గోదావరి - నేను 

- డా.వారణాసి రామబ్రహ్మం 


నాకు గోదావరి నది అంటే ఎంతో ఇష్టం. నేను గోదావరి నది ఒడ్డున ఒక పల్లెటూరిలో పుట్టాను. ఆ ఊరి  పేరు వేగేశ్వరపురం. గోదావరి నది ఒడ్డు మీంచి  పోలవరం వైపు కొవ్వూరుకు (పశ్చిమ గోదావరి జిల్లా) పదిహేను కిలోమీటర్ల  దూరంలో ఉన్న చక్కని ఊరు. మా నాన్న గారు బి.యిడి అసిస్టంట్ గా పనిచేస్తున్నప్పుడు నేను పుట్టాను. మూడవ క్లాస్ వరకు అక్కడి ప్రాథమిక పాఠశాలలో చదివాను. అప్పుడు గోదావరి నదిని ఎక్కువగా చూడలేదు. గోదావరి ఊరిని ఆనుకునే ఉంటుంది. మేమున్న ఇంటికి అరకిలోమీటరు దూరము.  ఒక్కణ్నే  సంతానము అవడం వల్ల చిన్నప్పుడు మా అమ్మగారు  కంటికి రెప్పలా కాస్తూ  గోదావరి వైపు వెళ్ళనిచ్చేవారు కాదు.
మళ్ళీ మా నాన్నగారు హైస్కూల్ హెడ్మాస్టర్ గా మళ్ళీ వేగేశ్వరపురం వచ్చేటప్పటికి  నేను నైన్త్ క్లాస్లోకి వచ్చాను. అప్పుడు గోదావరిని రోజూ చూసేవాడిని . వర్షాకాలములో ఏటి ఒడ్లని ఒరుసుకుని ఎంతో వేగంగా ప్రవహించే ఆ  ఉగ్ర గోదావరిని చూస్తూంటే ఎంతో బాగుండేది. పిల్లలము స్కూల్ అయ్యాక గోదావరి ఒడ్డుకు పరుగు తీసేవాళ్ళం. గోదావరి ఎంత వచ్చిందో చూడడానికి.  వరదల సమయంలో గోదావరి రోజు రోజుకూ అరటి మొక్కలా పెరిగేది. లోపలి గట్ల మధ్య ఇసుక తిన్నెలతొ నెమ్మదిగా ఉండే గోదావరి, వర్షాకాలము మొదలయ్యే సరికి ఎర్ర నీరు తో క్రమంగా పెరిగిపోతూ ఉండేది. ఏటి గట్టుకు లోని గట్టుకు మధ్యలో పావు కిలోమీటరు సమతల ప్రదేశం ఉండేది. అక్కడ రెండు చింత చెట్లు ఉండేవి. మొక్క జొన్న చేలూ ఉండేవి. రోజూ గోదావరి ఎంత పెరుగుతోందో ఆ చింత చెట్లు మాకు తెలిపేవి. వాటి మొదలు నుంచి కాండం వరకు గోదావరి పెరిగేది. ఆ  ప్రవాహపు ఉద్ధృతి లోనే పుల్లలు పట్టే ఈతగాళ్ళు గోదావరి మధ్యలో వాటిని పట్టి ఒడ్డుకు తెచ్చే వారు. ఆ పుల్లలు అమ్మేవారు. వంట చెరుకు కోసం ఊళ్లో వాళ్ళు అవి కొనే వారు. అప్పుడు గాస్ లు ఆవి లేవు కదా! కట్టె పుల్లలే వంటకు ఆధారం. ఆ పుల్లలలో ఒక్కొక్క సారి టేకు, మద్దిస, లాంటి జాతి దుంగలు కొట్టుకు వచ్చేవి. వాటిని రంపపు మిల్లుల వాళ్ళు కొనేవారు. గోదావరి రావడం, తీయడం దానిని ప్రతి ఏడాది చూడడం మాకు కనుల విందుగా ఉండేది.
