జలసంపదను జాతీయం చెయ్యాలని కలలుగన్న కాటన్ - అచ్చంగా తెలుగు

జలసంపదను జాతీయం చెయ్యాలని కలలుగన్న కాటన్

Share This

జలసంపదను జాతీయం చెయ్యాలని కలలుగన్న కాటన్

బి.వి.ఎస్.రామారావు


ఉభయ గోదావరుల్లోని డెల్టా నేలలు జీవజలాలతో తడుస్తున్న ప్రతిసారీ కాటన్ పేరుని స్మరిస్తూనే ఉంటాయి. అక్కడి నేలల్లో నాటిన విత్తనాలు మొలకత్తే ప్రతి తరుణాన, లేతాకుల చేతుల్ని జోడించి ఆయనకే తొలి వందనాలు చేస్తుంటాయి. అక్కడ పండిన ప్రతి వరిగింజ మీదా ఆయన పేరు అదృశ్య లిపిలో లిఖించే ఉంటుంది. అక్కడి రైతాంగం తలపుల్లో సదా ఆయన జీవిస్తూనే ఉంటారు. ఎందుకంటే, గోదావరి జలాలకీ –సాగుభూములకీ, పంటసిరులకీ – ప్రజా జీవితానికి, అనుసంధానకర్త ఆయనే కాబట్టి. ఆయనే – దక్షిణ భారతాన్ని ధాన్యక్షేత్రంగా మార్చిన అపర భగీరధుడు -  సర్ ఆర్ధర్ కాటన్.

సర్ ఆర్ధర్ కాటన్ 1803 మే 15 న ఇంగ్లండులోని కాంబర్ మిర్ అబీలో జన్మించారు. ఆయన తండ్రి కాల్ వెలీ , తల్లి హెన్రీ కాల్ వెలీ కాటన్. కాల్ వెలీ కీర్తిప్రతిష్టలున్న రాజసన్నిహిత కుటుంబానికి చెందినవారు.
ఆర్ధర్ కాటన్ తన 15 వ ఏట ఈస్టిండియా కంపెనీ మిలిటరీ కళాశాలలో సైనిక శిక్షణ పొందారు. 1819లో మద్రాసు ఇంజనీర్ల కమిషన్ సంపాదించి, 1821 లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఇక్కడికి వచ్చారు. తెలివితేటలతో పాటు సత్ప్రవర్తన కలిగిన ఆర్ధర్ కాటన్ ను ఏ పరీక్ష లేకనే రాయల్ ఇంజనీర్ సంస్థలో చేర్చుకున్నారు.
తొలినాళ్ళలోనే కాటన్ కి బాధ్యతాయుతమైన పనులు అప్పగించారు. ఆయన మద్రాసు హార్బర్ విస్తరణ పధకానికి సంబంధించిన పనులలో నిమగ్నులయ్యారు. ఆ సమయాన దక్షిణాదిలో నిరుపయోగంగా సముద్రం పాలవుతున్న కృష్ణా, గోదావరి, కావేరి నదులు ఆయన దృష్టిలో పడ్డాయి. ఆ నదుల నీటిని సద్వినియోగం చేసుకుంటే అపారమైన పంటలు పండుతాయని ఆయన ఊహించుకోగలిగారు. నేలతల్లిని నమ్ముకున్న రైతన్నల దుర్భర జీవితాలు, వారధి కట్టాలన్న ఆయన సంకల్పాన్ని నూరింతలు చేసాయి. అసలు వారధి కట్టే ముందు అక్కడి జనజీవనం ఎలా ఉందో చూద్దాము.

