రావు సాహెబ్ - భావరాజు సత్యనారాయణ గారు - అచ్చంగా తెలుగు

రావు సాహెబ్ - భావరాజు సత్యనారాయణ గారు

Share This

రావు సాహెబ్ - భావరాజు సత్యనారాయణ గారు  

- భావరాజు పద్మిని 

ఒక మార్గం అంటూ ఏర్పడ్డాకా, దాన్ని వెడల్పు చెయ్యటం, పొడిగించటం సులువే ! కాని కీకారణ్యాల్లో పయనిస్తూ, గూటిపడవలో కుటుంబంతో సహా నివాసముంటూ, చెట్లు నరికిస్తూ, కాలువలు అడ్డోచ్చినప్పుడు వంతెనలు కడుతూ ముందుకు సాగి, దుర్గమమైన మార్గాలను సైతం మనకు సుగమం చేసిన గొప్ప ఇంజనీర్ వారు. దక్షిణ భారతంలోని ఎన్నో రహదారులు, వంతెనలపై ఆయన పేరు అదృశ్యంగా లిఖించబడి ఉంటుంది. ఆయనే బ్రిటిష్ ప్రభుత్వంచే ‘రావు సాహెబ్’ అవార్డును అందుకున్న మహనీయులు – భావరాజు సత్యనారాయణ గారు.
 ప్రకాశం పంతులు గారు, అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి తో... 
పేరుకోసం, కీర్తి కోసం ప్రాకులాడద్దు అని ‘గొర్రిపూడి సత్రం’ నెలకొల్పి , అనేక సంవత్సరాలపాటు నిరతాన్నదాతగా అజ్ఞాతంగానే నిలిచినా తన తండ్రి భావరాజు శేషయ్య గారు చెప్పిన పాఠం ఆయన ఎన్నటికీ మరువలేదు. బీద, గొప్ప బేధం ఎంచకుండా అందరినీ ఆదరిస్తూ, ప్రేమగా పలకరించే తన తల్లి రమణమ్మ గారు చూపిన బాట ఆయన ఎప్పటికీ మరువలేదు. ఈ పుణ్యదంపతులు చూపిన ఆదర్శవంతమైన మార్గంలో పయనిస్తూ, అఖండ విజయాలు సాధించారు.
శ్రీ భావరాజు సత్యనారాయణ గారు తూర్పుగోదావరి జిల్లాలోని శీల గ్రామంలో జనవరి 11, 1893 న భోగిపండుగ నాడు జన్మించారు. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో SSLC చదివారు. PR కాలేజీ లో BA పూర్తిచేసి, ప్రిన్సిపాల్ OJ చౌల్ డ్రై గారి సలహా, సిఫార్సుతో మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. ఆటల పోటీల్లో, నాటకాల్లో ఇతర కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. సర్వే క్యాంపులలో, ఇరిగేషన్ టూర్లలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన సెక్రటరీ గా ఉన్న 4 వ సం. లో విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కాలేజీ వార్షికోత్సవాలలో ముఖ్య అతిధిగా వచ్చి, ప్రసంగించేందుకు ఒప్పించి, తీసుకువచ్చారు. ఠాగూర్ ఇచ్చిన గొప్ప ఉపన్యాసం, ఆయన గొంతులోని మార్దవం, కవితల్లోని మాధుర్యంతో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యి, సత్యనారాయణ గారిని ఎంతగానో కొనియాడారు.
ఇంజనీరింగ్ పూర్తయ్యాకా, 6 వారాలు గుర్రపు స్వారీ శిక్షణ ఇచ్చి, అప్ప్రెంటిస్ గా శిక్షణ కోసం ఆయన్ను విశాఖలో నిర్మితమవుతున్న కింగ్ జార్జి ఆసుపత్రి పనులకు పంపారు. ఆ తర్వాత మద్రాస్ లోని PWD ఇంజనీర్ వద్ద, రామాపురంలోని మెడికల్ కాలేజీ పనుల వద్ద, రోడ్లు భవనాల నిర్మాణాల వద్ద తర్ఫీదు పొందారు. ఆయనకు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఓర్పు, వీటన్నింటినీ మించిన ధృడ సంకల్పం ఉండేవి. 1919 లో ఆయనకు సత్యవతి గారితో వివాహం జరిగింది.