గోదావరి తీసాక (వరద తగ్గాక - ఒక పదిహేను రోజుల నుంచి రెండు నెలలవరకు ఉండేవి  ఈ గోదావరి గలలు) మేము రోజూ  గోదావరిలో స్నానానికి వెళ్ళేవాళ్ళం. అలా మళ్ళీ వరదల వరకు  గోదావరి స్నానం చేసేవాళ్ళం. అప్పుడే నాకన్న పెద్దవాళ్లైన  స్నేహితుల సాయంతో గోదావరిలో ఈత నేర్చుకున్నాను. కొద్ది లోతు వరకు తీసికెళ్ళి వదిలేసేవారు ఆ స్నేహితులు. కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒడ్డువైపు వచ్చేవాళ్ళం. మునిగిపోబోతూంటే స్నేహితులు గమనించి ఒడ్డుకు చేర్చేవాళ్ళు . అలా పదిరోజులు నేర్చుకునేసరికి ఈత వచ్చేసింది. నా  వయసు స్నేహితులం అందరం అలా ఈత నే ర్చుకున్న వాళ్ళమే. తరవాత ఈతలపందేలు, బిందె మీద ఈదుతూ ముప్పావు కిలోమీటరు వెడల్పున్న గోదావరిని దాటి లంకలోకి వెళ్ళే వాళ్ళము. సేద దీర్చుకుని మళ్ళీ బిందె మీద ఈదుకుంటూ  వెనక్కి వచ్చేసేవాళ్ళము. గోదావరి నీళ్ళు పట్టుకుని ఇంటికి తీసికుని వెళ్ళే వాళ్లము. తాగడానికి నీళ్ళు అవే. వర్షాకాలములో నీళ్ళకి పటిక, ఇండుపు వేసి తేర్చే వాళ్లము.
వేగేశ్వరపురం నుంచి తూర్పు కనుమలు కనిపిస్తాయి. ఆ తూర్పు కనుమలను భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు దాటి పోలవరం దగ్గర మైదానాన్ని చేరుతుంది గోదావరి. పాపి కొండలు తూర్పు కనుమలలో భాగము .
పోలవరం తరువాత గోదావరి మధ్యలో విరాజిల్లుతూంటాడు పట్టిస వీరభద్రేశ్వరుడు. గోదావరి మధ్య దీవిలో వెలుగొందుతూంటాడు ఆయన. ఆ దీవిలో చిన్ని కొండపైన శివాలయము; భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడు , శివునితో పాటు కొలువై ఉంటాడు. శివ రాత్రికి గొప్ప తీర్థము జరుగుతుంది ఆ దీవిపై. పక్షం రోజుల తీర్థం. ఆ తీర్థానికి వెళ్లి రావడం ఒక అందమైన అనుభూతి. అధికారులు కలరా  టీకాలు వేసేవారు. వారిని తప్పించుకోవడానికి గూటాల నుంచి పడవ మీద వెళ్ళేవాళ్ళం. అయినా ఒక్కొక్క సారి దొరికి పోయేవాళ్ళం. ఆ ఊరిని పట్టి సీమ అంటారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి టూరిజం వాళ్ళ నౌకా విహార సదుపాయము ఉంది పాపి కొండల వరకు. ఆ ప్రకృతి రామణీయకతను రసజ్ఞులు ఆస్వాదించవచ్చు
ఆ రోజులలో వేగేశ్వరపురం నుంచి రాజమండ్రి  ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవము. అప్పటికి కొవ్వూరు-రాజమండ్రిల మధ్య రైలు-రోడ్డు బ్రిడ్జి లేదు. లాంచీలు ఉండేవి. కొవ్వూరు నుంచి ప్రతి అరగంటకు. మా ఊరి నుంచి తాళ్ళపూడి - రాజమండ్రి లాంచి ఉండేది. గోదావరిమీద మూడు గంటల ప్రయాణం. భలే ఉండేది. లాంచి టాపు మీద ఎక్కి చుట్టూ నదిని, ఇసుక తిన్నెలని చూస్తూ ప్రయాణించడము మజాగా ఉండేది. ఇసుక పర్రల పై మిరపకాయ కళ్ళాలు ఉండేవి.
