వాణి వీణారవళి - బాలమురళీ స్వరఝరి - అచ్చంగా తెలుగు

వాణి వీణారవళి - బాలమురళీ స్వరఝరి

Share This

             వాణి వీణారవళి - బాలమురళీ స్వరఝరి         

- మధురిమ 


సంగీత సరస్వతి ముద్దుబిడ్డగా విశ్వవిఖ్యాతిగాంచిన  ఈశతాబ్దపు వాగ్గేయకారులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గోదావరీ తీరాన జననమొందిన  బాలమురళీ గళంలో మొదలైన గానప్రవాహం గమకాల పరవళ్ళు తొక్కుతూ,సంగతుల సొయగాలతో ఇప్పటికి ఏడు పుష్కరాలుగా ప్రవహిస్తూ ఉంది. గోదావరి లాంటి  జీవనది ఎప్పుడూ నీటితో ఎలా కళకళలాడుతూ ప్రవహిస్తూ ఉంటుందో   స్వరనిధితో ఉప్పొంగే ఆయన సంగీత నదీ ప్రవాహం అలానిరంతరం ప్రవహిస్తూ భక్తి సాగరసంగమానికై కచేరిలలో ఉరకలు వేస్తూ ఉంటుంది.
1930వ సంవత్సరం జూలై 6వ తేదీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఎందుకంటే ఆరోజే , నేటి ఆం.ప్రలోని తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలంలోని శంకరగుప్తం గ్రామంలో శ్రీ మంగళంపల్లి వారు జన్మించారు.
"శంకరగుప్తం"అన్న పేరుకి అర్థం ఏమిటంటే భస్మాసురుని బారినుండీ తనని తాను రక్షించుకోవడానికి ఇక్కడ శంకరుడు గుప్తంగా దాక్కున్నాడట.అలా గుప్తంగా దాక్కున్న నాదశరీరుడు తరువాతకాలంలో  భక్తులకు ఆప్రణవ నాదాన్ని తిరిగి వినిపించడానికి బాలమురళీకృష్ణగా వచ్చాడేమో??లేకపోతే కేవలం పదిహేను సంవత్సరాల  చిరుప్రాయంలో 72 మేళకర్త రాగలను సాధన చేయడమే కాదు అందులో రచనలను చెయ్యడం మానవమాత్రులకు సాధ్యమేనా??
 శృతిలయలే జననీ జనకులుకాగా అన్నట్టుగా తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య గారు వీణ,వేణువు,వయొలిన్ మూడింటిలో అపారప్రతిభగల విద్వత్ శిరోమణి.ఇక తల్లి సూర్యకాంతమ్మగారు చాల బాగా వీణ వాయించేవారట.ఇలా శాస్త్రీయసంగీతం వారికి తల్లితండ్రులనుంచి వార్సత్వంగా సంప్రాప్తించిన విద్యానిధి.
పిన్నవయసులోనే కన్నతల్లిని పోగొట్టుకున్నవీరు తన పెంపుడు తల్లిగారైన సుబ్బమ్మగారి దగ్గర పెరిగి పెద్దవారయ్యారు.     బాల్యంలో వీరికి సంగీతంపైగల మక్కువను గమనించి తండ్రిగారైన పట్టాభి రామయ్యగారు "గాయక సార్వభౌమ బిరుదాంకితులైన" శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి వద్ద శిష్యునిగా చేర్పించారు.
బాలమురళీకృష్ణ గారు ఎన్నో సందర్భాలలో తమ గురువుగారు తనను శిష్యునిగా కాక సొంత కుమారునిగా చూసుకునే వారని గత స్మృతులను చెప్పియున్నారు. తనకి  పుత్రవాత్సల్యంతో సంగీత పాఠాలు చెప్పేవారని ఆయన చాలా సందర్భాలలో తన తీపి జ్ఞాపకాలను తెలిపియున్నారు.  రామకృష్ణయ్య పంతులుగారు త్యాగరాజ శిష్యపరంపరలోని నాల్గవ వారు, వారి శిష్యులైన బాలమురళీకృష్ణగారు కూడా త్యాగరాజ శిష్యపరంపరలోనివారేమరి.
