గొల్లపూడి వీరాస్వామి సన్ - అచ్చంగా తెలుగు

గొల్లపూడి వీరాస్వామి సన్

Share This

గొల్లపూడి వీరాస్వామి సన్


లాభం - నష్టం బేరీజు వేసుకుని నడిచే లోకంలో , ఇంకా ఎక్కడో కొందరు మహనీయులు దాగి ఉన్నారు. వారి ఉదారత చూస్తే, మరికొందరి హృదయాల్లోని ఉదారతను జాగృతం చెయ్యగలుగుతాము.
వారి తాతగారు బండి మీద పుస్తకాలు అమ్ముకునేవారట ! అదే ఈ రోజున రాజముండ్రి లో శాఖోపశాఖలుగా విస్తరించిన తమ ప్రచురణాలయానికి మూలం అంటూ - మనిషి తన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, అంటున్నారు వారు. 24 ఏళ్ళ క్రితం జరిగిన గోదావరి పుష్కరాలకి, 1/- పుస్తకం ముద్రించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారట ! 12 ఏళ్ళ క్రితం పుష్కరాలకి, 2/- రూ. పుస్తకం ముద్రించారట. రానున్న పుష్కరాలకి 40 పేజీల పుస్తకాన్ని, 5/- రూ. లకు అందించానున్నారట ! 40 పేజీల పుస్తకం 5 రూ. అమ్మడం ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోయేవారికి ... ఇంకో సంగతి తెలిస్తే అవాక్కవుతారు ...
పుష్కరాల్లో చేతిలో పుస్తకాలు పట్టుకుని, యాత్రికుల మధ్య తిరుగుతూ పుస్తకాలు అమ్ముకోవాలని చూసే 10 వ తరగతి తప్పిన కుర్రాళ్ళకు, ఇతర యువతకు కేవలం 240 రూ. డిపాజిట్ తీసుకుని, వీరు 100 పుస్తకాలు ఇస్తారట. తద్వారా వచ్చే 500 రూ. లలో 250 అమ్మినవారికే ఇస్తున్నారు వీరు. ఒక యువకుడు రోజుకి 500 - 1000 పుస్తకాలు అమ్మితే, వారికి దక్కే లాభం రోజుకి 3000- 5000 వరకు అన్నమాట ! మరి 40 పేజీల పుస్తకం 2.50 రూ. అమ్మితే, పబ్లిషర్ కు వచ్చే లాభం ఏమిటి ? శాస్త్రోక్తంగా అనేకమంది, పుష్కరస్నానం చేసి, పుణ్యం పొందితే, అదే వారికి తృప్తి ట ! ఇంతకీ ఈ పబ్లిషర్ లు ఎవరో మీకు ఏమైనా తెలుసా ? వీరి పుస్తకం ఒక్కటి కూడా లేని ఇల్లు ఉండదంటే, అతిశయోక్తి కాదేమో ! వారే, రాజమండ్రి లో సుప్రసిద్ధులైన పుస్తకప్రచురణకర్తలు - గొల్లపూడి వీరాస్వామి సన్.
ఏ గొప్ప కార్యం వెనుకైనా, అలుపెరుగని ప్రయాస తప్పకుండా ఉంటుంది. అలా తమ సంస్థ ఆరంభం, మధ్యలో ఎదురైన సవాళ్లు, ఇబ్బందుల గురించి, తెలుసుకుందామా ...
ఈనాడు ఆంధ్రదేశంలో గానీ దేశవిదేశాల్లో ఉన్న పుస్తక ప్రియులకు “గొల్లపూడి” పుస్తకాలంటే విలువలు, ప్రామాణికత కల పుస్తకాల ప్రచురణ సంస్థ అని విశ్వాసం. ఈ సంస్థ ఆవిర్భావానికి మూలవిరాట్టు కీ.శే. శ్రీ గొల్లపూడి వీరాస్వామి గారు పాత ట్రంకుపెట్టెలలో రైళ్ళలో తిరుగుతూ పుస్తకాలను అమ్మే సాధారణ మధ్యతరగతి మనిషి, ఆయన కుటుంబ జీవనానికి పుస్తక అమ్మకాన్ని వృత్తిగా స్వీకరించిన సగటు మనిషి, 1920-25 ప్రాంతంలో ఆయన పుస్తక ప్రచరణకు అంకురార్పణ చేసినా 1926లో శ్రీ మల్లాది లక్ష్మీ నరసింహమూర్తి గారితో భగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానం రాయించటంతో తెలుగు పుస్తక ప్రచురణ కర్తగా “గొల్లపూడి వారి ప్రభ” ప్రారంభమైంది.