1830 నాటి స్థితిగతులు :
1830 నాటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉండేది. విదేశీయుల పరిపాలన, వ్యాపార దృష్టి ప్రధానమైన ఈస్టిండియా కంపెనీ అధికారులు, దేశంలో అంతఃకలహాలు, స్థానిక పాలకుల నిర్లక్ష్యం, దాడులు, దండయాత్రలతో ప్రజాజీవితం నిత్యం అతలాకుతలమే అయ్యేది. దీనికి తోడు ప్రకృతి పరమైన అతివృష్టులూ, అనావృష్టిలూ తోడయ్యేవి. అరాచకత్వానికి లోటు లేకుండా పోయి, కొద్దిమంది భూస్వాముల మినహా మిగతా వారంతా దారిద్ర నారాయణులుగా జీవించేవారు.
దక్షిణగంగగా కీర్తిగాంచిన గోదావరి నది ఎండిన పైరుల మధ్యనుంచి, సముద్రంలో కలిసిపోతూ వ్యర్ధమయ్యేది. నదీగర్భం కంటే ఎత్తున్న పొలాలకి ఆ నీరు అందే అవకాశమే లేదు. ఫలితంగా సారవంతమైన డెల్టా నేలలు వట్టిపోయి, బీడుభూములుగా మిగిలిపోయేవి. అనుభవానికి రాణి ఐశ్వర్యంలా గోదావరి సముద్రంపాలైతే,  అక్కడి రైతాంగం వర్షాలపై ఆశలు పెట్టుకుని, సాగుచేస్తూ ఉండేవారు. ప్రకృతి కరుణించిందా పంట చేతికోచ్చేది, లేదంటే నీటి ఎద్దడి మూలంగా అంతా నాశనమయ్యేది. గోదావరి చెంతనున్నా గోరంత సాయంలేక వ్యవసాయరంగం కటకటలాడేది.
1831 లో అతివృష్టి , 1832 లో తుఫాను ,1833 లో అనావృష్టి , 1836 లో కరువు , 1837లో అనావృష్టి , 1838 లో వరదలు ,1839 లో పెనుతుఫాను – పైగా కాకినాడ వద్ద ఉప్పెన ... ఈ విధంగా ఉభయగోదావరి మండలమంతా దుర్భిక్షానికి నిలయమయ్యింది. క్షామ దేవత విలయతాండవానికి తాళలేక ప్రజలు కాందిశీకులుగా మారిన సందర్భమది. ఆ కాలంలో ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి చావులకు బలయ్యారు. ఇక పశుపక్ష్యాదుల దీనస్థితి వర్ణనాతీతం. మద్రాసు నుంచి ఉత్తరాదికి పోయే రాచబాట స్మశాన మార్గంగా మారిపోయింది. తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా కరువై కడుపు చేతబట్టుకుని, ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరెందరో తమ కన్నబిడ్డలను తెగనమ్ముకున్నారు. ఏ దిక్కున చూసినా ప్రేతకళ... ఏ ముఖాన్ని తడిమినా దాహార్తిత అబ్యర్ధన... ఆకలితో అలమటించే కడుపులు...
ఈ దారుణ పరిస్థితికి తాళలేక ప్రజలు ప్రభుత్వాన్ని ధిక్కరించే రోజులు ఆసన్నమయ్యాయి. ప్రజలు తిరగబడే స్థాయికి వచ్చాకా గానీ,  ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. అప్పటికప్పుడు బ్రిటిష్ పాలకులు గోదావరి మండలాభివ్రుద్ధికి ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టక తప్పదని, గుర్తించారు.
ఆ సమయంలో అంతకు పూర్వం తంజావూరు కలెక్టర్ గా పనిచేసిన హెన్రీ మాంట్ మద్రాసు గవర్నర్ గా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఆయన తంజావూరులో ఉన్నప్పుడు సర్ ఆర్ధర్ కాటన్ 1836 లో కొలరూన్ ఆనకట్ట నిర్మించి, ఆ ప్రాంతానికి యెనలేని సేవలు అందించారు. అందుకే, విశాఖలో పనిచేస్తున్న కాటన్ మహాశయుని పిలిపించి,’ గోదావరి జలాలను వ్యవసాయాభివృద్ధికి వినియోగించేలా ఒక పధకం రూపొందించవలసిందని ‘ గవర్నర్ బృహత్తర కార్యక్రమాన్ని అప్పగించారు.
కాటన్ పట్టుదల కళ మనిషి. పరిపాలక వర్గానికి చెందినవాడైనప్పటికీ ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించగలవాడు. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన సిబ్బంది లేనప్పటికీ అపరిమితమైన పధకాలను అవలీలగా చేపట్టి పూర్తి చెయ్యగల దిట్ట. ప్రభుత్వ ఉత్తరువులు అందగానే ఆయన రంగంలోకి దిగారు...