అసలు మంగళంపల్లి వారి అసలుపేరు మురళీకృష్ణ.ఆయన ఎనిమిదవఏట విజయవాడలో త్యాగరాజస్వామి ఆరాధనలో తన మొట్టమొదటి కచేరీతో తన మహాప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు,ఆ కచేరీకి సుప్రసిద్ధ హరికథాభాగవతారులైన శ్రీ మునుసూరి సత్యనారాయణగారు కూడా వచ్చినారట.కచేరీలో ఆ పసి బాలుని అపార ప్రజ్ఞా,పాఠవాలు చూసి ముగ్ధులై అతనిలోని విశేష ప్రతిభను ఆనాడే గుర్తించి "బాల"అన్న ఉపసర్గను అతని పేరుకి ఇచ్చారు.ఆనాటి నుండీ ఆయన "బాలమురళీకృష్ణ" గా తన సంగీత మహాప్రస్థానాన్ని మొదలుపెట్టి కీర్తి శిఖరాలుకు చేరుకున్నారు.
 ఇంకొక విచిత్రం ఏమిటంటే శంకరగుప్తంలోని కొలువైన దేవుడు శ్రీమదన గోపాలస్వామి.సాధారణంగా కృష్ణుని చేతిలో ఏదేవాలయంలో నైనా మురళి ఉంటుంది,కానీ ఈ మదనగోపాల స్వామి చేతిలో గొడ్డలి ఉంటుందట.ఆ మదనగోపాలుడే మురళీకృష్ణునిగా అవతరించి గానమనే గొడ్డలితో దుష్ట అరిషట్వర్గ సంహారం చేయిస్తున్నాడేమో మరి.అందుకే మనలోని చెడు అలోచలని అంతం చెయ్యాలనుకున్నప్పుడు ఈయన గానామృతం వింటే చాలుమరి.
15సంవత్సరాల వయసులోనే 72మేళకర్త రాగాలను అవపోసన పట్టగలిగిన ఈమేధావి దైవాంశసంభూతుడు అనుటలో ఏ అతిశయోక్తి లేదు.గాత్రంలో ఈ స్థాయికి చేరగానే కంజీరా,వయొలిన్,మృదంగం ఈ మూడింటినీ ఏక కాలమందు సాధన చేసి వాటిలో కచేరీలు కూడా చెయ్యగలిగిన స్థాయికి ఎదిగినా ఎప్పుడూ సంగీతసరస్వతి ముందు ఒదిగి ఉండడం ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి పరాకష్ఠ.
ఎనిమిదవ ఏట మొదలు పెట్టిన తొలికచేరినుండి ప్రారంభమయ్యి ఇప్పటికి సుమారుగా 25,000 కచేరీలు పూర్తి చేసుకుని ఇంకా కొనసాగిస్తూ, ప్రతీ కచేరీలో నూతనత్వాన్ని ఆవిష్కరిస్తూ, శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూ కుర్చీలకు కట్టి పడేసే గల ఇంద్రజాలికుడు ఈయన.
పండిత్. భీంసేన్ జోషీ ,హరిపసాద్ చౌరాసియా వంటి నిష్ణాతులతో ఎన్నో జుగల్బందీలలో  కుడా పాల్గొన్నారు.
ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు "నేను నా కచేరీలకి ఎప్పుడూ ఏ ప్రణాలిక వేసుకుని వెళ్ళను,ఆ పరమేశ్వరుడు ఏది పాడిస్తే అది పాడి వస్తాను అంతే". తెలుగులోనే కాక కన్నడ,సంస్కృతం,తమిళం,మళయాళం, బెంగాలీ,పంజాబీ,ఫ్రెంచ్ భాషలలో కూడా పాడి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
రవీంద్రనాథ్ ఠాగూరు గారికి నోబెల్ బహుమానం తెచ్చిపెట్టిన గీతాంజలికి డా.జోఎల్ అనే యూ.కె దేశస్థుడు సంగీతం సమకూర్చి "గీతాంజలి సూట్"అనే మ్యూజిక్ ఆల్బం విడుదల  చేసాడు. దాంట్లో పాడే అవకాశం దక్కించుకున్న ఈయన మన తెలుగువారు అని చెప్పుకోవడం మనకెంతో గౌరవం కదా. ఆయనకు బెంగాలీ భాష పై అంత పట్టు ఉందికాబట్టే "రవీంద్ర సంగీత్" (బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూరుగారు రచించీ,స్వరపరిచిన గీతాలు) పాడటానికి ఆహ్వానాన్ని పొందగలిగినారు.