1920 లో అప్ప్రెంటిస్ శిక్షణ పూర్తయిన తర్వాత ఆయన్ను PWD మద్రాస్ వారు విజయనగరం డివిజన్ లో సెక్షన్
ఇంజనీర్ గా నియమించారు. అక్కడి ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్ లు, అనేక భవన సముదాయాలను – భీమిలిపట్నం, చీపురుపల్లి, చీకాకోలు, శృంగవరపు కోట, గజపతినగరం మొదలైన ఊళ్లలో కట్టించారు. వినయవిధేయతలు, నమ్మకం, ఉత్సుకత, అంకితభావంతో పనిచేసే ఇటువంటి ఆఫీసర్ ను తన 24 ఏళ్ళ సర్వీస్ లో చూడలేదని, ఆయన పైఅధికారి అయిన J. విట్టేకర్ నుంచి ప్రశంసా పత్రం పొందారు.
ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాలకు వయసులో చిన్నవారు, ఉడుకురక్తం ఉన్నవారిని, అక్కడి జ్వరాలకు తట్టుకోగలరని పంపేవారు. అలా 1921 – 22 మధ్యలో ఆయన్ను భద్రాచలం ఏజన్సీ ఏరియా లోని పర్ణశాలకు బదిలీ చెయ్యటంతో, భార్యతోసహా బయలుదేరారు. అప్పట్లో భద్రాచలానికి రోడ్లు లేవు, పాపికొండల మీదుగా, 100 మైళ్ళ దూరం గూటిపడవలో ప్రయాణం చేసి, వెళ్ళాలి. 10- 15 రోజుల ప్రయాణం తర్వాత, భద్రాచలం చేరి, అక్కడినుంచి కచ్చటం అనే రెండెడ్ల బండిపై రాత్రంతా ప్రయాణం చేసి చేరారు. అక్కడ ఒకపూరిపాకలో మకాం ఉంటూ, పర్ణశాల నుంచి త్యాగడ వరకూ 10 మైళ్ళ దూరం తలిపేరు వాగు ఒడ్డున రోడ్డు వెయ్యడం, పర్ణశాల హద్దుల వరకూ రోడ్డుకు ఇరువైపులా కొబ్బరిచెట్లు నాటించడం చేసారు. సీతవాగు, ధనబంధు వాగు, తప్పలవాగు, చీకటి వాగులపై ఆనకట్టలు కట్టేందుకు అంచనాల లెక్కలు తయారుచేసారు. కల్లాకపటం తెలియని కోయవారి మధ్య, రమణీయమైన ప్రకృతిలో, ఏజన్సీ లో తాము గడిపిన సామాన్య జీవితం ఎప్పటికీ మరువలేనిదని ఆయన తన ఆటోబయోగ్రఫీ లో పేర్కొన్నారు.
అన్ని సుగుణాలు మేళవించిన సంపూర్ణ వ్యక్తిత్వం భావరాజు సత్యనారాయణ గారిది. ఆయనలోని భావుకతను సూచించే ,ఆంగ్లకవి ‘బార్డ్ వర్డ్ స్వర్త్ ‘ రచనల నుంచి ఆయనకు నచ్చిన వాక్యాల్ని చూడండి.
“ తన ఉనికికై అన్వేషిస్తూ ప్రేమ పేదవారి గుడిసెల్ని చేరుకుంది. వనాలు, సెలయేళ్ళు, చుక్కలు పొదిగిన ఆకాశంలోని మౌనం, ఏకాంతమైన గిరుల్లోని నిద్ర ప్రేమకు నిత్యగురువులయ్యాయి.”
చీకటి వాగు నుంచి త్యాగడ కు ఒకసారి వీరు యడ్లబండిలో వీరు రేంజర్ నాగరాజు అయ్యర్ గారితో వెళ్తూ ఉండగా, ఒక పెద్దపులి బండిపైకి వచ్చి, గాండ్రు పెడుతూ మింగేందుకు ఉరకబోయింది. వారు భయపడి అరిచిన అరుపులకు, పెట్టిన కేకలకు అది నెమ్మదిగా దిగి, అడవిలోకి పారిపోయిందట ! ఆ రోజు దైవమే తనను రక్షించారని, అన్నారు సత్యనారాయణ గారు.
1923 లో తూర్పు గోదావరి జిల్లాకు అసిస్టెంట్ ఇంజనీర్ గా చేరి, సామర్లకోట కాలువపై మేడపాడు, అనపర్తి, బలభద్రపురం వద్ద బ్రిడ్జి ల నిర్మాణానికి అంచనాలు వేసి, అనుమతి పొంది, నిర్మాణం ఆరంభించారు. తర్వాత 1930 వరకూ అమలాపురం సబ్ డివిజన్ ఇంజనీర్ గా పనిచేస్తూ, అక్కడి డెల్టా ప్రాంతాల్లో బోటుపై తిరుగుతూ రోడ్లు, కాలువలూ వేయించారు. అమలాపురం, రాజోలు కొత్తపేట తాలూకాలలోని ప్రజలు వారిని ఎంతగానో అభిమానించేవారట ! ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి వరకూ రోడ్లు వేసేందుకు స్థలాల సేకరణ, కాట్రేనికోన వద్ద పంచనదిపై తగిలే వంతెనలు వేయించారు. సఖినేటిపల్లి, నర్సాపురం ఒడ్డు వద్డకల అంతర్వేది రోడ్లు, అంతర్వేది కాలువ పనులు, ఇంకా అనేక ప్రాంతాలకు రోడ్లు వేయించారు.