కాటన్ ఆనకట్ట నేపధ్యం :
కాటన్ గుర్రమే ప్రయాణ సాధనంగా, అరటిపళ్ళే భోజనంగా నది పరివాహక ప్రాంతమంతా పర్యటించారు. గోదావరి నది స్వరూపాన్ని, ఇతర నైసర్గిక పరిస్థితులను అధ్యయనం చేసారు. నదిలో నీతి లోతుల భేదాలు, ప్రవాహదిశలు,  నది వాలు, ఏటిగట్టు మిట్టపల్లాలు, పరీవాహక ప్రాంతంలోని నేల స్వభావం, వంటి వివరాలను ఇంజనీరింగ్ దృష్టితో సేకరించారు. కోయిదా, జీడికుప్ప తదితర ప్రాంతాలను కూలంకషంగా పరిశీలించారు. పాపికొండలలో గోదావరి నది ప్రవాహవేగాన్ని అంచనా వేసారు. పట్టిసం వద్ద గోదావరి నది ఆనుపానులు కనిబెట్టారు. రాజమండ్రి దిగువన గోదావరి లంకలు, ఇసుక తిప్పలతో ఎక్కువ వెడల్పుగా ఉంది. ఈ ప్రదేశం ఆనకట్టలు కట్టేందుకు, నిర్మాణ దశలో నదినీటిని మళ్ళించేందుకు అనువైన స్థలంగా ఆయన తలంచారు. ఈ అంశాలన్నీ క్రోడీకరించి, కాటన్ గోదావరి ఆనకట్ట గురించి పంపిన నివేదికను అప్పటి మద్రాసు గవర్నర్ బలపరిచి, లండన్ కు పంపారు. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి –

  • ధవళేశ్వరంలో నదీగర్భంలో ఉన్న మూడు దీవుల మధ్య నాలుగు భాగాలుగా ఆనకట్ట కట్టాలి.
  • వరదలవల్ల ముప్పు లేకుండా పంటపొలాలను రక్షించడానికి నదికి ఇరుప్రక్కలా గట్టును నిర్మించాలి.
  • కాలువలు తవ్వించి, పొలాలకు నీటిసరఫరా చెయ్యాలి.
  • ప్రతి గ్రామానికి తాగడానికి కాలువల ద్వారా నీరు అందించాలి.
  • ప్రతి గ్రామానికి వంతెనలు, రహదారులు నిర్మించాలి.
  • అతి చౌకైన నౌకాయాన రవాణా పధ్ధతి ప్రతి కాలువలోనూ ప్రవేశపెట్టి, దానికి వీలుగా లాకులు వగైరాలు ఏర్పాటు చెయ్యాలి.
గోదావరి డెల్టా (తూర్పు- మధ్యమ –పశ్చిమాల తో సహా ) విస్తీర్ణం రెండువేల చదరపు మైళ్ళు. ఇందులో ఇసుకభూములు, గ్రామాలు, రహదార్లు పోగా నికరంగా పదిలక్షల ఎకరాలు సాగుకు వీలుగా ఉన్నాయి. ఈ భూములన్నీ సాగులోకి తెస్తే అప్పట్లో పదిహేను లక్షల రూపాయిలుగా ఉన్న వ్యవసాయోత్పత్తుల విలువ కోటి రూపాయిలకు పెరుగుతుందని కాటన్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆనకట్టకు, తక్కిన అనుబంధ పనులకు అయ్యే వ్యయం పదిహేను లక్షలకు మించకపోగా, ఏటేటా వచ్చే శిస్తు పాతిక లక్షల దాకా పెరుగుతుందని వివరించారు.
ఒక పధకాన్ని రచించడంలోనూ, దాన్ని ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా సమర్పించడంలోనూ, అటు ప్రభుత్వానికీ ఇటు ప్రజలకీ అందులోగల ప్రయోజనాలను విడమర్చి చెప్పటంలోనూ కాటన్ సమర్ధులు. అందుకే, ఆయన పంపిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఎటువంటి సంకోచాలు లేకుండా పధకానికి అనుమతించింది.