కేవలం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనే కాదు నేటి శతాబ్దపు నూతన ఆవిష్కరణలు అయిన ఫ్యూషన్ లోకూడా ఈయన అనర్గళంగా పాడిమెప్పించారు. ఫ్రెంచ్ భాషలో ప్రముఖ ప్రికర్షన్ (వాయిద్యాలను వాయించడంలో ఓ ప్రక్రియకు పేరు) గురువులైన శ్రీ టి.సుభాష్ చంద్రన్ గారితో కలిసి మలేషియాలో జాజ్ వాయిద్యంలో ఫ్యూషన్ కచేరీలో కూడా పాడి ప్రశంసలు అందుకున్నారు.
ఇది గాయకులుగా వారి ప్రతిభ అయితే మరి వాగ్గేయకారులుగా వారి ప్రయాణం ఈ శతాబ్దంలో అనితరసాధ్యం. గణపతి, సర్వశ్రీ, మహతి,లవంగి, ఓంకారి, సుముఖం, త్రిశక్తి, జనసమ్మోదిని,మనోరమ,రోహిణి, సుషామ,ప్రతిమధ్యమావతి మొదలైనవన్నీ వీరు కనుక్కున్న రాగాలు. మహతి,లవంగి,సుముఖంలో కేవలం నాలుగు స్వరాలుంటే ఓంకారి, గణపతిల లో కేవలం మూడు స్వరాలతో రాగాన్ని సమకూర్చగల పుంభావ సరస్వతీ స్వరూపం.  త్రిముఖి, పంచముఖి,సప్తముఖి అనే తాళ పద్ధతులను కూడా కనుగొన్నారు. 1952లోనే ఆయనయొక్క "జనకరాగమంజరి" అచ్చు అవ్వగా ఇదే పుస్తకం "రాగాంగ రవళి" అన్న శీర్షికతో సంగీతా రికార్డింగ్ కంపెని వారిచే 9వాల్యూములు క్యాసెట్లుగా విడుదల చేయబడింది.  తన సంగీత జైత్రయాత్రలో సుమారు 250 క్యాసెట్లను ఇప్పటి దాకా విడుదల చేసిన ఘనత వీరిది.( ఇది ప్రపంచ రికార్డ్)
ఒక విద్వాంసుడిగా తన సొంత పేరుప్రతిష్ఠలకే కాక సమాజానికి మంచి చేయాలని కూడ వారు సంకల్పించారు,దాని ఫలితమే ఆయన మొదలుపెట్టిన ఆల్ ఇండియా రేడియోలో భక్తి రంజని కార్యక్రమం. ఆకాశవాణికి ఆయన ఎనలేని సేవలు అందించారు.అరవైలలో ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ స్టేషన్లకు ప్రొడ్యూసర్ గా ఉంటూ చాలమంచి కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భక్తిరంజని చాలా జనరంజకంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. మద్రాస్ ఆకాశవాణి స్టేషన్ని విజయవాడకి తీసుకొచ్చినది కూడా మంగళంపల్లి వారే.విజయవాడలోనే తన నివాసం ఏర్పర్చుకుని విజయవాడ ఆకాశవాణి స్టేషన్ అభివృద్ధికి చాల కృషి చేసారు.  విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రధానోపాధ్యాయుడిగా కూడా ఈకాలం లో పనిచేసి సేవలు అందించారు. అందుకే కృతజ్ఞతాపూర్వక అభిమానంతో విజయవాడ ప్రజలు ఒక రోడ్డుకు ఆయన పేరుపెట్టి, విజయవాడ మొదటి నాగరికుడి గౌరవాన్నికూడా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
శాస్తీయ సంగీతంలోనే కాదు చలచిత్రాలకు సంగీతం అందించి కొన్ని అపూర్వమైన పాటలు పాడి,అక్కడ కూడా తన ప్రతిభ చాటి చెప్పారు.విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్ అన్నారు కదా పెద్దలు. 1967లో విడుదలైన భక్తప్రహ్లాద చిత్రంలో నారదునిగా దేశమంతా సుపరిచితులే. అందులో ఆయన గానంచేసిన ఆది అనాదివి నీవే దేవా ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారికి మధుర గీతమే.ఇదేవిధంగా నర్తనశాలలో సలలిత రాగ సుధారశ సారం ,గుప్పెడు మనస్సు చిత్రంలో మౌనమె నీ భాష ఓమూగ మనసా,మేఘ సందేశంలో పాడనావాణి కల్యాణిగా, ముత్యాలముగ్గు చిత్రంలో శ్రీరామ జయరామ సీతారామ, రామాంజనేయ యుద్ధంలో మేలుకో శ్రీరామా వంటి పాటలు ఎంత జనాదరణ పొందాయో అందరికీ తెలుసు.