గొల్లపూడి వీరాస్వామి గారి ఏకైక కుమారుడు గొల్లపూడి వీరవెంకట సుబ్బారావు గారు కొంతకాలం ప్రచరణ రంగంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి ఆ తర్వాత తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో తండ్రిలానే ఒక ట్రంకుపెట్టెలో వివిధ ప్రచురణ కర్తల పుస్తకాలను  అమ్మటం ప్రారంభించారు.
గొల్లపూడి వారి పుస్తకాలు ఇతర ప్రచురణ కర్త పుస్తకాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో అత్యంత పాఠకాభిమానులను ఏర్పరుచుకుని గొప్ప ప్రజాదరణ పొందాయి.
1967లో గొల్లపూడి వీరాస్వామి గారు పరమపదించారు. అప్పటికి గోదావరి రైల్వేస్టేషన్లో పుస్తక విక్రేతగా అనుభవం గడించిన గొల్లపూడి వెంకట సుబ్బారావు గారు తన తండ్రి గారి హఠత్మరణ బాధను ద్రిగమింగుకుంటూనే ప్రచురణా సంస్థను ముందుకు నడిపించారు. దశాబ్దకాలంలో “గొల్లపూడి” ప్రచురణ సంస్థ తెలుగు పాఠకులకు అభిమాన ప్రచురణ సంస్థ అయ్యింది.
8-8-1977 గొల్లపూడి సంస్థకు మరొక విషాదం. మద్రాసు ప్రచురణ సంస్థలకు ధీటుగా మన తెలుగునాట వేళ్ళూనుకుంటున్న “గొల్లపూడి” ప్రచురణ సంస్థను నడుపుతున్న సుబ్బారావు గారు పరమపదించారు. వారికి ఇద్దరుమగపిల్లలు, ఒక ఆడపిల్ల. అప్పటికి వారి పిల్లల విద్యాభ్యాసం పూర్తి కాలేదు. ఆఖరి పిల్లల విద్యాభ్యాసం ఇంకా మొదలు కాలేదు.
సుబ్బారావు గారి పెద్దకుమారుడు వీర వెంకట రమణమూర్తి తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ తన 15వ ఏటనే సంస్థ పగ్గాలను చేపట్టాడు. ఆనాటి నుండి గొల్లపూడి సంస్థకు శుక్రమహాదశ పట్టింది. తండ్రి, తాతల అభిమతానికి అనుగుణంగా పయనిస్తూ... మారుతున్న కాలాన్ని గౌరవిస్తూ అటు సాహిత్య విలువలు... ఇటు మానవ విలువలను విస్మరించకుండా సంస్థను పంచకళ్యాణి గుర్రంలా పోటీదారులకు అందనంత దూరం పరుగులెత్తించారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వీరి సోదరుడు నాగేంద్ర కుమార్ M.B.A. చదువును పూర్తి చేసుకుని 1996లో ఇతర అవకాశాలను కాదనుకుని ఈ సంస్థలోకి అడుగు పెట్టటంతో ఆంధ్రప్రదేశ్ లో గొప్ప ఆధ్యాత్మిక పుస్తక ప్రచురణ సంస్థగా ఈ “గొల్లపూడి వీరాస్వామి” ప్రచురణ సంస్థ ముందు వరసలో నిలిచింది. శతాధిక రచయితలను ప్రోత్సహించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మారుతున్న విలువలను... సాహితీ విలువలను సమన్వయ పరుచుకుంటూ ఆధ్యాత్మిక సాహితీ వినీలాకాశంలో ఓ ధృవ తారగా వెలుగొందుతున్నది. పాఠకులకు పుస్తక భాండాగారంలా... రచయితలకు పెన్నిధిలా నిలుస్తుంది.
పాఠకులకు సులువుగా అందుబాటులో ఉండేందుకు 'bhakti pustakalu' అనే ఆప్ ను ప్రారంభించారు వీరు. ఈ ఆప్ ను క్రింది లింక్ లో డౌన్లోడ్ చేసుకుని, ఆన్లైన్ ద్వారా పుస్తకాల జాబితా చూసి, పుస్తకాలను ఆర్డర్ చెయ్యవచ్చు. ఆప్ లింక్ ఇది...
పుస్తకాలు కొని, చదివేవారు తగ్గిపోతున్న ఈ తరుణంలో, వీరి సేవల ద్వారా మళ్ళీ పుస్తక పఠనంలో స్వర్ణయుగం రావాలని, వీరికి అఖండ విజయం సంప్రాప్తించాలని మనసారా ప్రార్ధిస్తోంది అచ్చంగా తెలుగు.

No comments:

Post a Comment

Pages