సాంకేతిక ప్రగతిలో సువర్ణాధ్యాయం :
1847 ఉభయగోదావరి జిల్లాల చరిత్రలో అపూర్వమైన ఘట్టం. ప్రజల సిరిసంపదలకు మూలమైన మహానిర్మాణానికి ఆ ఏడే శంఖుస్థాపన జరిగింది. పరవళ్ళు తొక్కుతూ ఎగసిపడుతూ ప్రవహించే గోదావరి జీవనదికి అడ్డంగా సుమారు 4 మైళ్ళ ఆనకట్ట కట్టడమంటే మాటలు కాదు. అదొక , సాంకేతిక ప్రగతిలో అదొక సువర్ణాధ్యాయం.
రాజమండ్రి పట్టణానికి 4 మైళ్ళు దిగువన ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఆ స్థలానికి ఎగువన నది అఖండ గోదావరిగా దర్శనమిస్తుంది. ఆనకట్ట స్థలం వద్ద నది – ధవళేశ్వరం, ర్యాలి, మద్దూరు, విజ్జేశ్వరం అనే నాలుగు పాయలుగా విడిపోతుంది. మళ్ళీ దిగువన కొంత దూరంలో గౌతమి, వశిష్ట అనే రెండు పాయలుగా కలిసిపోతుంది. ఆనకట్ట నిర్మించాల్సిన 4 పాయల మొత్తం పొడవు 11,945 అడుగులు.
నదీగర్భంలో ఆరడుగుల లోతు ఇటుకబావులు నిర్మించి, వాటిపై 12 అడుగుల ఎత్తుగల ఆనకట్టను నిర్మించాలన్నది ప్రతిపాదన. దానిపై 18 అడుగుల వెడల్పుగల రోడ్డును నిర్మించాలి. ఇటువంటి ఆనకట్ట అప్పటికి ప్రపంచంలో ఎక్కడా నిర్మించలేదు. ఈ బృహత్తర నిర్మాణానికి కావలసింది అసాధారణ సాంకేతిక నైపుణ్యం మాత్రమే కాదు, నిర్మాణంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడగల గుండె నిబ్బరం కూడా కావాలి. ఈ రెండూ కాటన్ కు పుష్కలంగా ఉన్నాయని వేరే చెప్పవలసిన అవసరం లేదు కదా !
ఆనాటికి మన దేశంలో తగినంతగా సుశిక్షితులైన ఇంజనీర్లు లేరు. తనకి అందుబాటులో ఉన్నవారిలోనే సమర్ధతను వెతుక్కున్నారు కాటన్. నిర్మాణ కార్యక్రమాన్ని దశలవారీగా పర్యవేక్షించే నిపుణులు కూడా లేరు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించగల కార్యదీక్షే ఆయనతో ఎన్నో సాహసాలు చేయించింది.
కొన్నిసార్లు నిధుల కొరత వల్ల ప్రాజెక్ట్ పనులు మందగించాయి. వానలు, వరదలు, కూలీల అనారోగ్యాలు వంటి అడ్డంకులు కొన్నిసార్లు తలనొప్పిగా పరిణమించాయి. అయినా మేజర్ కాటన్ పనులు ఆపలేదు. చెదరని ఆత్మవిశ్వాసంతో శ్రమించి, ఐదు సంవత్సరాలలో అంటే, 1852 నాటికి ఆనకట్ట తుదిమెరుగులు దిద్దగలిగారు. ఆయన రూపకల్పన చేసిన ఆనకట్ట, కాలువలు, వందల సంఖ్యలో కాలువలపై నిర్మించిన స్లూయిస్లు, లాకుల నిర్మాణం వగైరాలు ఎంతో ప్రమాణం కలిగి, అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాయి. ఆయన చూపిన బాట ఇరిగేషన్ ఇంజనీరింగ్ లోనే ఒక పాఠం గా నిలిచింది.
కాటన్ దొర పుణ్యమా అని ప్రతి గ్రామానికీ సాగునీరుతో పాటు, తాగునీరు కూడా పుష్కలంగా అందింది. ఆ రకంగా ఆయన అక్కడి ప్రజలతోనూ, నేలతోనూ, నీటితోనూ మమేకమయ్యారు. వేదపండితులు సైతం నిత్యం స్నానసంకల్పం చెప్పుకునేటప్పుడు “నిత్య గోదావరి స్నాన పుణ్యదోయో మహామతి – స్మరామ్యాంగ్లేయ దేశీయం, కాటనుం తం భగీరధం “(అంటే పవిత్ర గోదావరి జలాలతో అనుదినం స్నానపానాదులు ఆచరించగలిగిన పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భాగీరధతుల్యుడు, ఆంగ్లేయుడైన కాటన్ ను స్మరిస్తున్నాను” అని అర్ధం ) అనే శ్లోకాన్ని వేద మంత్రాలతో కలిపి చెప్పుకుంటారు. ఇది చాలదూ – కాటన్ మహనీయునికి వారి గుండెల్లో ఉన్న గౌరవాభిమానాలు కొలవడానికి ?