1930 లో రాజమండ్రి సబ్ డివిజన్ కు బదిలీ కాగా అక్కడి రోడ్లు, వంతెనలు నిర్మించి, ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించారు. 1932 లో సామర్లకోట సబ్ డివిజన్ కు వెళ్లి, అక్కడ రాజమండ్రి – తునికి మధ్య సామర్లకోట మీదుగా ఉన్న ఉత్తర ట్రంక్ రోడ్ ను వృద్ధి చేస్తూ, వంతెనలు వేసారు. వేటపాలెం వద్ద సామర్లకోట కాలువపై ఉన్న వంతెన వీరు కట్టినదే ! 1935 లో రామచంద్రాపురం రాజా నరసరాజు గారి అభ్యర్ధనపై అక్కడికి బదిలీ అయి వెళ్లి, రామచంద్రాపురంలోని హై స్కూల్ భవనం, కడియం కాలువపై వంతెన, అనేక రోడ్లు, వంతెనల పన్లు చేసారు.
1937 లో ప్రభుత్వం ఆలమూరు బ్రిడ్జి నిర్మించదలిచి, ప్లాన్, ఎస్టిమేట్ లు వేసే పని శ్రీ సత్యనారాయణ గారికి అప్పగించింది. 6 నెలలు శ్రమపడి, 32 లక్షలకు అంచనాలు తయారుచేసి, ఇచ్చారు.
1939 లో నీలగిరులకు బదిలీ చెయ్యగా – మైసూరు బోర్డర్ వద్ద బోస్త్రింగ్ బ్రిడ్జి, గూడలూర్ వద్ద బిదూర్ హల్లాపై బ్రిడ్జి, నడువమట్టం వద్ద ACT బీం బ్రిడ్జి నిర్మించారు. నీలగిరుల్లోని 10 గ్రామాలకు నీటిసరఫరాకై , కొండలపై ఉన్న ఒక లోయవంటి ప్రాంతంలో నీటిని ప్రోగుచేసి, అక్కడి నుంచి కేవలం రూ. ౩౦౦౦ ఖర్చుతో ఆ నీటిని పైప్ ల ద్వారా వీరికి అందే ఏర్పాటు చేసి, అటు ప్రజల మన్ననలు, ఇటు అప్పటి నీలగిరి కలెక్టర్ మెక్విన్, ప్రెసిడెంట్ అరి గౌడర్ ప్రశంసలు పొందారు.
1940 లో కర్నూల్ జిల్లాకు బదిలీ చెయ్యగా అక్కడ ౩ ఏళ్ళు పనిచేసి, గాలెం బ్రిడ్జి, కనకదిన్నె బ్రిడ్జి, అలర్ దిన్నె బ్రిడ్జి, మార్కాపురం హై స్కూల్ ను రికార్డు టైం లో నిర్మించారు. ఆ సమయంలోనే వరుసగా మూడేళ్ళు శ్రీశైలం లో మహాశివరాత్రి ఉత్సవాలకు పంపుల ద్వారా నీటి సరఫరా, కరెంటు దీపాలను అందించినందుకు దేవస్థానం వారు ఎంతో సంతోషించి, వారి రికార్డు లలో సత్యనారాయణ గారి పేరును పొందుపరచుకున్నారు.
1942 లో 2 వ ప్రపంచ యుద్ధ సమయంలో మిలటరీ ట్రాఫిక్ కోసం రోడ్లను వృద్ధి చేసేందుకు ప్రభుత్వంచే ఎంపికైన తొలి ఇంజనీర్ వీరే ! రెండేళ్ళ పాటు దక్షిణ కమాండ్ పూనాకు 25 వ భారతీయ డివిజన్ CRE (కమాండింగ్ రాయల్ ఇంజనీర్) గా ఉంటూ అందించిన సేవలకు గానూ, 19౪౪ జూన్ లో వైస్రాయ్ ఆఫ్ ఇండియా వారిచే ‘రావు సాహెబ్’ అనే బిరుదును అందుకున్నారు.
46 లో కృష్ణా జిల్లా చీఫ్ ఇంజనీర్ గా అక్కడి రోడ్లు, బిల్డింగ్ లు నిర్మించారు. 47 లో పశ్చిమగోదావరి జిల్లాలోని దయనీయమైన రోడ్ల స్థితిని మార్చేందుకు వీరిని ఏలూరు కు బదిలీ చేసారు. మొత్తం జిల్లా అభివృద్ధికి 22 లక్షలతో ఎస్టిమేట్ లు రూపొందించి, రాళ్ళమడుగు బ్రిడ్జి, చేబ్రోలు బ్రిడ్జి నిర్మించారు. 55 ఏళ్ళకు రిటైర్ కావలసిన ఆయన కాలపరిమితిని మద్రాస్ ప్రభుత్వం పెంచి కావేరి నదిపై పుగలూర్, వేలూర్ వద్ద పుగలూర్ బ్రిడ్జి నిర్మాణానికి నియమించింది. అదే సమయంలో నెల్లూరు లోని పెన్నార్ బ్రిడ్జి కి కూడా వీరి సహకారం అవసరం కావడంతో, వీరిని ‘కంబైన్డ్ స్పెషల్ ఇంజనీర్’ గా నియమించారు.