ఇవితెలుగులో ఆయన పాడగా మనకు తెలిసిన కొన్ని పాటలు. తెలుగులోనేకాక తమిళ,కన్నడ,మళయాళం,బెంగాలీ వంటి అన్ని భాషల చలచిత్రాలలో  వారు తమ గళాన్ని అందించారు.చలన చిత్రాలకి గాత్రాన్నే కాదు సంగీత దర్శకత్వం కూడా చేసిన ఘనత కూడా ఉంది.ఆదిశంకరాచార్య  (సంస్కృతం), మాధవాచార్య(కన్నడ), శ్రీమద్భగవద్గీత (సంస్కృతం, తెలుగు) వంటి ఆధ్యాత్మిక ప్రధానమైన చలన చిత్రాలకు వారు సంగీత దర్శకత్వం కూడా చేసారు.  మాధవాచార్య చిత్రానికి 1987లో ఉత్తమ సంగీత దర్శకునిగా,హంసగీతె అను కన్నడ చిత్రానికి ఉత్తమ గాయకులుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసునిగా చలనచిత్ర సంగీతంలో, దర్శకత్వంలో, ప్లేబ్యాక్ లో, స్వర రచనలో (కంపోజింగ్) మూడు నేషనల్ అవార్డులను దక్కించుకున్న ఏకైక వ్యక్తి,శక్తి కూడా.
ప్రపంచంలో భౌతికమైన ఆస్థిపాస్థులు శాశ్వతము కాదు కాని కీర్తిప్రతిష్టలు ఆచంద్ర తారార్కం.అందుకే ఆచంద్రతారార్కమైన ఆయన బహుమతుల జాబితాని ఓసారి పరిశీలిస్తే: కంచుగంట లాంటి కంఠం మరి ఎవరికీలేని భగవంతుడిచ్చిన ఆయన స్థిర,చర ఆస్తి.
ఆయన బిరుదులు:సంగీత కళానిధి,గానగంధర్వ,గాయక చక్రవర్తి,గాన పద్మం,నాద మహర్షి,గంధర్వగాన సామ్రాట్, సంగీతకళా సరస్వతి,నాద జ్యోతి,గానసుధాకర,గాయక సిఖామణి,నాదవిద్యాభారతి,సుర్ సింగార్ అంటే శృతికి ఆయన సింగారమని అర్థం,శృతికి ఆయన సింగారం అయితే ఇన్నిబిరుదులున్న ఆయన సంగీత ప్రపంచానికి బంగారం కాదా మరి.
ఒక వ్యక్తి జీవితకాలంలో ఒక డాక్టరేట్ సంపాదించడానికే చాల శ్రమించాలి కాని బాలమురళీ గారికి ఆంధ్రా, హైదరాబాద్, శ్రీవేంకటేశ్వరా,మద్రాస్, జె.ఎన్.టి.యు.,విశ్వభారతి విశ్వవిద్యాలయం(శాంతీనికేతన్) వారినుండీ అయిదు గౌరవ డాక్టరేట్లు, విశ్వభారతి విశ్వవిద్యాలయం నుండీ 2005లో డి.లిట్ట్ మరియు "దేశికోత్తమ" వంటి బిరుదు కూడా సంప్రాప్తించినవి.
