

కొండవాగు నా కవితాధార
ఎండి పోదు ఈ ఆర్ద్రత ఏ వేళా
హృదయ గిరులందు పుట్టి
ప్రవాహమై పరుగులిడుచు
గంతులేయుచు కిందికి దూకు
జలపాతముగ మారి, 

అడవులలో అందముల మధ్య అందమై
కదలుచు కదిలించు తీయని నీటి జాలు
నాగరికులెవ్వరికి కనబడని జల గమనము
గిరిజనుల మనము వలె కుళ్ళు లేని
నిర్మలమువాదముల సంస్కృతుల
సిద్ధాంతముల ఉనికి తెలియని (క)
తనకై తాను సాగే సామాజిక స్పృహ లేని
వట్టి నీటి పరుగు.

ఎఱుగదది పద గమన నిర్దేశనలు
ఉన్నట్టే తెలియదు దానికి నడకల సూత్రములు
అలంకారములు ఆర్భాటములు పట్టని తాను
కొండల కోనల స్వేచ్ఛగా విహరించే చెంచీత 
రాలపై ఉదాత్తనుదాత్తముల వేగముగ చలించుచూ
శ్రావ్య రాగముల గానము చేయు కోయిల.

ఎత్తుల పల్లముల ఇష్టమున గంతులేయుచు
నటనలు నేర్వకనే నర్తించే మయూరి
చిత్ర కారుల కుంచెలంచులు
దిద్దలేవు దాని ఒద్దికలు 
ఛందస్సున కనుగుణముగ కదలు
గురు లఘువులు పట్టలేవా పరుగులు
ఆనవు వాద ప్రతివాద సంకులి(చి)త మానస దృష్టికి
దాని తీరు తెన్నులు సహజ గమన సౌందర్యములు
తావమాడరెవరూ గ్రోలరా నీటి నే దొరలూ.

దాని ఉనికే తెలియదు
పురవాసులైన వేత్తలకు 
నిర్మల మానస ప్రవాహము నా కవిత
దివ్య హృత్ ధ్యాన గమనము దాని నడత
ఆంద్ర సాహితీ గోదావరీ సలిలముల
మౌనముగ కలియుచు
తనదనము కోల్పోని కిన్నెరసాని!
నా కైతల కొండవాగు!

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

1 Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information