తర్వాత 52 లో పదవీ విరమణ చేసి, అతి పెద్ద ప్రాజెక్ట్ లను సైతం సమర్ధవంతంగా నిర్వహించగల ప్రైవేట్ సంస్థ గానన్ అండ్ డంకర్లీ లో చేరి కర్నూల్ వద్ద రాజభవన్, ఇతర ప్రభుత్వ బిల్డింగ్ లు, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లు, నిర్మించారు. తర్వాత 56 లో విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాకా, తెలంగాణలో ఉంటూ, కడప, కర్నూల్, బళ్ళారి, అనంతపురం ప్రాంతాలను వృద్ధి చేసారు. హోసపేట వద్ద తుంగభద్ర డాం పవర్ హౌస్ ను, హంపి వద్ద పవర్ హౌస్ ను, బళ్ళారి వద్ద ఒక షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని , బేతంచెర్ల వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ పనుల్ని, తిరుగుతూ పర్యవేక్షించేవారు.
1957 లో శ్రీ బులుసు సర్వారాయుడు గారు (కపిలేశ్వరపురం జమిందార్ ) చెల్లూరు వద్ద ‘సర్వరాయ షుగర్స్ ‘ నిర్మాణానికి సత్యనారాయణ గారిని తీసుకువెళ్లగా, విస్తృతమైన ఈ నిర్మాణ పనుల్ని అనేక విభాగాలు, వసతి గృహాలతో సహా, ఒంటరిగా పగలూ –రాత్రి కష్టపడి, రెండేళ్లలో రికార్డు స్థాయిలో పూర్తి చేసారు.
శ్రీ సత్యసాయిబాబా వారు వీరిని పుట్టపర్తి పిలిపించి అనేక భవనాలను, విశ్వవిద్యాలయాన్ని కట్టించుకున్నారు. భావుకత, పనివాళ్ళతో చక్కగా మాట్లాడి పనిచేయించుకునే నేర్పు,  కొండంత ప్రేమ, దైవభక్తి, ఓర్పు, దయ, పనివాళ్ళతో ప్రేమగా పనిచేయించుకునే నేర్పు, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకత, దానం, క్షమ, కొండల్ని డీ- కొనే ధైర్యం, పట్టుదల - ఎన్నో, మరెన్నో - క్లుప్తంగా చెప్పాలంటే, ఒక విజేతకు ఉండాల్సిన అన్ని సుగుణాలు ఆయనలో ఉన్నాయి.
తన కుటుంబమే తనకు బలం, ధైర్యం అని చెప్పే సత్యనారాయణ గారికి 11 మంది కుమారులు, 4 గురు కుమార్తెలు. కుమారుల్లో బి. వి. రమణారావు గారు, గోదావరి కధల రచయత  బి.వి.ఎస్. రామారావు గారు, ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు, ప్రముఖ మెజీషియన్, కౌన్సిలర్ బి.వి.పట్టాభిరాం గారు, మానసిక శాస్త్ర నిపుణులు బి.వి.సత్య నగేష్ గారు వంటి ప్రముఖులు ఉండడం విశేషం ! ఈ కుటుంబంలోకే కోడలిగా అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
సాధారణంగానే ఉంటూనే తన ఇష్టదైవాలైన అన్నవరం సత్యనారాయణ స్వామి, వేంకటేశ్వర స్వామి, భద్రాచాలం శ్రీరామచంద్రమూర్తుల అనుగ్రహంతో ఇంజనీరింగ్ రంగంలో సంచలనం సృష్టించి, మన దక్షిణ భారతం అసాధారణమైన ప్రగతి సాధించడంలో విశేషంగా కృషి చేసిన భావరాజు సత్యనారాయణ గారు, నిజంగానే చిరస్మరణీయులు.

No comments:

Post a Comment

Pages