తి.తి.దే, శృంగేరీ ఆస్థాన విద్వాంసునిగా అపార గౌరవం, "విజ్‌డం మేన్ ఆఫ్ థి ఇయర్ 1992" , పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మూడు పద్మ అవార్డులను అందుకున్న ఏకైక వ్యక్తి. ఆకాశవాణిలో సాధారణంగా ఎవరికైనా ఒక్క రంగంలో టాప్‌గ్రేడ్  ఆర్టిష్టుగా  గౌరవం దక్కుతుంది,కానీ ఏడు విభాగాలలో ఆకాశవాణిలో ఈయనకు టాప్ గేడ్ ఆర్టిష్టు గా అనన్య సాధ్యమైన గౌరవం లభించింది. 2005వ సంవత్సరంలో ఫ్రెంచ్ గవర్నమెంట్ నుండీ ప్రఖ్యాత ఛెవలియర్ అవార్డు, ఆంధ్ర ఫ్రదేశ్ సంగీత నాటాక్ ఎకాడమీ అవార్డు,గాంధీ మెమోరియల్ మెడల్ యునెస్కో(ప్యారిస్) , తమిళ్ నాడు ప్రభుత్వంచే ప్లాటినం జూబ్లీ అవార్డు, రాజా మార్థాండ వర్మ ట్రావెంకోర్ వారిచే  శ్రీకృష్ణ వేదవ్యాశ అవార్డు, ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ గారిచే  హృదయనాథ్ మంగేష్కర్ అవార్డు, కేంద్ర ,ఆం.ప్ర ప్రభుత్వాలచే సంగీత ఎకాడమీ అవార్డు, 1953లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ గారిచే బంగారు పతకం, 2001లో తెలుగు విశ్వవిద్యాల్యం వారిచే  విశిష్ట పురస్కారం, కంచికామకోటి పీఠంచే జీవిత సాఫల్య పురస్కారం, 2004వ సంవత్సరంలో భారత ప్రభుత్వంచే జాతీయ విద్వాంసునిగా ప్రత్యేక గుర్తింపు, మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే కాళిదాస సన్మాన్ అవార్డు, న్యూజిల్యాండ్ లో భారతి మ్యూజిక్ స్కూల్ వారి నుండీ 2009వ సంవత్సరంలో సంగీత విరించి అన్న బిరుదు
పైన తెలిపిన బహుమతులన్ని ఆయన బహుమతుల మణిహారంలో కొన్ని నాయికామణులు మాత్రమే అన్నిటినీ లెక్కించడం మానవ మాతృల తరం కాదంటే అతిశయోక్తిలేదు.
 స్విట్జర్లాండ్ లో "ఎకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎండ్ రెసెర్చ్ " నెలకొల్పి "మ్యూజిక్  థెరపీ" (సంగీత ధ్వనులతో కొన్ని వ్యాధులను నయం చేసే ప్రక్రియ) పై కృషి చేస్తున్నారు. దీనికోసమే ఎం.బి.కె ట్రస్ట్ ని స్థాపించి కళ,సంస్కృతుల ఉన్నతికై ఎనిమిది పదులలో కూడా కృషి చేస్తున్న గొప్ప మనీషి.  విపంచీ అనే సంగీత నృత్య  పాఠశాలను స్థాపించి కళాసేవ చేస్తూ తరిస్తున్నారు. ఈ పాఠశాల కలైమామణి సరస్వతి గారిచే నడుప బడుతొంది.
ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఇంత సంగీత ప్రతిభ ఉన్నానిండు కుండ తొణకదన్నట్టుగా " నేను సంగీతకారుడిని కాను కేవలం భగవంతుడికి సంగీతాన్ని వినిపించే ఒక పరికరాన్ని, నాకు సంగీతం తెలియదు నేను సంగీతానికి తెలుసు"అనే ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ధన్యజీవి. సంగీత విద్యార్థులందరికీ  ఆయన ఇచ్చే సలహా "కళని కళకోసమే నేర్చుకోండి"
బాలమురళీకృష్ణ గారికి కళపై ఉన్న తృష్ణ ఆయనను ఇంత మహోన్నత మనీషిని  చేసింది,ఆ తృష్ణ అలా కొన సాగాలని ఆయన ఆ సంగీత సరస్వతి కరుణా  కటాక్షాలచేత ఆరోగ్యవంతమైన ఆయుష్షును  కలిగి ఉండి నిండునూరేళ్ళు పూర్తి  చేసుకోవాలని,మరెన్నో ,ఎన్నెనో రచనలను చేస్తూ ,వారి ప్రియ శిష్యులైన మోహనకృష్ణ ,రామ వర్మ  లాంటివారి చేత జనరంజకంగా అవి  ప్రసారం చెయ్యబడాలని ఆయన గళంలో గానప్రవాహం మరిన్ని పరవళ్ళు తొక్కుతూ నిరంతరం ప్రవహిస్తూ ఇంకా ఎన్నో పుష్కరాలను జరుపుకుంటూ జీవనదిగా ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలని ఆ శారదామాతని ప్రార్దిద్దాం.

No comments:

Post a Comment

Pages