గోదావరి  

(గేయము - 6,6,6,5 మాత్రలు)

- సుప్రభ


గోదావరి కంఠములో వినిపించును వేదాలు గోదావరి గలగలలో రవళించును నాదాలు

గోదావరి నడకలలో కనిపించును అందాలు గోదావరి తడుమగనే పులకించును క్షేత్రాలు

గోదావరి నీరముతో ప్రభవించును పద్యాలు గోదావరి తీరములో విలసిల్లెను రాజ్యాలు

గోదావరి స్ఫూరితితో ద్యుతిమించెను కావ్యాలు గోదావరి పూజలతో తనిసేరిల దైవాలు

గోదావరి గానములో వినవిందగు రాగాలు గోదావరి స్నానముతో నశియించును పాపాలు

గోదావరి దీవనతో మనుచుండగ జీవాలు గోదావరి భావనతో ఘనమైనవి గేయాలు

గోదావరి పుట్టుకయే ధరణీతలి కొకవరము గోదావరి గట్టులపై తరుశాఖల కలరవము

గోదావరి గంగమగా కరుణించుట శ్రీకరము గోదావరి సంగముతో ముదమొందును సాగరము

గోదావరి పాదముతో క్షితి యెల్లెడ పావనము గోదావరి ఆదృతితో బ్రతుకంతయు పూవనము

గోదావరి పుష్కరుతో కనువిందగు నీ క్షణముగోదావరి అక్షరమై మనమంతయు దీపితము

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top