ప్రకృతితో  తాదాత్మ్యం చెందుతూ చేసిన ఆ  ప్రయాణాలు  ఇప్పటికీ నన్ను అలరిస్తూ ఉంటాయి  స్మృతులలో. గోదావరి నిండు గర్భిణిలా ఉన్నప్పుడు కొవ్వూర్నుంచి రాజమండ్రి కి రైలు మీద బ్రిడ్జి మీంచి వెళుతూంటే క్రింద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న  నిండు గోదావరిని చూడడం ఒక మధురానుభవము.
కాటన్ దొర దూరదృష్టి, ఉపకారగుణము, కృషి ల పుణ్యమా  అని  తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆన్నపూర్ణయైన గోదావరిని అందించాడు. కాటన్ దొరను తలుచుకోవడమే గోదావరి జిల్లాల వాసులకు గొప్ప సంస్కృతి. ఇంకా  గోదావరితో నా అనుబంధము మా ఊరు భీమవరంకి కొన సాగింది. మా నాన్నగారు రిటైర్ అయిపోయాక భీమవరంలో స్థిరపడ్డాము. కాటన్ దొర పుణ్యమా అని కట్టిన ధవిళేశ్వరం ఆనకట్ట పశ్చిమము వైపు కాలవల ద్వారా గోదావరి నీళ్లు భీమవరం వస్తాయి.
భీమవరంలో నాలుగు పంట కాలువలు పట్టణం గుండా ప్రవహిస్తాయి. భీమవరం పట్టణానికి తాగే నీళ్ళు ఈ కాలవల ద్వారా వచ్చిన గోదావరి నీళ్ళే. చిన్నప్పుడు భీమవరం వచ్చినప్పుడు  దగ్గరగా ఉన్న రెండు కాలవలలో స్నానం చేయడము సరదాయైన అనుభవమే. ఇప్పటికీ శలవలకు భీమవరం వేల్లినప్పుడు గోదావరినీళ్లు తాగుతూంటాము. రిటైర్ అయ్యాక అక్కడే నివాసము కనక గోదావరితో నా అనుబంధము అలా జీవితాంతము కొనసాగుతుంది.
నది ఒక చిన్న ధారగా మొదలై, ఏళ్ల, సెలయేళ్ల నీరు కలుపుకుని పెరుగుతూ, కొండల  ప్రవహించి దుముకుతూ  జలపాతములై;  ఉప నదుల కలుపుకు  నదియై మైదానముల సాగుతూ ఆనకట్ట కట్టడిని సంయమింపబడి సాగుకు నీరు, విద్యుత్ శక్తి ఉత్పాదనకు కారణమై మన అందరకూ ఉపయోగపడి ధన్యమైన "జీవితము" గడిపి మనకు ఆదర్శముగా నిలిచే పెద్ద నీటి  జాలు నది. చరమ దశలో సాగరుని కలిసి, అందు లీనమై తన ఉనికినే త్యాగము చేస్తుంది.
నది వలే మనమూ పసివారిగా పుట్టి, ఎదిగి, బంధముల ఏర్పరచుకుని సంయమముతో  జీవించి కావలసినవారికి, సంఘానికి ఉపయోగ పడి చరమ దశలో భగవంతుని కలిసి, లీనమై మన ఉనికిని ఆయన యందు సమర్పించి ప్రకృతిలోకలిసిపోతాము. అలా నది ప్రయాణము, మన  జీవన గమనము ఒకటే. నది మన మది. ఉరుకుల పరుగుల మనకి నెమ్మదిని నేర్పే రసాంతరంగ.
శ్రీ గోదావర్యై నమః!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top