తీరని కల :
కాటన్ కావేరి నదిపై కొలరూను ఆనకట్ట నిర్మించి, ఆ నదీపరివాహక ప్రాంతాల్ని సస్యశ్యామలం చేసిన సంగతి ముందరే చెప్పుకున్నాము. గోదావరి ఆనకట్ట నిర్మాణ దశలోనే కృష్ణానదిమీద బెజవాడ వద్ద ఆనకట్ట నిర్మాణం కాటన్ సిఫార్సు మీదనే 1857 లో రూపొందింది. ఇలాగే ఒరిస్సాలో నీటిపారుదల అభివృద్ధి పధకం, ఉత్తరాదిన గంగానదికి కాలువల నిర్మాణం, దక్షిణాన తుంగభద్రకి కాలువల నిర్మాణం కాటన్ ప్రతిపాదనల ప్రకారమే జరిగింది. భారత్ లో రైల్వే నిర్మాణ కార్యక్రమాల్లో సేవలు అందించారు.విశాఖ ఔటర్ హార్బర్ కు సంబంధించిన బ్రేక్ వాటర్స్ తదితర కట్టడాలు పూర్వం కాటన్ సూచించిన మేరకే ఉండడం గమనార్హం.
భారతదేశంలోని జీవనదులన్నీ తూర్పు నుండి పడమరకు, పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయే కాని, ఉత్తర దక్షిణాలుగా ప్రవహించట్లేదు. గంగ, బ్రహ్మపుత్ర, నర్మద, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి వంటి ప్రధాన నదులను వాటి ఉపనదులతో సహా కలిపి సాగునీటి పారుదలతో పాటు, నౌకాయాన రవాణా మార్గం ఏర్పరచడానికి ఆచరణీయమైన ఒక పధకాన్ని నూరేళ్ళ క్రిందటే కాటన్ ప్రతిపాదించారు. ఆ జలరవాణా పద్ధతే ఉంటే, ఈ రోజున దేశానికి ఎంతో ప్రగతి ఒనగూరి ఉండేది. ప్రస్తుతం మన జాతీయ జలసంపదలో రాజకీయాలు చోటు చేసుకుని, అవి రాష్ట్రాల హక్కులుగా మారి, జలమార్గం ప్రతిపాదనే సోదిలో లేకుండా పోయింది. ఆ కలే నెరవేరి ఉంటే యెంత బాగుండేది !
‘యోగః కర్మేషు కౌశలం ‘ అన్నారు పెద్దలు. అంటే, చేపట్టిన పనిలో పూర్ణత్వాన్ని సాధించడమే యోగసిద్ధి. అటువంటి కోవకు చెందిన సర్ ఆర్ధర్ కాటన్ కు 1860 లో బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో పాటు ‘నైట్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అన్న ప్రతిష్టాత్మకమైన బిరుదునిచ్చి, ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత ఆయన పదవీ విరమణ చేసి, ఇంగ్లాండ్ లోని డార్కింగ్ కు చేరుకున్నా, భారతదేశ శ్రేయోభిలాషిగా ఆలోచిస్తూ, ‘ జలసంపద వినియోగమే భారత్ కు బంగారు భవితను తెస్తుందని’ సూచిస్తూ అనేక లేఖలు వ్రాసారు.
నిండు జీవితాన్ని భారత ప్రజల శ్రేయస్సుకు ధారపోసిన కాటన్ ‘అపర భగీరధుడిగా ‘ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
***

No comments:

Post a Comment

Pages